యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40
యేసు సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని, వారు అచటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయనను పరీక్షింపవలెనని "బోధకుడా! ధర్మ శాస్త్రము నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?" అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా "నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మ శాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడియున్నవి" అని సమాధానమిచ్చెను.
క్రీస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనములో దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తను ఎండిన ఒక లోయలోనికి పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త అటు ఇటు తిరుగుతూ దానినిండ ఉన్నా ఎండిన ఎముకలను చూసినప్పుడు ఆ అస్థికలు మరల జీవింపగలవా, అని దేవుడు అంటున్నాడు. అప్పుడు ఆ ప్రవక్త ఆ సంగతి నీకే తెలియును అని అంటున్నాడు.
దేవుడు ఆ ప్రవక్తతో ఇలా అంటున్నాడు నీవు ఈ అస్తికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో ప్రభువు పలుకులు ఆలింపుడు అని చెప్పుము. ఆ ప్రవక్త దేవుని వాక్కును, సందేశాన్ని వినిపించుచుండగా ఎముకలు ఒకదానితో నొకటి అతుక్కొన్నవి. దేవుడు ఎండిన ఎముకలకు మరల ఊపిరిని పంపి జీవించేలా చేసాడు. మరల వారిని బ్రతికించేను. వారు మహా సైన్యమైరి.
ప్రియ విశ్వాసులారా దేవుడు అంటున్నాడు ఈ ఎముకలు యిస్రాయేలీయులందరికిని చిహ్నముగా ఉన్నవి. ఎందుకంటే వారు మేము అస్తికల వలే ఎండిపోయితిమి. మా ఆశ విఫలమైంది. మేము మృతులతో సమానమైతిమి అని పల్కుచున్నారు. అందుకు దేవుడు మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు అని అంటున్నాడు. మీరు జీవించునట్లు చేయుదును. మీరీ దేశమున వసించునట్లు చేయుదునని మాట ఇస్తున్నాడు.
ప్రియా విశ్వాసులారా మనం కూడా మన జీవితాలలో బాధలు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మర్చిపోతం. అంత శూన్యం అనుకుంటాం. మన జీవితాలు ఎంత చీకటిమయం అయినా మన బ్రతుకులు అణగారిపోయిన మన స్థితి ఎలా ఉన్నా దేవుడు ఒక్క మాటతో మనకు జీవం పోసి లేవనెత్తుతాడు. మనలను నడిపిస్తాడు. మన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయనకు సమస్తము సాధ్యమే. జీవమునకు కర్త మన ప్రభువె. మరి నీవు నేను నమ్ముతున్నామా , ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం ధర్మ శాస్త్రోపదేశకుడు క్రీస్తు ప్రభువును పరీక్షింపవలెనని "బోధకుడా ధర్మ శాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది? అని అడిగాడు. అందుకు క్రీస్తు ప్రభువు రెండు ప్రధానమైన ఆజ్ఞలను ఆ వ్యక్తికీ తెలియజేస్తున్నాడు. అవి ఏమనగా 1. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. అదే విధంగా నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. మోషే ధర్మ శాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండు ఆజ్ఞల పైనే ఆధారపడివున్నవి.
ప్రియ విస్వసులారా మనం దేవుణ్ణి నిజమైన మనస్సుతో, పూర్ణ మనస్సు , పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించగలుగుతున్నామా? మనలో చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెపుతుంటాం, కాని పరిపూర్ణ హృదయంతో ప్రేమించలేకపోతున్నాం. ఈలోకాన్ని ఈ లోకంలో ఉన్న అందచందాలను చూసి, వస్తువులను, సంపదలను, వ్యక్తులను ప్రేమిస్తూ, దేవునికి మొదటి స్థానము ఇవ్వలేకపోతున్నాము. అదేవిధంగా తోటివారిని ప్రేమించలేకపోతున్నాం. నేటి సమాజంలో ఎక్కడ చూసిన గొడవలు, హత్యలు, దోపిడీలు, కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు. కాని తమ తోటి వారిని చూసి ప్రేమించలేక పోతున్నారు. సహాయం చేయలేకపోతున్నారు. ఇతరులను నశనము చేస్తూ, భాదిస్తు ఇబ్బందుల పాలు చేస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ ఈలోకంలో కరువైపోతుంది. స్వార్ధ పరమైన ప్రేమలు నటనలు ఎక్కువై పోతున్నాయి. మరి మనం నిజంగా స్వచ్ఛమైం ప్రేమతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా ఆలోచించండి.
ప్రార్ధన: ప్రేమమయుడైన దేవా నీవు సర్వశక్తిమంతుడవు. జీవ నదిని మాలో ప్రవహింపచేసి మాకు జీవమును దయచేయుము. నీవు మాకు ఒసగిన ఆజ్ఞలను మేము పూర్ణ మనస్సుతో , హృదయంతో, ఆత్మతో పాటించగల శక్తిని నాకు దయచేయండి తండ్రి ఆమెన్.
ఫా. సురేష్ కొలకలూరి OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి