యిర్మీయా 26:1-9 మత్తయి 13: 54-58 2 ఆగస్టు 2024
యేసు తన పట్టణమును చేరెను. అచట ప్రార్ధనామందిరములో ఉపదేశించుచుండగా, ప్రజలు ఆశ్చర్యచకితులై, "ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచటినుండి లభించినవి?" అని అనుకొనిరి. "ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు , యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులుకారా? ఇతని సోదరీమణులు అందరు మన మధ్యనలేరా? అటులయిన ఇవి అన్నియు యితడు ఎట్లు పొందెను?" అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో "ప్రవక్త స్వదేశమందును, స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు" అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసమువలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు.
ఈనాడు ప్రభువు తన వాక్కును యిర్మీయా ప్రవక్తకు, నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపుము. వాటిలో ఒక్క మాటకూడా వదలిపెట్టవలదు అని వినిపించాడు. ప్రియా మిత్రులారా దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని , తన వాక్కును వినిపించి, తనను ఆరాధించే ప్రజలకు తన సందేశాన్ని ఒక్క మాటకూడా వదలి పెట్టకుండా చెప్పడానికి మన మధ్యకుపంపిస్తున్నాడు. ఎందుకు దేవుడు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు అంటే, దేవుని వాక్కును సందేశాన్ని విని పాపులమైన మనము మన దుష్ట మార్గము నుండి మంచి మార్గములోనికి రావాలని, మన బ్రతుకులు మార్చుకొవాలని, మనము మనం పాపలు నుండి చేదు వ్యసనాల నుండి మారకపోతే దేవుని ప్రేమకు దగ్గరగా రాకపోతే మనం నాశనమునకు గురిచేయబడుతాం. మారుమనస్సు పొందితే రక్షణ లేకపోతే నాశనము. మరి మనము మన మనస్సును మార్చుకోవాలంటే ఏమి చేయాలి.
యిర్మీయా 26:4 వ వచనంలో దేవుడు "మీరు నేనిచ్చిన ధర్మ శాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలి" అని చెబుతున్నాడు. మరి మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా? ఆజ్ఞలు అన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమపై ఆధారపడియున్నవి. మరి మనము దేవుని మరియు మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా? అదేవిధంగా దేవునికి నిజంగా విధేయులమై ఉంటున్నామా? మనం ఎవరికీ విధేయత చూపిస్తున్నాం? దేవుని వాక్కులుకు విధేయత చుపిస్తున్నామా? ఒకవేళ దేవుని వాక్కు కు విధేయత చూపించకపోతే మనము మన నాశనమును కోని తెచ్చుకుంటాము. దేవుడు యిస్రాయేలు ప్రజలతో , మీరు నా సేవకులగు ప్రవక్తల పలుకులు వినలేదని అంటున్నాడు. మరి ఈనాడు మనం దేవుని సేవకులగు ప్రవక్తలు, గురువులు పెద్దల మాటలను వింటున్నామా లేదా ఆలోచించండి. ఒక ప్రవక్తగా, దైవ సేవకునిగా, దేవుని వాక్కును భయపడకుండా, భాధలకు దూరంగా వెళ్లకుండా ధైర్యంగా ప్రకటించాలి. యిర్మీయా ప్రవక్త వలె ఉండాలి. ఆయన దేవుని వాక్కును, సందేశాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆయనను నింధించారు. ఆయనపై అరిచారు. కాని ఆయన దేవుని వాక్కును, సువార్త పరి చర్యను ఆపివేయలేదు.
ఈనాటి సువిశేషంలో తన పట్టణ ప్రజలే క్రీస్తు ప్రభువునుతృణీకరించారని వింటున్నాం. ఆయనను చిన్న చూపు చూచి, ఆయన బోధనలు విని ఆశ్చర్యపోయి, క్రీస్తు ప్రభువునికి ఇంతటి జ్ఞానం ఎట్లు వచ్చినదని, ఆయనను ఔన్నత్యాన్ని ఒప్పుకోలేక, ఆయన బోధనలను తృణీకరించారు. క్రీస్తు ప్రభువు, తన శిష్యులమైన మనకు తెలియజేసేది ఏమిటంటే మనవారే కొన్ని సార్లు మనలను తృణీకరిస్తారు , మన మాటలను అంగీకరించరు, మన మాటలపై అవిశ్వాసం వ్యక్తపరుస్తారు, భయపడకండి, నా సందేశాన్ని అందరికి తెలియజేయండి. కొన్నిసార్లు అగౌరవంగా మాట్లాడుతారు. కాని మీరు సువార్త ప్రకటనను కొనసాగించండి అని తెలియజేస్తున్నాడు.
ప్రార్థన :
ప్రేమమయుడైన దేవా! నీవు మమ్ము రక్షించువాడవు. మేము నీ వాక్కును విని, ఆరాధిస్తూ, నీ ఆజ్ఞలను పాటించి జీవించే భాగ్యం నాకు దయజేయండి. తద్వారా మేము మా దృష్టమార్గములను విడిచిపెట్టి, నీ ప్రేమా , సువార్తను ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి. మమ్ము ఎవరు తృణీకరించిన బాధపడకుండ, నీ సత్య మార్గములో నడిచే శక్తిని ఇవ్వండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి