21వ సామాన్య ఆదివారం
యెహోషువ 24:1-2,15-18, ఎఫేసీ 5:21-32, యోహాను 6: 61-70
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములు మన యొక్క జీవితంలో తీసుకునే నిర్ణయం గురించి తెలుపుచున్నవి. గత నాలుగు ఆదివారాలుగా ఏసుప్రభువు దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుపుచు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించుట ద్వారా కలుగు ప్రయోజనములను వివరిస్తూ ఈనాటి ఆదివారములో మనందరికీ కూడా ఈ దివ్య సత్ప్రసాద స్వీకరణను గురించి ఒక నిర్ణయం తీసుకొనమని తెలుపుచున్నారు.
మన యొక్క అనుదిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు ఎన్నో రకాలైనటువంటి అంశాల మధ్య మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఉదాహరణకు ఏమి తినాలా? ఏమి త్రాగాలా, ఎలాంటి వస్త్రాలు ధరించాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలా చదవాలి? ఎలా ప్రయాణం చేయాలి? ఎలా ప్రార్థించాలి? ఆదివారం దేవాలయానికి వెళ్లాలా? ఈ విధంగా అనేక అంశాల గురించి మనందరం కూడా రోజు వివిధ రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. మనము తీసుకునేటటువంటి నిర్ణయము మీదే మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది ఎందుకనగా మనము సరియైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి సరియైనటువంటి నిర్ణయం తీసుకోపోతే జీవితాంతం మనం బాధపడాల్సి వస్తూ ఉంటుంది.
ఈనాటి మొదటి పఠణంలో యెహోషువా ప్రవక్త న్యాయాధిపతులను, పెద్దలను అందరినీ షెకెము వద్ద సమావేశపరచి ఏ దేవుడిని ఆరాధించాలో నిర్ణయం తీసుకొనమని తెలుపుచున్నారు. అన్య దైవములను పూజించాలా? లేక యావే దేవుడిని ఆరాధించాలా? అనే ఒక ప్రశ్న ఇశ్రాయేలు ప్రజల ముందు యెహోషువ ప్రవక్త ఉంచుతున్నారు. యెహోషువ దేవునితో సంభాషించారు, దేవుని యొక్క అద్భుత కార్యములు కనులారా చూసారు, దేవుడు రక్షించిన విధానమును ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నాడు , ఐగుప్తు బానిసత్వం నుండి స్వేచ్ఛను కలిగించిన విధానమును మననం చేసుకున్నారు అందుకనే ఆయన నేను నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధించుదము అని పలికారు. ఆయన తన జీవితంలో ఉత్తమ నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడి ప్రజలందరూ కూడా మమ్ము రక్షించినటువంటి యావే దేవుడిని మేము సేవింతుము అని పలికారు. ఈ మొదటి పఠణంలో ఎలాంటి దేవుడిని అనుసరించాలి అని వారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు. అన్యదైవములకు మరియు నిజమైన దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసంలో వారు నిజ దేవుని యొక్క గొప్పతనమును గ్రహించి యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఒక నిర్ణయం మన జీవితాన్ని మార్చి వేస్తుంది.
1. ఆదాము అవ్వ తీసుకున్నటువంటి, పండు తినాలి అని నిర్ణయం వారి జీవితంలో చాలా కోల్పోయేలాగా చేసింది.
2.అబ్రహాము యొక్క మంచి నిర్ణయం తనను విశ్వాసులకు తండ్రిగా చేసింది.
3. ఏసావు తప్పుడు నిర్ణయం తన యొక్క అధికారం, దీవెనలు కోల్పోయేలాగా చేసింది.
4. సౌలు యొక్క మూర్ఖ నిర్ణయం తన యొక్క పదవి కోల్పోయేలాగా చేసింది.
5. మోషే ప్రవక్త యొక్క నిర్ణయం తనను నాయకుని చేసింది.
6. దానియేలు యొక్క మంచి నిర్ణయం తనను దేవునికి సాక్షిగా చేసింది.
7. మరియ తల్లి తన జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం ద్వారా మనకు రక్షకుడు తన ద్వారా జన్మించారు.
8. పేతురు తీసుకున్న నిర్ణయం తనను అపోస్తులలకు నాయకునిగా చేసింది.
9. అననీయ సఫీరాల నిర్ణయం దేవుడిని మోసం చేసేలా చేసింది.
వారు తీసుకున్నటువంటి నిర్ణయములను బట్టి వారి జీవితాన్ని యొక్క ప్రతిఫలం అనేది నిర్దేశించబడినది.
చాలా సందర్భాలలో సరియైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రార్థిస్తూ, దేవుని సహాయం కోరుతూ, మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క కుటుంబము విధేయత కలిగిన కుటుంబం లాగా జీవించమని తెలుపుచున్నారు. వారు (భార్యా-భర్తలు) వివాహ రోజున దేవుని ముంగట తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒకరి ఎడల ఒకరు పరస్పర ప్రేమ కలిగి, విధేయత కలిగి ఒక ఆదర్శవంతమైన దేవుని కుటుంబ జీవితమును ప్రేమానురాగములతో జీవించమని తెలుపుచున్నారు. దేవుని ముంగిట తీసుకున్న నిర్ణయములో వారు ఎల్లప్పుడూ కూడా విశ్వాస పాత్రులుగా ఉండాలి. తీసుకున్న నిర్ణయమునకు కట్టుబడి జీవించాలి.
ఈనాటి సువిశేష భాగములో అనేకమంది ప్రజలు ఏసుప్రభు యొక్క మాటలు విని ఈయన బోధనలు కఠినమైనవి అని పలికి ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. ఏసుప్రభు ఇచ్చిన ఆహారమును భుజించారు, ఆయన యొక్క అద్భుత కార్యములు చూశారు అయినప్పటికీ కూడా వారిలో విశ్వాసము కలగలేదు. అనేకమంది శిష్యులు ఏసుప్రభును విడిచి వెళ్లి మరెన్నడను వెంబడింపరైరి. ఆ సమయములో ఏసుప్రభు తన 12 మంది శిష్యులను మీరు కూడా వెళ్లిపోయిదరా? అని అడగగా పేతురు, ప్రభువు మేము ఎవరి వద్దకు పోగలము "నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు" మేము నిన్నే అనుసరింతుము అని పలికెను. పేతురు తన యొక్క జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. దేవుని యొక్క శక్తిని గ్రహించిన వ్యక్తి, అద్భుత కార్యములు చూసిన వ్యక్తి, యేసు ప్రభువుని సజీవ దేవుని కుమారుడు ఒక మెస్సయ్య అని గుర్తించినటువంటి పేతురు మేము నిన్ను మాత్రమే అనుసరిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు.
మన యొక్క అనుదిన జీవితంలో కూడా అనేక సందర్భాలలో మనం సరైన నిర్ణయం తీసుకోక రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేసే వ్యక్తులుగా ద్వంద స్వభావం కలిగిన జీవితం జీవిస్తూ ఉంటాం. ఇటు క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తాం అదేవిధంగా అటు ఇతర మతముల యొక్క ఆచారమును కూడా పాటిస్తూ ఉంటా కానీ నేడు ప్రభువు మనల్ని కూడా ఒక సరియైనటువంటి నిర్ణయం తీసుకొని మనం తెలుపుతున్నారు. మనలో నిజముగా దివ్యసప్రసాద అనుభూతి కలిగినట్లయితే మనం కూడా దేవుడిని అంటిపెట్టుకొని జీవించగలుగుతాం, ఆయన యొక్క శక్తిని గ్రహించగలుగుతాం కాబట్టి నా జీవితంలో సరైన నిర్ణయం తీసుకొని దివ్య బలి పూజలో పాల్గొని, దేవుని యొక్క దీవెనలు పొందాలి.
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి