సంఖ్యా 11:25-29, యాకోబు 5:1-6, మార్కు9:38-43,45,47-48
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు అసూయ అనే అంశము గురించి బోధిస్తున్నాయి. సమాజంలో చాలామందికి తమ తోటి వారి పట్ల అసూయ భావం ఉంటుంది. అసూయ అనగా ఇతరుల యొక్క ఎదుగుదలను అభివృద్ధిని సహించలేక మనసంతా బాదించేది అసూయ. ఎదుటివారి గొప్పదనమును చూసి మనం కొన్ని సందర్భాలలో ఓర్వలేకుంటాం.
అసూయ అనేది కోపము, క్రూరము కంటే ఘోరమైనది సామెతలు 27:4.
మనం జీవించేటటువంటి ప్రదేశంలో మనకన్నా గొప్పగా ఎవరైనా ఎదుగుతున్నారంటే మనందరం కూడా తట్టుకోలేక పోతాం. మన కన్నా అందంగా ఉన్నా, డబ్బున్నా, పేరు ప్రతిష్టలన్నా, వారిని చూసినప్పుడు మనలో అసూయ భావం కలుగుతుంది. ఈ యొక్క అసూయ వలన ఎప్పుడు మనము ఎదుటివారి గురించే ఆలోచిస్తాం దానివలన ప్రశాంతంగా జీవించలేం. అసూయ వలన మన యొక్క ఆయుష్షు తగ్గుతుంది. (సిరా 30:24.
చాలా సందర్భాలలో ఈ యొక్క అసూయ వలన పాపం చేస్తాం. మనం దేవునితో మంచిగా ఉంటే సైతాన్కు అసూయ, అందుకే మన జీవితంలో శోధనను ప్రవేశపెడుతుంటుంది. మనం కొంతమందితో మంచిగా మాట్లాడితే వేరే వారికి అసూయ ఉంటుంది. మనం కొన్నిసార్లు ఖరీదైన కార్లు కొన్నా, వస్తువులను కొన్నా కొంతమంది దానిని చూసి తట్టుకోలేరు.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ఇశ్రాయేలు ప్రజలపై నాయకత్వం భారం కింద కృంగిపోయి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు యావే ప్రభువు అతనికి సహాయంగా ప్రజల పెద్దల నుండి 70 మందిని ఎన్నుకున్నారు వారిని గుడారం చుట్టూ నిలవమని చెప్పారు. మోషే దేవుడు చెప్పిన విధంగా చేశారు అంతట యావే దేవుడు మేఘం నుండి దిగివచ్చి మోషే మీద వచ్చిన ఆత్మలో కొంత ఆత్మను ఆ 70 మంది మీద ఉంచారు. ఆ ఆత్మను స్వీకరించినప్పుడు ఆ 70 మంది కూడా దేవుని వాక్యమును ప్రకటింప సాగారు. ఈ గుంపులో లేనటువంటి ఎల్దాదు, మేధాదు అనే ఇద్దరు వ్యక్తులు మీద కూడా వేరుగా ఆత్మ దిగి వచ్చి వారు కూడా ప్రవచింపసాగారు. గుడారం దగ్గర లేని ఇద్దరు మీదకు ఆత్మ దిగిరాగా, వారు ప్రవచించుట చూచి యెహోషువ వారిని అడ్డుకోవాలని భావించాడు అందుకు మోషే నీవు నా మీద ఉన్న ప్రేమ వలన అసూయపడుచున్నావు అని చెప్పారు.(సంఖ్యా11:29). దానికి ప్రత్యుత్తరముగా మోషే ప్రవక్త యెహోషువతో ఈ విధంగా అంటున్నారు దైవ ప్రజలందరూ ప్రవక్తలుగా మారి దేవుని సేవ చేయాలని దేవుని ప్రణాళిక. యెహోషువ, దేవుని యొక్క ఆత్మ ప్రవచన శక్తి, బోధనా శక్తి అందరి శ్రేయస్సు కొరకై ఇవ్వబడినది అని గ్రహింప లేకపోయారు. అసూయ పడుచున్నారు. ఈ యొక్క ప్రవచన శక్తిని కేవలము 70 మందికి మాత్రమే పరిమితం చేయాలని యెహోషువ భావించాడు. మోషే ప్రవక్త ఎటువంటి అసూయ పడకుండా అందరూ ప్రభువు సేవ చేయుట మంచిదే అని భావించారు. అందుకే తాను స్వీకరించినటువంటి ఆత్మను సైతం ఇతరుల కొరకు ఇవ్వటకు సిద్ధపడ్డాడు. తన గౌరవ ప్రతిష్టలు తగ్గిపోతాయని కానీ, తన అధికారం ఇతరులకు ఇవ్వడం ద్వారా తన నాయకత్వానికి హాని కలుగుతుందని మోషే భావించలేదు ఆయన అనుక్షణం ప్రజల యొక్క శ్రేయస్సునే కోరుకున్నారు. తన యొక్క పదవి గురించి భయపడలేదు.
కొన్ని సందర్భాలలో మనం కూడా యెహోషువలే తొందరపడి అసూయ చెందుతుంటాం. ఈ అసూయ వలన ఇతరులతో కూడా మాట్లాడటం మానేస్తాం. అసూయ వలన జరిగే కొన్ని నష్టాలు;
1. అసూయ మనలను నిరుత్సాహపరుస్తుంది (సామెతలు 23:17-18)
2. అసూయ మనల్ని కఠినులను చేస్తుంది (పరమగీతం 8:6)
3. అసూయ మనల్నీ confuse చేస్తుంది. (యాకోబు 3:16).
4. అసూయ మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
ఈనాటి రెండవ పఠణంలో ధనవంతులు చేస్తున్నటువంటి మోసము గురించి తెలుపుతున్నారు. వారు పేదవారిని కూలగొట్టి సంపాదించినటువంటి ధనము మొత్తము కూడా నాశనమవుతుంది అని యాకోబు గారు తెలుపుచున్నారు. ధనవంతులు పేదవారి పట్ల, తమ దగ్గర పని చేసే వారి పట్ల ప్రేమ భావం కలిగి జీవించాలి. ధనికులు, పేదవారిని చిన్నచూపు చూడకుండా వారి యెడల కనికర హృదయం కలిగి జీవించాలి.
ఈనాటి సువిశేష భాగములో కూడా యోహాను, ఒక వ్యక్తి ఏసుప్రభువు పేరిటములను గూర్చి ప్రభువునకు ఫిర్యాదు చేస్తున్నారు అతడిని వెంటనే తన పరిచర్య నుండి నిషేధించాలని ఏసుప్రభువును కోరాడు. యోహాను కూడా యెహోషువలై తన యొక్క అసహనాన్ని, అసూయను వ్యక్తపరుస్తున్నాడు. ప్రభు అంటున్నారు "నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కాని వాడు" మన పక్షమున ఉండు వాడు (మార్కు 9:39-40) అని తెలిపారు. దేవుని వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అందించబడ్డాయి దానిని యోహాను గుర్తించలేకపోయారు.
కేవలము వారి వలె అద్భుతాలు చేస్తున్నారు అనేటటువంటి అసూయతోనే యోహాను ఏసు ప్రభువునకు ఈ విషయమును తెలియజేశారు.
పవిత్ర గ్రంథంలో అసూయ గురించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
1. కయీను అసూయ వలనే సోదరుడిని చంపివేశాడు. (ఆది 4:3-8)
2. ఏసేపు యొక్క అన్నలు అసూయ వలనే ఆయన్ను బావిలో పడేశారు (ఆది 37:5-8)
3. మోషే గొప్పతనమును చూసి మిరియం అసూయ పడుతున్నది.
4. సౌలు దావీదు యొక్క కీర్తిని చూసి అసూయ పడుతున్నాడు.
5. మెర్థుకయి కీర్తిని చూసి హామాను అసూయ పడుతున్నాడు.
6. హేరోదు రాజు కూడా బాల యేసుని చూసి అసూయ పడుతున్నాడు.
అదేవిధంగా ఈ యోహాను గారు కూడా అసూయ పడుతున్నారు. మన యొక్క జీవితంలో అసూయను విడిచి పెట్టేసి తోటి వారిని అంగీకరించి జీవించాలి అప్పుడే మనందరం కూడా సంతోషంగా జీవించగలుగుతాం.
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి