15, జూన్ 2022, బుధవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి 6:7-15 (జూన్ 16,2022)

సువిశేషం: అన్యులవలె అనేక వ్యర్ధపదములతో మీరు ప్రార్ధింపవలదు. అటుల చేసినగాని, దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరడుగక మునుపే మీ తండ్రి ఏరిగియున్నాడు. మీరిట్లు ప్రార్ధింపుడు:  పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక! నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను  మీరు క్షమించిన యెడల, పరలోక మందలి, మీ తండ్రి , మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనియెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. 

ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు  శిష్యులకు ఎలా ప్రార్దన చేయాలి అని నేర్పిస్తున్నారు .  అన్యుల వలె వ్యర్ధ పదములతో మీరు ప్రార్ధింప వలదు అని వారికి చెపుతున్నారు. ఎందుకు వీరు అనేక పెద్ద పెద్ద మాటలతో , గొప్ప వర్ణలతో దేవుడుని ప్రార్ధిస్తారు అంటే దేవునికి ముఖ స్తుతి ఇష్టం అని వీరు భావిస్తారు, అందుకే చాలా అందమైన పదాలను వాడటానికి ఇష్టపడుతారు. నిజానికి దేవునికి ఇటువంటివి ఇష్టం వుండదు.  దేవుడు మన వేడుకోలును అలకించాలి అంటే మనకు కావలసినది భాష ప్రావీణ్యత కాదు. పొగుడుటలో పట్టాలు కాదు. ఈ లోకం యొక్క మెప్పును పొందాలి అనుకునేవారు, దేవుని గురించి సరిగా అర్ధం చేసుకొనివారు చేసే విధంగా కాకుండా తన శిష్యులు ఏ విధంగా దేవున్ని ప్రార్ధించాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు. 

మీకు ఏమి కావలయునో మీరు అడుగక మునపే మీ తండ్రి ఏరిగియున్నాడు . దేవునికి మనం అవసరములు అన్నీ కూడా తెలుసు. మనం కష్ట సుఖాలు అన్నీ ఆయనకు ఎరుకయే. దేవుని మన అవసరములు తెలియదు అన్నట్లు మనం ప్రవర్తిస్తుంటాం. ఏలియా ప్రవక్త,   బాలు ప్రవక్తలతో గొడవ పడినప్పుడు ఆ ప్రవక్తలను ఈ విధముగానే హేళన చేసింది. మీ దేవర నిద్ర పోతున్నదేమో ఇంకా పెద్దగా అరవండి అని అంటున్నారు. దేవుడు మనకు ఉన్న సమస్యలను  ఇతర దేవరల వలె చూడలేని వాడు కాదు. మనం ఎప్పుడు ఆయన కనుసన్నలలోనే ఉంటాము. దేవునికి నీ అవసరం తెలుసు అదే విధముగా నీ కోరిక తెలుసు. నిన్ను ఎంత పరీక్షించాలో తెలుసు. 

"మీరిట్లు ప్రార్ధింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక!"  ఇక్కడ యేసు ప్రభువు మనకు దేవుడు తండ్రి అని చెబుతున్నారు. ఆయనతో మనం మాటలాడటానికి చాలా ఆనంద పడాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడో మనకు దూరంగా ఉండాలి అనుకునే వ్యక్తి కాదు. ఆయన ఎల్లప్పుడు మనతో ఉండాలి అనుకుంటారు. ఆయన పరలోకంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చిత్తం ఎల్లప్పుడు అక్కడ నెరవేర్చబడుతుంది.

 ఎక్కడ దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో అక్కడ దేవుడు ఉంటారు. ఎప్పుడైతే భూలోకంలో కూడా దేవుని చిత్తం పూర్తిగా నెరవేర్చ బడుతుందో అప్పుడు భూలోకం కూడా పరలోకంలానె ఉంటుంది. మనం ప్రార్ధించాలనది దేవుని నామమును ఎల్లప్పుడు పవిత్ర పరచ బడాలి అని. దేవుని అందరు కీర్తించాలి అని. దేవుని నామమును అపవిత్రం చేయడం అంటే దేవున్ని కాకుండా దేవునిచే సృష్టిని దేవునిగా ఆరాధించడం. దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్దన చేయాలి అని ప్రభువు చెబుతున్నారు. 

ఏమిటి ఈ దేవుని రాజ్యం. ఎటువంటి అసమానతలు లేని రాజ్యం, అందరు సోదర భావంతో మెలిగే రాజ్యం. ఒకరికోకరు ప్రేమ కలిగి జీవించే రాజ్యం. ప్రతి నిత్యం దైవ సాన్నిద్యం అనుభవించే రాజ్యం. ఇటువంటి రాజ్యం ఈ లోకంలో రావాలని ప్రార్ధించాలి. ఈ రాజ్యాన్ని స్థాపించాలని యేసు ప్రభువు కృషి చేశారు. అందుకే దేవుని రాజ్యం  సమీపించినది అని ప్రభువు చెప్పినది. ఇటువంటి రాజ్యం అంటే దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించ బడాలి అప్పుడు నీకోరికలు అవసరాలు అన్నీ, ఏది కూడా కష్టమైనది కాదు. ఇది మొత్తం సాధ్యం ఎప్పుడైతే దేవుని చిత్తం ఇక్కడ జరుగుతుందో అప్పుడు. దానికోసం మనం ప్రార్దన చేయాలి. 

"నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము." దైవ రాజ్యం, ఆయన చిత్తం గురించి ప్రార్ధించిన తరువాత నేటికీ కావాలసిన ఆహారం కోసం ప్రార్దన చేయమంటున్నారు. మన భౌతిక అవసరముల కోసం ప్రార్దన చేసిన తరువాత ప్రభువు మనకు చెప్పేది సమాజంలో మన జీవించే తీరు గురించి. మనం ఏ విధముగా ఇతరుల పట్ల ప్రవర్తిస్తున్నామో మన పట్ల కూడా అదేవిధముగా ప్రవర్తించమని దేవున్ని ఆడగమని ప్రభువు చెబుతున్నారు. నీవు ఇతరులను క్షమించకుండా , ఇతరులకు ప్రేమను పంచకుండా దేవుని నుండి వాటిని ఆశించవద్దు అని ప్రభువు చెబుతున్నారు.ఈలోకం మీద , లోకం వస్తువుల మీద మనకు అనేక శోదనలు వస్తుంటాయి. వాటిలోనికి పడిపోకుండా మనలను రక్షించమని ప్రార్ధించమని చెబుతున్నారు. అనేక మంది గొప్ప వారు ఈ లోక ఆశలకు లోనై దేవున్ని విడనాడి జీవించి ఆయన అనుగ్రహాలు కోల్పోయారు. 

ప్రార్ధన : ప్రభువా! పరలోక ప్రార్దన ద్వారా మేము ఏమి కోరుకోవాలో, ఏమి కోరుకోకూడదో తెలియజేస్తున్నారు ప్రభువా. దేవా!మీ చిత్తమునే ఎల్లప్పుడు ఈ లోకంలో మేము కోరుకునే విధముగా మమ్ము దీవించండి. అనేక సార్లు మేము అన్యుల వలె అనేక వ్యర్ధ పదాలతో ప్రార్దన ఇతరుల కంట పడాలి అని, మేము బాగా ప్రార్ధన చేస్తాము అని అనిపించుకోవాలని ప్రార్దన చేసిన సమయాలు ఉన్నవి ప్రభువా, అటువంటి క్షణాలలో మమ్ములను క్షమించండి. వాక్యంలో చెప్పబడిన విధముగా మొదట దేవుని చిత్తమును వెదికే వారీగా మమ్ము దీవించండి.   మీ చిత్తమును నెరవేర్చిన తరువాత ప్రభువా, మేము మీ రాజ్యమునకు అర్హులము అవుతాము. మీ చిత్తములో క్షమాపణ ఉంది. మీ చిత్తమును నెరవేర్చువాడు. ఇతరులను క్షమిస్తాడు. ప్రేమిస్తాడు. మీ కరుణకు పాత్రుడు అవుతాడు. మమ్ములను మీ చిత్తము నెరవేర్చేవారిగా చేసి , మీ రాజ్యంలో చేర్చుకోనండి. ఆమెన్. 

14, జూన్ 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం (మత్తయి 6:1-6,16-18 )

 మత్తయి 6:1-6,16-18 ( జూన్ 15, 2022)

సువిశేషం: మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్ధనా మందిరములలోను , విధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయ వలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది యున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునపుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తులవలే మీరు ప్రార్ధన చేయవలదు. ప్రార్ధనామందిరములలో, వీధులమలుపులలో నిలువబడి, జనులు చూచుటకై ప్రార్ధనలుచేయుట వారికి ప్రీతి. వారికి తగినఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్దన చేయునపుడు నీవు నీ గదిలో ప్రవేశించి, తలుపులు మూసికొని అదృశ్యుడైయున్న నీ తండ్రిని ప్రార్ధింపుము అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగును. మీరు ఉపవాసము చేయునపుడు, కపట వేషధారులవలె విచారవదనములతో నుండకుడు, వారు తమ ఉపవాసము పరులకంట పడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందు వలన అదృశ్యుడైయున్న నీ తండ్రియేకాని, మరెవ్వరునునీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగ ఒసగును. 

దేవునిచేత ఎలా ప్రశంసించబడాలి? 

"మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు." యేసు ప్రభువు తన శిష్యులకు వారు ఏ విధముగా భక్తి కలిగి ఉండాలి అని చెబుతున్నారు. మన భక్తి దేవునికి మనకు మధ్య వ్యక్తిగతమైనదిగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. మన భక్తి ఇతరులకు చూపించడానికి కాదు అనే విషయం తెలియ పరుస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువు ఈ మాటలను చెబుతున్నారు అంటే పరిసయ్యులు , ధర్మ శాస్త్ర బోధకులు వారి భక్తి క్రియలన్నీ ఇతరులకు కనబడే విధముగానే చేసేటువంటి వారు. అందరు వారి భక్తికి వారిని గౌరవంగా చూసేవారు మరియు ప్రశంసించేవారు. ఎప్పుడైతే వీరిని అందరు గొప్పగా పొగుడుతున్నారో, ఆ పొగడ్తలకు మురిసిపోయి వాటి కోసమే వారి భక్తిని బయట చూపించేవారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే వారి జీవితాలు కపటత్వంతో నిండిపోయేంతగా వెళ్ళింది. ఇతరులు చూడకుండ వీరు ఏమి చేయడానికి ఇష్టపడలేనంతగా వీరి జీవితాలు ఉన్నాయి. ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే వారు బయట నుండి ఒక వస్తువు తీసుకొని వచ్చినప్పుడు దానిని  బయట శుభ్రంగా కడిగితే సరిపోతుంది, లోపల అవసరం లేదు అని చెప్పేంతగా వీరు జీవిస్తున్నారు. 

కొన్ని సంవత్సరాల క్రిందట చదివిన ఒక చిన్న కధ గుర్తుకు వస్తుంది. ఒక ఊరిలో ఒక పెద్ద పేరు మోసిన ఒక లాయరు గారు ఉన్నారు. ఆయన అనేక కేసులలో పేదలవైపున వాదించి పేదలకు సాయం చేసేవారు. ఆ విధంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. అందరు ఆయనను పొగిడేవారు. గొప్పవాడు అని అందరు ఆయనను కీర్తించే వారు. పేదల పెన్నిది అని చెప్పేవారు. ఈ లాయరు గారు,  ఈ పొగడ్తలకు బాగా అలవాటు పడి పోయాడు. రాను రాను ఏ మంచి పని చేయాలన్న ఎవరైన ఉన్నారా ? నేను చేసే మంచి పని చూడటానికి, అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఒక వేళ తాను చేసే మంచి పని చూడటానికి ఎవరు లేకపోతే, ఆ మంచి పని చేయడం మని వేశాడు. ఎందుకంటే తాను చేసే మంచి పని, కేవలం  కీర్తి , ప్రతిష్టలకోసం , తాను చేసే పని చూడటానికి ఎవరు లేనప్పుడు తాను ఆ పని చేసేవాడు కాదు. ఒక రోజు తాను కారులో ప్రయాణం అయి పోతుండగా అక్కడ  చెరువులో ఒక స్త్రీ నీటిలో మునిగి పోతూ , తనను రక్షించమని వేడుకుంటుంది.  ఆ దారిలో పోతున్న ఈ లాయరు గారికి ఆ అరుపులు వినపడుతాయి.  తాను ఆమెను రక్షించినట్లయితే దానిని చూడటానికి , చూసిన తరువాత దాని గురించి చెప్పి, తనను పొగడటానికి ఎవరైన ఉన్నారా?  అని ఆ లాయరు గారు చుట్టు ప్రక్కల చూసి,  ఎవరు లేరు అని గ్రహించి,  ఆమెను కాపాడకుండా వెళ్ళిపోతాడు. మనం చేసే ప్రతి పనిని ప్రభువు చూస్తూనే వుంటాడు. మనకు బహుమానము ఇచ్చేది ప్రభువే కాని మానవ మాత్రులు కారు. ఇతరులు కంట,  పడటానికే మనం మంచి పని చేస్తే అది స్వార్ధంతో చేసిన పని అవుతుంది. 

యేసు ప్రభువు మనం చేసే ప్రతి మంచి పని,  అది భక్తి తో కూడిన పని అయిన లేక ఉపకారంతో కూడిన పని అయిన ఇతరుల మెప్పు పొందుటకు చేయ వద్దు అని చెబుతున్నారు. మన ప్రభువు మనం చేసే అన్నీ పనులను చూస్తారు, ఇతరులు మెప్పు పొందుటకు మనం మంచి పనులు చేస్తే ఇతరులు మనలను మెచ్చుకుంటారు. మనం పొందవలసిన బహుమానం మనం పొందాము అని ప్రభువు చెబుతున్నారు. మనం బహుమానం పొందవలసినది తండ్రి దగ్గర నుండి. ఆయన మన పనులకు సరి అయిన బహుమానం ఇస్తారు. 

డాంభీకములు చెప్పుకోవడం లేక మేము గొప్ప అని అని పించుకోవడం అనేది మన అజ్ఞానం వలనే జరుగుతుంది. మనం చేసే ప్రతి మంచి పని దేవుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం, దానిని మనం సద్వినియోగం చేసుకోవడం కూడా ఆయన కృపనే. కనుక అందుకు మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. 

యేసు ప్రభువు మనం ఉపవాసం చేసేటప్పుడు మనం ఎటువంటి విచారాన్ని బయట పడనివ్వకుండ ఉండమని చెబుతున్నారు. ఎందుకంటే మన భక్తి క్రియలన్నీ చూసే ప్రభువు ఖచ్ఛితముగా మనకు కావలసిన అనుగ్రహాలు, ఇస్తారు అని చెబుతున్నారు. అంతే కాదు ప్రభువు మనకు ఈ అనుగ్రహాలు , బహుమానాలు బాహాటముగా ప్రకటిస్తారు అని చెబుతున్నారు. అప్పుడు మన మంచి తనాన్ని దేవుడే అందరికి తెలియజేస్తారు. దేవునిచేత మనం గొప్ప వారిగా కీర్తించ బడేలా జీవించమని ప్రభువు చెబుతున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! నా జీవిత ప్రయాణంలో అనేక సార్లు ఇతరుల చేత పొగిడించుకోవాలని, మంచి వాడను అని పించుకోవాలని, ఎన్నో మంచి పనులు చేయలని లేకపోయినా చేశాను ప్రభువా. దాని ద్వార నేను మంచి వాడిని అని గొప్ప వాడిని అని పేరు పొందాను. కాని ఎవరు చూడని సమయాలలో అవకాశం ఉండికూడ మంచి చేయడానికి ముందుకు వెళ్లలేదు ప్రభువా. కేవలం నా మంచి పనిని చూడటానికి ఎవరు ఉండరు అనే ఒకే కారణంతో మంచి చేసే అవకాశం వదులుకున్నాను ప్రభువా. ఇటువంటి సంఘటనలు అనేకం నా జీవితంలో జరిగాయి.  ఆ సంఘటనలు అన్నింటిని ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను ప్రభువా. ఇటువంటి ఘటనల నుండి నన్ను క్షమించండి ప్రభువా. మరల ఇటువంటివి నా జీవితంలో జరుగకుండా నన్ను నడపండి. ఇక నుండి నేను చేసే ప్రతి పని ఇతరుల మెప్పు కోసం కాకుండా కేవలం మీ మీద గల ప్రేమ వలనే చేసే విధంగా నన్ను దీవించండి. ప్రభువా , ఇతరుల మెప్పు కాకుండా మీరు మెచ్చుకునే విధంగా జీవించే వానినిగా మార్చండి. ఆమెన్. 


13, జూన్ 2022, సోమవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం (మత్తయి 5: 43-48 )

 మత్తయి 5: 43-48 (జూన్ 14, 2022)

 సువిశేషం: "నీ పొరుగువానిని ప్రేమింపుము; నీ శత్రువును ద్వేషింపుము  అని పూర్వము చెప్పిబడిన దానిని మీరు వినియున్నారుగదా! నేనిపుడు మీతో చెప్పునదేమన : మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అపుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా  ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై , దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా  వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అటులచేయుట లేదా?మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత యేమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక!

నీ పొరుగు వానిని ప్రేమింపుము ; నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదా! మీ పొరుగువానిని ప్రేమింపుము అని లెవీయకాండంలో మరియు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. శత్రువును ద్వేషింపుము అని మనం చూడము. కాని వారి వ్యావహారిక విషయాలలో అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం అంటే ఇష్టం లేని వారిని ప్రేమించడం మనకు చాలా కష్టం. మనలను ద్వేషించే వారిని ప్రేమించడం అంత సులువైన విషయము కాదు. ఆ విధంగా చేయడానికి మనం చాలా అధ్యాత్మికంగా ఎదగాలి .  మనం అంటే ఇష్టం లేని వారిని ద్వేషించడం లేక దూరం పెట్టడం మనం కొన్ని సారులు చేస్తుంటాము.  కాని ఇది దేవుని వాక్కును సరిగా  అర్ధం చేసుకోకుండా మనం చేసే పని. యేసు ప్రభువు ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి వారి ఆలోచనలు  సరి చేస్తున్నారు.  ఎందుకు వారు ఈ విధంగా ఆలోచించకూడదు అని బోధిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు మీ శత్రువులను ప్రేమింపుడు అని అంటున్నారు. 

మీ శత్రువులను ప్రేమింపుడు.  యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలు అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరచి ఉండవచ్చు. ఇవి సాధ్యపడే మాటలు కాదు అని అనిపించి ఉండవచ్చు. నేను ఎలా నా నాశనము కోరుకునే వ్యక్తిని ప్రేమించాలి? అని అనుకోని ఉండవచ్చు. మనం కూడా అటులనే అనుకుంటూ వుండవచ్చు. అసలు నేను ఎందుకు నన్ను వ్యతిరేకించే, లేక నాకు కీడు తలపెట్టే వ్యక్తిని ప్రేమించాలి? అని మనం ఆలోచించినప్పుడు మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. అది ఏమిటి అంటే ప్రేమకు మాత్రమే మానవుడు లొంగిపోతాడు. మనం ఒక వ్యక్తిని గెలవ గలిగేది కేవలం ప్రేమతో మాత్రమే. మనం ద్వేషం చూపిస్తే తాను అదే విధంగా స్పందిస్తాడు కాని ప్రేమకు మాత్రము దాసోహం అవుతారు. వారు మారి అనేక మందికి మార్గ చూపరులు అవుతారు. ప్రేమకు మొదటిలో కోపంతో లేక ద్వేషంతో స్పందించిన తరువాత ఖచ్చితంగా వారు మారుతారు. అందుకే మానవున్ని ఎప్పుడు దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. తన వద్దకు ఆహ్వానిస్తూనే ఉంటాడు. 

"మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అప్పుడు మీరు పరలోక మందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు" : ఆదిమ క్రైస్తవులు ఈ పనులు ఖచ్ఛితముగా పాటించారు. వారిని రాజులు, పాలకులు హింసించినప్పుడు వారి కొరకు ప్రార్ధన చేశారు. స్తేఫాను గారు అందరు రాళ్ళు వేస్తున్న కూడా ఆయన యేసు ప్రభువు వలె ప్రభువు వీరు చేయునదేమో వీరికి తెలియదు వీరిని క్షమించు అని ప్రార్ధన చేశారు. ఆయన మాత్రమే కాదు, అనేక మంది ఆదిమ క్రైస్తవులు ఈ విధంగా ప్రార్ధన చేశారు, వారిని ఇతరులు హింసించినప్పుడు. హింసించే వారి మీద పగ తీర్చుకోలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఇతరులను హింసించే వారు వారి అజ్ఞానంతో ఆ పని చేస్తున్నారు అని .  దైవ జ్ఞానం కలిగి వివేకం కలిగిన దైవ జనుడు అటువంటి హింసను చేయడు. కాని వారి కోసం ప్రార్ధన చేస్తారు. ఇది యేసు ప్రభువు చూపించిన మార్గం.  ఆయనను సైనికులు హింసిస్తున్న వారి కోసం ప్రార్దన చేస్తున్నారు. అప్పడు కూడా తన ప్రక్క వాని విన్నపాన్ని ఆమోదీస్తున్నారు. ఆయన దేవుని కుమారుడు. మనలను కూడా ఆయన వలె చేయమని చెబుతున్నారు. ఈ విధంగా జీవించడం వలన మనం దేవుని కుమారులం కాగలమని ప్రభువు చెబుతున్నారు. 

అంతేకాదు ఇది దేవుని గుణం. ఆయన ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరిపై తన ప్రేమను ఒకే విధంగా చూపిస్తున్నారు. "ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా  ప్రకాశింపజేయుచున్నాడు" ఈ సువిశేషము మనలను దేవుని గుణగణాలు కలిగి ఉండే వారిగా జీవించమని కోరుతుంది. మన జీవితంలో  మనం ఎంత గొప్ప ధ్యేయలు సాధించిన కాని యేసు ప్రభువు మనకు చూపిస్తున్న ఈ గొప్ప గుణాలు అంతటివి అవి కాలేవు. ఎందుకంటే ఇవి దైవ లక్షణాలు. అంతే కాదు యేసు ప్రభువు ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నారు, మిమ్ములను ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే దానిలో మీ గొప్పతనం ఏమి ఉంది అని అడుగుతున్నారు. అందరు ఆ విధంగానే చేస్తారు కదా! సుంకరులు కూడా అలానె చేస్తున్నారు. యూదులు  సుంకరులను , తక్కువ వారిగా చూసేవారు. అంటే మీరు ఎవరి కంటే గొప్ప కాదు అని ప్రభువు వారికి చెబుతున్నారు.   క్రీస్తు అనుచరునిగా , దేవుని నమ్మిన వానిగా నేను పరిపూర్ణత కలిగి జీవించాలి. ఆయన ప్రేమ , వాత్సల్యం ఇతరులకు పంచగలగాలి. దిని కోసం ప్రభువు నన్ను పిలుచుకున్నాడు అని విశ్వసించి మనం జీవించాలి. 

ప్రార్దన : ప్రభువా ! మా జీవితంలో అనేక సార్లు నేను నిజమైన క్రీస్తు అనుచరునిగా జీవించాలి అని అనుకుంటున్నాను కాని ఈలోక ఆశలు లేక ఇతరుల మీద నాకున్న చెడు అభిప్రాయాలు వలన అందరిని దూరం పెడుతూ , ఎవరికి నీ ప్రేమను చూపించ కుండ జీవిస్తున్నాను. నీవు మాత్రము ప్రభువా, నేను నీ వలె, తండ్రి వలె పరిపూర్ణత కలిగి ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా, నేను నీ వలె జీవించలేక పోయినందుకు , ఆ అవకాశాలు చేజార్చుకున్నందుకు నన్ను క్షమించండి ప్రభువా. నాలో ఉన్న చెడు లక్షణాలును, ఇతరులను ద్వేషించే మనస్సును, హింసించే హృదయాన్ని తీసివేయండి.   ఇతరులను క్షమిస్తు, ప్రేమిస్తూ మీ సుగుణాలును అలవర్చుకునే అనుగ్రహం నాకు దయ చేయండి. ఎప్పుడు ఎవరిని ద్వేషించకుండ అందరిని ప్రేమించె మనస్సును ఇవ్వండి ప్రభువా. మీ యొక్క కుమారుని వలె జీవించెలా జేయండి. ఆమెన్ . 





4, జూన్ 2022, శనివారం

పెంతుకోస్తు మహోత్సవం(2)

పెంతుకోస్తు మహోత్సవం
అ. కా. 2 ;1-11
1 కొరింతి 2;3-7,12-13,
యోహాను 20;19-23

ఈరోజు తల్లి శ్రీసభ పెంతుకోస్తు పండుగను కొనియాడుతుంది. ఈరోజును వివిధ రకాలుగా పిలువవచ్చు .  శ్రీసభ ప్రారంభమైన రోజు అని,  పవిత్రాత్మ  శిష్యుల పై వేంచేసి వచ్చిన రోజు అని క్రీస్తునందునికి సాక్షులుగా జీవించమని కోరిన పండుగ. 

Pentecost అనే మాట గ్రీకు నుంచి వచ్చింది. గ్రీకు భాషలో దీనిని Pentekoste  అంటారు.  అనగా 50 వ రోజు అని అర్ధం.

పాస్కా  పండుగ అయిన 50   రోజుల తరువాత జరుపుకునే ఒక విలువైన  పండుగ.  క్రీస్తు ప్రభు యొక్క  పునరుత్తానం అయిన 50 రోజులకు  క్రైస్తవులు భక్తి విశ్వాసంతో జరుపుకునే పండుగ ఇది.
ఈ పండుగను యూదులు కృతజ్ఞత పండుగగా  జరుపుకునే  వారు.    దేవుడు ఇచ్చిన పంటలకు గాను కృతజ్ఞత తెలుపుతూ దేవుని యొక్క గొప్ప కార్యాలు  తలుచుకొని చేసే పండుగ ఇది .

ఈరోజు తల్లి శ్రీసభ పుట్టిన రోజు ఎందుకంటే పవిత్రాత్మ  శక్తిని  పొందుకున్న  తరువాతనే శిష్యులు భహిరంగ సువార్త ప్రకటన చేశారు. దేవుని యొక్క  ఆత్మను స్వీకరించిన అపోస్తులు  భయం విడనాడి దేవుని యొక్క  రక్షణ  ప్రణాళికను కొనసాగించారు. యేసు ప్రభు శిష్యులకు వాగ్దానం చేసిన విధంగా ఆదరణ కర్తను వారి చెంతకు పంపించారు.    మనందరికీ పవిత్రాత్మ రాకడ ఎంతగానో  ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది.

ఈనాటి  మొదటి పఠనములో  పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీదకి  వేంచేసిన  విధానాన్ని చదువుకుంటున్నం మరియతల్లి  శిష్యులందరు  ఒక గదిలో వుండగా ప్రార్ధించే సమయంలో  పవిత్రాత్మ  దేవుడు వారి మీదకి  దిగి వచ్చారు. 

అప్పటివరకు వరకు భయంతో వున్నారు ప్రాణాలు అరచేతులో పెట్టుకొని జీవించారు  కానీ ఎప్పుడైతే  పవిత్రాత్మను స్వీకరించారో  వారి జీవితములే మారిపోతున్నాయి . బలహీనులు బలవంతులు అవుతున్నారు భయంతో వున్నవారు  ధైర్యవంతులు అగుచున్నారు . 

పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో శిష్యుల మీదకి  దిగివచ్చారు. యెరుషలేములో సువార్త ప్రారంభించిన సమయంలో అక్కడ దాదాపు   16 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారందరు కూడాప్రవచనాలు  వారి యొక్క  సొంత భాషలోనే వింటున్నారు  ఇది కేవలం పవిత్రాత్మ యొక్క పనియే  .(అపో 2 ;9 -10 ). 

బాబెలు గోపురం వల్ల పలు భాషల అడ్డు గోడలు కూలి  పోయాయి .దీని ద్వారా యేసు ప్రభు సందేశం  అందరికి చెందింది దానిని అందరు అర్ధం చేసుకుంటారు అని తెలుస్తుంది  అన్నీ భాషలో దేనువుని సందేశం వింటున్నారు అంటే  ఎన్నుకొన్న  జాతి  , ప్రజా ,అంటూ ప్రత్యకంగా  లేరు అందరూ  కూడా దేవుందని ప్రజలే  దేవుని రాజ్యంలోకి నడరు పిలువా పడినవారు   ఎవరు కూడా ప్రత్యకంగా నియమింప పడిన వారు కాదు అందరు కూడా దేవుని యొక్క సొంత  ప్రజలే .

పవిత్రాత్మను స్వేకరించి తరువాతనే  శిష్యులు  సాక్షులుగా మరి తమ యొక్క  ప్రాణాలు సైతం  దేవునికి ఇవ్వాలి అనుకున్నారు .పెంతుకోస్తు  పండుగ పాత నిబంధన  గ్రంధంలో కూడా చూస్తుంటం  పాత  పెంతుకోస్తు  పండుగకు   క్రొత్త పెంతుకోస్తు  పండుగకు  దెగ్గర సంభందం ఉంది . 

పాత పెంతుకోస్తు పండుగ  సీనాయి పర్వతము దగ్గర  దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను సూచిస్తుంది .ప్రభు  సినాయ్  పర్వతం పైకి వేంచేసి వచ్చినపుడు ఆ పర్వతం మీద ఉరుములు  మెరుపులు  మేఘాలలో  యెహువె  దేవుడు శిష్యులమీదకి  దిగి వచ్చారు . (నిర్గమ 19 ;16 -18 )

నూతన నిబంధన  గ్రధంలో కూడా  శిష్యులమీదకి పవిత్రాత్మ  వేంచేసినపుడు బలమైన గాలులు వచ్చాయి .పవిత్రాత్మను  పవిత్ర  గ్రంధంలో వివిధ చిహ్నాలతో పోల్చుతారు.  

-అగ్నితో 
- పావురంతో 
- గాలితో 
- నీటితో

గ్రీకు భాషలో ఉపిరికి  ఆత్మకు  ఒకే పదాన్ని   ఉపయోగించారు  ఊపిరి దేవుని ఆత్మకు గుర్తు దేవుని జీవానికి  గుర్తు. దేవుడు మట్టితో  చేసిన  మానవ రూపంలోకి  తన జీవం ఊది తొలి మానవ వ్యక్తిని సృష్టించి  క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు పవిత్రాత్మ  అనే  శ్వాసనుది క్రొత్త జీవితం  ప్రసాదించారు.

పవిత్రాత్మను  అగ్నితో  పోలుస్తారు అగ్ని దేవుని స సాన్నిదికి  గుర్తు  అగ్ని అని తనలాగా  మార్చుకుంటుంది  అలాగే  పవిత్రాత్మ అందర్నీ తనలాగా  మార్చుకుంటుంది  అగ్ని దహించును  అలాగే  పవిత్రాత్మ   మన  పాపాలను  దహించి  మనకు  పవిత్రాత్మను  దయచేస్తుంది. 
  
అగ్ని క్రొత్త జీవాన్ని పుట్టిస్తుంది, రగిలించుకుంటుంది. పవిత్రాత్మ కూడా శిష్యులలో  క్రొత్త జీవాన్ని పుట్టించారు. అప్పటివరకు భయంతో మరణించిన వారిలో క్రొత్తజీవం నింపారు. 

అగ్ని  వెలుగును  ఇస్తుంది  దరి చూపుతుంది  అదే విధంగా  పవిత్రాత్మ  దేవుడు   శిష్యుల యొక్క  అంధకారం  అనే  అజ్ఞానం  తొలగించి దేవా జ్ఞానం  అనే వెలుగును  నింపారు .
 
పవిత్రాత్మ శిష్యులకు దారి  చూపించారు     ఎటుయైపు   వెళ్ళి సువార్తను  ప్రకటన చేయాలో తెలిపారు  .

రెండొవ పఠనంలో  పౌలు గారు  ఆత్మ  స్వభావం గురుంచి తెలిపారు  
         
1 .ఆత్మ అందర్నీ  ఒకే  సమాజంగా  ఐక్యపరుస్తుంది
ఆత్మ ప్రత్యేక అనుగ్రహాలను దయచేస్తారు. వాటిని అందరూ పొందుకుంటారు. 
౩ ఆత్మ పరిచర్యకు  ఎన్నుకొంటుంది  సేవకు వారిని పంపిస్తారు

జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు సువార్త సేవకు అర్హులే. 
పవిత్రాత్మ దేవుడు మనందరినీ క్రీస్తు శరీరంలో ఐక్యపరచి మనలను ముందుకు నడిపిస్తారు.  
సువార్త పఠనంలో కూడా యేసు ప్రభువు శిష్యులకు పవిత్రాత్మను ఒసగి వారిలో ధైర్యం నింపుచున్నారు. వారిలో క్రొత్త జీవం దయ చేశారు. ప్రపంచమంతటా తిరిగి సువార్త సేవచేయుటకు వారిని పంపిస్తున్నారు. 

ఈరోజు పవిత్రాత్మ దేవుని పండుగ కాబట్టి పవిత్రాత్మ చేసే వివిధ పనుల గురించి ధ్యానిద్దాం. 
1 . పవిత్రాత్మ  మనకు సహాయం చేస్తారు - రోమా 8 : 26 
2 . పవిత్రాత్మ  మనల్ని నడిపిస్తారు - యోహాను 16 : 13 
3 . పవిత్రాత్మ  మనకు బోధిస్తారు - యోహాను 14 : 26  
4 . పవిత్రాత్మ  మనతో మాట్లాడతారు - దర్శన 2 : 7 
5 . పవిత్రాత్మ  మనకు బయలు పరుస్తారు - 1  కొరింతి 2 : 10 
6 . పవిత్రాత్మ  మనకు సూచనలిస్తారు - అ. కా. 8 : 29 
7 . పవిత్రాత్మ  క్రీస్తుకు సాక్షమిస్తారు - యోహాను 15 : 26 
8 . పవిత్రాత్మ  మనల్ని శాంతి పరుస్తారు - అ. కా. 9 : 31 
9 . పవిత్రాత్మ  మనల్ని పిలుస్తారు - అ. కా. 13 : 2 
10 . పవిత్రాత్మ  మనలను దైవంతో నింపుతారు - అ. కా. 4 : 31 
11 . పవిత్రాత్మ  మనల్ని బలపరుస్తారు - ఎఫెసీ ౩: 16 
12 . పవిత్రాత్మ  మనకోసం ప్రార్ధిస్తారు - రోమా 8 : 26 
13 . పవిత్రాత్మ  మన ద్వారా సువార్త పరిచర్య చేస్తారు - 2  పేతురు 1 : 21 
14 . పవిత్రాత్మ  సత్యంకు సాక్ష్యమిస్తారు - రోమా 9 : 1 
15 . పవిత్రాత్మ  మనకు ఆనందం దయచేస్తారు - 1 తెస్స  1 : 6 
16 . పవిత్రాత్మ  మనకు స్వేచ్ఛనిస్తారు - 2 కొరింతి 3 : 17 
17 . పవిత్రాత్మ  విధేయించుటకు సహకరిస్తారు - 1  పేతురు 1  : 22 
18 . పవిత్రాత్మ  మనల్ని క్రీస్తు చెంతకు నడిపిస్తారు - దర్శన 22 : 17 
19 . పవిత్రాత్మ  మన జీవితాలను మార్చుతారు - 2  కొరింతి 3 : 18 
20 . పవిత్రాత్మ  మనలో జీవిస్తారు - 1 కొరింతి 3 : 16 

పవిత్రాత్మ మనకు స్వేచ్ఛ నిస్తారు - రోమా 8: 32
పవిత్రాత్మ  మనలను నుతనికరిస్తారు - తీతు 3: 5
పవిత్రాత్మ  మనలో ఆత్మీయ ఫలములను దయచేస్తారు - గలతి5:22-23
పవిత్రాత్మ  మనకు వరాలు దయచేస్తారు - 1 కొరింతి 12:8-10
పవిత్రాత్మ  మనల్ని  ముందుకు తీసుకొనివెళ్తారు - రోమా 8:14 
పవిత్రాత్మ  మనల్ని  నిరపరాధులు చేస్తారు - యోహాను  16:8
పవిత్రాత్మ  మనల్ని  పవిత్ర పరుస్తారు - 2 తెస్స  2:13
పవిత్రాత్మ  మనల్ని  ధృడంగా ఉండేలా చేస్తారు - అ. కా. 1:8
పవిత్రాత్మ  మనల్ని   ఐక్య పరుస్తారు - ఎఫెసీ 4:3- 4
పవిత్రాత్మ  మన మీద దేవుని ముద్ర వేస్తారు - ఎఫేసి 1:13
పవిత్రాత్మ  మనల్ని  తండ్రి చెంతకు నడిపిస్తారు - ఎఫేసి 2:18
పవిత్రాత్మ  మనకు సహనం  దయచేస్తారు - గలతి 5:5
పవిత్రాత్మ  సైతాను శక్తులను పారద్రోలుతారు 

పవిత్రాత్మ దేవుడు మనకు అనేక విధాలుగా దీవెనలు ఒసగుతుంటారు. మనం కూడా పవిత్రాత్మను పొందినవారం కాబట్టి సువార్త సేవ చేస్తూ దేవుని ప్రేమను పంచుదాం.
 
పవిత్రాత్మ   దేవుని యొక్క పాత్ర:
పవిత్రాత్మ దేవుడు మనందరినీ దేవుని నివాస స్ధలం చేశారు. మన హృదయంలో ఉండేలాగా చేస్తారు. కొరింతి మనందరికీ శక్తిని ఇస్తారు. ఈలోక శక్తులను ఎదుర్కొని ముందుకు సాగుటకు, సైతాను  శక్తులను అధిగమించుటకు అదే విధంగా దేవునికి సాక్షులై ఉండుటకు దేవుడు వారికి శక్తిని దయచేస్తారు. 

పవిత్రాత్మ దేవుడు మనల్ని పవిత్ర పరుస్తారు. దివ్య సంస్కారాలు స్వీకరించుట ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు.  

- జ్ఞానస్నానం ద్వారా మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తారు. 
- భద్రమైన అభ్యంగనం ద్వారా దేవునితో మరియు పొరుగువారితో సఖ్యపడేలా చేస్తారు.
- దివ్య సత్ప్రసాదం ద్వారా ఆధ్యాత్మిక భోజనం దయచేస్తారు. 
-గురుపట్టాభిషేకం మరియు వివాహం ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు. 
దేవుని విషయాలు బోధించి మనల్ని పరలోకానికి చేర్చుతారు. 
మన యొక్క బాధలను వింటారు. మనకు ఊరటను దయచేస్తారు. మన యొక్క ప్రార్ధనలు వింటారు, మనల్ని ప్రార్ధించేలా చేస్తారు. 
మనకి వరాలిచ్చి, ఫలాలను ఇచ్చి మనందరికీ కర్తవ్యం గురించి తెలుపుతారు. 

Rev. Fr. Bala Yesu OCD

పెంతెకోస్తు మహోత్సవము

పెంతెకోస్తు మహోత్సవము

 అ.కా. 2:1-11
1 కొరింతి 12:3-13
 యోహాను 20:19-23

క్రీస్తునాధునియందు ప్రియమైన సహొదరీ సహోదరులారా! ఈనాడు తల్లి తిరుసభ పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. నిజానికి పెంతెకోస్తు పండుగ తల్లి శ్రీసభ పుట్టినరోజు. పెంతెకోస్తు పండుగరోజున పవిత్రాత్మ రాకడను కొనియాడుతున్నాము. నేడు పవిత్రాత్మ అగ్నిజ్వాలలుగా మానవాళిపైకి దిగివచ్చిన ఆనందదాయకమైయిన శుభదినం. పవిత్రాత్మ శ్రీసభను నిర్మించి, ప్రభువు ఒసగిన ప్రేషితకార్యాన్ని గుర్తుచేసి, ఆత్మవరాలతో అందరిని నింపి దైవసేవకు పిలిచిన రోజు. 
పెంతెకోస్తు అనునది యూదుల పండుగ. పెంతెకోస్తు అనగా “50  వ రోజు “అని అర్దం. యూదులు పాస్కా పండుగ అనంతరం ఏడు వారాల తరువాత అంటే  50 రోజుల తరువాత పెంతెకోస్తు పండుగను కొనియాడేవారు. ఇది యూదుల మూడు ప్రధాన పండుగలలో ఒకటి. యూదులు ముఖ్యంగా   కొతకాలము ముగియు సందర్భమున దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు ఈ పండుగను చేసేవారు. 

పెంతెకోస్తు - ప్రభుని వాగ్ధానము నెరవేరిన రోజు :
పెంతెకోస్తు పండుగను ప్రభువు చేసిన వాగ్ధానము నెరవేరిన రోజు అని కూడా పిలవవచ్చు.  క్రీస్తు ప్రభువు కలవరపడుచున్న  తన శిష్యులకు పవిత్రాత్మను అనుగ్రహిస్తానని వాగ్ధానం చేసియున్నారు. "నేను మిమ్ము అనాధలుగా వదిలి పెట్టను. మీతో ఎల్లపుడు ఉండుటకు మీకు ఒక ఆదరణ కర్తను పంపుదును" (యోహాను 14 : 16 ), "నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లి మీకు ఒక ఆదరణ కర్తను పంపిస్తాను" (యోహాను 16 :7 ) అని ప్రభువు సువిశేషంలో వాగ్ధానమొనర్చినట్లు మనం చూస్తున్నాం. 
ప్రభువు తాను చేసినా ఆ వాగ్ధానము ఈనాటి మొదటి పఠనంలో నెరవేరడం మనం చూస్తున్నాం. పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో నాలుకల రూపంలో శిష్యులందరిపై క్రుమ్మరింపబడి, ప్రతి ఒక్కరు పవిత్రాత్మ శక్తి ధ్వారా అన్య భాషలలో మాట్లాడసాగిరి (అ. కా. 2 : 2 - 4 ). అక్కరికి వెళ్లిన ప్రతి ఒక్కరు శిష్యులు వారి వారి సొంత భాషలలో మాటలాడుట విని కలవరపడి, ఆశ్చర్యపోయిరి (అ. కా. 2 : 6 - 7 ). ఈ విధముగా ప్రభువు శిష్యులకు తాను వాగ్ధానము చేసిన పవిత్రాత్మను దయచేసారు. 

ఈనాడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని రాకడను కొనియాడుతున్న మనమందరము ఆయనను గౌరవించాలి, ప్రార్ధించాలి, మరియు ఆరాధించాలి. మనం ఎన్నడును పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు, ఏ  కార్యము చేయకూడదు.  

ఎందుకు పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు? ఏ కార్యము చేయకూడదు? 
“ఎవ్వడేని మనుష్యకుమారునికి వ్యతిరేకముగా మాటలాడిన క్షమింపబడును గాని, పవిత్రాత్మకు వ్యతిరేకముగా పలికినవానికి ఈ జీవితమందైనను, రాబోవు జీవితమందైనను క్షమాపణ లభింపదు" (మత్తయి 12 : 31 - 32) అని క్రీస్తుప్రభువు చాలా స్పష్టముగా చెప్పుచున్నారు. హెబ్రీయులకు వ్రాసిన లేఖలో కూడా 'దయామయుడగు పవిత్రాత్మను అవమానపరచువాని  గతి ఏమవుతుందో, అతడెట్టి నీచమైన శిక్షార్హుడో' అని విచారించడాని మనం చూస్తున్నాం (హెబ్రీ 10: 29). కనుక త్రిత్వంలో ఒకరైనటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరున్ని మనం ఈనాడు గౌరవించాలి, ఆరాధించాలి. 

పవిత్రాత్మను పొందాలంటే మనం ఏం చేయాలి?

1 . హృదయ పరివర్తన చెందాలి :
పవిత్రాత్మను పొందాలంటే ప్రతిఒక్కరు  ముందుగా పాపం నుండి వైదొలగి హృదయ పరివర్తన చెందాలి. "మీరు హృదయపరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు" (అ. కా. 2 : 38 ) అని అపొస్తలుల కార్యంలో మనకు తెలియజేయబడుతుంది. అనగా, పవిత్రాత్మను పొందుటకు హృదయ పరివర్తనం అనేది ఒక ముఖ్యమైన వారధి లేదా ధ్వారం వలె ఉన్నది.

2 . దేవునియందు విధేయత :
పవిత్రాత్మను పొందుటకు రెండవదిగా మనం చేయవలసిన ముఖ్య కార్యము దేవునియందు విధేయత కలిగియుండాలి. "దేవుడు తనపట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మ.........." (అ. కా. 5 : 32 ). ఎవరైతే దేవునియందు విధేయత భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టివారికి ప్రభువు పవిత్రాత్మను అనుగ్రహిస్తారు. 

పవిత్రాత్మను పొందుటవలన కలుగు మేలు ఏమిటి ?

1 . పాపములను క్షమించు అధికారం?
ఈనాటి సువిశేషం ద్వారా  ప్రభువు ప్రతి ఒక్కరికి పవిత్రాత్మ పొందుట ద్వారా పాపములను క్షమించు అధికారమును ఒసగుచున్నారు. "ప్రభువు వారిమీద శ్వాస ఊది 'పవిత్రాత్మను మీరు పొందుడు.ఎవరి పాపములనైనను మీరు క్షమించి యెడల అవి క్షమించబడును; ఎవరి పాపములనైనను మీరు క్షమింపని యెడల అవి క్షమింపబడవు"(యోహాను 20 : 22 -23 ) అని ప్రభువు పలుకుచు మనకు పాపములను క్షమించు ఒక గొప్ప అధికారమును పవిత్రాత్మద్వారా ఒసగుచున్నారు. 

2 . దేవుని రాజ్యంలోకి ప్రవేశం:
పవిత్రాత్మ మనకు దేవుని రాజ్యంలోకి చేరడానికి ప్రవేశాన్ని కల్పిస్తుంది.  "ఒకడు ఆత్మ వలన, నీటి వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 3 : 5 ) అని పరిసయ్యుడైన నికోదేముతో ప్రభువు పలుకుచున్నారు. పవిత్రాత్మను స్వీకరింపని యెడల మనకు దైవ రాజ్యంలో స్థాన ఉండదని నికోదేము ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. 

3 . దేవుని పుత్రులం:
 పవిత్రాత్మ ద్వారా మనమందరము దేవుని పుత్రులం అవుతాం అని పునీత పౌలు గారుతెలియజేస్తున్నారు. "దేవుని ఆత్మద్వారా నడుపబడువారు దేవుని పుత్రులు.......... దేవుని ఆత్మ ద్వారా మనం దేవుని 'అబ్బా! తండ్రీ!' అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని  సాక్షమిచ్చును (రోమా 8 : 14 - 16 ).

4 . మన బలహీలతలో సహాయపడును:
మన బలహీనతలో పవిత్రాత్మ మనకు సహాయపడునని పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖలో తెలియజేస్తున్నారు. "బలహీనులమైన మనకు పవిత్రాత్మ సహాయపడును. ఏలయన, మనం ఎట్లు ప్రార్ధింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా ఆత్మయే మన కొరకు దేవుని ప్రార్ధించును (రోమా 8 : 26 - 27 ). 
5 . జీవమును ఒసగును:
పవిత్రాత్మ మనకు జీవమును ఒసగును అని పవిత్ర గ్రంధము తెలియజేయుచున్నది. "క్రీస్తును మరణమునుండి  లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన, మీయందున్న తన ఆత్మ వలన మీ మర్త్య శరీరములకు కూడా జీవమును ఒసగును" (రోమా 8 : 11 ) అని పౌలు గారు పవిత్రాత్మ వలన కలుగు ఫలమును బోధిస్తున్నారు. 

కనుక క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా!  పెంతెకోస్తు పండుగ అనగా పవిత్రాత్మ రాకడను జరుపుకుంటున్న  ఈ శుభదినాన అందరము ఆ పవిత్రాత్మ  సర్వేశ్వరుడు మన యందు, మన కుటుంబాల యందు నివసిస్తూ, ఎల్లప్పుడూ మనలను ఆ ప్రభుని మార్గంలో నడిపిస్తూ, శాంతి సమాధానంతో మనలను నింపమని ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్ధించుదాం. 

Br. Joseph Kampally 

28, మే 2022, శనివారం

ప్రభువు మోక్షరోహణ పండుగ

 అపో. కా 1:1-11, ఎఫెసీ  1: 17-23, లూకా 24:46-53 

ఈ రోజు తల్లి శ్రీ సభ యేసు క్రీస్తు ప్రభువు యొక్క మోక్ష రోహణ పండుగ  జరుపుకొంటుంది. ప్రభువు పునరుత్థానం  అయిన నలభై రోజులు శిష్యులకు దర్శనమిస్తూ , వారి విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ వారిని సువార్త పరిచర్యకు తయారు చేస్తూ, వారు సంపూర్ణంగా  దేవుని యొక్క  అనుభూతిని పొందిన తరువాత శిష్యులకు పరలోకంలో  నివాసం కల్పించుటకు యేసు క్రీస్తు ప్రభువు, తన తండ్రి చెంతకు  తిరిగి వెల్లుచున్నారు. యోహను 14:2-3. 

యేసు ప్రభువు పూర్వం తాను ఉన్న స్థలమునకు వెల్లుచున్నారు. పరలోకం నుండి దిగివచ్చిన  దేవుడు మనకు పరలోక విషయాలను బోధించి మనలను పరలోకం నడిపించుటకు , మనలను పరలోకంకు  చేర్చుటకు మార్గం చూపించారు. 

తాను వచ్చిన స్థలంకే మరలా తిరిగి వెల్లుచున్నారు. ఆయన పరలోకం వెళ్ళిన సరే లొకాంతము వరకు మనతోనే ఉంటారు. మత్తయి 28:20. దివ్య సత్ప్రసాదంద్వారా, దివ్య సంస్కారముల ద్వారా, ప్రార్ధన ద్వారా, వాక్యం చదవటం, ధ్యానించటం ద్వారా దేవుడు మనతోనే ఎప్పడూ ఉంటారు. 

క్రీస్తు ప్రభువు పరలోకంకు వెళ్ళటం ద్వారా దేవుని పనిని ఈ లోకంలో కొనసాగించాలి.  దేవుడు మనలను  భౌతికంగా విడిచి వెళ్లినందుకు ఒక విధంగా మనం బాధ పడాలి. ఇంకొక విధంగా  సంతోషించాలి. ఎందుకంటే త్రీత్వంలో  పవిత్రాత్మ దేవున్ని మనకు తోడుగా ఉండుటకు పంపిస్తానన్నారు. పవిత్రాత్మ ఆదరణకర్తగా , ఓదార్చువాడుగా  మనకు తోడుగా ఉండటానికి పంపిస్తానన్నారు. 

ఈరోజు  మనం చదువుకున్న మొదటి పఠనంలో పునీత లూకా గారు యేసు ప్రభువు యొక్క పునరుత్థాన సన్నివేశంను  వివరించారు. దానితో పాటు  శిష్యులకు పవిత్రాత్మను ఇస్తానని వాగ్ధానం చేశారు. 

సువార్తికులలో  కేవలం లూకా గారు మాత్రమే ప్రభువు యొక్క  మోక్ష రోహణంను చక్కగా వివరించారు. ప్రభువు యొక్క  శిష్యులు ఆయనను చూడటం అదే చివరి సారి.  వారందరు యేసు ప్రభువును చూస్తుండగా  ప్రభువు వారి కనుచూపు మేర నుండి మేఘాల్లో అదృశ్యమయ్యారు. 

మొదటి పఠనంలో లూకా గారు యేసు  ప్రభువు యొక్క పునరుత్థానం  తరువాత ఏ విధంగా శిష్యులతో వున్నారో, ఎలాగా వారిని బలపరిచారో, ఎంత గొప్పగా వారిని తీర్చి దిద్దరో, అలాగే వారికి  పవిత్రాత్మ దేవుని ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు గురించి తెలిపారు. 

లూకా గారు  ఆయన వ్రాసిన సువార్త మరియు అపోస్తులుల కార్యములు తెయొఫీలూ అనే వ్యక్తికి అంకితం చేశారు. లూకా 1:1.

 తెయొఫీలూ సమాజంలో మంచి పేరున్న వ్యక్తి కాబట్టియే లూకా గారు ఆయనను ఘనత వహించిన తెయొఫీలు అని సంబోదిస్తున్నాడు. 

 తెయొఫీలూ అనగా దేవుని చేత ప్రేమించబడిన వాడు అని మరియు దేవుని స్నేహితుడని అర్ధం. ఆయన పాలస్తీనాకు బయట జీవించారు. అందుకే లూకా గారు ఆయనకు ప్రభువు  విషయాలు లేఖల ద్వారా తెలియజేస్తున్నారు. 

తెయొఫీలూ అను వ్యక్తి దేవునిలో ఎదగాలని కోరుకున్న వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవున్ని వెంబడించిన వ్యక్తి. 

తెయొఫీలుకు దేవుని పట్ల తృష్ణవుంది. ఆయన్ను తెలుసుకోవాలనే దాహంతో ఉన్నారు. రెండు పుస్తకాలు ఆయన కోసమే లూకా గారు వ్రాసారంటే  ఆయనకు   ఎంత ప్రగాఢమైన కోరిక వుందో మనం  తెలుసుకోవాలి. తేయొఫీలూ క్రీస్తు ప్రభువు యొక్క జీవితంకు ఆకర్షింపబడ్డారు. 

యేసు ప్రభువు పునరుత్థానం  తరువాత శిష్యులకు దర్శన మిస్తూ, శాంతి యుతంగా జీవించుట గురించి బోధించారు. అలాగే దేవుని ముంగిట ఎలా జీవించాలి అనే విషయములను నేర్పించారు. 

దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు శిష్యులలో  ఒక ఆశను కలిగించారు. మనిషి జీవితంలో కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితే జీవితం నిలబడుతుంది అని ప్రభువు నేర్పించారు.  బ్రతుకు మీద ఆశలు కల్పించారు. 

ప్రభువు పరలోకంకు వెళ్ళేంత వరకు సువార్తను ప్రకటించుచునే వున్నారు. తన తండ్రికి సంపూర్ణ, విధేయత చూపుతూ తనకున్నది, మొత్తం కూడా తండ్రిని మహిమ పరుచుటకే అని భావించి ఆయనకు విశ్వాస పాత్రునిగా జీవించారు. 

దేవుడు మనకిచ్చిన వరములన్నీ మంచిగా వినియోగించి పరలోకంకు వెళ్ళాలి. పరలోకంలో ప్రవేశించే వరకు  మన యొక్క వరాలను మనం దేవున్ని మహిమ పరచడానికే వినియోగించాలి. యోహను 9:4, 1 పేతురు 4:10 . 

యేసు ప్రభువు ఈ భూలోకంలో పరిచర్య  చేసి తండ్రి చెంతకు తిరిగి వెళ్ళే సమయం వరకు పవిత్రాత్మ  దేవుని శక్తి తో  పనిచేసి బోధించారు. యేసు ప్రభువు పవిత్రాత్మ మీద ఆధారపడి జీవించారు. తనను తాను సమర్పించుకున్నారు. 

క్రీస్తు ప్రభువే పవిత్రాత్మ మీద ఆధారపడి జీవిస్తే మరి మనమెంతగా ఆదారపడి జీవించాలి. 

యేసు ప్రభువు ఆజ్ఞలిచ్చి  వాటిని పాటించమని  తాను ఎన్నుకొన్నవారికి  తెలియజేశారు. అనేక మందికి  పరలోక విషయములు తెలియజేసినా ప్రభువు యొక్క మనసు , attention శిష్యుల మీదనే  ఉంది. ఎందుకంటే ఆయనకు  సాక్షులుగా  ఉండబోతున్నారు కాబట్టి. ప్రభువు పరిచర్యం మొత్తం కూడా శిష్యుల మీదనే ఆధారపడి ఉంది. శిష్యులె ప్రభువు యొక్క సందేశాన్ని మొదటిసారిగా అందించేవారు. ఆయన పునరుత్థాన వార్తను అదించేవారు శిష్యులే కాబట్టి ప్రభువు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారు విఫలమైతే ప్రభువు యొక్క పని విఫలమైనట్లే. అందుకే శిష్యుల మీద concentrate చేశారు. వారు విజయం పొందితే, ప్రభువు విజయం పొందినట్లే ఆయన యొక్క పని సంపూర్ణంగా పూర్తి అవుతుంది. 

ప్రతి యొక్క క్రైస్తవుడు కూడా ప్రభువు గురించి ప్రకటించాలి. 2 తిమోతి 2:2., మత్తయి 28:19-20 యోహను 20:21. 

అపో 1:3 వ వచనంలో ప్రభువు శిష్యులకు పునరుత్థానం అయ్యాక  కనిపించారని తెలుపుతుంది. నూతన నిబందన గ్రంధం లో, దాదాపు 10 సార్లు ఆయన దర్శనం గురించి వ్రాయబడింది. 

1. మగ్ధలా మరియమ్మకు దర్శనం ఇచ్చారు.  యోహను 20:11- 18

2. స్త్రీలకు దర్శనం ఇచ్చారు, ఖాళీ సమాధి గురించి చెప్పుటకు వెళ్తున్న స్త్రీలకు ప్రభువు దర్శనం ఇచ్చారు. మత్తయి 28: 8-10 

3. పేతురు గారికి దర్శనం ఇచ్చారు. లూకా 24:34, 1 కోరింథీ 15:5 

4. ఎమ్మావు మార్గంలో  శిష్యులకు దర్శనం ఇచ్చారు. లూకా  24:13-42 

5. శిష్యులకు తోమా గారు లేని సమయంలో ఇచ్చిన దర్శనం.  మార్కు 16:14, యోహను 20:19-25. 

6. చేపలు పట్టుటకు వెళ్ళిన శిష్యులకు దర్శనం ఇచ్చారు.  యోహను 20. 

7. ప్రభువు 500 మంది విశ్వాసులకు దర్శనం ఇచ్చారు.  1కోరింథీ 15:6 

8. శిష్యులందరు ఉన్నప్పుడు దర్శనం ఇచ్చారు. మత్తయి 28:16-20 

9. యకొబుకు దర్శనం ఇచ్చారు.  1 కోరింథీ 15:7 

10. ఆయన మోక్ష రోహణమప్పుడు విశ్వాసులకు దర్శనం ఇచ్చారు. ఇవి కాకుండా  ఇంకా   కోన్ని  బహుశ వ్రాయబడలేదు. యోహను 20:30-31. 

మోక్షరోహణ సమయంలో ప్రభువు శిష్యులను, విశ్వాసులను సాక్షులై ఉండమని తెలుపుచున్నారు.  8 వ వచనం. పవిత్రాత్మ పొందిన తరువాత భూదిగంతముల వరకు మనము దేవునికి సాక్షులై ఉండాలని ప్రభువు తెలిపారు. శిష్యులు పవిత్రాత్మ శక్తిని పొందిన తరువాత ఈ లోక ఆశలు ఏమియు వారు కొరలేదు. అధికారం కోసం, పేరు కోసం, ఆశ పడలేదు. కేవలం ఆయనకు సాక్షులై జీవించారు. 

శిష్యులు దేవుని విషయాలను  అందరితో పంచుకున్నారు, ఈ వచనంలో మీరు అంటే కేవలం శిష్యులు మాత్రమే కాదు.  అందరు ప్రతి విశ్వాసి కూడా సాక్షియై జీవించాలి. సువార్తను ప్రకటించాలి. 

సాక్షులై జీవించుట అంటే  దేవునికొరకు జీవించుట, ప్రాణాలు సైతం సమర్పించుట. సాక్షులు క్రీస్తు ప్రభువు ఆలోచనలు కాదు తెలిపేది ,క్రీస్తు ప్రభువునే. 

ఈనాటి రెండవ పఠనంలో దేవుని విశ్వాసులు ప్రభు జ్ఞానమందు  ఎదుగుట కొరకు పౌలుగారు ప్రార్ధిస్తున్నారు. దేవుని యొక్క పవిత్రాత్మను పొందుకొని వారు ప్రభువుని తెలుసుకొనుటకు ప్రార్ధిస్తానని చెబుతున్నారు. 

విశ్వాసులు దైవ జ్ఞానంను  కలిగి జీవించాలి. మనం దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ దేవుడు క్రీస్తు ప్రభువే ఆయన తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు. అలాగే విశ్వాసులు, తండ్రి దేవుని గురించి తెలుసుకోవాలి.  ఆయన సృష్టి కర్త అని గ్రహించి, వారి యొక్క గొప్పతనం ధ్యానించుకొని వారి గురించి జ్ఞానం సంపాదించుకోవాలి. 

దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు కాబట్టి విశ్వాసులందరు ఆయన జ్ఞానంలో ఎదగాలి. దేవుని జ్ఞానంలో ఏదగాలంటే మూడు విషయాలు మనం కలిగి ఉండాలి. 

1. విశ్వాసికి విజ్ఞానము వుండాలి. దేవుని యొక్క ఆత్మ ఉండాలి. 

2. విశ్వాసి దేవునితో సంబంధం కలిగి జీవించాలి.  దేవుడు ఎవరని గ్రహించి ఆయనతో బంధంను ఏర్పరుచుకోవాలి. 

3. విశ్వాసి దేవున యొక్క క్రియలు తెలుసుకొని రోజు రోజుకు ఆయనలో ఎదగాలి . తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి. 

రెండవ భాగంలో యేసు క్రీస్తు ప్రభువును తండ్రి లేవనెత్తిన విధానం గురించి పౌలు గారు తెలుపుచున్నారు. 

ప్రభువు చూపిన విధేయతను బట్టి సమస్తము ఆయన పాదముల క్రింద వుంచారు. తండ్రి కుమారున్నీ అధికంగా దీవించారు. మనందరం ఆయన శరీరంలో భాగస్తులము కాబట్టి ఆయన్ను గురించి ప్రకటించాలి. మన యొక్క క్రియల ద్వార , మాటల ద్వారా ప్రకటించాలి. 

ఈనాటి  సువిశేష పఠనంలో  యేసు ప్రభువు  చివరి సారిగా శిష్యులతో  మాట్లాడారు. ఆయన  పునరుత్థానం  తరువాత  చివరి  రోజు  ప్రభువుకు భూలోకంలో . ఇది మోక్ష రోహణంకు ముందు. ప్రతి ఆదివారం  విశ్వాస ప్రమాణంలో  మనం చెబుతాం. ఆయన పరలోకంకు ఎక్కి తండ్రి కుడి ప్రక్కన  కూర్చొని వున్నారని.  తండ్రి చిత్తాన్ని  సంపూర్ణంగా నెరవేర్చిన తరువాత ఆయన ప్రణాళికా ప్రకారంగా తండ్రి  చెంతకు తిరిగి వెల్లుచున్నారు. 

యేసు ప్రభువు  40 రోజుల తరువాత  మోక్షంకు ఎత్త బడ్డారు. తండ్రి కుమారున్నీ పునరుత్థానం ద్వారా మహిమ పరిచారు. మరొకసారి మోక్ష రోహణం ద్వారా మహిమ పరచి తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైయ్యేలా చేశారు. 

ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు  ప్రభువు యొక్క పట్టాభిషేకం రోజు.  ప్రభువుకు పరలోకంలో సన్మానం జరిగిన రోజు. ఆయన యొక్క త్యాగ క్రియలకు, తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినందుకు పరలోకంలో గొప్ప సన్మానం జరుగుతుంది. 

క్రీస్తు భూలోకంలో తనకొసగబడిన కర్తవ్యాన్ని జయ ప్రదంగా ముగించుకొని వస్తున్నాడని పరలోక దూతలు ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. 

పిత దేవుడు , పవిత్రాత్మ దేవుడు కుమారున్ని పరలోకంలోకి ఆహ్వానించి తండ్రి  తన కుడి ప్రక్కన సింహాసనములను ఇచ్చారు. ఇది పరలోకంలో ఒక పండుగ దినం, సంతోషకరమైన  రోజు. ప్రభువు పరలోకంలోకి ప్రవేశించారు. ప్రభువు వలె మనమందరం కూడా పరలోకంలో ప్రవేశించాలి. 

ప్రభువు యొక్క మోక్ష రోహణంకు  మరియు క్రీస్తు జయంతికి ఒక దగ్గర సంబంధం వుంది. క్రీస్తు జయంతిలో త్రీత్వంలో వున్న పుత్రుడు, దైవ , మానవ స్వభావంతో ఈ లోకంలో జన్మించారు. 

మోక్ష రోహణం  ద్వారా పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు దివ్య శరీరం ద్వారా దైవ స్వభావంతో మరల త్రీత్వంలో కలుస్తున్నారు, పరలోకంలో ప్రవేశిస్తున్నారు. 

ఏ శరీరంను అయితే శిష్యులు పునరుత్థానం తరువాత తాకారో అదే దివ్య  శరీరంతో ప్రభువు పరలోకానికి వెళ్లారు. క్రీస్తు జననం ద్వారా ప్రభువు భూలోకంలోనికి ప్రవేశించి  మానవులకు దగ్గరగా వున్నారు. ఆయన మోక్ష రోహణం ద్వారా మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్లారు. 

యేసు ప్రభువు అదే శరీరంతో పరలోకంకు  వెళ్లారు. యేసు ప్రభువు మోక్ష రోహణం అయ్యే ముందు ప్రపంచమంతట వెళ్ళి బోధించమని  శిష్యులకు చెప్పారు. 

సువార్తను ప్రకటిస్తూ  ప్రభువు యొక్క ప్రేమకు సాక్షులవ్వాలి. ప్రభు ప్రేమను ప్రపంచమంతట చాటి చెప్పాలి. 

ఈ ప్రకటించే బాధ్యత కేవలం గురువులది, కన్యస్త్రీలది మాత్రమే కాదు. అది అందరికి చెందినది. అందరు ప్రకటించాలి. పవిత్రాత్మ దేవుని సహకారంతో  మనందరం ప్రేమ వ్యాప్తికై కృషి చేయాలి. 

ప్రభువు యొక్క ప్రేమతో పాటు మనందరం విశ్వాసం గురించి , దేవుని  దయ గురించి , రక్షణము గురించి, క్షమను గురించి మనం బోధించాలి. 

అనుదినం దైవ అనుభూతిని పొందుతూ మనం దేవుని గురించి ప్రకటించాలి.   

యేసు ప్రభువు యొక్క మోక్ష రోహణం మనందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. 

1. మనం పరలోకంలో ప్రవేశించుటకు దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించాలి. 

2. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. 

3. దేవుని యొక్క ప్రేమను పంచి పెట్టాలి. 

4. పాపంను జయించి  హృదయ పరివర్తనం చెంది జీవించాలి. 

5. దేవుని సువార్తను ప్రకటించాలి. 

6. దేవుని యొక్క ఆనందంలో పాలు పంచుకొని జీవించాలి. 

 By Rev . Fr. BalaYesu OCD


21, మే 2022, శనివారం

పాస్క 6 వ ఆదివారం

పాస్క 6 వ ఆదివారం (2)

 అపో 15:1-2, 22-29, దర్శన 21:10-14, యోహను 14:23-29 

ఈనాటి  దివ్య పఠనాలు మరి ముఖ్యంగా మొదటి పఠనం సువిశేష పఠనం శాంతి గురించి బోధిస్తుంది. మనందరం ఐక్యంగా ఒకే ఆలోచనలో, అభిప్రాయంలో వుంటే అక్కడ ఎటువంటి  కలహాలు  వుండకుండా, శాంతి వుంటుంది, అని ఈ దివ్య పఠనాలు తెలియజేస్తున్నాయి. 

మానవ జీవితంలో అనేక సందర్భాలలో కష్టతరమైన, క్లిష్ట సమస్యలకు పరిష్కారం,  సమాధానం వెదికేటప్పుడు అభిప్రాయ భేధాలు రావచ్చు, సంఘర్షణలు రావచ్చు, వివాదాలు, విభేధాలు, మనస్పర్ధలు రావచ్చు. అలాంటి సందర్భాలలో మనం శాంతిని నెలకొల్పేందుకు ఒక మంచి మార్గాన్ని, అందరు మెచ్చే మార్గాన్ని ఎన్నుకోవాలి. 

ఈనాటి మొదటి పఠనంలో తొలి క్రైస్తవులకు ఎదురైన ఒక సమస్యను గురించి వింటున్నాం. 

అప్పుడే విశ్వాసం స్వీకరించిన ఆదిమ క్రైస్తవులకు రక్షణకు సంబంధించిన విభేదాలు వచ్చాయి. రక్షణ పొందాలంటే వాస్తవానికి ఒక వ్యక్తి ఏమి చేయాలి, అనే విషయం గురించి కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సున్నతికి సంభందించినది. 

శ్రీ సభ ప్రారంభమైన తొలి 20 సంవత్సరములు, క్రైస్తవులంటే ఎక్కువగా యూద మతం నుండి క్రైస్తవులుగా మారిన వారే. ఆ సమయంలో ఏ అన్యుడైన, క్రైస్తవునిగా మారాలంటే వారు మొదటిగా యూదులుగా మారాలి. యూదుల అన్నీ ఆచారాలు అనుసరించాలి. అందుకే రక్షణ పొందాలంటే సున్నతి అవసరం అని యూదయ నుండి వచ్చిన అన్యులు అన్నారు. క్రైస్తవులుగా మారాలని ఇష్టపడుచున్న  అన్యులు కూడా అన్నీ ఆచార విధులను పాటించాలని పట్టుబట్టారు. 

అంతియోకు సంఘంలో ఉన్న విశ్వాసులు, క్రీస్తు సంఘంలో సున్నతి లేకుండానే చేరారు. వారు విశ్వసించేదెమిటంటే జ్ఞాన స్నానం , విశ్వాసం ఉంటే చాలు ఎవరైన రక్షణ పొందవచ్చని. 

అప్పటి భేధాభిప్రాయం ఏమిటంటే అన్యులను క్రీస్తు సంఘంలో చేర్చుకునేందుకు వారు మొదటిగా యూదులుగా మారటం అవసరమా? లేదా? అనే భేదాభిప్రాయాలు వచ్చాయి. 

ఈ భేదాభిప్రాయం ఏలా వుందంటే రెండు జాతులు మధ్య భేదాభిప్రాయం, రెండు సంస్కృతులు మధ్య, రెండు రకాల ఆలోచనల మధ్య భేదాభిప్రాయం మొదలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పౌలు, బర్నబా గార్లు ఎవరైన రక్షణ పొందాలంటే క్రీస్తు నందు విశ్వాసం కలిగి ఆయన్ను అంగీకరిస్తే చాలు, రక్షణ పొందవచ్చు అని తెలిపారు. 

ఈలాంటి పెద్ద సమస్యను వారు ఏకాభిప్రాయం ద్వారా విశ్వాసుల మధ్య శాంతిని నెలకొల్పారు. పౌలు , బర్నబాలు ఈ సమస్యను అపోస్తులతో చర్చించి దీనిని సరి చేశారు. 

మన కుటుంబాలలో కూడా సమస్యలు భేధాభిప్రాయలు ఉంటే వాటిని కూర్చొని మాట్లాడితే, ఏక ఆలోచన , నిర్ణయం కలిగి ఉంటే సమాధానంతో ఉండవచ్చు. 

తొలి క్రైస్తవ సంఘం కూడా యెరుషలేములో  మొదటిగా సమావేశాన్ని ఏర్పరిచారు, పవిత్రాత్మ తో  నడిపింపబడి సరియైన నిర్ణయం తీసుకున్నారు. 

అపోస్తులు తాము తీసుకున్న నిర్ణయం తమ ఒక్కరిదే కాదని స్పష్టం చేశారు. మా చేత  నిర్ణయించబడినది అని తెలిపారు. 

ఈ నిర్ణయం  రెండు కారణాల వల్ల మహిమాన్విత ప్రాముఖ్యతను  కలిగి ఉంది. 

1. మొదటిగా క్రైస్తవ విశ్వాసాన్ని యూదామతం నుండి విస్పష్టంగా వేరు చేసింది. 

2. రక్షణ అనేది మానవుని విశ్వాస జీవితానికి మరియు దేవుని ప్రేమకు చెందినది. 

దేవుడు మనల్ని రక్షించేది ఆయన  ప్రేమ వలనే ఆయన ప్రేమే మనలను కాపాడుతుంది. 

మన విశ్వాస జీవితంలో కూడా  మనం ప్రార్ధించాలి, మంచిగా జీవించాలి, సోదర ప్రేమ , దైవ ప్రేమ కలిగి ఉంటే దేవుని ఆజ్ఞలు పాటించి జీవిస్తే మనం రక్షణ పొందవచ్చు. 

మన విశ్వాస జీవితంలో  ప్రశాంతంగా వుండాలంటే ఒకే అభిప్రాయం ఉంటే అంతా శాంతి యుతంగా , ఆనందంగా వుంటుంది. 

మన జీవితంలో దేవుని యొక్క తోడు ఎప్పుడు కూడా ఉండాలి. 

ఈనాటి రెండవ పఠనంలో  యోహను గారు నూతన యెరుషలేమును  దర్శనంలో చూసారు.  అది ఎంతో అందంగా, ప్రకాశవంతంగా ఉంది . 

ఈ నూతన  యెరుషలేము చుట్టూ గోడ కలదు, దానికి 12 ద్వారాలు ఉన్నాయి. ఈ పన్నెండు ద్వారాలు 12 మంది దేవ దూతల ఆధ్వర్యంలో  ఉన్నాయి అని తెలిపారు 

యోహను గారు చూసిన ఈ  దర్శనం శ్రీ సభ గురించియే. ఈ నూతన యెరుషలేము అయిన శ్రీ సభ 12 మంది అపోస్తుల  మీద నిర్మించబడింది. ఈ యొక్క శ్రీ సభ బాధ్యతలను మొదటిగా దేవుడు వీరికే అప్పజెప్పారు. 

వారు దేవుని యొక్క నామమును వేదజల్లారు. యేసు క్రీస్తువే వారికి ఆదరువు , ఆయనయే వారికి వెలుగుగా, రక్షకునిగా మార్గ చూపరిగా ఉన్నారు. 

దేవుని వెలుగును స్వీకరించిన వారు ఎల్లప్పుడు శ్రీ సభను ప్రకాశవంతంగా చేస్తారు. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులను ఆజ్ఞలను పాటించమని తెలుపుచున్నారు. 

మొదటిగా ప్రభువు అంటున్నారు. నన్ను ప్రేమించువారు, నా ఆజ్ఞలు పాటిస్తారు అని, వాస్తవానికి మనం ఎవరినైన ప్రేమిస్తే వారు చెప్పిందల్లా పాటిస్తాం, అనుసరిస్తాం. ఉదాహరణకు ఒక స్నేహితుడు  ఇంకొక స్నేహితుడి పట్ల సోదర ప్రేమ కలిగి  ఉంటే అతని కోసం ఏదైనా చేస్తాడు. 

అదే విధంగా ప్రేయసి ప్రియుడి మధ్య ఉన్న ప్రేమ వలన ఒకరి మాట ఒకరు  పాటించుకొని జీవిస్తారు. 

మనం కూడా దేవున్ని ప్రేమిస్తే ఆయన్ను బాధ పెట్టము, ఆయన ఆజ్ఞలు పాటిస్తాము. ఆయన  యొక్క చిత్తమునే  ఈ లోకంలో నెరవేర్చుతాము. 

దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞలను పాటించుట ద్వారా మనం దేవుని ప్రేమకు సాక్షులవుతున్నాము. దేవుడు మనతో ఉంటారు. తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తారు, దేవున పేరిట ఏమి అడిగినను దయ చేస్తారు, దేవుడు మనతో నివసిస్తారు. 

దేవున్ని ప్రేమించని  వారు  ఆయన అజ్ఞలను  పాటించరు, ఎందుకంటే ఆయన మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు అందుకే ఆయన ఆజ్ఞలను పాటించుట లేదు. 

ఆయన్ను నిజంగా ప్రేమించేవారు ఆయన యొక్క ఆజ్ఞలను  శిరసావహిస్తాడు, ఆయన చిత్తానికి  తనను తాను లోబరుచుకుంటాడు. ఆయన మాటను పాటిస్తాడు. 

దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా  ఆయన్ను ప్రేమించుట అసాధ్యం. మనలో చాలా మంది దేవుని సహకారాన్ని అర్ధిస్తున్నమే కానీ  ఆయన ఆజ్ఞలను పాటించుట లేదు. 

ప్రభువా , ప్రభువా అని పిలిచేవారు పరలోకంలో చేరరు కాని దేవున్ని ప్రేమించి, ఆయన చిత్తాను సారంగా  జీవించేవారే ప్రవేశిస్తారు. మత్తయి 7:21. 

యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యులకు తోడుగా వుండుటకు ఓదార్పు వాడును పంపిస్తానంటున్నారు. పవిత్రాత్మ దేవుడు అందరికి అన్నీ విషయాలు తెలియ పరుస్తానంటున్నారు. 

యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యులకు శాంతిని ఒసగుతున్నారు 27 వ వచనం. ప్రభువు యొక్క శాంతి నీతితోను, సత్యము తోను కూడిన శాంతి. ఈ లోకంలో అందరు శాంతి కోసం చూస్తున్నారు. యేసు ప్రభువు శాంతి ఇస్తానంటున్నారు. ఆయన శాంతి అంటే మనం ఆయన జీవితంను ఆదర్శం చేసుకొని ఎటువంటి ఆశలకు గురికాకుండా  అధికారం కోసం ఆశించ కుండా డబ్బు మీద ప్రీతి ఉండకుండా కేవలం దేవుని చిత్తం నెరవేర్చుటయే. 

యేసు క్రీస్తు తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చారు. ఆయన శాంతి యుతంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అయన జీవితంను  ఆదర్శం చేసుకొని శాంతి సమాధానాలతో  ఉండాలి. 

ఏ  విషయంలో కూడా  భయ పడకుండా దేవుడే అన్నీ సమకూర్చుతాడు అనే విశ్వాసం కలిగి జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD

20, మే 2022, శుక్రవారం

పాస్క కాల 6 వ ఆదివారం

 పాస్క కాల 6 వ ఆదివారం 

అపో. కా 15:1-2,22-29 దర్శన 21:10-14,22-23 యోహను 14:23-29 

క్రీస్తు నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాడు తల్లి తీరుసభ ఈస్టర్ 6 వ ఆదివారం లోనికి అడుగిడుతుంది. ఈనాటి  మొదటి పఠనం అపోస్తుల కార్యముల నుండి తీసుకొనబడింది. ఈ పఠనంలో  ఒక ముఖ్యమైన సంఘటనను వివరించడం చూస్తున్నాము. అది ఏమన “రక్షణ”మరియు సున్నతి .

ఈ సున్నతి వలన యూదులకు మరియు పౌలు , బర్నబాలకు మధ్య ఒక గొప్ప వివాదం చోటుచేసుకుంది. అది ఏమి అంటే యూదులకు సున్నతి  పొందిననే తప్ప రక్షణ లేదు అని పౌలు, బర్నబాలు  రక్షణ పొందడానికి సున్నతితో సంభందం లేదు అని వాదించారు.  యూదులు ధర్మ శాస్త్రానికి మరియు మోషే చట్టానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. వారు పాటించడాని కంటే ఎదుటివారు పాటించడం మీద  ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు,  ఉదాహరణకు ఈనాటి వాక్యము మరియు క్రీస్తు ప్రభుని జీవితంలో జరిగిన సంఘటనలు.

చట్ట ప్రకారము సున్నతి  పొందితేనే రక్షణ మరియు దేవాలయము లోనికి అనుమతి. యూదులకు అన్యులు దేవాలయమునికి రావడం ఇష్టమే కాని వారు సున్నతి పొందిన వారై ఉండాలి. సున్నతి పొందటం అంటే యూదుడుగా మారుటయే అని యూదులు భావించేవారు. పౌలు , బర్నబాలు యూదుల మాటలన్నీ త్రోసివేసి దేవుడు ఒక్కడే, అన్యులకు , యూదులకు , గ్రీకులకు అందరకు ఆయనే దేవుడు, ఆయన యందే రక్షణ అని ధృడంగా వాదించారు. రోమి 3:29... దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడే, దేవుడు ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. ధర్మ శాస్త్రమనే సంకెళ్లతో యూదులు ఎప్పుడు బంధించడానికి ప్రయత్నించేవారు. కాని పౌలుగారు చెప్పినట్లు  మరణించిన వారి మీద ధర్మ శాస్త్రము వర్తించదు. మనము క్రీస్తు శరీరము ద్వారా మరణించితిమి, ఆయన లేవనెత్త బడినట్లు మనము ఆయనలో సజీవులమయ్యాము, అంటే ధర్మ శాస్త్రముల నుండి విముక్తులమై, వ్రాతపూర్వకమైన ధర్మ శాస్త్రమును అనుసరించిన పాత పద్ధతిలోకాక,  ఆత్మానుసరమైన క్రొత్త పద్దతిలో  దేవుని సేవించు చున్నాము. రోమి 7:1-6.

విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహముకూడ ఎటువంటి ధర్మ శాస్త్రమును పొందలేదు, ఎటువంటి సున్నతి పొందక ముందే  దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింప బడ్డాడు. రోమి 4 :10  అబ్రహాము సున్నతి పొందక పూర్వమే విశ్వాసము వలన దేవునిచే నీతిమంతునిగా అంగీకరింపబడెను. దేవుని బిడ్డలు కావాలంటే, దేవుని రక్షణ పొందాలంటే విశ్వాసము అవసరము కాని బాహ్యకరమైన సున్నతి కాదు.

రోమి 3:30 విశ్వాసము ద్వారా ఆయన సున్నతి పొందిన వారిని , సున్నతి పొందని వారిని తనకు నీతిమంతులను చేయును. అంతియోకులో ఈ వివాదము చోటు చేసుకోవడానికి కారణం కొంత మంది యూదులు, ఎవ్వరైతే అన్యులంటె గిట్టని వారో  , వారు ఎప్పుడు, యూదులు దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారు అని, గర్వంతో వుంటూ ఇతరులను అన్యులుగా పరిగణించేవారు.

ఎప్పుడైతే ఈ కొంత మంది యూదులు, విశ్వాసులుగా మారిన యూదులు,  అన్యులు మధ్యకు వచ్చి ఈ యొక్క మాటలను అన్నారో అప్పుడు యూదులకు మరియు పౌలు, బర్నబాలకు మధ్య వివాదం మొదలైంది. ఇటువంటి ప్రవర్తనే మన క్రైస్తవత్వం లోనికి వస్తే మనము కూడా యూదా మతం లాగా వర్గాలుగా మారాల్సి వచ్చేది.

క్రైస్తవత్వం  అంటేనే కలయిక , కలసిఉండటం. ఈ కలయిక వలనే క్రైస్తవత్వం అంటారు. మనమందరం కూడా క్రీస్తులో ఐక్యమవటం, ఆయనలో కలసి ఉండటం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలసి ఆయన నామమున ప్రార్థన చేస్తారో ఆయన అక్కడ ఉంటాను  అని అన్నాడు.

దివ్య బలి పూజ, దివ్య సత్ప్రసాదం ఇవన్నీ ఒక్కరి కోసం కాదు, ఒక తెగ కోసం కాదు, ఒక జాతి కోసం కాదు. జాతి , కుల , ప్రాంతీయ వర్గ భేదాలు లేకుండా అందరు కలసి పాల్గొనే దానినే  దివ్య బలిపూజ, అందరు కలసి భుజించే దానినే దివ్య సత్ప్రసాదం, అందుకే క్రైస్తవం,  కలసి చేసేది, కలసి ఉండేది, క్రైస్తవత్వం. అందుకే  పౌలు , బర్నబాలు ఈ సమస్యను  అపోస్తులులు, పెద్దలు మరియు క్రీస్తు సంఘంలోని వారి యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఎంతో చాక చక్యంగా మెలిగిరి.

వారికి వారుగా, వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. వారు పవిత్రాత్మ సహాయాన్ని కోరారు. వారు పవిత్రాత్మ  సహాయము ద్వారా ఎంతో చాక చక్యముగా ఈ సమస్యను చక్క దిద్దారు. యేసు ప్రభువు చెప్పినట్లు మిమ్ము నడిపించడానికి మీకు  తోడుగా ఒక సహాయకుడిని  పంపిస్తాను, ఆయన మీకు అన్నీ విషయాలలో అన్నీ వేళలా తోడ్పడతాడు అని, ఆ పవిత్రాత్మ వారికి తోడ్పడింది ఈ సమస్యను తీర్చడానికి . యోహను 16:13-14. వారు సమస్యను చక్క దిద్దటమే కాదు, సమస్యను చక్క దిద్దటములో ఎంతో తెలివిగా మెలిగారు.

వారు రాసిన లేఖను తిరిగి పౌలు , బర్నబాలకు ఇచ్చి పంపించ కుండా, వారిలో ఇద్దరును ఎన్నుకొని, ఇద్దరికి  పౌలు , బర్నబాలతో లేఖను ఇచ్చి పంపిచ్చారు.  పౌలు, బర్నబాలు  లేఖను  తీసుకొని వెళ్లినట్లయితే ప్రజలు  నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే  వీరు మార్గ మధ్యములో, కూడబలుకుకొని  ఒక లేఖను తీసుకొని వచ్చి మనలను నమ్మిస్తున్నారు, అని అపోహ పడే వారు. కానీ పవిత్రాత్మ  ఇద్దరినీ పౌలు , బర్నబాలతో పంపించి లేఖను చదివించి అంతియోకులో , సిరియాలో, సీలీషియాలో ప్రజల విశ్వాసాన్ని దృడం చేసింది. 

ఈనాటి రెండవ పఠనంలో యోహను గారికి కలిగిన దర్శనం  గురించి వివరిస్తున్నాడు. ఈ  యొక్క దర్శనం నూతన యెరుషలేము గురించి మరియు దాని వైభవము గురించి వివరిస్తుంది. యెరుషలేము  నగరం దాని యొక్క కాంతి, ప్రాకారము, ద్వారములు, గోడలు మరియుదేవుని సన్నిధి గురించి తెలియజేస్తుంది.  ఇటువంటి దర్శనమును  మనము యెహేజ్కెలు గ్రంధంలో కూడా చూస్తాము. ప్రభువు యొక్క సన్నిధి దర్శనములో యెహెజ్కెల్ ప్రవక్తను యిస్రాయేలు దేశమునకు తీసుకొనిపోయి ఒక ఉన్నత పర్వతం పై నిలిపి ఆ నగరపు కట్టడములను చూపిస్తాడు ( యెహెజ్కెలు 40:2 )

ఈ యొక్క నగరపు గోడలు మీద  యిస్రాయేలు ప్రజలు యోషయా గ్రంధంలో పాటలు పాడటం చూస్తాము. యోషయా 26:1 మాకోక బలమైన పట్టణము కలదు. ప్రభువే దాని ప్రాకారములను, బురుజులను కాపాడును. యోషయా 54:11-12 విలువ గల మణులతో నిన్ను పుననిర్మింతును , నీల మణులతో నీ బురుజులు కట్టుదును, అరుణ కాంతిలీను మణులతో నీ ద్వారములు కట్టుదును, ప్రశస్త రత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును.

 నగరమునకు 12  ద్వారములు క్రైస్తవ సంఘాన్ని సూచిస్తున్నాయి. ఆ 12 ద్వారములకు 12 గోత్రముల పేర్లు లిఖించ బడినవి, ఇవి క్రైస్తవ సంఘం నడచుకునే , కొనసాగే విధానాన్ని  సూచిస్తున్నాయి. ఈ యొక్క నూతన యెరుషలేము ద్వారములు గురించి యెహేజ్కెలు  ప్రవక్త తన గ్రంధంలో వివరించాడు. (యెహేజ్కెలు 48:30-35.) తూర్పున ఉన్న ద్వారములు సూర్యుడు ఉదయించే వైపుని తలపిస్తాయి, ఇది ప్రతిరోజు ఉదయము ప్రభుని పవిత్ర నగరం లో వేదకటాన్ని  సూచిస్తుంది. ఉత్తరమున ఉన్న ద్వారము చల్లని ప్రదేశమును తలపిస్తాయి, క్రైస్తవత్వంలో క్రైస్తవులు హృదయంలో విశ్వాసాన్ని ధృడపరచుకునే మార్గంగా సూచిస్తున్నాయి. దక్షిణమున ఉన్న ద్వారములు వేడి ప్రదేశములకు తలపిస్తాయి, ఈ ప్రాంతములో గాలులు  ప్రశాంతముగా వీచుతాయి.  వాతావరణం సున్నితముగా వుంటుంది, ఇది ఎవ్వరైన బావోద్వేగాలతో సిలువ మీద ప్రేమతో వచ్చేవారికి మార్గముగా సూచిస్తుంది.పడమర ఉన్న ద్వారములు సూర్యుడు, అస్తమించే వైపు ఇవి పవిత్ర నగరములోని సాయం కాల సమయమున క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చే వారికి మార్గమును సూచిస్తుంది.

ఈ యొక్క క్రొత్త యెరుషలేము నగరములో ఎన్నో ఉన్నాయి, కానీ యోహను గారికి దేవాలయం మాత్రం కనిపించలేదు. యూదులకు  దేవాలయం  ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యం , ఎంతో పవిత్రత కాని అ క్రొత్త నగరమున దేవాలయం మాత్రం కనిపించలేదు. కాని ఒక గొర్రెపిల్ల మాత్రం కనిపించి దానినే దేవాలయముగా  యోహనుగారు భావించారు, యెహెజ్కేలు ప్రవక్త చెప్పినట్లు  ప్రభువే ఆ నగరమునకు దేవాలయం (యెహేజ్కేలు 48:35)  నగరమునకు ప్రభువు ఇచ్చట ఉన్నాడు అని పేరు పెట్టవలెను. 

రాతితో కట్టబడిన దేవాలయం కాదు మన విశ్వాసాన్ని తెలియజేసేది. మన అంతరంగంలో కట్టబడే విశ్వాసం అనే దేవాలయం తెలియ జేస్తుంది, క్రైస్తవులు అంటే ఎవరు అని. రాతితో కట్టబడిన  దేవాలయంలో కాదు ప్రభువు వసించేది, నీ హృదయంలో.  ప్రభువు సమరియా స్త్రీ తో చెప్పినట్లు పర్వతము మీదనో లేక దేవాలయంలో కాదు దేవుని ఆరాధించేది, నీ హృదయంలో దేవుని ఆరాధించే దినములు వస్తాయి అని.

పౌలు గారు చెప్పినట్లు  మన శరీరం దేవుని ఆలయం, మనముకాదు జీవించేది మనలో క్రీస్తే జీవిస్తున్నాడు అని . బాహ్యంగా కనపడేది కాదు ప్రభువునకు కావలసినది. కానీ నీ యొక్క అంతరంగంలో ఏమున్నది అని ప్రభువు లెక్కిస్తాడు, మొదటి పఠనములో యూదులు బాహ్యమైన సున్నతికి  మరియు ధర్మ శాస్త్రమునకు ప్రాధాన్యత ఇచ్చారు కాని వారి అంతరంగమునకు కాదు.

 సువిశేష పఠనములో యోహను సువార్తికుడు తండ్రి కుమారుల బంధాన్ని, కలయికను వర్ణిస్తున్నాడు. తండ్రి కుమారున్నీ ఎంతగా ప్రేమిస్తాడో, కుమారుడు తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈనాటి సువిశేషంలో చూడవచ్చు. అధె విధంగా తండ్రి, కుమారులను ప్రేమించే వారిని దేవుడు ఇంకా ఎంతగా ప్రేమిస్తాడో కూడా చూడవచ్చు.

యోహను సువిశేషమంత గమనిస్తే, సువార్తికుడు అయిన యోహను గారు ప్రభువునకు ప్రియమైన శిష్యుడు, ఆయన ప్రేమను ఎంతగా పొందాడో , ఈయన ప్రభువుని ఎంతగా ప్రేమించాడో, ఈయన రాసిన సువిశేషం ద్వారా మనకు అర్ధం అవుతుంది.

యోహను గారికి అంతా కూడా  దేవుని ప్రేమ, ప్రేమ అనేది అన్నిటికీ మూలాధారం. దేవుడు, ప్రభుని ప్రేమిస్తున్నాడు, ప్రభువు, దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుడు మానవున్ని  ప్రేమిస్తున్నాడు, మానవుడు, దేవున్ని  ప్రేమిస్తున్నాడు, మానవుడు, మానవుడిని ప్రేమిస్తున్నాడు, సృష్టి అంతయు కూడా ప్రేమ అనే బంధంతో ముడి పడియుంది. విధేయతకు ములాధారం ప్రేమ, అందుకే దేవుడు ఉత్థానమైన తరువాత ఆయనను ప్రేమించిన వారికి కనిపించారు, కాని పరిసయ్యులు , ధర్మ శాస్త్ర భోదకులకు మరియు యూదులకు కాదు. తండ్రి మీద ప్రేమ వలన క్రీస్తు ప్రభువు, సిలువ మరణాన్ని విధేయతతో స్వీకరించాడు.

ఇది అర్ధం కాని  వారు, సిలువ మరణాన్ని అసభ్యకరమైన మరణంగానే చూస్తారు.  కాని దానిలోని ప్రేమను కాని త్యాగాన్ని కాని విధేయతను కాని అర్ధం చేసుకోరు. ప్రభువు ఒసగిన రెండు ప్రధాన  ఆజ్ఞలను ఈనాటి సువిశేషంలో చూస్తాము. తండ్రి దేవుని ప్రేమించడం , తన పొరుగువారిని ప్రేమించడం. ప్రభువు తండ్రి దేవుని ప్రేమించాడు కాబట్టి విధేయతతో ప్రభువు ఒసగిన కార్యాన్ని  నెరవేర్చాడు.తన  స్నేహితులు , పొరుగువారు అయిన శిష్యులను ప్రేమించాడు అందుకే వారిని ఒంటరిగా  వదలి వేయకుండా వారికి తోడుగా పవిత్రాత్మను ఇస్తున్నాడు.

ఈ పవిత్రాత్మ మనకు అన్నీ విషయాలను బోధిస్తుంది, ప్రభుని మాటలను తెలియచేస్తుంది. ఆయన మార్గంలో నడుచుటకు సహాయకునిగా ఉంటుంది. ఎవరైతే ఆయన  యందు ప్రేమ కలిగి ఉంటారో, వారికి తన సమాధానం ఓసగుతాను అని ప్రభువు పలుకుతున్నాడు. ప్రభుని సమాధానం అంటే కొద్ది కాలం ఉండేది కాదు, చివరివరకు మనతో ఉండేది. ఒక్క కష్టములలో మాత్రము కాదు, అన్నీ విషయాలలో మనతో ఉండేది. రోమి 5: 6-11 నీతిమంతుని కొరకై, సత్పురుషుని కొరకై , పాపాత్ములమైన మన కొరకై ఆయన మరణించేను. మన దేవుడు, మనపై తనకు ఉన్న ప్రేమను చూపాడు. అంతే కాదు ఆయన ద్వార మనం సమాధానం పొందాము.

 Br. Lukas OCD 

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...