23, ఆగస్టు 2024, శుక్రవారం

దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51

పునీత బర్తలోమయి అపోస్తులుడు 

దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51

ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడినవానిని మేముకనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా? అని నతనయేలు అడుగగా, "వచ్చి చూడుము" అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు  ఎరుగుదురు?" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే, నీవు అంజూరపుచెట్టు క్రింద ఉండుటను నేను  చూచితిని" అని సమాధానమిచ్చెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు" అని   నతనయేలు పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా?  ఇంతకంటే గొప్పకార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. 

ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనం పునీత బర్తలోమియో గారి పండుగను కొనియాడుకుంటున్నాము. పునీత బర్తలోమయి గారు పన్నెండు మంది శిష్యులలో ఒకరు. ఈయన గలిలియాలోని కానా గ్రామ నివాసి. వీరికి మరో పేరు నతనయేలు. నతనయేలు పవిత్ర జీవితం గడుపుతున్న యూదుడు. ఆయన రక్షకుడి  రాకకోసం నిత్యం ప్రార్ధనలు చేసే భక్తుడు. ఫిలిప్పుగారికి ఆప్తమితృడు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను శిష్యుడు. ఫిలిప్పు గారు మేము మెస్సియ్యను కనుగొంటిమి అని చెప్పగానే నతనయేలు యేసు ప్రభువును కలుసుకునేందుకు ఫిలిప్పు గారితో పాటు బయలు దేరాడు. యేసు ప్రభువు వారిని చూడగానే ఇదిగో కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు అని అంటున్నాడు.  నతనయేలు అనగా నిష్కళంకమైన నిజాయితీ కలవాడని అర్ధం. నతనయేలు బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. క్రీస్తు కొరకు ఎదురు చూసి ఆయనను కనుకొని ఆయన కొరకు జీవిస్తూ, ఆయన క్రీస్తు సేవ చేసి, క్రీస్తు ప్రభువుని సాక్షిగా తన ప్రాణమును ధారపోసి రక్త సాక్షిగా మరణించాడు. 

క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా పవిత్ర నగరమైన యెరూషలేమును గూర్చి వింటున్నాం. ఆ యెరూషలేము నగరము ఒక అమూల్యమైన రత్నము వలెను, సూర్యకాంతమణి వలెను.  స్ఫటికము వలే స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను అని ఆ యెరూషలేము యొక్క విశిష్టతను వింటున్నాం. పండ్రెండు ద్వారములు. వాటిపై పండ్రెండు మంది దేవదూతలు, ఆ ద్వారములపై పండ్రెండు గోత్రముల పేర్లు వ్రాయబడినవి అని అదే విధంగా ఒక్కొక్క ప్రక్కకు మూడేసి ద్వారములు ఉండెను. తూర్పున మూడు, దక్షిణమున మూడు ఉత్తమున మూడు పశ్చిమమున  మూడు అన్ని కలిపి  పండెండు ద్వారములు, ఆ నగరపు గోడ 12 శిలలపై నిర్మింపబడినది. ఆ రాళ్లపై క్రీస్తు ప్రభువుని  పండ్రెండు మంది అపొస్తలుల పేర్లు వ్రాయబడి ఉన్నవి.. 

ప్రియా విశ్వాసులారా 12 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు, అధికారానికి గుర్తు, పండ్రెండు యిస్రాయేలీయుల తెగలు, పండ్రెండు మంది అపోస్తులులు, పండ్రెండు ద్వారములు, పండ్రెండు పునాదులు ఇక్కడ 12 అంటే దేవుని చిత్తం పరిపూర్ణము అని అర్ధం. ఎంతో మంది ఆ నూతన యెరూషలేములో చేరాలని, ప్రవేశించాలని ప్రయత్నించారు. ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఆ అందమైన దేవుని రాజ్యంలో చేరాలంటే దేవుని అనుసరించి, మంచి మార్గంలో నడవాలి అప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. 

ఈనాటి సువిశేష పఠనంలో దేవుడు క్రీస్తు ప్రభువు తన వద్దకు వచ్చుచున్న నతనయేలును చూసి ఇదిగో కపటము లేని నిజమైం యిస్రాయేలీయుడు అని చెప్పాడు. ఈనాడు మనం వాక్యంలో వింటున్నాము. ఫిలిప్పు ఎప్పుడైతే నతనయేలును కలిసి మేము మెస్సియ్యను కనుగొంటిమి . ఆయన  యేసు నజరేతు నివాసి అని చెప్పగానే అక్కడ నుండి మంచి ఏదైనా రాగలదా ? అని నతనయేలు అనగానే వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికాడు. 

ప్రియా విశ్వాసులారా మన సంఘలలో మన జీవితాలలో మన కుటుంబాలలో మనం నిజమైన మెస్సియ్యను కనుగొనాలంటే మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చి చూసి ఆయన గొప్ప కార్యాలు, మహిమ శాంతిని అనుభవించాలి. క్రీస్తు చెంతకు రావాలి. నతనయేలు క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి, ఆ దేవుని అనుభవించి,  క్రీస్తు ప్రభువునితో బోధకుడా నీవు దేవుని కుమారుడవు యిస్రాయేలు రాజువు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనం మన జీవితాలలో,  నీ , నా మన అనుభవం ఏమిటి?  ఆ నజరేయుడైన యేసును అనుభవిస్తున్నామా! ఆయన దేవుని కుమారుడని, యిస్రాయేలు రాజు అని గుర్తించగలుగుతున్నామా! లేదా ! ఆత్మ పరిశీలన చేసుకుందాం.     

ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీవు దేవుని కుమారుడవు, లోక  రక్షకుడవు, యిస్రాయేలు రాజువు. మేము నీవద్దకు వచ్చి మిమ్ము ప్రేమిస్తూ, సేవిస్తూ  నిన్ను మా జీవితాలలో తెలుసుకొనే భాగ్యం మాకు దయచేయండి. నతనయేలు మిమ్ము తెలుసుకొని, నీ శిష్యుడుగా మారి, నీ  వాక్యాన్ని లోకాన బోధించి ఒక గొప్ప   పునీతుడుగా మారినట్లు మేము కూడా మారె భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

28 వ సామాన్య ఆదివారం

సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11 హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30 ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కల...