5, ఏప్రిల్ 2025, శనివారం

ఐదవ తపస్సుకాలపు ఆదివారము

ఐదవ తపస్సుకాలపు ఆదివారము 
యెషయా 43:16-21 ఫిలిప్పీయులు 3: 8-14
 యోహాను 8:1-11
క్రీస్తునాధునియందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులరా. మనం ఇప్పుడు తపస్సుకాలపు చివరి రోజులలోకి ప్రవేశిస్తున్నాము, అంటే తపస్సుకాలపు ఐదవ ఆదివారం జరుపుకుంటున్నాము. నేటి మూడు పఠనలు కూడా మనల్ని, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యమైన పాఠాలను అందిస్తున్నాయి. మనం క్రీస్తును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి, మరియు ఇతరులను క్షమించాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ కొత్త ఆశను మరియు కొత్త ప్రారంభాలను అందిస్తాడు.
దేవుని దయ మరియు ఆయన క్షమాపణ శక్తిని అనుభవించమని పిలుస్తున్నాయి.
           ఈ నాటి మొదటి పఠనములో యెషయా 43:16-21, యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు దేవుని శక్తివంతమైన కార్యాలను గుర్తుచేస్తాడు, ముఖ్యంగా ఎర్ర సముద్రాన్ని దాటించడం. అయితే, దేవుడు గతంలో చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, వారు దానిని చూడాలని చెబుతున్నాడు. ఆయన అరణ్యంలో మార్గాలను, ఎడారిలో నదులను సృష్టించి, తన ప్రజలకు కొత్త ఆశను ఇస్తాడు. ఈ లేఖనం దేవుడు ఎల్లప్పుడూ కొత్త కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, మనం ఆయనపై విశ్వాసం ఉంచాలని గుర్తుచేస్తుంది.
ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి చూడవచ్చు. అవి ఏమిటంటే * గత కార్యాల స్మరణ: దేవుడు తన ప్రజలకు గతంలో చేసిన అద్భుతాలను గుర్తుచేస్తాడు.
 * క్రొత్త కార్యాలు: దేవుడు గతంలో చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
 * అరణ్యములో మార్గము, ఎడారిలో నదులు: దేవుడు అసాధ్యమైన పరిస్థితులలో కూడా మార్పు తీసుకురాగలడు.
 * దేవుని విశ్వాసం: దేవునిపై విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది. ఈనాటి మొదటి పఠనము.
          రెండొవ పఠనములో  ఫిలిప్పీయులకు 3:8-14 అపొస్తలుడైన పౌలు  క్రీస్తును తెలుసుకోవడం యొక్క అత్యున్నత విలువను గురించి మాట్లాడుతాడు. గతంలో తనకు విలువైనవిగా భావించినవన్నీ క్రీస్తుతో పోలిస్తే వ్యర్థమైనవిగా భావిస్తాడు.
      అంతే కాకుండా పౌలు తన జీవితంలో క్రీస్తును తెలుసుకోవడం కంటే మరేదీ గొప్పది కాదని ప్రకటిస్తాడు.
   * అతను తన గత విజయాలు, నేపథ్యం, మరియు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండటం వంటి వాటిని క్రీస్తుతో పోలిస్తే "పెంట"గా పరిగణిస్తాడు.
             క్రీస్తుతో ఐక్యత కోసం ప్రయత్నం: పౌలు క్రీస్తుతో ఐక్యతను సాధించడానికి, ఆయనను పోలి ఉండటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అతను క్రీస్తు యొక్క నీతిని పొందాలని కోరుకుంటాడు, ఇది ధర్మశాస్త్రం ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా వస్తుంది.
         గతానికి వీడ్కోలు, భవిష్యత్తుపై దృష్టి:  పౌలు తన గత జీవితాన్ని, విజయాలను విడిచిపెట్టి, భవిష్యత్తుపై దృష్టి సారిస్తాడు. అతను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అని చెబుతాడు, ఇది క్రీస్తులో తన పిలుపు యొక్క బహుమానం కోసం అని రెండొవ పఠనము తెలియజేస్తుంది.
          చివరిగా సువిశేష పఠనములో యోహాను 8:1-11 యేసు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని న్యాయాధిపతుల నుండి రక్షించిన సంఘటనను వివరించబడింది.
 * పరిసయ్యుల మరియు శాస్త్రుల కుట్ర: పరిసయ్యులు మరియు శాస్త్రులు యేసును పరీక్షించడానికి ఒక వ్యభిచారిణిని ఆయన ముందు నిలబెడతారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించాలని వారు యేసును అడుగుతారు. వారు యేసును ఇరుకున పెట్టాలని చూస్తారు, ఆయన ధర్మశాస్త్రాన్ని సమర్థిస్తే, ఆయన కఠినమైన న్యాయాధిపతిగా కనిపిస్తాడు, లేకపోతే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.
 * యేసు యొక్క జ్ఞానం మరియు కరుణ: యేసు నేలపై వ్రాస్తూ, మీలో పాపం లేనివాడు మొదట ఆమెను రాళ్లతో కొట్టవచ్చు అని అంటాడు. ఈ మాటలు విన్న వారందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్లిపోతారు, వారి స్వంత పాపాలను గుర్తుచేసుకుంటారు. యేసు స్త్రీ పట్ల కరుణ చూపిస్తాడు, ఆమెను ఖండించకుండా, "నేను కూడా నిన్ను శిక్షించను; ఇకనుండి పాపం చేయకు" అని చెప్పి ఆమెను పంపివేస్తాడు.
 * దేవుని క్షమాపణ మరియు కొత్త ప్రారంభం: యేసు స్త్రీకి క్షమాపణను అందిస్తాడు మరియు ఆమెకు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇస్తాడు. ఈ సంఘటన దేవుని క్షమాపణ మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది మనందరం పాపులమేనని, ఇతరులను తీర్పు తీర్చడానికి మనకు హక్కు లేదని గుర్తుచేస్తుంది.
 * యేసు యొక్క బోధన: ఈ సంఘటన ద్వారా, యేసు క్షమాపణ, కరుణ మరియు స్వీయ-పరిశీలన యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాడు. ఇతరులను తీర్పు తీర్చడానికి ముందు, మన స్వంత లోపాలను పరిగణించాలని ఆయన మనకు బోధిస్తాడు.
ఈ సంఘటన దేవుని ప్రేమ, క్షమాగుణం మరియు మానవత్వం యొక్క శక్తివంతమైన ఉదాహరణ. ఇది మనకు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను, దేవుని కరుణను, మరియు కొత్త ప్రారంభాల ఆశను నేర్పుతుంది.
        కాబ్బటి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనములు మన ఆధ్యాత్మిక జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. దేవుని ప్రేమ, క్షమాగుణం, మరియు కొత్త ఆశ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతాయి.
Fr. Johannes OCD 

29, మార్చి 2025, శనివారం

తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం

తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం
యెహోషువా 5:9-12
2 కొరింథి 5: 17-21
లూకా 15: 1-3, 11-32
                   క్రీస్తునాధునియందు ప్రియ విశ్వాసిని విశ్వాసులరా, ఈ నాడు మనమందరము కూడా తపస్సు కాలపు నల్గొవా ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము. ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం ద్యానించినట్లయితే మూడు పఠనలు కూడా నూతన జీవితం యొక్క సందేశాన్ని మనకు అందజేస్తున్నాయి. 
              అసలు నూతన జీవితం అంటే ఏమిటి అని గ్రహించినట్లయితే పునీత అసిస్సిపురి ఫ్రాన్సిస్ వారు, అవిలాపురి తెరెసమ్మ గారు మరియు సిలవా యోహాను గారు ఈ విధంగా అంటున్నారు నూతన జీవితం అనేది: 
* నూతన జీవితం అనేది క్రీస్తు అడుగు జడలో నడవటం మరియు అయన ఉదాహరణలను అనుసరించడం, 
* నూతన జీవితం అంటే ప్రపంచంలోని భోగభాగ్యలకు దూరంగా ఉండటం మరియు నిరాడంబరమైన జీవితాన్ని గడపటం.
* నూతన జీవితం అంటే దేవుని సృష్టిలో సామరహస్యం జీవించడం మరియు దానిని సంరక్షించడం.
* నూతన జీవితం అంటే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించటం మరియు అవసరాలను తీర్చుటకు సిద్ధంగా ఉండటం.
* నూతన జీవితం అంటే మన పాపాల నుండి వైదోలగడం మరియు దేవుని వైపు తిరగడం.
* నూతన జీవితం అంటే దేవునితో నిరంతరం సంభాసించటం మరియు అయన చిత్తని తెలుసుకొవడానికి ప్రయత్నించటం.
* నూతన జీవితం అంటే దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచడం మరియు అయన మార్గదర్శకత్వనికి లోబడి జీవిచడం.
* పునీత సిలువ యోహాను గారికి నూతన జీవితం అంటే మన కోరికలను మరియు అటాచ్మెంట్‌లను అధిగమించడం మరియు దేవునిపై మాత్రమే ఆధారపడటం.
* పునీత అవిలాపురి తెరెసమ్మ మరియు సిలువ యోహాను. వారిద్దరికి కూడా నూతన జీవితం అనేది నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణం అని మరియు అది దేవుని ప్రేమలో మరింతగా ఎదగడానికి మనలను పిలుస్తుందని బోధించారు.
                యెహోషువ 5:9-12:
ఈ మొదటి పఠనములో ఇశ్రాయేలీయులు ప్రజలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటన గురించి వివరించబడింది. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు చేయబడని సున్నతి గిల్గాలులో చేయబడుతుంది. దీని అర్థం ఏమిటంటే, వారు ఐగుప్తు బానిసత్వం యొక్క కళంకాన్ని తొలగించుకున్నారు మరియు దేవుని ఎన్నిక చేసుకున్న నూతన ప్రజలుగా కొత్త ప్రారంభాన్ని పొందారు. దీని తర్వాత వారు మొదటిసారిగా ఆ దేశపు పంటను తిన్నారు మరియు అప్పటివరకు వారికి ఆహారంగా ఉన్న మన్నా అక్కడితోటి ఆగిపోయింది. ఈ సంఘటన మన జీవితాలకు ఒక గొప్ప గుణ పాఠాన్ని నేర్పుతుంది. మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపం యొక్క బంధకాల నుండి విడుదల పొందుతాము. బాప్తిస్మం అనేది మన జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని మరియు నూతన జీవితాన్ని ప్రారాంబించటం సూచిస్తుంది. ఇకపై మనం పాత జీవితానికి చెందినవారం కాదు అని క్రీస్తునందు కొత్త సృష్టిగా జీవిస్తాము. దేవుడు మనకు అవసరమైన ప్రతిదాన్ని సరైన సమయంలో అందిస్తాడు. అరణ్యంలో మన్నాను అందించిన దేవుడే, వాగ్దాన భూమిలో పంటను కూడా అందించాడు. అదే విధంగా మనం ఆయనపై నమ్మకం ఉంచితే, మన అవసరాలను ఆయన తప్పకుండా తీరుస్తాడు అని ఈ నాటి మొదటి పఠనములో దేవుడు తెలియజేస్తున్నాడు.
            2 కొరింథీయులు 5:17-21:
ఈ రెండొవ పఠనములో క్రీస్తునందు  ఎవరైతే ఉంటారో వారి యొక్క నూతనత్వాన్ని మరియు దేవునితో సమాధానపడే అవకాశాన్ని గురించి మాట్లాడుతుంది. ఎవరైనా క్రీస్తునందు ఉంటే, వారు నూతన సృష్టి పునీత పౌలు గారు అంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటివి పాతవి గతించిపోయి, ఇదిగో కొత్తవి వచ్చాయి ఇదంతా దేవుని ద్వారానే సాధ్యమైంది అంటు,  క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకున్నాడు అని మరియు ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగించాడు. యేసు క్రీస్తు పాపం చేయకపోయినా, మన కొరకు పాపవిమోచకుడిగా చేయబడ్డాడు, తద్వారా మనం దేవుని నీతి బిడ్డలుగా తీర్చిదిద్దాబడ్డము. ఈ మాటలు మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయి. క్రీస్తునందు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించగలము. దేవుడు మనలను తనతో సమాధానపరచుకోవడమే కాకుండా, ఇతరులను కూడా ఆయనతో సమాధానపరచడానికి మనలను రాయబారులుగా నియమించాడు. ఇది మనకు ఇవ్వబడిన గొప్ప నూతన అధ్యాద్మిక బాధ్యత.
                  లూకా 15:1-3, 11-32:
చివరికి సువిశేష పఠనములో యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం గురించి ఇది దేవుని యొక్క అపారమైన ప్రేమను మరియు క్షమాపణను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్లి దుర్వ్యసనాలతో దానిని నాశనం చేసుకుంటాడు. చివరికి దిక్కులేని స్థితిలో తన తండ్రి వద్దకు తిరిగి వస్తాడు. తండ్రి అతన్ని చూసి జాలిపడి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంటాడు మరియు ఘనంగా విందు ఏర్పాటు చేసి సంతోషిస్తాడు. అయితే పెద్ద కుమారుడు దీనిని చూసి అసూయపడతాడు. ఈ ఉపమానంలో తండ్రి దేవునికి, ఇద్దరు కుమారులు కూడా మానవులకు ప్రాతినిధ్యం వహిస్తారు. చిన్న కుమారుడు పాపంలో పడిపోయిన మరియు దేవునికి దూరమైన వ్యక్తిని సూచిస్తాడు. అతని పశ్చాత్తాపం మరియు తిరిగి రావడం అనేది దేవుని క్షమాపణను పొందడానికి అవసరమైన హృదయ మార్పును తెలియజేస్తుంది. తండ్రి యొక్క నిస్వార్ధమైన ప్రేమ మరియు క్షమాపణను మరియు దేవుని యొక్క కరుణను మరియు ఆయన పాపులను స్వీకరించే విధానాన్ని చూపిస్తుంది. పెద్ద కుమారుడు తమ నీతిని గూర్చి గర్వపడే మరియు ఇతరులను తక్కువగా చూసే వారిని సూచిస్తాడు. దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంటుందని మరియు మనం ఇతరుల పశ్చాత్తాపం పట్ల సంతోషించాలి అని ఈ ఉపమానం మనకు నేర్పుతుంది. 
           కాబ్బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమగలవాడు మరియు క్షమించేవాడు. ఆయన మనలను పాపం యొక్క బంధకాల నుండి విడిపించడానికి, మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మరియు తనతో సమాధానపరచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచాలి, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి అప్పుడే మనం ఒక నూతన సృష్టిగా లేకపోతే నూతన వ్యక్తులుగా పరిగనింపబడతాము. మరి అటువంటి దీవెనలకొరకై మనమందరము ఈ బలి పూజలో ప్రార్దించుకుందాము.

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...