27 వ సామాన్య ఆదివారం
ఆది కాండం 2:18-24, హెబ్రీ 2:9-11, మార్కు 10:2-16
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు "పరిశుద్ధ వివాహం" గురించి బోధిస్తున్నాయి. కుటుంబం అనేది ప్రభువును యొక్క ఉద్దేశంలో సృష్టి ప్రారంభం నుండి ఉన్నది. దేవుడు ఏర్పరచినటువంటి దివ్య సంస్కారాలలో మొదటిగా ఏర్పరచిన దివ్య సంస్కారము ఈ యొక్క వివాహ జీవితం ఎందుకనగా సృష్టి ఆరంభంలోనే స్త్రీ పురుషులు ఇద్దరిని సృష్టించి వారిని
పవిత్ర వివాహము ద్వారా ఒకటి చేశారు.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఆదాముకు అవ్వమ్మను తోడుగా ఇచ్చిన అంశమును చదువుతున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయనకి తోడుగా ఉండుటకు, సహాయం చేయుటకు, తన కష్ట కాలములో, సంతోష సమయంలో, అండగా -నీడగా నిలబడటం నిమిత్తమై ఆదాము కొరకు అవ్వను ప్రభువు ఇస్తున్నారు. దేవుడు ఈ సృష్టిలో ఒక కుటుంబమునకు ప్రాముఖ్యత నుంచి ఆ కుటుంబమును ఏర్పరచుటకు సిద్ధపడ్డారు ఎందుకనగా కుటుంబమే అన్నిటికీ ప్రధానం. కుటుంబం నుండి అందరూ (గురువులైన, కన్య స్త్రీలైనా రాజకీయ నాయకులైనా, వైద్యులైనా ......) వస్తారు కాబట్టి ఆ కుటుంబం మంచిదైన యెడల ఈ ప్రపంచమే మంచిదిగా మారును అనే ఉద్దేశంతో ప్రభువు బహుశా ఈ నిర్ణయం తీసుకున్నారేమో. దేవుడు సృష్టించినటువంటి ఆది తల్లిదండ్రులు ఇద్దరు ఒకరితో ఒకరు సగభాగమై, కలిసిమెలిసి జీవించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆదాము యొక్క ప్రకటి ఎముకను తీసుకొని అవ్వను చేసిన సందర్భంలో ఆదాము ఈ విధంగా అంటున్నారు ఈమె నా ఎముకలో ఎముక, నాదేహంలో దేహం ఈమె నా వంటిదైనది అని పలికారు. దాంపత్య జీవితంలో ఇద్దరు వేరు వేరు చోట్ల జన్మించినటువంటి వారు ఒకటిగా అవ్వాలి అన్నది దాంపత్య జీవితం ప్రణాళిక. ప్రతి భార్య తన భర్త లాగా మారాలి అదేవిధంగా ప్రతి భర్త తన భార్య లాగా మారాలి. అందుకే ప్రభువు అంటున్నారు వివాహ బంధం ద్వారా భిన్న శరీరులుగా ఉన్న ఇద్దరూ ఏక శరీరులై జీవించబోతున్నారు. వివాహ బంధం అన్నది దేవుడు ఏర్పరిచిన బంధం. ఒక స్త్రీకి భర్తను అదే విధంగా ఒక పురుషుడికి భార్యను జత చేసేది దేవుడే ఎందుకనగా సృష్టి ప్రారంభంలోనే ఆదాముకు అవ్వే భార్యని దేవుడు వారిద్దరినీ జత చేసారు. ఆది తల్లిదండ్రులకు అంతయు క్రొత్తగా ఉన్నప్పటికీ వారిద్దరూ చివరి వరకు కలిసిమెలిసి జీవించారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువే స్వయంగా పలికారు ఎందుకన ఒంటరితనం బాధిస్తుంది, ఒంటరితనం మగవారు తట్టుకోలేరు అందుకే చాలా సందర్భాల్లో చూస్తాం ఒక భర్త చనిపోయినప్పుడు భార్య జీవించగలదు కానీ ఒక భార్య చనిపోయినప్పుడు భర్త దాన్ని తట్టుకొని జీవించటం చాలా కష్టం.
వివాహ జీవిత ముగింపు అనేది కేవలం మరణం ద్వారా సంభవించాలి కానీ విడాకులు అనేవి వివాహ జీవితంలో లేవు అని ప్రభువు స్పష్టం చేశారు. పరిసయ్యులు ఏసుప్రభువుని "భార్యను భర్త పరిత్యజించుట ధర్మమా అని ప్రశ్నించారు" ఎందుకంటే మోషే వారికి భార్యను పరిత్యజించే నియమము ఇచ్చారు కాబట్టి. మోషే చట్టం ప్రకారము ఒకవేళ భార్య అపరిశుద్ధముగా ఉన్నట్లయితే విడాకులు ఇవ్వవచ్చని రాయబడి ఉన్నది ఇక్కడ అ పరిశుద్ధత అంటే ఒక విధముగా భార్య వ్యభిచారిని అయ్యి ఉండవచ్చు రెండవదిగా అపరిశుద్ధత అనగా భార్య తన జీవితంలో భర్త మాట వినకపోవడం, వంట సరిగా చేయకపోవడం, పరాయి పురుషులతో మాట్లాడటం, భర్త యొక్క బంధువులతో అమర్యాదగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఆమె యొక్క అపరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. ఇలాంటి విపరీతార్ధాలు ఉండటం వలన యూదా ప్రజలలో విడాకులు ఎక్కువైనాయి. భర్తలు,భార్యలపై ఏదో ఒక సాకుమోపి విడాకులిచ్చేవారు వైవాహిక జీవితం ఇట్టి దుస్థితికి దిగజారి పోవటం వలన వివాహ జీవితం అద్వానంగా మారేది అందుకని స్త్రీలు వివాహమాడుటకు వెనుకంజ వేసేవారు.
ఏసుప్రభు మాత్రము వివాహ బంధము విడదీయని బంధము అని స్పష్టము చేశారు అందుకే ప్రభువు అంటున్నారు దేవుడు జతపరిచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదని. దేవుని దృష్టిలో విడాకులకు తావులేదు కానీ మానవులే స్వార్థం కోసం బలహీనత వలన విడాకులు తీసుకుని దైవ ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తున్నారు.
వివాహ జీవితంలో కష్టాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి బాధలు ఉంటాయి కానీ అన్ని సందర్భంలో ఒకరికి ఒకరై తోడై ఉండాలి అది దేవుడు వివాహ జీవితం ద్వారా నేర్పిస్తున్న అంశం. వివాహం రోజున భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని ముంగిట కష్టములోనూ సుఖములోనూ వ్యాధి లోను సౌఖ్యములోనూ నేను నీకు ప్రామాణికంగా ఉందునని ఇద్దరు కూడా ప్రమాణం చేస్తారు. కాబట్టి ఆ ప్రమాణం యొక్క అర్థమును ఎప్పుడూ కూడా గ్రహించి ఇద్దరు కూడా కలిసిమెలిసి చివరి వరకు జీవించాలి. వివాహ బంధము పరలోకమునకై ఏర్పరచబడినది. Marriages are not made in heaven but marriages are made for heaven. ఈ సత్యమును గ్రహించి దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ఎడల ఒకరు విశ్వాస పాత్రులుగా జీవిస్తూ, పరస్పరం క్షమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ జీవిస్తే వారు చివరి వరకు సంతోషంగా ఉంటారు.
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి