6, జనవరి 2024, శనివారం

క్రీస్తు సాక్షాత్కార పండుగ

క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60:1-6,ఎఫేసి 3:2-3, మత్తయి 2:1-12
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నది. సాక్షాత్కారం అనగా క్రీస్తు ప్రభువు తనను తాను ఇతరులకు ఎరుకపరుచుట. తండ్రి దేవుడు తన కుమారుడిని ఈ లోకమునకు అంతట ఎరుకపరిచారు. ఆయన యొక్క పుట్టుక ద్వారా దేవుడు మొదటగా ఏసుప్రభువును తన తల్లిదండ్రులకు తరువాత గొల్లలకు ఎరుకుపరిచారు అటు తరువాత ముగ్గురు జ్ఞానులకు తన కుమారుడిని బయలుపరిచారు. క్రీస్తు సాక్షాత్కారము ద్వారా మానవలోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది. దేవుడికి మానవునికి మధ్య ఉన్న తెర తొలగిపోయి దేవుడు మానవుడు ఒకటిగా కలిసి ఉన్నారు, ముఖాముఖిగా ఒకరినొకరు చూడగలుగుతున్నారు.
ఈ పండుగను మూడు విధాలుగా పిలుస్తారు
1. ముగ్గురు రాజుల పండుగని
2. విశ్వాసుల పండుగని
3. అన్యుల క్రిస్మస్ పండుగని
ఈ ముగ్గురు జ్ఞానులు అన్యులైనప్పటికీ వారు క్రీస్తు రాజును దర్శించడానికి మరియు ఆరాధించటానికి దూర ప్రాంతముల నుండి సుదీర్ఘమైన ప్రయాణం చేసి కష్టమైనా ఇష్టముగా మార్చుకొని వారు దివ్య బాల యేసును సందర్శించారు. ఈ జ్ఞానులు క్రీస్తు ప్రభువు చెంతకు చేరుటకు ఎటువంటి పవిత్ర గ్రంథమును చదవలేదు కేవలం ఒక నక్షత్రమును ఆధారముగా చేసుకొని వారి యొక్క ప్రయాణమును ప్రారంభించి రక్షకుడిని చేరుకున్నారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరనగా? కాస్పర్, మెల్కియోర్, బల్తజార్.
కాస్పర్ అనేటటువంటి జ్ఞాని అరేబియా దేశం నుంచి తన ప్రయాణం ప్రారంభించి దేవునికి సాంబ్రాణి సమర్పించారు. ఈ సాంబ్రాణి యాజకత్వమునకు గుర్తు ఏసుప్రభు నిత్య యాజకుడని గుర్తించి ఆయన అందరికీ రక్షణనిచ్చుటకై తన్ను తానే బలిగా సమర్పించుకుంటారని మరియు మన కొరకై తండ్రిని సంతోష పరుచుటకు ఒక యాజకునిలా ధూపము వేస్తూ మనలను ఆశీర్వదిస్తారు.
మిల్కియోర్ అనే జ్ఞాని ఏసుప్రభుకు బంగారమును సమర్పించారు. ఈ బంగారం యేసు ప్రభు యొక్క రాజరికమునకు గురుతుగా ఉన్నది. ఆయన మన అందరి యొక్క హృదయములను పరిపాలించే రాజు అందుకే ఆయనకు బంగారం కానుకగా సమర్పించారు
బల్తజార్ అనే జ్ఞాని పరిమళ ద్రవ్యమును యేసు ప్రభుకి సమర్పించారు అది ఆయన మరణమును సూచిస్తుంది. ఆయన మరణించిన తరువాత తన యొక్క శరీరమును మంచిగా ఉంచుటకు ఈ యొక్క పరిమళ ద్రవ్యమును సమర్పించారు. ముక్కు రంధ్రంలో పరిమళ ద్రవ్యమును ఉంచినట్లయితే ఆ యొక్క శరీరం చాలా కాలం నిలుస్తుంది.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను జరుపుకునే సందర్భంలో వారి జీవితము నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి
- 1. ఏసుప్రభువును చూడాలన్న కోరిక. వీరి ప్రయాణం చీకటిలో జరిగినప్పటికీ వారు ఏసుప్రభుని చూడాలి అనేటటువంటి గాఢమైన కోరికను కలిగి ఉన్నారు కాబట్టి ఆయనను సందర్శించి ఉన్నారు. మనలో కూడా దేవుడు ఎడల ఒక గాఢమైన కోరిక ఉండాలి అది ఏమిటి అంటే ఆయనను చూడాలి, ప్రార్థించాలి, ఆయన సన్నిధికి రావాలి అని కోరిక మనలను నడిపించాలి.
2. వెదకుట- ఏసుప్రభు కోసం వెతుకుతూ ఉన్నారు చివరికి ఆయనను కనుగొన్నారు కాబట్టి మనలో కూడా వెదికే సుగుణం ఉండాలి.
3. పాత మార్గమును విడిచి కొత్త మార్గమును అనుసరించాలి. ఈ జ్ఞానులు కూడా చేసినది అదే.
4. దేవుడిని ఆరాధించారు. అన్యులైనప్పటికీ వారు ఏసుప్రభుని విశ్వసించి ఆయన రక్షకుడని గ్రహించి వారు ఎంత పెద్ద జ్ఞానులైనప్పటికీ కూడా ఆయన ముందు సాష్టాంగ పడి ప్రభువుని ఆరాధించారు.
5. విధేయత చూపుట. దేవుని యొక్క దూత వారికి ఆదేశించిన విధముగా వారు దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి వారి యొక్క ప్రయాణమును కొనసాగించారు.
6. దేవునికి కానుకలు సమర్పించారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఏసుప్రభువుకు విలువైన కానుకలను సమర్పించారు అలాగే మనము కూడా దేవునికి విలువైన కానుకలు సమర్పించాలి.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను కొనియాడే  సందర్భంలో మనము వీరిలో ఉన్న లక్షణములను కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

30, డిసెంబర్ 2023, శనివారం

తిరు కుటుంబ ఉత్సవము

తిరు కుటుంబ ఉత్సవము
సిరాకు 3:2-6,12-14
కొలోస్సీ 3:12-21
మత్తయి 2:13-15,19-23

ఈనాడు తల్లి శ్రీ సభ తిరు కుటుంబ పండుగ జరుపుకుంటుంది. ఈ పండుగను 15వ బెనెడిక్ట్ పాపుగారు 1921 వ సంవత్సరంలో ప్రారంభించి ఉన్నారు. క్రిస్మస్ పండుగ జరుపుకున్న సందర్భంలో అదే విధముగా ఒక సంవత్సర చివరి ఆదివారమును ముగించుకొని ఇంకొక కొత్త సంవత్సరములోనికి అడుగుపెట్టేముందు మనము తిరు కుటుంబ పండుగను కొనియాడాలని శ్రీ సభ నిర్ణయించుకున్నది ఎందుకనగా తిరుగు కుటుంబమువలె మన కుటుంబం కూడా ఉండాలి కాబట్టి.
తిరు అనగా పవిత్రమైన కుటుంబం అని ఆదర్శవంతమైన కుటుంబం అని అర్థం. యేసు, మరియమ్మ తల్లి మరియు యేసేపు గార్ల కుటుంబమును తిరు కుటుంబ అని పిలుస్తారు. వీరి కుటుంబం ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబములకు ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.
ఈ పండుగను జరుపుకునే సమయంలో మన కుటుంబాలు తిరు కుటుంబము వలె దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నదా అని పరిశీలన చేసుకోవాలి. 
పాత నిబంధన గ్రంథములో మనము కొన్ని కుటుంబాలను చూస్తున్నాం దేవునికి అతిసమీపముగా జీవించిన కుటుంబాలు ఉదాహరణకు నోవా,అబ్రహాము, ఈ సాకు, యాకోబుల కుటుంబములు ఇంకా మిగతా కొన్ని కుటుంబములు కూడా ఉన్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు బిడ్డల యొక్క కర్తవ్యం గురించి తెలియజేస్తున్నారు. బిడ్డలు తమ తల్లిదండ్రులకు ఎల్లవేళలా విధేయులై జీవిస్తూ వారిని ప్రేమిస్తూ మంచిగా చూసుకోవాలి అని తెలుపుచున్నారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరువక వారి యెడల ఒక కుమారుడిగా, కుమార్తెగా  చేయవలసినటువంటివి(బాధ్యతలు నెరవేర్చుట) అన్నియు చేసి వారి యొక్క దీవెనలు పొందాలి అని ప్రభువు, వాక్యం ద్వారా తెలుపుచున్నారు.
ప్రస్తుత కాలంలో చాలామంది సమాజంలో తమ తల్లిదండ్రులను చూసుకోవటం లేదు, వారిని అనాధలుగా విడిచిపెడుతున్నారు. అదేవిధంగా కొంతమందైతే వారిని అనాధ ఆశ్రమంలో ఉంచుతున్నారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులను వాటా వేసుకుని మూడు నెలలు నా దగ్గర మూడు నెలలు అన్న దగ్గర జీవించు తెలుపుతున్నారు కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకనగా మన తల్లిదండ్రులు లేనిదే ఈ లోకంలో మనం లేము వారే మనల్ని ప్రేమించారు మనకి కావలసినది ఇచ్చారు మన యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు కాబట్టి వారి జీవితమును ఎన్నడూ కూడా మరువకుండా వారిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఒక మంచి బిడ్డగా ప్రతి ఒక్కరూ జీవించాలి. ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు మనందరం కూడా వినయము, దయా, కనికరము, ప్రేమ, కలిగి ఒకరి ఎడల ఒకరు సంతోషముతో జీవించాలి అని తెలుపుచున్నారు. ప్రతి కుటుంబంలో సంతోషము, ప్రేమ అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబములు ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాయి.
ఈనాటి సువిశేష భాగములో ఏసేపు గారు మరియ తల్లి, బాల యేసును తీసుకొని ఐగుప్తునకు వెళుచున్నారు అదేవిధంగా హేరోదు రాజు మరణము తర్వాత శిశువును తీసుకొని ఇశ్రాయేలునకు తిరిగి తీసుకుని రావటమును చదువుకుంటున్నాము. తిరు కుటుంబ పండుగను కొనియాడే సందర్భంలో వీరి యొక్క జీవితములు ఏ విధముగా ఉంటున్నాయి అని మనము ధ్యానించుకోవాలి. వీరు ముగ్గురు కూడా దేవునికి (తండ్రికి, పవిత్రాత్మ కు)సహకరించి దేవుని యొక్క చిత్తమును తమ జీవితంలో నెరవేర్చిన మంచి కుటుంబం. ఒక విధముగా చెప్పుకోవాలంటే తీరు కుటుంబము;
1. దేవునిని విదేయించిన కుటుంబము
2. దేవునికి సహాయం చేసిన కుటుంబము.
3. ప్రేమించే కుటుంబము
4. ప్రార్థించే కుటుంబము
5. త్యాగము చేసిన కుటుంబం
6. దేవుడిని కేంద్రంగా కలిగిన కుటుంబం
7. విశ్వాసము ఉన్న కుటుంబం
కావున ఏ విధముగానయితే తిరు కుటుంబము దేవునికి విధేయత చూపుతూ, దేవుని చిత్తమును ప్రేమిస్తూ, దేవుని కొరకు జీవించి ఉన్నారో అదే విధముగా మన కుటుంబాలు కూడా ఉండాలి.
మన కుటుంబాలు ఏ విధముగా ఉండాలో అని మనమే ఒక నిర్ణయం చేయాలి దానికి తగిన విధముగా ఒక మంచి కుటుంబమును నిర్మించుకోవాలి ఎందుకంటే కుటుంబంలోనే బిడ్డలు అన్నీ నేర్చుకుంటారు కావున తల్లిదండ్రులు బిడ్డలకు సుమాత్రుకగా ఉండుటకు ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు, బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి. బిడ్డలు తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తూ, ప్రేమిస్తూ జీవించాలి. భార్యా భర్తలిద్దరూ కలిసి మెలిసి అర్థం చేసుకుంటూ ప్రేమతో జీవించాలి. ఇదే ప్రభువు మనకు ఈనాడు ఈ పండుగ ద్వారా నేర్పించే అంశం కావున మన కుటుంబములను చక్కదిద్దుకొని దేవునికి ఇష్టకరమైన కుటుంబం గా జీవించుటకు ప్రయత్నం చేద్దాం.
Fr. Bala Yesu OCD

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...