25వ సామాన్య ఆదివారం
సొలోమోను జ్ఞాన గ్రంధం 2:12,17-20, యాకోబు 3:16-4:3, మార్కు 9:30-37
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మానవుని యొక్క అత్యాశ, అసూయ, స్వార్థం మరియు దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరు అనేటటువంటి అంశములను గురించి బోధిస్తున్నారు. చాలా సందర్భాలలో వ్యక్తులు కీర్తి ప్రతిష్టల కొరకై ప్రాకులాడుచుంటారు, ధనాశ కలిగి జీవిస్తుంటారు. స్వార్థానికి, స్వలాభానికి ప్రాముఖ్యతనిస్తూ అనేక రకాలైన అక్రమ మార్గాలను అనుసరిస్తుంటారు. మానవుల యొక్క అత్యాశ ప్రమాదకరమైనది దాని వలన చాలామంది ప్రాణాలను, బంధువులను, స్నేహితులను కోల్పోతూ జీవిస్తుంటారు.
ఈనాటి మొదటి పఠణంలో నీతిమంతుడు అనుభవించేటటువంటి బాధలను గురించి తెలియచేయబడినది. కొందరు వ్యక్తులు (చెడును ప్రేమించేటటువంటివారు) ఒక నీతిమంతుని యొక్క పీడను వదిలించుకోవడానికి, ఆయన కొరకై ఉచ్చులు పన్నుచున్నారు. ఎందుకనగా ఆయన వారితప్పిదములను వేలెత్తి చూపారు. వారు ధర్మశాస్త్రమును, పూర్వుల సాంప్రదాయమును పాటించట్లేదని తెలిపాడు అందుకే ఏ విధంగానైనా ఆయన్ను నాశనం చేయాలనుకున్నారు. ఇది ప్రతి ఒక్కరిలో జరిగేటటువంటి సంఘటన ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇతరులను సరి చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటామో, వారి అధర్మాన్ని ఖండిస్తామో అప్పుడు వారు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు.
ఇర్మియ ప్రవక్త ఇశ్రాయేలీయులకు దేవుని హెచ్చరికలు తెలియజేసినప్పుడు అప్పటి ప్రజలు ఇర్మియా ప్రవక్తను ఎలాగైనా తుద ముట్టించాలని భావించారు. బప్తిస్మ యోహాను, హేరోదు రాజు, హెరోదియాలను హెచ్చరించినప్పుడు వారికి అది నచ్చలేదు అందుకని హెరోదియా, బప్తిస్మ యోహాను యొక్క తలను బహుమతిగా కోరింది. మనం కూడా ఎవరినైనా సరిచేయాలి అని భావించి ఇతరులకు వారి తప్పిదములు తెలియచేసిన అందరూ దానిని సహృదయంతో తీసుకోరు దానికి ప్రతిఫలంగా మనకి వ్యతిరేకంగా ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో కూడా కొంతమంది వ్యక్తులు నీతిమంతుని యొక్క జీవితము నచ్చక అతడిని శిక్షించాలని భావించారు. దేవుడు అతడిని కాపాడతారా? లేదా? అని కూడా ఎదురుచూస్తున్నారు. నిజమైన సేవకుడు ఈ నీతిమంతుడు. అతడు అధర్మాన్ని ఖండిస్తూ ప్రజలకు న్యాయాన్ని చేకూరుస్తూ వారి సేవకై అనేక విధాలుగా పాటుపడ్డాడు.
మనం కూడా ఈ సేవకుని వలె మంచి జరిగినా,లేదా చెడు జరిగిన ఎదుటివారి యొక్క ఆ ధర్మాన్ని ఖండించుటకు సిద్ధంగా ఉండాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత యాకోబు గారు స్వార్ధమును, అసూయలను విడిచివేయాలని తెలుపుచున్నారు. స్వార్థము, అసూయలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సర్వ విధముల నీచ కార్యములు జరుగును అని తెలిపారు. అసూయవలనే కయినూ తన యొక్క సోదరుడిని చంపేశాడు. స్వార్థం వలననే సౌలు దేవుడి మాటను పెడచెవిన పెట్టాడు. మనందరం దివ్యమైన వివేకముతో నింపబడినప్పుడు శాంతితో- సమాధానముతో కనికర హృదయముతో జీవించుతాం. ఎటువంటి పక్షపాతమును చూపించము.
ఈనాటి సువిశేష భాగములో శిష్యులు తమలో తాము ఎవరు గొప్పవారు అని వాదించు కొంటున్నారు. ఏసుప్రభు శత్రువులను జయించి యూదా ప్రజలకు స్వాతంత్రాన్ని సంపాదించి,శాంతి సంపదలతో తలతూగే ఒక రాజ్యమును భూలోకంలో స్థాపించబోతున్నారు కాబట్టి ఆయన యొక్క రాజ్యములో ఈ పనిని ఇద్దరు శిష్యులు ఎవరు ప్రథమ స్థానాన్ని అధిష్టించి అధికారాన్ని చలాయించవచ్చని దాని కొరకు శిష్యులు ఒకరిని ఒకరు వాదించుకుంటున్నారు. పేతురు నేనే గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే ఏసుప్రభు ఆయన మీద తన సంఘమును నిర్మిస్తానన్నారు కాబట్టి. యోహాను కూడా గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే ఏసుప్రభు శిష్యులలో మిక్కిలిగా ప్రేమింపబడినటువంటి వ్యక్తి.
ఫిలిప్పు కూడా గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే నిర్జన ప్రదేశంలో అద్భుతం చేయుటకు ప్రభువు ఫిలిప్పుని మొదట అడిగారు కాబట్టి.
యూదా ఇస్కారియాతో గొప్పవాడని భావించి ఉండొచ్చు ఎందుకంటే ఆయన దగ్గరే ధనము ఉన్నది కాబట్టి.
ఈ విధముగా శిష్యులలో ఒకరితో ఒకరు తమలో తాము ఎవరు గొప్పవారని వాదించు కొనుచుండగా ప్రభువు గొప్పవాడు కాదల్చినవాడు అందరిలో చివరివాడై, సేవకుడిగా ఉండాలి అని తెలుపుచున్నారు. ప్రభు ఈ విధంగా అంటున్నారు" నేను మీ వద్దకు సేవకునిగానే వచ్చి ఉన్నాను" (లూకా 22:26-27). తన శిష్యులు కూడా తన వలే సేవకు రూపం దాల్చాలని ప్రభువు భావించారు. ఎవడు మొదటి వాడు కావాలనుకుంటున్నాడో వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడిగా ఉండాలి అని అన్నారు (మార్కు 9:35). మనం సేవకులుగా మారాలంటే ముందుగా మనలో ఉన్న స్వార్ధాన్ని-గర్వాన్ని చంపుకోవాలి. వినయము అనే సుగుణమును మనలో అలవర్చుకొని జీవించాలి అందుకనే ఏసుప్రభు గొప్పవాడు కాదల్చినవాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడిగా మారాలని పలుకుచు ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి, ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరు స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని అనెను.
చిన్న బిడ్డను స్వీకరించుట అనగా ఆ చిన్న బిడ్డలలో ఉన్నటువంటి లక్షణములను మనము కలిగి జీవించుట. చిన్న బిడ్డలకు అధికార వ్యామోహం ఉండదు. వారికి సమాజంలో పలుకుబడి ఉండదు. పేరు ప్రఖ్యాతులకు ఎక్కువ ఆసక్తి చూపరు. వారు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసిమెలిసి కల్మషం లేని వ్యక్తులుగా జీవిస్తారు అదేవిధంగా వారు ప్రతినిత్యం సహాయం కొరకు వేరే వారి మీద ఆధారపడి ఉంటారు. చిన్న బిడ్డలకు ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు వారిని అంతగా పట్టించుకోరు. ఈ చిన్న బిడ్డల వలె శిష్యులు ఎటువంటి అధికార ఆశావ్యామోహం లేకుండా తమ్ము తాము తగ్గించుకొని అందరికీ సేవ చేయాలి అన్నది ప్రభువు యొక్క కోరిక. ధనం ఉంటే గొప్పవారు కారు, పేరు ప్రఖ్యాతలు ఉంటే గొప్పవారు కారు కానీ దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరంటే ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో, వినయము కలిగి జీవిస్తారో, సేవా దృక్పథంతో జీవిస్తారో వారి. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో మనందరికీ ఒక సుమాతృకను చూపించారు ఆయన గొప్పవాడైనప్పటికిని, సేవకుని వలె మన మధ్య వినయంతో అందరితో కలిసి మెలిసి జీవించారు. మనం కూడా మనలో స్వార్థం విడిచి ఏసుప్రభు వలే ఇతరులకు సహాయం చేస్తూ ప్రేమను పంచుతూ జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనందరం ఎటువంటి అత్యాశకు గురికాకుండా ఉండాలి. దేవుని దృష్టిలో గొప్ప వారిగా జీవించటానికి ప్రతినిత్యము వినయము, సేవ, ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నించాలి
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి