24, డిసెంబర్ 2024, మంగళవారం

క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25

"క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25
ఈనాడు యావత్ ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు జయంతి యొక్క పుట్టినరోజు పండుగను కొన్నియాడుచున్నది. ఈ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా మిగతా వారందరూ కూడా జరుపుకుంటారు ఏదో ఒక విధముగా వారి ఇంటిలో క్రిస్మస్ నక్షత్రమో, చెట్టునో ఉంచుకుంటూ వారి ఈ పండుగను జరుపుకుంటారు. 
1. క్రిస్మస్ పండుగ అందరికీ ఆనందంనిచ్ఛే ఒక పండుగ ఎందుకనగా 
-ఎన్నో వందల సంవత్సరముల నుండి ఎదురుచూస్తున్నటువంటి మెస్సయ్య జన్మించబోతున్నారు, - ప్రవక్తల యొక్క ప్రవచనములు నెరవేరబోతున్నాయి.
- దేవుని యొక్క రాకడ భూమి మీద మన జన్మంలా జరుగుచున్నది. దేవుడు ఈ భూమి మీదకు మనలాగా వచ్చి మన అందరిని కూడా పరలోకము చేర్చాలి అన్నదే ప్రభువు యొక్క కోరిక. ఇంగ్లీషులో ఒక గొప్ప మాట ఈ విధంగా రాయబడినది Jesus became so that we might become what He is. దేవుడు మానవుడు అయినది, మానవుని తనలాగా మార్చుట కొరకే. క్రీస్తు యొక్క జననము ద్వారా మనము మొట్టమొదటిసారిగా చరిత్రలో దేవుణ్ణి కనులారా చూడగలుగుతున్నాము, చెవులారా వినగలుగుతున్నాము. చేతితో తాకగలుగుతున్నాము. ఆయన యొక్క ఉనికిని మనము మన యొక్క జీవితంలో అనుభవించగలుగుతున్నాం. ఇది కేవలం దేవుడు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమ వలన మాత్రమే చేసినటువంటి గొప్పదైనటువంటి పని. 
ఎందుకు దేవుడు మానవుడు అయ్యారు అని మనం ఇంకా ధ్యానించినట్లయితే ప్రభువు పతనమైనటువంటి మానవలోకమును రక్షించుట కొరకు, తప్పిపోయిన గొర్రెలను వెదకుట కొరకు, మనందరికీ పరలోక మార్గము చూపుట కొరకు ఆయన మనలాగా మారి మన మధ్యన నివసించారు. ఒక చిన్న సంఘటన మనకు ఇంకా క్లుప్తంగా ఈ అంశం గురించి వివరిస్తుంది. ఒక మంచు కురిసే(మంచు గడ్డ కట్టే స్థలం) ప్రాంతంలో ఒక రోజున కొన్ని పక్షులు ఒక భక్తుడు యొక్క ఇంటి దగ్గర చెట్టు మీద వాలి ఉన్నాయి అయితే బయట చాలా చలిగా, మంచు గడ్డలు కట్టడం వల్ల అక్కడున్నటువంటి పక్షులన్నీ కూడా ఎటు వెళ్లాలో తెలియక దీనస్థితిలో ఉన్నాయి వాటి పరిస్థితిని చూసినటువంటి ఆ భక్తుడు ఎలాగైనా సరే వాటిని రక్షించాలనుకున్నాడు కానీ అది ఎలా అని ఆయనకు తోచలేదు అప్పుడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక షెడ్డులో కొంచెం మేత పెట్టి వాటిని లోపలికి పిలవటానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడున్న పక్షులు ఆయన మాట విని లోపలికి రాలేకపోయాయి ఎందుకంటే ఆయన స్వరాన్ని అవి గుర్తించలేకపోయాయి అప్పుడు ఆయన తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు నేను కూడా ఒక పక్షినైతే ఈ పక్షులన్నీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లి బ్రతికించి ఉండే  వాడినని భావించాడు. ఈ యొక్క విషయము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఎవరైతే ఇతరుల యొక్క స్వభావంలోకి వెళుతుంటారో, ఇతరులు లాగా మారతారు అప్పుడు వారికి అనేక విషయాలు తెలియచేసి వారిని రక్షించవచ్చు. దేవుడు కూడా చేసినటువంటి గొప్ప పని ఇదే మనలాగా వచ్చి మనందరినీ పరలోకం చేర్చాలనుకున్నారు, మనకు అనేక విషయాలు మన స్వభావంలో అర్థమయ్యే విధంగా తెలిపి మనలను మార్చాలనుకున్నారు. ఇది ఒక సంతోషకరమైనటువంటిది మానవాళి ఆనందమునుంచే వార్త.
.2. క్రిస్మస్ పండుగ మార్చే పండుగ అనగా భూలోకాన్ని పరలోకముగా మార్చినటువంటి గొప్ప పండుగ. దేవుడు ఉన్న స్థలము పరలోకం అదే దేవుడు భూలోకమునకు వచ్చి పరలోకంగా మార్చారు. మనకు  పరలోక అనుభూతిని కలుగ చేశారు. ఏసుప్రభు తన యొక్క రాకతో ఎందరినో మార్చారు మరి ఆయన రాకడ మనల్ని మార్చగలుగుతుందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏసుప్రభు తన మాటల ద్వారా క్రియల ద్వారా సాన్నిధ్యం ద్వారా అనేక మందిని మార్చారు.
3.  క్రిస్మస్ అనగా దేవుడు మానవులకు దగ్గరైన వేళ. దేవుడు మానవులకు ప్రేమను పంచుటకు దగ్గరగ వచ్చారు మరి మనము దేవుని కొరకు రాగలుగుతున్నామా? ప్రభువే తన చిత్తము ప్రకారముగా మన కొరకు తన యొక్క మహిమాన్వితమైనటువంటి స్థలమును విడిచి మన కొరకు వచ్చారు. మనము దేవుని కొరకు దేవాలయానికి వస్తున్నామా?
రక్షకుని యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న అందరూ కూడా కలిసి ఆనందంగా ఈ పండుగ కొనియాడుతూ, ప్రేమను పంచుతూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దేవుడిని ఆరాధిస్తూ ఈ యొక్క పుట్టినరోజు పండుగను కొనియాడాలి.

Fr. Bala Yesu OCD

21, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం 
మీకా 5:1-4 హెబ్రీ 10: 5-10 లూకా1:39-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ఏసుప్రభు యొక్క ఆగమనం కోసం ఎదురు చూసే వారందరిలో ఆయన యొక్క జన్మం జరుగుతుంది అనే అంశము గురించి తెలియజేయు చున్నవి. దేవుని ప్రణాళికకు సహకరిస్తూ ఆ ప్రణాళికను వ్యక్తిగత జీవితంలో అమలు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరిలో దేవుడు జన్మిస్తారు.  ప్రభువు యొక్క జన్మదినం త్వరగా రాబోవుచున్నది కాబట్టి ఆయన రాక కొరకు ఆధ్యాత్మికంగా తయారవ్వాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు మీకా ప్రవక్త ద్వారా చేసినటువంటి వాగ్దానములను తప్పనిసరిగా నెరవేరుస్తారు అనే విషయమును తెలుపుచున్నారు. బెత్లెహేము నుండి రక్షకుడు ఉదయిస్తాడు అని ప్రవక్త తెలియజేశారు. దీనిలో ఒక అర్థము ఉన్నది. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు బెత్లహేముని ఎన్నుకున్నారు రక్షకుని జన్మస్థలంగా? మొదటిగా బెత్లహేము అనగా హౌస్ ఆఫ్  ద బ్రెడ్ అని అదేవిధంగా దేవుని యొక్క నిలయము అని అర్థం కావున అక్కడినుండి రక్షకుడు జన్మిస్తారు. బెత్లహేము లేవీయులకు కేంద్ర స్థానంగా ఉన్నది. బెత్లహేము దావీదు రాజు యొక్క జన్మస్థలం. ఇశ్రాయేలును పరిపాలించే పాలకుడు మరియు దేవుడు పంపబోయే వ్యక్తి క్రీస్తు ప్రభువే ఎందుకంటే దేవుడు మరియమ్మకు ప్రత్యక్షమైన సమయంలో తనతో పలికిన మాటలు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అన్నారు.( లూకా 1:33). దేవుడు చిన్నదైనటువంటి బెత్లహేమును ఎన్నుకొని ఆ ప్రదేశమునకు రక్షకుని జన్మస్థలమును అర్థము  ఇస్తున్నారు. ఎఫ్రాతా అనేది ఒక చిన్న గ్రామం దానికి పెద్ద గుర్తింపులేదు అయితే దేవుడు మాత్రము ఆ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక గొప్ప ప్రాంతమును ఎన్నుకొనక కేవలం గుర్తింపు లేని అతి సామాన్యమైన ప్రాంతమున ఎన్నుకొని దానికి ఒక గొప్పదైన అర్థం ఇస్తున్నారు. మన జీవితంలో ప్రముఖమైన స్థలంలో జీవించడానికి ప్రయత్నిస్తాం కానీ దేవుడు మాత్రం ఒక చిన్నదైనటువంటి గుర్తింపు లేని స్థలము ఎన్నుకొని అక్కడ జన్మిస్తున్నారు.
దేవుడు అల్పులైనటువంటి చేపలు పట్టే శిష్యులను ఎన్నుకొని వారిని గొప్పవారిగా తీర్చిదిద్దారు సామాన్యురాలు అయినటువంటి మరియమ్మ గారిని ఎన్నుకొని దేవుని తల్లిగా చేశారు కాబట్టి ప్రభువు అల్పమైనటువంటి ప్రాంతంలో జన్మించి ఆ ప్రాంతములకే కొత్తదైన అర్థం ఇస్తున్నారు ఈ క్రిస్మస్ కాలమున అల్పుల మైనటువంటి మనలో జన్మించి మన యొక్క జీవితమునకు కూడా కొత్త అర్థమును దయ చేస్తారు. 
ఈనాటి రెండవ పఠణంలో ఏసు క్రీస్తు ప్రభువు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అని తెలియజేశారు. 
ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఎలిజబెతమ్మను సందర్శించుట గురించి వింటున్నాం దేవదూత వద్ద నుండి శుభ వచనము విన్న మరియ మాత వెంటనే తన చుట్టమైన ఎలిజబెతమ్మను కలుసుకొనుటకు వెళ్ళుచున్నారు. దాదాపుగా నాలుగు రోజుల ప్రయాణం చేసి విసుగు చెందకుండా నజరేతు నుండి యూదయా పట్టణంలో ఉన్న  అయిన్ కరీము అనే ప్రాంతమునకు మరియ తల్లి 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి  ఎలిజబెత్తమ్మను కలుసుకున్నారు. ఈ యొక్క సువిశేష పట్టణములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. అడగక మునుపే సహాయము చేయుట. మరియ తల్లిని ఎలిజబెత్తమ్మ సహాయము చేయమని పిలవలేదు కానీ మరియమ్మ గారే ఎలిజబెత్ పరిస్థితిని అర్థం చేసుకొని వారికి సహాయం చేయుటకు వెళ్లారు. కానా పల్లెలో కూడా మరియ తల్లియే చొరవ తీసుకొని వారు అడగకమునుపే సహాయం చేశారు. మన క్రైస్తవ జీవితంలో కూడా చాలా సందర్భంలో మనం ఇతరులు మనల్ని అడగాలనుకుంటాం అప్పుడే సహాయం చేస్తాం కానీ మరియ తల్లి యొక్క గొప్పతనం ఏమిటంటే అడగకపోయినా సహాయం చేసే గుణం అని మనం నేర్చుకోవాలి. 
2. ఆనందమును పంచుకొనుట. మరియమ్మ గారు దేవునికి తల్లిగా పిలవబడిన సమయంలో తన యొక్క ఆనందమును తన చుట్టమైన ఎలిజబెత్తమ్మతో పంచుకొనుటకు ఆనందముతో పరిగెడుచున్నారు. దైవ అనుభూతిని కలిగిన మరియమ్మ గారు ఇంకొక వ్యక్తిని సందర్శిస్తూ తన దైవ అనుభూతిని మరియు ఆనందమును ఇతరులకు ఇస్తున్నారు. మనం కూడా క్రైస్తవ జీవితంలో ఇతరులకు ఆనందం నివ్వటానికి ప్రయత్నించాలి. 
3. మరియమ్మ గారి యొక్క వినయం. మరియమ్మ గారు కూడా గర్భము ధరించి ఉన్నారు తాను కూడా ఇతరుల యొక్క సహాయం కావలసిన వారే కానీ తాను తన యొక్క సహాయం చూసుకోకుండా ఇతరులకు సహాయం చేయాలని తనను తాను తగ్గించుకొని ఎలిజబెత్ దగ్గరకు వెళుతుంది. వాస్తవానికి మరియమ్మ గారు దేవునికి తల్లిగా ఉండబోతున్నారు ఎలిజబెతమ్మ ప్రవక్తకు తల్లిగా ఉండబోతున్నారు ఈ సందర్భంలో మరియమ్మ గారి దేవుని తల్లి అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకొని సేవాభావంతో ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్లి సేవ చేస్తున్నారు.
4. ఎలిజబెతమ్మ తన వయసులో చిన్నదైనా మరియమ్మ గారికి నమస్కరించి నా దేవుని యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను అని మరియమ్మ గారిని గౌరవించి నమస్కరించినది మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకన్నా చిన్న వయసులో ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనమును మంచితనము చూసినప్పుడు వారిని కూడా గౌరవించాలి. జీవం పోసిన దేవునికి జీవమునిచ్చుటకు నిన్ను తల్లిగా దేవుడు ఎన్నుకున్నారని ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారిని గౌరవించారు.
ఈనాటి ఈ యొక్క దివ్యగంధ పఠణముల ద్వారా మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికను అంగీకరిస్తూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తూ జీవించాలి. మన యొక్క జీవితంలో ప్రభువు కొరకు తయారు చేసుకోవాలి. మరియ తల్లి మరియు ఎలిజబెతమ్మవలే ఇతరులకు సహాయం చేస్తూ, ప్రేమను పంచుతూ జీవించాలి. 
Fr. Bala Yesu OCD

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...