11, ఆగస్టు 2024, ఆదివారం

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

రాజుల మొదటి గ్రంథం 19:4-8, ఎఫెసీ 4:30-52 యోహాను 6:41-51

ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త గురించి   వింటున్నాము. ఏలీయా ప్రవక్త బాలు ప్రవక్తలందరిని చంపినా తరువాత యేసెబేలు రాణి ఏలియాతో నేను నిన్ను చంపిస్తాను అని చెప్పగానే ఆయన దేవుణ్ణి కలుసుకొవడానికీ, తన ప్రయాణము ప్రారంభించి మార్గంలో  దేవునితో  ప్రభూ ఈ బాధ ఇక చాలు! నా ప్రాణమును తీసుకొనుము  అని మోర పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏలియాను ఆదరించి, ఆకలిని తీర్చిన తరువాత , ఆ శక్తితో  తన ప్రయాణం  నలువది రోజులు నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నాడు. 

ప్రియా విశ్వాసులారా దేవుని వాక్కు ప్రజలకు అందించి ఆత్మబలంతో ఎన్నో గొప్ప కార్యాలు చేసి రోషంతో దేవుని కొరకు జీవించి యావే దేవుడే నిజమైన దేవుడని నిరూపించి, ఎంతో మంది బాలు ప్రవక్తలను చంపి కార్మెల్ కొండపై దేవుని ఘనతను చాటించిన ఏలీయా ప్రవక్త, యేసెబేలు రాణి చంపిస్తుందేమో అని భయపడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలను దేవుడిచ్చే శక్తితో చేస్తూ ఉంటాం. కాని ఎలియా వలె మనం కూడా ఏమైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, ప్రభూ  ఇక చాలు నా ప్రాణమును తీసుకొనుము అని అంటూవుంటాం. ప్రియ విశ్వాసులారా మనము దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నిలబడితే దేవుడు ఎల్లా వేళల మన పక్షమున ఖచ్చితముగా ఉంటూ, మనలను ఆదరిస్తూ, మన ఆకలిని తీర్చుతాడు. మనలను నడిపిస్తుంటాడు. మరి ఈ గొప్ప ప్రేమను దేవుని నడిపింపును అర్ధం చేసుకొనగలుగుతున్నామా లేదా ఆలోచించండి. 

రెండవ పఠనములో వింటున్నాం. మనము దేవుని ప్రియమైన బిడ్డలం కనుక దేవుని పోలి జీవించాలి అని వాక్యంలో స్పష్టంగా చెబుతున్నారు దేవుడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. కాబట్టి క్రీస్తు వలె మనం ప్రేమతో నడుచుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అని తెలియజేస్తుంది. వైరము, మోహము, క్రోధము అనే వాటిని వదలి పెట్టాలి అరుపులుగాని,  అవమానముగాని  ఏ విధమైన ద్వేషభావముగాని,  అసలు మనలో మన కుటుంబాలలోగాని మన మనసులలోగాని ఉండకూడదు. కాని ప్రియా మిత్రులారా ఈలోక  జీవితంలో ప్రేమకు బదులుగా గొడవలు, ప్రతి విషయానికి అరుపులు, కేకలు, అల్లరులు అవమానాలు ఎక్కువై పోతున్నాయి. వీటన్నిటికీ కారణం స్వార్ధం, గర్వం, అసూయ, ఓర్వలేని తనం, అందుకే వాక్యం సెలవిస్తుంది. ఏ విధమైన ద్వేషభావమైన మనలో అసలు ఉండకూడదు.   ఈ లోకంలో స్వార్ధం, నటన, మోసం ఎక్కువగానే కనపడుతుంది, ఈ లోకంలో ఎక్కడ చూసిన స్వార్ధ బుద్దితో ఉన్నవారే ఎక్కువ ఉన్నారు. అన్ని నాకే, అంత నాకే, అన్ని నేనే అనే స్వార్ధం అదేవిధంగా నటన అన్నిటిలో,, అన్ని రంగాలలో అన్ని విధులలో ఎంతో మంది నటిస్తూ నటన జీవితం జీవిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువమంది  ప్రజలు ఇతరులను  అవమానిస్తున్నారు, లేదా అవమానింపబడుతున్నారు. 

ప్రియమిత్రులారా ఆలోచించండి మనం ఏవరిని అవమానించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు.  క్రీస్తుని బిడ్డలుగా, యేసు క్రీస్తుని విశ్వాసులుగా మనము ఎలా ఉండాలి అంటే పరస్పరము దయను, మృదుత్వమును మరియు క్షమాగుణమును కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి దయామయుడు. మృదుత్వంకలిగి క్షమించి ప్రేమించే ప్రేమ మయుడు. కాబట్టి మనము పరస్పరం ప్రేమ కలిగి ఉండటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించుదాం. 

సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు అంటున్నారు. "పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అది విని  యూదులు గొణగసాగారు. ఈ యూదులు క్రీస్తు ప్రభువును తృణీకరించారు. క్రీస్తును కేవలం ఒక మానవునిగా మాత్రమే వారు చూస్తున్నారు. కాని దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోతున్నారు. ఆయనపై నిందలు వేస్తూ వ్యతిరేకిస్తున్నారు. ఆయనను గురించి ప్రశ్నించుకుంటూ గొణుగుతున్నారు. ప్రియ విశ్వాసులారా మనలో చాలామంది యూదుల వలె అపనమ్మకంతో క్రీస్తుని నిజ దేవుడు కాదని అనుమానిస్తుంటాము. కొన్ని సార్లు మనము కూడా గొణుగుకుంటూ దేవుణ్ణి పరీక్షిస్తుంటాం. దేవునిపై మనము కూడా నిందలు వేస్తూ వ్యతిరేకిస్తుంటాము.   

ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఎలా ఉన్నాము అందుకే క్రీస్తు ప్రభువు అంటున్నాడు. తనను పంపిన  తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. మిత్రులారా మనము దేని ద్వారా లేక ఎవరి ద్వారా ఆకర్షింప బడుతున్నాము, ఆలోచించండి. అనేక విధాలుగా మనము ఆకర్షింపబడుతున్నాం. మరి మనము దేవుని ద్వారా ఆకర్షింపబడుతున్నామా! దేవుని వాక్యానికి ఆకర్షింపబడుతున్నామా! ఆలోచించండి. అదేవిధంగా క్రీస్తు ప్రభువు నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందును అని అంటున్నాడు. మనము నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అంటే ఆయనను విశ్వసించాలి. ఒక గొప్ప విశ్వాసిగా విశ్వాస జీవితం జీవించాలి. అదే విధంగా క్రీస్తు ప్రభువు అంటున్నాడు ఈలోకము అనగా మనం జీవించుటకు ఆయన ఇచ్చు ఆహారము తన దేహము. అంటే ఎవరైనా క్రీస్తు శరీర రక్తాలను, దివ్యసత్ప్రసాదమును విశ్వాసంతో  స్వీకరిస్తారో, వారు నిరతము జీవిస్తారు. మరి మనము నిజమైం విశ్వాసంతో క్రీస్తుని శరీర రక్తాలను స్వీకరిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: జీవము గల దేవా, మాకు నీ జీవమును నీ శక్తిని ఇచ్చి నడిపింపుము. ఆనాడు ఏలియా ప్రవక్తను పోషించి, బలపరచి, నడిపించినావు. మమ్ము కూడా అదే విధముగా నడిపించుము. మేము మాలోని చేడు గుణములు విడనాడి నిన్ను పోలి నీ బిడ్డలుగా జీవించే అనుగ్రహం మాకు దయచేయుము. అదేవిధంగా మీ విశ్వాసులుగా పరస్పరం దయను,మృదుత్వమును మరియు క్షమించే గుణములను కలిగి జీవిస్తూ, పరలోకం నుండి దిగివచ్చిన జీవముగల ఆహారం  నీవే అని గుర్తించి, విశ్వసించి, నీ శరీర రక్తాలను విశ్వాసంతో స్వీకరించి నిత్య జీవం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

28 వ సామాన్య ఆదివారం

సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11 హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30 ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కల...