20, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా నాలుగవ ఆదివారం

పాస్కా నాలుగవ ఆదివారం 
అపో 4:8-12, 1 యోహాను 3: 1-2
యోహాను 10:11-18
 ఈ యొక్క ఆదివారమును మంచి కాపరి ఆదివారము అని తల్లి శ్రీ సభ పిలుస్తుంది. పాత నిబంధన గ్రంథంలో యావే దేవుడిని గొర్రెల కాపరిగా పోల్చి చెబుతూ ఉంటారు. దావీదు రాజు ప్రభువును కాపరిగా పిలిచారు కీర్తన (23 :1). అదేవిధంగా ఇంకొక చోట మేము నీ ప్రజలము నీ మందలోని గొర్రెలను అని తెలుపుచున్నారు (కీర్తన 79: 13). దేవుడు తన ప్రజలకు ఒక కాపరిగా ఉంటూ వారిని తన వైపుకు ప్రతినిత్యం నడిపిస్తూ, వారి యొక్క జీవిత యొక్క అభివృద్ధి కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తూ, వారిని శత్రువుల నుండి అదేవిధంగా విపత్తుల నుండి కాపాడుచూ వారికి తన యొక్క ప్రేమను చూపిస్తున్నారు. 
ఈనాడు చదువుకున్న పరిశుద్ధ గ్రంథ పఠణములు నుంచి కొన్ని అంశములను ధ్యానం చేద్దాం. మొదటి పఠణంలో పేతురు గారు దేవుని చేత తన మంద కొరకు ఒక కాపరిగా ఎన్ను కనబడిన తర్వాత ఆయన చేసిన అద్భుతం గురించి వింటున్నాం. ఈ యొక్క అద్భుతము యేసు ప్రభువు యొక్క నామములో చేయబడినది అని స్పష్టముగా పేతురు తెలియజేస్తున్నారు. ఆయన సజీవుడుగా వారి మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాదు అద్భుతములు చేసేది ఆయన మరణించి- పునరుత్థానమైన తర్వాత కూడా ఏసుప్రభు తన ప్రజల యందు అద్భుతములను చేస్తూ ఉన్నారు అని తెలుపుచున్నారు. ఏసుప్రభు యొక్క నామము శక్తివంతమైనదని, ఆ యొక్క నామములో అనేక అద్భుతములు కలవు అని స్పష్టంగా పేతురు వివరించారు. పేతురు కాపరిగా ఉంటూ కుంటివానికి ప్రభువు స్వస్థతనిచ్చారు. అనేక సంవత్సరాల నుండి కుంటివాడిగా నిర్భాగ్య జీవితం జీవిస్తున్నాడు అతడు. అతని యొక్క జీవితంలో ఆనందం లేదు జీవితము కృంగిపోయినది అట్టివానికి పేతురు సంతోషాన్ని దయచేసి, ఏసుప్రభు యొక్క నామమున స్వస్థత పరుస్తూ తనలో ఆనందము నింపుతున్నారు. పేతురు ఒక కాపరిగా తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను ఆయన నెరవేరుస్తూ దేవుడు యొక్క ప్రేమను అదేవిధంగా సందేశమును ఇతరులకు అందజేశారు. ఇది తనకు అప్పచెప్పినటువంటి బాధ్యత.
ఈనాటి రెండవ పఠణంలో యోహాను గారు దేవుడికి మానవుడు ఎడల ఉన్నటువంటి గొప్ప ప్రేమ గురించి తెలియజేస్తున్నారు. దేవుడు మనలను ప్రేమించి ఉన్నారు కాబట్టే మనము ఆయన యొక్క బిడ్డలుగా ఉంటున్నాం. ఈ లోకము ఆయనను ఎరుగదు కాబట్టి ఈ లోకమునకు దేవుని విలువ అదేవిధంగా మన యొక్క ప్రాధాన్యత తెలియదు. దేవుడు మనమ ఆయనకు సాక్షులుగా ఉండటం వలన ఒక రోజున ఆయనను ముఖాముఖిగా దర్శించే అవకాశంను ప్రభువు మనకు కల్పిస్తారు ఆ రోజున మనము కూడా ఆయన వలె చేయబడతాము అని యోహాను గారు తెలియజేస్తున్నారు. ఇది ఎప్పుడు సాధ్యము అంటే,  కేవలం మనం దేవుడిని ఎరిగి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఏసుప్రభువు ఈనాటి సువిశేష భాగములో తన్ను తాను మంచి కాపరిగా పోల్చుకొని చెబుతున్నారు. పవిత్ర గ్రంథములో చాలామంది ప్రవక్తలు, భక్తులు కాపరులుగా ఉంటున్నారు. 
- ఆబేలు గొర్రెల కాపరి 
- అబ్రహాము గొర్రెల కాపరి
- మోషే గొర్రెల కాపరి 
- దావీదు గొర్రెల కాపరి 
- ఆమోసు ప్రవక్త కాపరి
- చాలామంది గొర్రెల కాపరులుగా ఉంటున్నారు. ఒక మందకు కాపరి తప్పనిసరిగా అవసరం లేదంటే ఆ గొర్రెలు విచ్చలవిడిగా జీవిస్తాయి.  ఏసుప్రభు మంచి కాపరి కాబట్టి ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షలములను ధ్యానం చేద్దాం 
1) మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములను త్యాగం చేస్తారు. ఏసుప్రభు ఆయన గొర్రెల దొడ్డి వద్ద గేటు (ద్వారము) వద్ద నిలబడి ఉంటాను అని తెలియజేస్తున్నారు (యోహాను 10: 7). ఆయన ద్వారము వద్ద నిలబడుతూ దొంగలు కానీ జంతువులు కానీ తన మంద దగ్గరకు రాకుండా ఆయనే వాటన్నిటిని రక్షిస్తారు. జీతగాండ్రు సొంత వాడు కాదు కాబట్టి ఆపద వచ్చినప్పుడు తన యొక్క మందను విడిచి వెళతారు కానీ మంచి కాపరి ఒక రక్షణ కవచంగా ఉంటూ తానే ఆపద భరిస్తూ ఆయన తనమందను అన్ని రకాల ఆటంకముల నుండి కాపాడుతారు. కేవలం మంచి కాపరి మాత్రమే తన మంద కొరకు ప్రాణాలు సైతం త్యాగం చేస్తారు ఇది ఎవరికి కూడా సాధ్యపడదు ఏసుప్రభు మంచి కాపరి కాబట్టి మన అందరి యొక్క మరణమునకు బదులు ఆయనే మరణించి తన ప్రాణమును త్యాగం చేసి మనకు జీవమును ప్రసాదించారు ఇది ఆయన యొక్క త్యాగానికి గుర్తు.
2). తన మంద గురించి కాపరికి స్పష్టముగా తెలియను. 
ఏసుప్రభుకి ప్రతి ఒక్కరి యొక్క  జీవిత స్థితిగతులు తెలుసు కాబట్టే ఎవరికీ ఏం అవసరమున్నదో దానిని బట్టి వారిని దీవిస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలు తెలుసు కాబట్టి వారిని అర్థం చేసుకొని వారిని దీవించారు. 
3. మంచి కాపరి తన మందను పోషిస్తారు. యెషయా 40:11. మంచి కాపరి తన మందును నడిపించే సమయంలో వారికి కావలసిన పోషణను దయ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పై ప్రయాణం చేసే సందర్భంలో వారు ఆకలితో ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆకలని తీర్చారు. ఏసుప్రభువు కూడా తన యొక్క బోధనలను వినటానికి వచ్చినటువంటి వారిని అందరిని కూడా శారీరక మరియు ఆధ్యాత్మిక పోషణను దయ చేశారు. 
4. మంచి కాపరి తన మందను నడిపిస్తారు. (కీర్తన 23: 3)
తానే అన్నిటిలో సుమాతృకగా ఉంటూ తన మందను నడిపిస్తారు. పాత నిబంధన గ్రంథములో యావే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మార్గ చూపరిగా ఉంటూ వారిని ఎడారి గుండా నడిపించారు అలాగే ఏసుప్రభు కూడా తనను విశ్వసించే వారందరికీ కూడా పరలోక మార్గమును చూపిస్తూ, వారు వినయములో నడుచుటకు, విధేయతతో జీవించుటకు, క్షమ కలిగి ఉండటకు, ప్రేమ కలిగి ఉండుటకు ఒక మార్గమును తన యొక్క జీవితం ద్వారా చూపించారు, వారిని నడిపించారు. ఏసుప్రభు తన మందను నడిపించేది మంచి వైపుకు మాత్రమే అనగా పరలోకము వైపు మాత్రమే మనము ఆయన మందకు చెందిన వారమైతే ఆయన స్వరమును విని ఆయన మార్గంలో నడవాలి.
5. మంచి కాపరి తన మందను ప్రేమిస్తారు అలాగే తన ముందు పట్ల శ్రద్ధ వహిస్తారు.
మంచి కాపరి తన మందను ప్రేమించారు కాబట్టి ఆ మందను ఆపదల నుండి కాపాడుతారు అలాగే అవి దారి తప్పిన సమయంలో వారిని వెతికి తీసుకొస్తారు మరియు వారి యొక్క ఎదుగుదలకు అవసరమైనది మొత్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే మంచి కాపరి తన మందును ప్రేమిస్తూ, శ్రద్ధ వహిస్తారు అని పిలుస్తారు. యేసు ప్రభువు కూడా మనలను ప్రేమించారు అలాగే మన యందు శ్రద్ధ వహించారు కాబట్టి మనకు అనేక సత్యములను తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా చేయవలసినది ప్రేమించాలి, శ్రద్ధ వహించాలి.
6. మంచి కాపరి తన మందను సరి చేస్తారు. ఎప్పుడైతే ఒక గొర్రె యజమానుడి యొక్క మాట వినకుండా ఇష్టం వచ్చిన రీతిలో నడుచుకున్నప్పుడు  కాపరి దానిని సరిచేస్తూ, వాటిలో ఉన్న చెడును కత్తిరించి వాటిని మంచి మార్గంలో నడిపిస్తారు. ఏసుప్రభు ఒక మంచి కాపరిగా ఉంటూ ఆయన అనేక మంది యొక్క జీవితాలను సరి చేస్తూ, ఆయన పరిచర్య చేసే సందర్భంలో ఏది సత్యమో, ఏది అనుసరించాలో తెలియచేస్తూ వారి యొక్క విశ్వాస జీవితాలను సరి చేశారు. 
7. మంచి కాపరి తన గొర్రెలను తన భుజముల మీద వేసుకుంటారు.
8. మంచి కాపరి తన మంద పట్ల కనికరం కలవారు. అవి గాయపడిన సందర్భంలో తానే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తూ వాటి యొక్క గాయములను నయం చేయుట కొరకై ప్రత్యేకంగా కృషి చేస్తారు.
దేవుడు మనలను కూడా మన యొక్క కుటుంబాలకు సంఘాలకు కాపరులుగా ఎన్నుకుంటున్నారు మరి మనము ఆయన వలె లక్షణములను కలిగి జీవించగలుగుతున్నామా ఒక కాపరిగా మనము ప్రేమించగలుగుతున్నామా, పెంచగలుగుతున్నామా, రక్షించగలుగుతున్నామా అని మనము ధ్యానము చేసుకొని మనము కూడా మంచి కాపరి వలె జీవించటానికి ప్రయత్నం చేయాలి. 

Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఐదవ ఆదివారం

పాస్కా ఐదవ ఆదివారం  అపో9: 26-31, 1 యోహాను 318-24, యోహాను 15:1-8 ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనములు దేవునిలో ఐక్యమై జీవించుట అనే అంశము గురించ...