26, ఏప్రిల్ 2025, శనివారం

యేసు ప్రభువు దర్శనములు

మార్కు 16: 9-15

ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్తానుడైన యేసు, తాను ఏడూ దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్లి ఆయనతో  ఉండినవారును, దుఃఖసాగరంలో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ  నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.   

ఈ వచనాలు యేసు ప్రభువు పునరుత్థానము నిద్ధారణము మరియు శిష్యులకు ఓదార్పును తెలియజేస్తూ, వారు చేయవలనసిన కర్తవ్యము గురించి తెలియజేస్తున్నాయి. ఈ దర్శనములు వారిలో ఉన్న అపనమ్మకమును తీసివేయుటకు ఆయన సువార్తను బోధించుటకు వారిని మరల ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు. 

మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను

యేసు ప్రభువు మొదటగా ఒక స్త్రీకి దర్శనము ఇస్తున్నాడు. యూదయ సమాజంలో, మరియు యేసు ప్రభువు కాలములో ఒక స్త్రీకి సమాజంలో అంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. మరియు ఈ మరియమ్మ నుండి ప్రభువు దయ్యములను వదలకొట్టాడు. ప్రభువు మనకు దర్శనము ఇవ్వడడానికి మన గత జీవితం ఏమిటి? మనకు సమాజం ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? అనేవి ఏమి ప్రభువు పరిశీలించరు. మనకు ప్రభువు మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిఉంటే చాలు. ఆయన మనము మరచిపోలేని మేలులను మనకు చేస్తారు. అంతేకాక మనలను ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక మందికి ఆదర్శవంతులుగా తయారుచేస్తారు. ఈ మరియమ్మ అనేక బంధనాలనుండి విముక్తి పొందింది. ప్రభువు మాటలకు అణువుగా మనం ఉంటే మన జీవితం కూడా ఎటువంటి లోక శక్తులకు బానిసలు కాకుండా ఎల్లప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతాం. 

ప్రభువు దర్శనం గురించి నమ్మక పోవుట 

దుఃఖంలో ఉన్న శిష్యులకు ప్రభువు ఓదార్పు ఇవ్వడానికి ఎంతగానో వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నప్పటికీ శిష్యులు నమ్మలేదు. వారికి నమ్మకము కలుగక పోవడానికి కారణం పకృతి విరుద్ధంగా ఉన్న మరణం నుండి లేవడం అనేది నమ్మదగినదిగ లేకపోవడం. అంతేకాక ప్రభువే ఇటువంటివి చేశారు. ఆయనే మరణించిన తరువాత ఎవరు అలా చేయగలరు? అనేక ప్రశ్నలు వారిలో ఉన్నవి. వీరిలో ఉన్న ఈ భయాలు మరియు యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు ఆసరాగా తీసుకొని ఎవరైన పుకార్లు పుట్టిస్తున్నారు అనే అనుమానాలు ఇవాన్నీ శిష్యులలో ఉండవచ్చు అందుకే వారు అన్నింటిని నమ్మలేని పరిస్థితుల్లో లేరు. 

 ఇద్దరు శిష్యులకు దర్శనం 

యేసు ప్రభువు గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులకు దర్శనం ఇస్తున్నారు. లూకా సువిశేషంలో ఎమ్మావు వెళుతున్న ఇద్దరు శిష్యులు అని మనం చదువుతాం. ప్రభువు వారితో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రభువును గుర్తించలేకపోయారు. తరువాత రొట్టెను విరిచి ఇస్తున్నప్పుడు వారు ప్రభువును గుర్తించారు. అనేక సార్లు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ప్రభువును గుర్తించలేపోతున్నాము కారణము కేవలం ప్రభువుకు సంబంధించిన విషయాలలో మనం ప్రేక్షకులుగా మాత్రమే ఉంటున్నాము. ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువు వారికి దర్శనము ఇచ్చిన విషయం గురించి ఇతర శిష్యులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు.  శిష్యులు ఏక్కువ నమ్మనది వారికి స్వయంగా  ప్రభువు ఇచ్చిన దర్శనమును. వారు స్వయనుభవంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రభువు మాత్రము మనకు ఇతరుల సాక్ష్యంను కూడా నమ్మమని చెబుతున్నారు. 

ప్రభువుని సందేశం 

యేసు ప్రభువు పదకొండు మంది శిష్యులకు దర్శనము ఇచ్చి వారి అవిశ్వాసమును ఖండించారు. యేసు ప్రభువు వారి హృదయ కాఠిన్యము, అవిశ్వాసమును  గద్దించారు. హృదయ కాఠిన్యము చాల మందిలో పెరుగుతున్నది. హృదయ కాఠిన్యము పెరిగినప్పుడు మనము దేనికి స్పందించము. ఇతరుల అవసరములలో ఉన్న , కష్టాలలో ఉన్నా నాకు ఎందుకులే? అనే ధోరణిలో ఉంటాము.  క్రీస్తు అనుచరులలో ఉండకూడనిది ఈ హృదయ కాఠిన్యము.  అందుకే దేవుడు యిస్రాయేలుకు వారి రాతి గుండెను తీసి మాంసంతో కూడిన హృదయము వారికి ఇస్తాను అని చెప్పినది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు ప్రభువు వలె ఇతరుల జీవితాలు చూసినప్పుడు వారి సమస్యలు , లేక సౌఖ్యాల అనుకూలంగా స్పందించ కలగాలి. ప్రభువు వారితో సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. శిష్యులకు ఉన్న ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడం. ఎందుకు ఇది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రభువు ఇచ్చే రక్షణ అందరికి, కేవలం ఒక జాతి, ప్రాంతం, వర్గమునకు మాత్రమే చెందినది కాదు. ఆ విషయం ఈ శిష్యుల ప్రపంచమంతట తిరిగి అందరికి తెలియజేస్తూ, వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇతరుల అనుభవాలు మాత్రమే కాక వారు కూడా స్వయంగా ప్రభువును పునరుత్థానం అయిన తరువాత చూసారు, విన్నారు మరియు ఆయన నుండి వారి కర్తవ్యము ఏమిటో తెలుసుకున్నారు. వీరు మాత్రమే కాక ప్రభువును తెలుసుకున్న వారు అందరు ఈ కర్తవ్యము కలిగివున్నారు. వారు అందరు ఆయనను ప్రకటించవలసి బాధ్యత ఉంది. 

ప్రార్థన : ప్రభువా! మీరు ఈ లోకమున ఉండగా అనేకమందిని   పాపము నుండి సాతాను బంధనముల నుండి  విముక్తిని కలిగించారు. అదేవిధంగా వారిని స్వతంత్రులనుచేశారు. మీరు చూపించిన కరుణకు స్పందిస్తూ,  మంచి జీవితం జీవించిన వారిని మీరు అనాధారం చేయలేదు. మగ్ధలా మరియమ్మకు దర్శనము ఇవ్వడం, శిష్యులకు దర్శనం ఇవ్వడం, ఇవాన్నీ మీరు మమ్ములను  విడిచిపెట్టడం లేదు అని తెలుపుతున్న, మిమ్ములను నమ్మడంలో, విశ్వసించడంలో  అనేకసార్లు విఫలం చెందుతున్నాం. దానికి మాకు ఉన్న అనేక భయాలు కారణం అయ్యివుండవచ్చు. ప్రభువా! మీరు మాతో ఎప్పుడు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకొని,  మీరు ప్రసాధించిన రక్షణ అందరికి అని, మీ సువార్తను ప్రకటించే భాద్యత, మాకు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు, మీ సువార్తను ఇతరులకు ప్రకటించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ఆమెన్. 

Fr. Amruth

12, ఏప్రిల్ 2025, శనివారం

మ్రానికొమ్మల ఆదివారము


యెషయా 50:4-7
ఫిలిప్పీ 2:6-11
లూకా 22:14-23:56
             ప్రియ సహోదరి సహోదరులరా ఈ రోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈ ఆదివారంతో పాటు మనమందరము పవిత్ర వారంలోనికి ప్రవేశించబోతున్నాము. అదేవిదంగా ఈ యొక్క వారమును మ్రానికొమ్మల ఆదివారంగా కొనియాడుతున్నాము. ఈ నాటి మూడు పఠనలు మనకు సేవకుని యొక్క జీవితం గురించి తెలియజేస్తున్నాయి. మొదటి పఠనములో సేవకునికి ఎన్ని బాధలు వచ్చిన కూడా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు అని తెలియజేస్తున్నది. రెండొవ పఠనములో ఎన్ని బాధలు వచ్చిన కూడా మనలను మనం తగ్గించుకొని జీవించాలని తెలియజేస్తుంది. చివరిగా సువిశేషములో బాధలను అనుభవించుటకు మనలను మనం సిద్ధం చేసుకోవాలని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే లూకా 22:42 లో మనం చూస్తున్నాము బాధలను అనుభవించుట లేక తొలగించుట దేవుని చిత్తానికి వదిలివేయాలని నేర్పిస్తుంది.
           అసలు బాధలు అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే. బైబిల్‌లో బాధలకు సంబంధించిన అనేక వచనాలు ఉన్నాయి, ఇవి మనకు ఓదార్పును, ఆశను, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. బాధలు మానవుని జీవితంలో ఒక భాగమని, దేవుడు మనతో ఉంటాడని ఈ వచనాలు మనకు గుర్తుచేస్తాయి.
బాధలకు అర్థం ఏంటి అని మనం గ్రహించినట్లయితే బైబిల్ ప్రకారం, బాధలు అనేక కారణాల వల్ల వస్తాయి. అవి మన పాపాల ఫలితంగా, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, లేదా దేవుని మహిమ కోసం రావచ్చు. బాధలు మనలను దేవునికి దగ్గర చేయడానికి, మన పాత్రను అభివృద్ధి చేయడానికి, ఇతరులను ఓదార్చడానికి ఉపయోగపడతాయి.
     మరి ముఖ్యముగా కార్మెలైట్ సభ పునీతులు బాధల గురించి అనేక విషయాలు చెబుతున్నారు, ముఖ్యంగా బాధలు దేవునితో ఐక్యమయ్యేందుకు, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు, ఇతరులకు సహాయపడేందుకు ఒక మార్గమని వారు భావించారు. పునీత అవిలాపురి తెరెసమ్మ  గారు  బాధలు దేవుని ప్రేమను అనుభవించడానికి ఒక మార్గమని, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశమని బోధించింది. పునీత సిలువ యెహాను గారు బాధలు ఆధ్యాత్మిక శుద్ధికి ఒక మార్గమని, దేవునితో ఐక్యమయ్యేందుకు సహాయపడతాయని బోధించాడు. అంతే కాకుండా బాధలు స్వర్గంలో శాశ్వత ఆనందానికి దారితీస్తాయని బోధిస్తున్నారు. పునీత ఎలిజబెత్ ఆఫ్ ది ట్రినిటీ బాధలలో దేవుని సన్నిధిని అనుభవించాలని, ఆయన ప్రేమపై నమ్మకం ఉంచాలని బోధించింది. పునీత చిన్న తెరెసమ్మ గారు అంటున్నారు చిన్న చిన్న బాధలను కూడా దేవునికి అర్పించాలని, వాటి ద్వారా ఆయన ప్రేమను చాటాలని ప్రోత్సహించిచరు. కార్మెలైట్ పునీతులు బాధలను సహనంతో, విశ్వాసంతో ఎదుర్కోవాలని బోధించారు. పునీత ఎడిత్ స్టెయిన్  గారు బాధలలో క్రీస్తును అనుసరించాలని, ఆయన బాధలలో పాల్గొనాలని బోధించింది. 
        ముందుగా మొదటి పఠనములో యెషయా 50:4-7 బాధపడుతున్న సేవకుని గురించి మాట్లాడుతుంది. అతను దేవుని మాటలను వింటాడు, ప్రజలను ఓదార్చడానికి నేర్చుకుంటాడు, బాధలను సహిస్తాడు. బాధలు ఎదురైనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచడానికి, ఆయన వాక్యానికి విధేయత చూపడానికి మనలను ప్రోత్సహిస్తాయి.
      రెండొవ పఠనములో ఫిలిప్పీయులు 2:6-11 క్రీస్తు యొక్క  వినయం, త్యాగం గురించి మాట్లాడుతుంది. దేవుని రూపంలో ఉన్నప్పటికీ, ఆయన మనలాంటి మానవునిగా అవతరించాడు. ఆయన తనను తాను తగ్గించుకొని, సిలువ మరణం వరకు విధేయుడయ్యాడు. అందుకు దేవుడు ఆయనను అత్యంత ఉన్నత స్థితికి హెచ్చించాడు, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది తెలియజేస్తున్నాయి. ఈ వచనాలు మనలో వినయం, త్యాగం, దేవునికి విధేయత కలిగి ఉండాలని బోధిస్తాయి.
లూకా 22:14-23:56 యేసుక్రీస్తు యొక్క చివరి భోజనం, పట్టుబడటం, విచారణ, సిలువ మరణం గురించి చెబుతుంది. యేసు తన శిష్యులతో చివరి భోజనం చేస్తూ, తన త్యాగం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఆయనను పట్టుకొని, విచారించి, సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు బాధలు, మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం అని తెలియజేస్తున్నాయి. 
           కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు బాధలు అనేవి జీవితంలో ఒక భాగమని, కానీ దేవుడు మనతో ఉంటాడని చూపిస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు బాధలు మనకు ఆశను కలిగిస్తాయి, ఎందుకంటే ఆయన మన బాధలను అర్థం చేసుకుంటాడు, మనలను ఓదార్చగలడు. బాధలు అనేవి మన విశ్వాసాన్ని పరీక్షించగలవు, కానీ అవి మనలను దేవునికి దగ్గర చేస్తాయి. బాధల సమయంలో, మనం దేవునిపై నమ్మకం ఉంచాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి, క్రీస్తు యొక్క ఉదాహరణను అనుసరించాలి.
Fr. Johannes OCD 
  ‌ 

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...