4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

5 వ సామాన్య ఆదివారం (మూడవ సంవత్సరం )

 దైవ పిలుపు- దైవ పిలుపునకు మన స్పందన -దైవ పిలుపు ఉద్దేశం 

యోషయా 6:1-8,     1 కోరింథీ 15:1-11             లూకా 5:1-11 

ఈనాడు  తల్లి తిరుసభ 5 వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు దైవ పిలుపు  గురించి ప్రస్తావిస్తున్నాయి. వీటిని వివరంగా మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ, అర్థం చేసుకొని మన జీవితాలకు అపాదించుకుందాం. 

1. దైవ పిలుపు 

2. దైవ పిలుపునకు మన స్పందన 

3. దైవ పిలుపు ఉద్దేశం 

1 . దైవ పిలుపు -

 దైవ పిలుపు  చాలా పవిత్రమైనది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క  విధంగా పిలుస్తుంటారు. దేవుని యొక్క పిలుపు మరియు ఎన్నిక మానవ మేధస్సుకు అతీతంగా వుంటుంది. దేవుడు సామాన్యులను నిరాక్షరాసులను , అయోగ్యులను , మానవ దృష్టిలో  దేనికి పనికిరారు అన్నటువంటి అతి సాధారణమైన వ్యక్తులను పిలిచి, ఎన్నుకొని, వారిని తనకు తగిన వారీగా మలిచి ,అభిషేకించి తన ప్రేషిత కార్యాన్ని వారి ద్వారా నెరవేరుస్తారు. దేవుడు అల్పులను పిలిచి అత్యదికులను చేస్తారు.  బలహీనులను పిలిచి బలవంతులను చేస్తారు. అయోగ్యులను పిలిచి యోగ్యులనుగా చేస్తారు. 

మనము పవిత్ర గ్రంధంలో  ఎంతో మందిని పిలవడం ,మరెంతో మందిని ఎన్నుకోవడం చూస్తున్నాం. ముఖ్యముగా ఈనాటి మొదటి పఠనంలో అతి సామాన్యమైన యోషయాను పిలిచి ప్రవక్తగా మలుస్తున్నారు.(యోషయా 6:8). రెండవ పఠనంలో సౌలును పౌలుగా అంటే హింసకుడిని , సువార్త సేవకై పిలిచిన దేవుడు తన సువార్త వ్యాప్తికై ఒక సాధనముగా వాడటం చూస్తున్నాం.(1 కోరింథీ 15:10-11), మరియు చేపలు పట్టువాడైన సీమోనును ప్రేరేపించి పిలిచి మనుషులు పట్టువానిగా మలచడం చూస్తున్నాం.(లూకా 5:1-11). 

 ఈరోజు అత్యల్పులమైన,  అతి సామాన్యులమైన , అయోగ్యులమైన మనందరిని ప్రభువు పేరు పెట్టి పిలుస్తున్నారు. కొందరిని తన సువార్త సేవకై  మరి కొందరిని కుటుంబ జీవితానికి పిలుస్తున్నారు. పిలువబడిన వారు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. కానీ మనం ప్రభువు పిలుపునకు స్పందిస్తున్నామా ? సరిగా స్పందిస్తే ఈ పిలుపు మన జీవితాలను మలచకలదు,  మన జీవితాలను మార్చ కలదు. మన జీవిత ఉద్దేశాలను కార్యసాధనకు చేర్చకలదు. 

2 . దైవ పిలుపునకు మన స్పందన 

దేవుడు మనలను పిలవడం ఒకెత్తయితే దానికి స్పందించడం మరొక ఎత్తు . దైవ  పిలుపునకు స్పందించడం అంటే కేవలం కాళ్ళ నడక ద్వారా దేవుని అనుసరించడం కాదు. కానీ పిలుపునకు అనుగుణంగా  మన జీవిత మార్పు ద్వారా  దేవుని అనుసరించడం. మనం దేని నుండి దేనికి పిలవబడ్డాం అని గ్రహించాలి. ఎవరి చేత పిలవబడ్డాం, అని తెలుసుకోవాలి మరియు దానికి అనుగుణంగా  స్పందించాలి. అంటే 

1. మన పాపపు స్తితిని గ్రహించాలి: -నేను హా !చేడితిని కదా ! నా నోటి నుండి వెలువడునవన్నియు  అపవిత్రమైన మాటలే.  అపవిత్రమైన మాటలు పల్కు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. అని యోషయా ప్రవక్త తన పాపపు స్థితిని గ్రహించాడు. (యోషయా 6:5). ఏలయన అపోస్తులందరిలో  నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని  పిలువబడుటకు నేను అయోగ్యుడను" అని పౌలు తన జీవిత స్థితిని  గ్రహించాడు. (1 కోరింథీ 15:9).  ప్రభూ ! నేను పాపాత్ముడను నన్ను విడిచి పొండు అని పేతురు గారు కూడా తన పాప స్థితిని గ్రహించారు.(లూకా 5:8). ఈనాడు నీవు నేను కూడా మన పాపపు స్థితిని గ్రహించాలి.

 2. పాపాన్ని విడిచి పెట్టాలి :- పాపాపు స్థితిని గ్రహించడమే కాదు . పాపాన్ని పరి పూర్తిగా విడిచిపెట్టాలి. మన జీవితాన్ని పవిత్రీకరించమని దేవుని అర్థించాలి. మనము పాప కార్యముల నుండి వైదొలగి నూత్న హృదయమును,నూతన మనస్సును పొందాలి. ఎవడు చనిపోవుట వలన  ప్రభువునకు సంతోషం కలగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభు వాక్కు. యోహేజ్కేలు 18:31-32. 

3. మనలని మనం దేవుని చిత్తానికి అప్పగించాలి:-  దౌర్జన్యమునకు సాధనముగా మీ శరీరములందు ఏ అవయములను పాపమునకు అర్పింపకుడు. అంతేగాక , మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడినవారుగా మిమ్ము మీరు దేవునికి  అర్పించుకొనుడు. మీ శరీరమునందలి అవయములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. (రోమి 6:13). దేవుని  పిలుపునందుకున్న మనమందరము దేవునికి మనలను మనం సంపూర్ణముగా అప్పగించుకోవాలి. అంటే దేవుని చిత్తమే మన చిత్తం కావాలి. దేవుని చిత్తానుసారంగా ఆలోచించాలి, మాట్లాడాలి, కార్యాలు చేయాలి. ఈ విధంగా దేవుని పిలుపునకు  స్పందిస్తే దేవుని అనుగ్రహాలను పొందగలము, ఆ అనుగ్రహాలకు సాధనాలుగా మారగలము. 

3. దేవుని పిలుపు  యొక్క ఉద్దేశము

  దేవుడు  తన ప్రజలను ఓ గొప్ప ఉద్దేశంతో పిలిచి వారిని పవిత్రులుగా , నిర్దోషులుగా  చేస్తారు. (ఏపేసి 1:4) పవిత్రులుగా , నిర్దోషులుగా మలచబడినవారు, దైవ పిలుపు ఉద్దేశమైన సువార్త వ్యాప్తిద్వారా ఇతరులను పవిత్రులుగా, నిర్దోషులుగా  తయారుచేయాలి. ఈ ప్రేషిత కార్యం కొరకై మనము ప్రభుని సొంత ప్రజలుగా ఎన్నుకోబడతాము. (ద్వీతి14:2 ), అదే యోషయా  ప్రవక్త (6:8) , పౌలు గారు (1 కోరింథీ 15:10) మరియు పెతురు (లూకా 5:10 ) వీరి జీవితాలలో జరగడం   ఈనాటి పఠనాలలోమనం చూస్తున్నాం . 

దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవిత శైలికి పిలిచియున్నారు. కొంతమందిని సువార్త  వ్యాప్తికై , మరి కొంత మందిని భర్తలుగా, భార్యలుగా , పిల్లలుగా మరియు ఇతర జీవిత శైలికి పిలిచారు. ప్రతి ఒక్కరు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మనకు కావల్సిన మొట్ట మొదటి  ఆయుధం విశ్వాసం. విశ్వాసం లేకపోతే దైవ పిలుపు యొక్క ఉద్దేశం నెరవేర్చలేము. పునీత పౌలుగారు ఈనాటి రెండవ పఠనములో చాలా చక్కగా చెప్తున్నారు. "మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప ,నేను మీకు భోదిం చిన విధంగా మీరు దానిని గట్టిగా అంటి పెట్టుకొని ఉంటిరేని , మీరు రక్షింపబడుదురు." (1 కోరింథీ 15:2). పేతురు గారు ప్రభువు మాట యందు విశ్వాసించాడు, వల చినుగునన్ని చేపలు పట్టగలిగాడు. లూకా 5:6 . మనము కూడా విశ్వసించాలి, ప్రభువునకు ప్రార్ధించాలి. తద్వారా మన విశ్వాసాన్ని  బలపరచుకోవాలి. మన జీవితాలలో ప్రభువు కార్యాలను చవి చూడాలి. 

రెండవది ప్రేమ. యోహను 3:16 . 15:12. ప్రభువు కాపరికి అప్పగించిన తన మందను , కుటుంబ పెద్ద సభ్యులను ఎటువంటి పక్షపాతం లేకుండా అందరిని సమానంగా  ప్రేమించాలి. ప్రేమ అనే ఆయుధం ద్వార పరలోకాన్ని భూలోకంలోనే సృజించవచ్చు. ఎప్పుడైతే కాపరులు తమ స్వార్ధనికి ,ఆనందాలకు, ఇహలోక జీవిత శ్రేయస్సుకు, వస్తువులకు మరణించి, తన ఆలోచనలను, శక్తిని మాటలను మరియు కార్యాలను  దైవ చిత్తానికి  దైవ రాజ్య  వ్యాప్తి ఉపయోగార్దం జన్మిస్తారో. అప్పుడు  ప్రేమ ద్వార ఇహలోక  జీవియతం పరలోక జీవితంగా మారుతుంది. 

మూడవ ఆయుధం ఓర్పు , సహనం. ఈ సద్గుణాలు ఉన్నటువంటి వారు ఎటువంటి బేరుకు లేకుండా  దేవునితో నడవగలరు. సంఘంలో  కుటుంబంలో  ప్రజలందరు ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క  తీరుతో  ప్రవర్తిస్తుంటారు. కానీ దైవ పిలుపు స్వీకరించిన మనం  ఓర్పు సహనం కలిగి అందరిని ఒక తాటిపై  నడిపించగలగాలి. ఇది దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు లేనప్పుడు పేతురుగారు ఒక్క చేపనైన పట్టలేక పొయ్యాడు. కాని దేవుడు తనతో ఉన్నప్పుడు వల చినిగే చేపలను పట్టగలిగాడు. (లూకా 5:5,6 ), దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలలో కూడా ఎటువంటి కొరతలు ఉండవు. అన్నీ సమృద్దిగా ఒసగపడుతాయి. 

ఏ విధంగా దైవ పిలుపు అందుకున్న కుటుంబ అంతస్తుకు చెందినవారు సువార్తను భోధించగలరు ? దివ్య వాక్కు  వినడం, పఠించడం, పాటించడం ద్వారా. దైవ వాక్కు మన జీవితాలకు  ఆధ్యాత్మిక  భోజనం. భోజనం భుజింపకపోతే ఏ విధంగా  భౌతిక ఆరోగ్యాన్ని కోల్పోతాము. అధేవిధంగా ఆధ్యాత్మిక భోజనం  అయినటువంటి దేవుని వాక్యం పఠించక,వినక, పాటించక పోయిన ఆధ్యాత్మిక అనుగ్రహాలను కోల్పోతాము. కాబట్టి దేవుని వాక్యం చదువుదాం , విందాం, ఆచరిదాం. తద్వారా  దైవ పిలుపును గ్రహించి , ఆ పిలుపునకు సరిగ్గా స్పందించి, ఆ పిలుపును జీవిస్తూ ముందుకు సాగుదాం. ఆమెన్ 

 Br. Sunil Inturi  OCD

   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...