19, అక్టోబర్ 2024, శనివారం

29 వ సామాన్య ఆదివారం


యెషయా 53:10-11, హెబ్రి 4:14-16,మార్కు 10:35-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ప్రభువుని అనుసరించేవారు సేవక రూపం కలిగి జీవించాలి అనే అంశమును, అదేవిధంగా అధికారం ఉన్నటువంటి వారు సేవకులు వలె తమ యొక్క అధికారమును సద్వినియోగపరుచుకోవాలని వినయంతో సేవ చేయాలని కూడా  తెలుపుతున్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో  బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి తెలుపుచున్నది ఈ యొక్క బాధామయ సేవకుడు మరెవరో కాదు క్రీస్తు ప్రభువే ఆయన అందరి కోసం అనుభవించేటటువంటి శ్రమలను గురించి యెషయా ప్రవక్త తెలియజేశారు. క్రీస్తు ప్రభువు యొక్క మరణము పాప పరిహార బలి అయ్యింది. అందరి యొక్క పాపముల నిమిత్తమై ప్రభువు మరణించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి కొందరికి సంతోషంగా ఉన్న సమయంలో శ్రమలు వస్తాయి, కొందరికి జీవితం యధావిధిగా సాగించే సమయంలో శ్రమలు వస్తుంటాయి. కొంతమందికి శ్రమలు అప్పుడప్పుడు మరి కొంతమందికి శ్రమలు తరచుగా వస్తాయి. కొంతమంది శ్రమలు తట్టుకొని జీవిస్తే మరి కొంతమంది శ్రమలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటారు. మరికొందరు విశ్వాసాన్ని కూడా కోల్పోతారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఇతరులకు మేలు చేయుట కొరకు శ్రమలు అనుభవించవచ్చు. పునీత చిన్న తెరెసమ్మ గారు తన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో తాను తప్పు చేయనప్పటికీ దానిని అంగీకరించుకొని ఆ యొక్క బాధలను పాపుల యొక్క హృదయ పరివర్తనం కొరకై సమర్పించేవారు. ఈనాటి మొదటి పఠణంలో బాధామయ సేవకుడు ఎటువంటి తప్పిదము చేయనప్పటికీ కేవలము ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై, రక్షణ కొరకై తన యొక్క ప్రాణములను త్యాగం చేశారు. ఈనాటి రెండవ పఠణంలో హెబ్రీలకు రాయబడిన లేఖలో రచయిత యేసు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నారు. ఆయన మనవలె శోధింపబడినప్పటికీ పాపము చేయనటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన చెంతకు చేరి ఆయన కృపను పొందుదుమని తెలుపుచున్నారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటూ తానే ఒక బలిగా ఇతరుల కొరకు సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు యొక్క శిష్యులు యోహాను యాకోబులు, ప్రభువు స్థాపించబోయే రాజ్యంలో అగ్రస్థానాల కొరకై ఆశపడ్డారు ఆయన రాజ్యాన్ని ఇహలోక సంబంధమైన రాజ్యముగా, సిరిసంపదలతో కూడిన రాజ్యముగా, శాంతిభద్రతలతో తులతూగే ఒక గొప్ప రాజ్యంగా భావించారు అట్టి రాజ్యములో వీరికి ముఖ్యమైనటువంటి స్థానములను ఇవ్వమని ప్రభువును అడుగుచున్నారు. యోహాను, యాకోబులకు దేవుడు మొదటి స్థానం పేతురుకు ఇచ్చారు అని తెలుసు తరువాత రెండవ- మూడవ స్థానములను యోహాను యాకోబులకు ఇవ్వమని వారు అధికారం కోసం అడుగుచున్నారు. అనేక సందర్భాలలో యోహానును యాకోబును ఏసుప్రభు తనతో తీసుకుని వెళ్లారు. పేతురు అత్త అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరిని తనతో పాటు తీసుకెళ్లారు, యాయీరు కుమార్తె అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరూ ప్రభువుతో ఉన్నారు, దివ్యరూపధారణ సమయంలో కూడా మీరు ఏసుప్రభు తోనే ఉన్నారు. కాబట్టి వీరు కూడా ప్రభువు మాకు ప్రాముఖ్యతనిచ్చారు అయినప్పటికీ అధికారం కొరకు ఆశించారు.
ఇక్కడ ఏసుప్రభు నిజమైన అధికారమంటే పెత్తనం చెలాయించటం కాదు సేవ చేయటం అని తెలియపరుస్తున్నారు. ఈ సువిశేష భాగములో మనము గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు. 
1. ప్రతి శిష్యుడు/ అధికారి సేవకు రూపం దాల్చాలి. దేవుడిని వెంబడించేటటువంటి సమయములో ఎటువంటి పదవులను ఆశించకుండా కేవలము సేవకుని వలె దేవుడి యొక్క బాధ్యతను నెరవేర్చాలి. 
2. ఇచ్చిన అధికారమును వినయముతో నెరవేర్చాలి. కొన్ని సందర్భాలలో అధికారము వచ్చిన తర్వాత అనేక మందికి గర్వం వస్తూ ఉంటుంది కాబట్టి ప్రభువు చెప్పే అంశం ఏమిటంటే వినయంతో అధికారమును వినియోగించుకోవాలి అని తెలుపుచున్నారు. తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క గొప్పతనము చాటి చెప్పాలి.
3. ప్రతి అధికారంలో త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి అనగా ఇతరులకు మేలు చేయు సమయంలో తాను (అధికారంలో ఉన్న వ్యక్తి)ఎన్ని బాధలైనా పొందవలసి వస్తే పొందటానికి సిద్ధముగా ఉండాలి. 
4. ప్రతి సేవకుడిలో/అధికారి వినయం ఉండాలి ఎందుకంటే ఏసుప్రభు నేను ఈ లోకంలో సేవ చేయడానికి వచ్చాను సేవింపబడుటకు రాలేదు అని తెలిపారు. కాబట్టి ఏసుప్రభుని వెంబడించే ప్రతి ఒక్క శిష్యుడు- శిష్యురాలు ఆయన వలె వినియం కలిగి జీవించాలి. 
5. నిస్వార్థ సేవను చేయాలి. ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ప్రభువు యొక్క సేవ చేయాలి.
6. ఏసుప్రభు వలై నిస్సహాయులను అనాధలను స్వీకరించి వారికి మేలు చేయాలి. 
ప్రతి క్రైస్తవుడు అధికారాన్ని సేవగా భావించి క్రీస్తు వలే కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సమాజములో జరుగుతున్నటువంటి అన్యాయమును ఎదుర్కొని న్యాయం కొరకు పోరాడాలి. పేదల పట్ల బలహీనుల పట్ల దయా కనికరము కలిగి వారి కొరకు పోరాడటానికి ప్రయత్నించాలి. 

Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...