16, నవంబర్ 2024, శనివారం

33 వ సామాన్య ఆదివారం

33 వ సామాన్య ఆదివారం 
దానియేలు 12:1-3, హెబ్రీ10:11-14,18 మార్కు 13:24-32
ఈనాటి పరిశుద్ధ గ్రంథములు దేవుని యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నాయి. ఆయన యొక్క రాకడ కొరకై మనందరం కూడా సంసిద్ధులై జీవించాలి. అదేవిధంగా దేవుడు తనను విశ్వసించే వారితో ఎల్లప్పుడూ ఉంటారని కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభువు మన యొక్క కష్ట కాలములో, అంత్య దినములలో మనతోనే ఉంటారు ఎందుకనగా ఆయన ఇమ్మానుయేలు ప్రభువు, మనతో ఉండే దేవుడు. 
ఈనాటి మొదటి పఠణంలో దానియేలు ప్రవక్తకు కలిగిన నాలుగవ దర్శనము గురించి వింటున్నాము. మానవులు మరణించి సమాధి చేయబడిన తర్వాత మట్టిలో నిద్రించే చాలా మంది సజీవులవుతారని చెబుతున్నారు. 
ఆనాడు విశ్వాస పాత్రులుగా జీవిస్తున్న యూదులను నాల్గవ అంతెయోకు(Antioch. IV)  రాజు అన్యాయంగా వారిని యూదులను శిక్షకు గురిచేసి చంపారు. ఈ యొక్క రాజు ఆయన యూదా ప్రజల మీద అనేక రకములైన ఆంక్షలు విధించి వారు గ్రీకు మతస్తుల ఆచారాలను, పద్ధతులను అనుసరించాలని ఒత్తిడి చేశారు. యూదా ప్రజల సున్నతిని తిరస్కరించాడు, దేవాలయాలను ధ్వంసం చేశాడు దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులను నాశనం చేశారు అది మాత్రమే కాకుండా వారికి విలువైన పవిత్ర గ్రంథం "తోరా" యొక్క ముఖ్య భాగాలను కాల్చివేశాడు. ఇలాంటి ఒక కష్టతరమైన పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రవక్త దేవుని యొక్క అభయంను /రక్షణ వినిపించారు. దేవుని యెడల విశ్వాసము కలిగిన యూదులు కూడా మరణించిన తర్వాత శరీరంతో పునరుత్థానం చెందుతారని తెలిపారు. దేవుని యందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి జీవించాలని కూడా ప్రవక్త వారిని ప్రోత్సహించారు. దానియేలు ప్రవక్త ప్రజలు అనుభవించే బాధలను చూసి వారికి ఊరటనిస్తున్నారు. దేవుడు ఎప్పుడూ తన ప్రజలకు చేరువలోనే ఉంటారని తెలియజేశారు. దానియేలు గ్రంధం 11: 21-39 వచనములు చదివినట్లయితే ఇక్కడ సిరియా రాజు అయినా నాలుగవ అంతియోక్ యొక్క దురాలోచనలు, ఆయన అహం, స్వార్థం ఆయన చేసే హింసలు అర్థమవుతాయి. ఎన్ని విపత్తులు ఎదురైనా సరే ప్రజలలో ఒక విధమైన ఆశను నమ్మకాన్ని ప్రవక్త కలుగ చేశారు. వారి జీవిత అంత్య దినములు సంభవించినప్పుడు దేవుని కోసం ఎలాగ జీవిస్తున్నాం అన్నది ముఖ్యం. క్రైస్తవ విశ్వాసము మరియు యూదుల యొక్క విశ్వాసము ఏమిటనగా అంతిమ దినమున అందరు కూడా సజీవులుగా లేపబడతారని. యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలకు దేవుని వాక్యము ప్రవచించగానే అవి శరీరమును పొందుకొని జీవము కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు 37:13. చనిపోయిన వారు దేవుని కృప వలన సజీవులవుతారని ఈ యొక్క వాక్యము తెలుపుతుంది. మక్కబీయులు గ్రంథంలో ఏడుగురు సోదరులు ప్రాణత్యాగము చేశారని వింటున్నాం ఎందుకంటే వారికి పునరుత్థానమునందు విశ్వాసము ఉన్నది అందుకని వారు తమ ప్రాణాలను దేవుని కొరకు త్యాగం చేశారు.(2 మక్కబీయులు 7:9) ఈ యొక్క మొదటి పఠణం ద్వారా మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి మనము జీవించాలి. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన యందు విశ్వాసము కోల్పోకుండా జీవించాలి.
ఈనాటి రెండవ పఠణం యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ఈ యొక్క భాగములో ప్రత్యేక విధముగా ఏసుప్రభువు సమర్పించిన బలికి మిగతా యాజకులు సమర్పించిన బలికి ఉన్నటువంటి వ్యత్యాసమును తెలియజేస్తున్నారు. పూర్వ నిబంధన ప్రధాన యాజకులు ఒకే రకమైన బలులు అర్పించినప్పటికీ ప్రజల పాపాలు తొలగించలేకపోయారు కానీ క్రీస్తు ప్రభువు తన యొక్క బలిద్వారా అందరి పాపాలను ఒక్కసారిగా మన్నించారు. ఆయన సమర్పించిన బలిలో రక్షణ సామర్థ్యం ఉంది. ప్రభువు సమర్పించిన బలి విశ్వాసులను దేవుని ఎదుట నీతిమంతులుగా చేస్తుంది శుద్ధికరిస్తుంది అదేవిధంగా అందరూ రక్షణ పొందుటకు సహాయపడుతుంది.  పాత నిబంధన గ్రంథంలో వారు సమర్పించిన బలులన్నీ కేవలము క్రీస్తు ప్రభువు యొక్క బలితో పరిపూర్ణమయ్యాయి. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు శకం 69 వ సంవత్సరంలో రోమీయులు క్రైస్తవులను మరియు క్రైస్తవ మతం స్వీకరించిన యూదులను అనేక రకాల హింసలకు గురి చేశారు అలాంటి సమయంలో తన యొక్క ప్రజల విశ్వాసాన్ని బలపరుచుటకు దేవుడు మరలా వస్తాడని నమ్మకమును కలిగిస్తూ మార్కు సువార్తికుడు ఈ యొక్క మాటలను రాస్తున్నారు. తనకు కలిగినటువంటి దర్శనం వలన మనుష్య కుమారుని రాకడ ద్వారా ప్రపంచంలో కొన్ని ప్రకృతి మార్పులు జరుగుతాయని మార్కు గారు తెలియజేశారు. వాస్తవానికి నిజమైన విశ్వాసులకు అవన్నీ భయపెట్టే సంకేతాలు కావు ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం గా జీవించిన వారికి ఎల్లప్పుడూ మేలు కలుగును ప్రభు వారందరినీ రక్షించును. ఏసుప్రభు అత్తి చెట్లనుండి ఒక గుణపాఠం ను నేర్పిస్తున్నారు. ఈ యొక్క అత్తి చెట్ల ఆకులు వసంత రుతువు చివరిలోనే చిగురిస్తాయి అవి అలా కనిపించినప్పుడు ఒక కొత్త కాలం సంభవించునదని మనకు తెలుస్తుంది ఆ కాలంకు తగిన విధంగా మనం కూడా తయారవ్వాలి. ఆకులు రాలిపోయాయి అంటే చెట్టు చనిపోయినది అని కాదు అర్థం, కొత్త ఆకులు వస్తాయని అర్థం. అదే విధముగా దేవుని యొక్క రెండవ రాకడ జరిగినప్పుడు కూడా క్రొత్తకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మనం దానికి తగిన విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న పాపము, స్వార్థము, అహం అన్నింటిని చంపేయాలి అప్పుడే దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించగలం.
 దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎప్పుడూ సంసిద్ధముగా ఉండాలి. ఆయన యొక్క రాకడ ఎప్పుడు ఎలాగా వచ్చునో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతినిత్యం కూడా మనము మనల్ని తయారు చేసుకుంటూ జీవించాలి. చివరిగా ఈ యొక్క పఠణముల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు.
1. నిరీక్షణ కలిగి ఉండుట 
2. విశ్వాసము కలిగి జీవించుట 
3. దేవుని యొక్క రాకడకు సంసిద్ధత కలిగి జీవించుట 
4. ప్రభువుకు సాక్షులై ఉండుట. 
5. దేవునికి అనుగుణంగా జీవించుట.

Fr. Bala Yesu OCD

15, నవంబర్ 2024, శుక్రవారం

అంత దినములు ఎలా ఉండును

 అంత దినములు ఎలా ఉండును 

లూకా 17: 26-37 

నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు  ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును. ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు. పొలములో  ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కోనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును." "ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?" అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును" అని యేసు చెప్పెను. 

అంతదినములు ఎలా ఉండును? అని ప్రభువు ఈ సువిశేషభాగంలో  చెబుతున్నారు. ఒకసారి నోవా దినములను, లోతు దినములను గుర్తు చేస్తున్నారు. నోవా రోజులలో అందరు తినుచు త్రాగుచు ఉన్నారు.  అందరు వారి వారి రోజు వారి పనులలో నిమగ్నమై ఉండగా ఎటువంటి హెచ్చరిక లేకుండా, హఠాత్తుగా జలప్రళయము వచ్చింది, లోతు కాలంలో ప్రజలు వారి వారి పనులలో ఉన్నారు. ఆసమయంలోనే   ఆకాశం నుండి గంధకము వర్షించినది.  ప్రభువు రోజు ఎప్పడు మనకు ఇష్ఠమైనపుడు, మనం కోరుకున్నప్పుడు  రాదు.

 ప్రభువురోజు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుందా? ప్రభువు అనేక రోజులకు ముందుగానే హెచ్చరిస్తారు.  నోవా కాలంలో, మరియు లోతు కాలంలో కూడా  ప్రభువు ప్రజలను హెచ్చరించాడు.  అప్పటినుండి నోవా , లోతు ఆ రోజు కోసం సిద్ధపడ్డారు. నోవా  దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక ఓడను తయారు చేసాడు. మిగిలిన ప్రజలు వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు కాని ప్రభువు మాటను పట్టించుకోలేదు.   నోవా మాత్రము వారితో  కలవకుండా తనకు దేవుడు చెప్పినట్లుగా  చేసాడు. జలప్రళయము వచ్చింది నోవా కుటుంబము మాత్రమే రక్షించబడింది. మిగిలిన వారు మాత్రము ప్రాణములను కోల్పోయారు. లోతు కాలములో కూడా ప్రభువు ప్రజలను హెచ్చరించాడు , కాని వారు చేసే పనులలోనే వారు ఆనందం వెదుకుకున్నారు . అందరు వారి వారి పనులలో నిమగ్నం అయిపోయారు.  లోతు కుటుంబము  మిగిలిన వారి వలే కాకుండా జీవించడం జరిగింది.  లోతు కుటుంబం రక్షించబడింది. 

దేవుడు మనలను హెచ్చరించినప్పుడు మనం సిద్ధపడాలి, అలా కాకుండా అంత సవ్యముగా ఉన్నది అనే అపోహలో ఉండి క్షమాపణ పొంది, రక్షించబడే అవకాశం కోల్పోతారు.  నోవా కుటుంబం రక్షించబడింది, కాని లోతు కుటుంబంలో అందరు రక్షించబడలేదు. లోతు భార్య దేవుడు చెప్పినట్లు చేయకుండా ఆ పట్టణమునకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంది, వెనకకు తిరుగుతుంది. ఉప్పు స్థంభం వలె మారిపోతుంది. మన కుటుంబంలో దేవుడు ప్రేమించే వ్యక్తి ఉన్నంత మాత్రమున మన కుటుంబం మొత్తం రక్షించబడాలని లేదు. ప్రతి వ్యక్తి కూడా తాను పరివర్తన చెంది మారితే దేవుని అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. వారి కుటుంబంలో మంచి వారు ఉండటం కొంత వరకు మాత్రమే వారికి ఉపయోగపడుతుంది కాని వారి వ్యక్తిగత జీవితం కూడా ప్రభువు ఆజ్ఞలకు లోబడి ఉండాలి. 

ప్రభువుని రాక సమయంలో కూడా ఇలానే జరుగును అని దేవునివాక్కు చెబుతుంది. ఇది ప్రతి ఒక్కరు వారి వారి జీవితములను సరిచూసుకుని జీవించాలి. ఆ రోజు ఎవరు అయితే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. ఎవరి జీవితం మరియొకరి జీవితం మీద ఆధారపడి ఉండదు. ఎవరి జీవితమునకు వారే బాధ్యత వహించాలి. ఇది భయపడే రోజు ఏమి కాదు, ప్రతి  నిత్యం సిద్దపడి ఉంటె అది ప్రభువు సాక్షాత్కారం అయ్యేరోజు. సరియైన సిద్ధపాటు లేకపోతే అది భయపడవలసిన రోజే అవుతుంది. 

సిద్ధపాటు 

ప్రభువు రాకడకు ఆయన అనుచరులు ప్రతి నిత్యం సిద్దమై ఉండాలి.  ఎందుకు  ప్రభువు రోజు కోసం ప్రతినిత్యం  అప్రమత్తముగాను, సిద్ధముగాను ఉండాలి అంటే ఆ రోజు ఎలా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరు వారి వారి పనులలో ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు వస్తుంది. దేవుని ఆజ్ఞలకు ఎవరు అయితే బద్ధులై ఉంటారో వారికి అది ఎప్పుడు వచ్చిన భయ పడవలసింది ఏమి ఉండదు.  ఎందుకంటే వారు ఆ రోజు కోసం సిద్ధంగా ఉన్నారు. జలప్రళయము వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం జీవించిన నోవా కుటుంబం రక్షించబడింది, లోతు రక్షించబడ్డాడు. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే దానికి సిద్దపడటం. 

ప్రార్ధన : రక్షకుడవైన ప్రభువా! మీ రాకడకు నేను ఎప్పుడు సిద్ధముగా ఉండుటకు నోవా,లోతుల వలె మీ ఆజ్ఞలకు ఎప్పుడు బద్ధుడనై జీవించే విధంగా నన్ను మలచమని  వేడుకుంటున్నాను. నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా మీ ఆజ్ఞలను నేర్చుకుంటూ, మీ మాటను పాటించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. నా జీవితమును పవిత్రీకరించుకొనుటకు మీ అనుగ్రహాలు దయచేమని వేడుకుంటున్నాను. ఆమెన్

Fr. Amruth 


22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...