19వ సామాన్య ఆదివారం
1 రాజులు 19:4-8, ఎఫేసీ 4:30-5:2, యోహాను 6:41-51
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మరొకసారి దేవుని యొక్క దివ్య భోజనము గురించి బోధిస్తున్నాయి. గత మూడు వారముగా తల్లి శ్రీ సభ దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను రొట్టెతోను మరియు నీటితోనూ పోషించిన విధానం చదువుకుంటున్నాము. ఏలియా ప్రవక్త కార్మెల్ కొండపై 450 మంది బాలు ప్రవక్తలతో సవాలు చేసిన తర్వాత నిజమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యం రుజువు చేసి ఆ 450 మంది బాలు ప్రవక్తలను హతమార్చారు దాని తరువాత ఆహాబు రాజు యొక్క భార్య అయిన యెసెబేలు రాణి తన సైనికులను పంపించి ఏలియాను ఏ విధముగానైనా సరే చంపాలని చూసింది. ఏలియా ప్రవక్త తాను ఈ వార్తను గ్రహించి తన యొక్క ప్రాణములను దక్కించుకొనుట నిమిత్తమై దూరముగా పారిపోవుచున్నారు.
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకున్నట్లయితే ఏలీయా ప్రవక్త 450 మంది ప్రవక్తలను చంపిన సమయంలో భయపడలేదు కానీ ఒక రాణి యొక్క మూర్ఖత్వము గ్రహించి ఆయన పారిపోతున్నారు. కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఎందుకని ఏలియా పారిపోతున్నారు? తన దేవుడి మీద నమ్మకం లేఖనా, లేదా ఇంకేమైనా కారణమా? ఎంతో ధైర్యంగా ఉన్న ఏలియా ఎందుకు ఒక్కసారిగా బలహీనపడుచున్నాడు?
ఏలియా ప్రవక్త ఒక్కసారిగా తన యొక్క ప్రాణం మీదకు వచ్చినప్పుడు భయపడుచున్నారు. తన యొక్క కష్ట సమయంలో దేవుని యొక్క స్వరమును గుర్తించలేకపోయారు, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఆయన నిరాశలో ఉంటున్నారు అందుకని ప్రాణభయం మీద ఉన్న ఒక ఆశ వలన దూరంగా ప్రయాణమై పోతున్నారు. మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే;
1. ఏలియా ప్రవక్త యొక్క భయం. తన బలహీనత ద్వారా భయపడ్డారు కానీ ప్రభువు అతనికి దర్శనమిచ్చి, ధైర్యం నుంచి ముందుకు నడిపారు. ఏసుప్రభు మరణం తరువాత కూడా శిష్యులు భయపడిన సమయంలో ఏసుప్రభు పునరుత్థానమైన తరువాత దర్శనం ఇచ్చి బలపరిచారు (యోహాను 20:19)
2. దేవుడు ఏలియాను విశ్రాంతి తీసుకోమని చెప్పుట. ఆయన దేవుని కార్యము ముగించే అలసట చింది ఉన్నారు కాబట్టి దేవుడు ఏలియాను కొద్దిపాటి సమయము విశ్రాంతి తీసుకోమని తెలుపుచున్నారు. ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా పరిచర్య చేసి అలసిపోయిన సందర్భంలో ఏసుప్రభు వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మని పలికారు (మార్కు 6:31). ప్రభువు మన యొక్క ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని మనము సంతోషముగా ఉండుట నిమిత్తమై మనకు సహాయపడతారు.
3. దేవుడు పరిగెత్తే వారి వెనకాల వెళతారు. ఏలియా ప్రవక్త దూరంగా వెళ్లేటటువంటి సమయంలో దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. తన యొక్క బలహీన సమయాలలో తోడుగా ఉన్నారు. తాను పరిగెత్తే సమయంలో తన వెనకాలే వస్తున్నారు. యోనా ప్రవక్త కూడా దేవునికి దూరంగా వెళ్లే సమయంలో దేవుడు అతని వెంట వస్తున్నారు. (యోనా 1:3, 2:10)
4. ప్రభువు ఇచ్చిన ఆహారము ద్వారా ఏలీయా ప్రవక్త 40 రోజుల పాటు శక్తిని పొందుకొని తన యొక్క గమ్యమును చేరుకున్నారు. ప్రభువు ప్రసాదించే ఆహారము మన అందరి యొక్క బలహీనతను తొలగించి మనకు బలమును ఒసగుతుంది.
5. దేవుడు మనల్ని ఎన్నటికీ మరువరు. మనము ఉన్నటువంటి అపాయములో ప్రభువు మనకు చేరువలోనే ఉంటారు. దేవుని యొక్క కనుల నుండి మనము దూరముగా వెళ్లలేము ఆయన మనలను పరిశీలిస్తూనే ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా తాను ఉన్నటువంటి పరిస్థితిలో అతనిని విడిచి పెట్టకుండా తన చెంతకు వచ్చి తనను ఆదుకుంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పవిత్రాత్మను విచారణమున ఉంచరాదని పౌలు గారు తెలుపుతున్నారు. పవిత్ర ఆత్మ మనలను బలపరచి ఈ లోకంలో ఎన్ని శోధనలను ఎదుర్కొనటానికి సహాయపడతారు. దేవుడు ఒసగిన ఆత్మ ద్వారా మనందరం కూడా దేవునికి చెందిన వారముగా మరియు దేవుడు మన యొక్క యజమానిగా ఉంటారు కాబట్టి మనము మన యొక్క జీవితములో ఒకరి ఎడల ఒకరు దయను చూపించుకునే విధంగా, అందరితో మంచిగా మాట్లాడుతూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుడిని పోలిన వ్యక్తులుగా జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. దేవుని పోలిన వ్యక్తులుగా అనగా దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో ఆచరించి పాటించి జీవించటం.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తానే జీవాహారము అని ప్రజలకు తెలిపిన విధానము చదువుకుంటున్నాం. ఏసుప్రభు తాను జీవాహారము అని పలికిన సందర్భంలో చాలామంది ఆయన ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తారు అని భావించారు కానీ ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారమును గురించి తెలిపారన్న సత్యమును గ్రహించలేకపోయారు. ప్రభువు ఏ విధంగా మనకు జీవాహారము అవుతారు అంటే;
1. ఆయన యొక్క వాక్కును వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, ఆచరించుట ద్వారా మనకు జీవాహారముగా మారతారు.
2. ప్రభువు యొక్క శరీర రక్తములను స్వీకరించుట ద్వారా ప్రభువు మనకు జీవాహారమవుతారు. ఆయన దివ్య శరీర రక్తములు మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి.
3. ప్రార్థించుట ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి కొరతను తొలగించి మనలను తన యొక్క సాన్నిద్యంతో నింపుతారు.
4. దేవుని మీద మనసును హృదయమును లగ్నము చేసి ఆయన కొరకు జీవించినట్లయితే ప్రభువు మన యొక్క జీవాహారము అవుతారు.
ఈ విధముగా ప్రభువును మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఇక మనకి ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకలి ఉండదు ఎందుకనగా దేవుడే మనలను తనతో నింపుతారు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చి మనకు ఆహారమైన క్రీస్తు ప్రభువును స్వీకరించటానికి మనము ప్రతినిత్యం కూడా సిద్ధముగా ఉండాలి.
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి