11, నవంబర్ 2023, శనివారం

32 వ సామాన్య ఆదివారం

32 వ సామాన్య ఆదివారం
సొలోమోను జ్ఞాన గ్రంధం 6:12-16
1తెస్సలోనిక 4: 13-18
మత్తయి 25:1-13
ప్రియమైన దేవుని విశ్వాసులారా రోజుకి మనము దైవార్చన సంవత్సర చివరి రోజులకి సమీపించుండగా తల్లి శ్రీ సభ మనందరినీ ధ్యానించమని తెలిపే అంశము ఏమిటి అంటే మన యొక్క చివరి రోజుల గురించి, మన మరణం, తుది తీర్పు, పరలోకం నరకం గురించి తెలుపుచున్నాయి. ఈనాడు మనం 32వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివార దివ్య గ్రంథములు మన యొక్క చివరి రోజుల యొక్క ప్రభావం గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠణం సొలోమోను జ్ఞాన గ్రంథం నుండి తీసుకొనబడింది జ్ఞాన గ్రంథం అని ఎందుకు పిలుస్తారు అంటే జ్ఞానము ద్వారా మన జీవితంలో చాలా మేలులు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీనిని జ్ఞాన గ్రంధం అంటారు. సొలోమోను తన జీవితంలో దేవుడిని అర్ధించినది కేవలం జ్ఞానము కొరకే, జ్ఞానం సంపాదించుట వలన కలుగు ప్రయోజనములు, జ్ఞానము సంపాదించుటవలన పెరుగు కీర్తి, జ్ఞానము సంపాదించడం వలన ఒక వ్యక్తి జీవితంలో పొందే గొప్ప ఆశీర్వాదం తెలుసుకున్న వ్యక్తి మన అందరిని కూడా జ్ఞానమును వెతకమని చెబుతూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో మనందరం కూడా చెబుతుంటాం "ఒక్క ఐడియా మీ జీవితమనే మార్చి వేయను అని"అనగా జ్ఞానముతో తీసుకున్న ఒక ఆలోచనా నిర్ణయం వలన వారి జీవితమే మార్చబడుతుంది. మనకు జ్ఞానము ఉన్నట్లయితే దాని ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనము అభివృద్ధి చెందగలుగుతూ ఉంటాం. ఎందుకంటే జ్ఞానము మనకు అంతయు కూడా సమకూర్చబడేలాగా చేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ జ్ఞానమును వెతకమని రచయిత తెలుపుచున్నారు. ఆయన చెప్పే మాటలు ఇంకా ఏమిటంటే ఎవరైతే ఈ జ్ఞానము కొరకు వెతుకుతుంటారో, ఎవరైతే జ్ఞానము కొరకు ఆశ పడుతూ ఉంటారో, ఇంకా ఎవరైతే జ్ఞానమును ప్రేమిస్తూ ఉంటారో అది సులువుగా దొరుకును అని తెలుపుతున్నారు. జ్ఞానం కొరకు ఎవరైతే గాలిస్తూ ఉంటారో వారికి అది తనంతట తాను తలుపు తీయును అని తెలుపుచున్నారు కావున మనం కూడా మన యొక్క అనుదిన జీవితంలో జ్ఞానం యొక్క ప్రాధాన్యత తెలుసుకొని దాన్ని పొందుట కొరకై ప్రయత్నం చేయాలి. జ్ఞానమును కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడితో పోల్చితూ ఉంటారు కలిగి ఉండాలి. దేవుడు అనే జ్ఞానం మనందరం కూడా కలిగి ఉండాలి.
 ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక  ప్రజలకు క్రైస్తవ పునరుత్థానము గురించి తెలియజేస్తున్నారు. తాము ప్రేమించిన వారిని కోల్పోయిన సందర్భములో మరణము తర్వాత  మరియొక జీవితము ఉన్నది అని అంశమును తెలియజేస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు యొక్క మరణ, పునరుత్థానము మన అందరి యొక్క పునరుత్థానమునకు నాంది పలికినది కావున పౌలు గారు విశ్వాసమును కోల్పోవద్దు అని తెలియజేస్తున్నారు. ప్రభువు యొక్క రాకడకై సంసిద్ధతను కలిగి జీవించమని తెలుపుచున్నారు ఎందుకంటే ఆయన కొరకు సంసిద్ధముగా ఉన్న వారిని తాను ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటారు.
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు పదిమంది కన్యల యొక్క గురించి తెలియజేస్తున్నారు. ఈ పదిమంది కన్యకల యొక్క సువిశేష భాగము ద్వారా మనందరినీ కూడా ప్రభువు తన యొక్క రాకడకై సంసిద్ధులై జీవించాలని కోరుతున్నారు. ఆయన గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు అకస్మాత్తుగా ఆయన వచ్చేస్తారు. కాబట్టి మనందరం కూడా అప్రమత్తులై ఆయన రాకకై మనం సంతోషముతో ఎదురుచూస్తూ ఆయనకు స్వాగతం పలకాలి.యూదుల సంప్రదాయం ప్రకారం పెండ్లి ఏడు రోజులపాటు కొనసాగుతుంది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ను ఆమె ఇంటికి వచ్చి తనను తీసుకొని వెళ్తాడు అయితే పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెండ్లి కుమార్తెకు ఎవరైతే అతి సన్నిహితులుగా (కన్యలు) ఉంటారో, వారు పెండ్లి కుమారుడికి ఎదురేగి ఆహ్వానించుట అలనాటి సంప్రదాయం. ఒకరోజు జరిగిన పెండ్లిలో, పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైనది అతని రాక కోసమై పదిమంది కన్యలు ఎదురుచూస్తున్నారు కానీ ఐదుగురు మాత్రమే ఆయన ఎప్పుడూ వచ్చినా సరే ఆయనను కాగడాలతో ఆహ్వానించుటకు వారితోపాటు నూనెను కూడా తీసుకొని వెళ్లి ఉన్నారు. మిగతా ఐదుగురు వారు ఊహించిన సమయమునకు భిన్నముగా పెండ్లి కుమారుడు రాలేదు. కావున వారు తమతో పాటు ఎక్కువ నూనె తీసుకొని పోలేదు అందువలన అతడిని ఆహ్వానించలేకపోయారు. మన జీవితంలో మనకి ఎప్పుడూ ఏమి జరుగునో అని ముందుగానే తెలిస్తే మనము దానికి సంసిద్ధమై ఉంటాము.ఉదాహరణకు బస్సు ఏ సమయమునకు వచ్చునో తెలిసిన యెడల మనము దాని ప్రకారంగా సిద్ధంగా ఉంటాం. సినిమా ఏ టైం కు ప్రారంభిస్తారని తెలిసిన యెడల దానికి కూడా ముందుగానే సిద్ధమై ఉంటాం కానీ ప్రభువు యొక్క రాకడ ఊహించని గడియలో జరుగును కాబట్టి దానికి ప్రతి రోజు కూడా మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఈ పదిమంది కన్యలు మన క్రైస్తవ సంఘమునకు ఒక సూచన. పెండ్లి కుమారుడిని ఆహ్వానించడానికి పదిమంది కూడా వెళ్లి ఉన్నాను కానీ చివరికి ఐదుగురు మాత్రమే తనతో పాటు లోనికి ప్రవేశించి ఉన్నారు. అనగా కేవలము ఎవరైతే తమ జీవితములను తాము తయారు చేసుకుని ఉన్నారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని అర్థం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టం కేవలము తమ జీవితాలను దేవుని కొరకు సంసిద్ధం చేస్తున్న వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు.
ఈ సువిశేష పఠణంలో మనము కొన్ని విషయములను చూస్తున్నాం:
1. ఆయన రాకడ కొరకై సంసిద్ధత కలిగి జీవించుట-ఐదుగురు వివేకవతులు పెండ్లి కుమారుడు ఏ సమయములో వచ్చినా సరే ఆయనను ఆహ్వానించుటకు వారు తమతో పాటు అన్నీ కూడా తీసుకుని వచ్చి ఉన్నారు అది ముందుచూపు కలిగి ఉండటానికి ఒక నిదర్శనం. మనము కూడా మన జీవితంలో మన యొక్క గమ్యం ఏమిటి అని ముందుచూపు కలిగి జీవించినట్లయితే మనందరం కూడా ఒక మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాం.
2. ఆయన రాకడ తథ్యం అని నమ్మడం-పెండ్లి కుమారుడు ఏదో ఒక సమయమును తప్పనిసరిగా వస్తాడు అని వారు నమ్మి ఉన్నారు అందుకని ఆయన రాక కోసం అక్కడే ఎదురుచూస్తున్నారు.
3. సహనం కలిగి ఉన్నారు-ఈ పదిమంది వివేకవతులు పెండ్లి కుమారుడి ఎడల సహనంతో ఉన్నారు ఎందుకంటే ఆయన రాక ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో వినయము, సహనము కలిగి ఆయన కొరకు ఎదురుచూస్తున్నారు.
అదే విధముగా ఈ సువిశేష భాగములో మనము గమనించే ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే "నూనె". నీ నూనెను వివిధ రకాలైన గుర్తులతో పోల్చి వేద పండితులు చెబుతూ ఉంటారు అవి ఏమిటంటే 
1. ఈ నూనె దేవునితో మనకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధమును తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి సంబంధం చాలా ముఖ్యమైనది అది లేకపోతే మన క్రైస్తవ జీవితం ఫలించదు అదేవిధంగా దేవుడితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనము వేరే ఒకరి దగ్గర నుండి కాబట్టి మన జీవితం ఫలించాలి అంటే మనందరికీ కూడా దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి.
2. నూనెను క్రైస్తవ విలువలతో కూడా పోల్చి చెప్తూ ఉంటారు, అవి వేరే వారి దగ్గర నుండి అరువు తెచ్చుకొనలేము. మనందరం కూడా క్రైస్తవ విలువలు కలిగి జీవించాలి.
3.నూనెను క్రైస్తవ విశ్వాసముతో కూడా పోల్చి చెబుతూ ఉంటారు విశ్వాసము లేనిదే దేవుడు రాజ్యంలో ప్రవేశించలేము.
4. నూనెను క్రైస్తవ జీవితములో ఉన్న ప్రేమ, క్షమాపణతో కూడా పోల్చి చెబుతూ ఉంటారు ఈ రెండును పాటించకపోతే మన జీవితంలో పరలోక రాజ్యములో ప్రవేశించలేము .
ఎవరి జీవితమునకు వారే బాధ్యులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాకడకై సంసిద్ధతను కలిగి జీవించాలి అప్పుడే మనందరం కూడా నిత్య పెళ్లికొడుకు అయిన క్రీస్తు ప్రభువుతో ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం.

Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...