12, అక్టోబర్ 2024, శనివారం

28 వ సామాన్య ఆదివారం


సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11
హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30
ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కలిగి ఉండుట కొరకు దేనినైనా వదులుకుని జీవించాలి అనే అంశమును గురించి తెలుపుచున్నవి. ప్రతి ఒక్కరి యొక్క అనుదిన జీవితంలో రోజు ఈ లోక సంబంధమైనటువంటి విషయములతో ప్రాముఖ్యతను ఇచ్చి జీవిస్తారు. కొందరికి బంగారము అంటే విలువ ఎక్కువ, అందరికీ వెండి అంటే ఇష్టం, మరికొందరికి పదవులు ఇంకొందరికి సుఖ భోగాలు, గౌరవ మర్యాదలు ఇష్టం అందుకని వాటికి ప్రాముఖ్యతను, విలువనిచ్చి అవి కలిగి ఉండుట కొరకు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను తన యొక్క జీవితంలో ఏది ముఖ్యమైనది అని తెలుసుకొని దానికి విలువనిచ్చి ఆ యొక్క వరము కొరకు ప్రార్థించాలి. సొలోమోను దైవ భక్తుడిగా, నీతిమంతుడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, ఆయనయే స్వయంగా తెలుపుతున్నటువంటి మాటలు ఏమిటంటే నేను ప్రార్థించినప్పుడు వివేక వరము నాకు లభించినది. దేవుడిని ప్రార్ధించినది వివేకము కొరకు. జ్ఞానము తాను సంపాదించినట్లయితే ఇంక తన జీవితంలో ఏదీ కూడా అవసరం లేదు అని సొలోమోను గ్రహించాడు కాబట్టి జ్ఞానమును సంపాదించుట కొరకు దేవుని ప్రార్థించారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనం దేనికొరకు ప్రార్థిస్తున్నాము అని మనము ఒకసారి పరిశీలించుకోవాలి. సొలోమోను రాజు ఆయన తన యొక్క వివేకము ద్వారా తెలుసుకున్న సత్యమేమిటంటే ఈ లోక పదవుల కన్నా, సంపదల కన్నా, సింహాసనములకన్నా, రాజు దండనముకన్నా విలువైనది జ్ఞానము అని తెలుసుకున్నారు అందుకని దానిని పొందుట కొరకై దేనినైనా సరే వదులుకొనుటకు సిద్ధపడుతున్నారు. సొలోమోను యొక్క విజ్ఞానము వలన తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ లోక సంపదలు ఏవి కూడా జ్ఞానముతో సరిపోవని తెలిపారు. జ్ఞానముతో పోల్చినప్పుడు బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అనేది మట్టి పెళ్లతో సమానం. ఆయన తన యొక్క జీవితంలో ఆరోగ్యము కంటే సౌందర్యం కంటే ఎక్కువగా జ్ఞానమునే పొందాలని ఆశించాడు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఏది కావాలో అనే అవగాహన లేదు. కొన్ని సందర్భాలలో సంపదలకే ఎక్కువ విలువ ఇస్తాము, కానీ సొలోమోను మాత్రం విజ్ఞానమునకు మొదటి స్థానమును ఇచ్చారు ఎందుకనగా విజ్ఞాన ద్వారా అంతా కూడా సంపాదించవచ్చు. ఆయనకు ఉన్నటువంటి విజ్ఞానమును బట్టి షెభారాణి కూడా ఆయనను చూడటానికి వచ్చారు. ఇంగ్లీష్ లో ఒక సామెత one idea can change your life ఇది ఎలా సాధ్యమంటే మనకు విజ్ఞానం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే. మనము కూడా విజ్ఞానమును దేవుని యొక్క కృప వలన పొందాలి. విజ్ఞానము కొరకు ప్రార్థించాలి ఈ యొక్క విజ్ఞానముతో మన యొక్క జీవితములో ఏది ఉత్తమమైనదో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవింప సాగాలి. విజ్ఞానము మనకు నేర్పిస్తుంది మన జీవితంలోను సరి చేస్తూ ఉన్నది కావున సొలోమోను ఏ విధముగానయితే దేవుని యొక్క జ్ఞానమునకు ప్రధాన స్థానమును ఇచ్చి దానిని సర్వస్వంగా భావించి దానిని పొందుట కొరకై దేవుడిని ప్రార్థించి వేడుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవుడిని ప్రార్థించి విజ్ఞానాన్ని పొంది మంచి విశ్వాసులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్కు సజీవమైనది చైతన్యవంతమైనది అని తెలుపుచున్నది. ఆయన యొక్క వాక్కు మన జీవితంలో ఉన్నటువంటి చెడును తొలగిస్తుంది మనలో హృదయ పరివర్తన కలుగచేస్తుంది. ఆ విలువైనటువంటి దేవుని యొక్క వాక్కు కొరకు మనము తపించాలి. మన జీవితములను సరిచేసుకోవాలి. 
ఈనాటి సువిశేష పఠణములో ఒక యువకుడు నిత్యజీవితము పొందుటకు నేనేమి చేయాలి అని ప్రభువుని అడుగుతున్నారు. అందుకు తనను, ఏసుప్రభు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని తెలుపుతున్నారు ఆ యువకుడు అవి అన్నియు చిన్ననాటి నుండే పాటిస్తున్నాడని తెలిపారు. అప్పుడు ప్రభువు ఆయనకు తన దగ్గర ఉన్నటువంటి ధనము పేదలకు దానం చేసి ఇవ్వమని తెలిపారు కానీ అతడు దానికి ఇష్టపడలేదు. ఈ యువకుడు యొక్క ఉద్దేశ్యము నిత్య జీవము పొందుట మరి ఆ ఉద్దేశం కొరకు ఎందుకు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ధనమును విడిచిపెట్టలేదు? ఈ యువకుడు ధనమే ముఖ్యమని భావించాడు. ధనము ఉన్న ఎడల తనకు మంచి గౌరవము అదే విధముగా తన భవిష్యత్తు బాగుంటుందని భావించాడు అందుకే ధనానికి ప్రాముఖ్యతను ఇచ్చి దానిని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. వాస్తవానికి ధనపేక్ష అన్నది సర్వ అనర్ధాలకు మూలం. ఈ యువకుని యొక్క హృదయం ధనాశతో నిండి ఉన్నది కాబట్టి దానిలో దేవునికి స్థానము ఇవ్వలేదు. ధనాపేక్ష అతని పట్టి పీడిస్తుంది. ఈయొక్క ధనం వలనే ఆయన ఉదార స్వభావిగా జీవించి లేకపోయాడు. ఈ యొక్క యువకుడు తన యొక్క జీవితంలో ధనం కన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భావించినట్లయితే ఆయన మీద ఆధారపడి జీవించేవాడు, ఆయనకు నిత్యజీవం లభించేది కానీ ఈ యొక్క యువకుడు దేవుని కన్నా ధనానికే ప్రాముఖ్యతనిచ్చి జీవించాడు అందుకనే విలువైన నిత్య జీవితాన్ని కోల్పోయాడు. ఈ యువకునికి దేనికి ప్రాముఖ్యత నివ్వాలో, దేనిని కలిగి జీవించాలో తెలుసుకోలేక పోయాడు అందుకే తన జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఏసుప్రభు తన కొరకు ఎవరైతే సమస్తము విడిచిపెడతారో వారు నూరంతలుగా ఆశీర్వాదం పొందుతారని తెలిపారు (మార్కు 10:28-31). ఈ విషయాన్ని ఆ యువకుడు మరిచిపోయారు. మన యొక్క జీవితంలో దేవునికి విలువ నుంచి జీవించాలి అప్పుడు దేవుడు మనకు సమస్తము కూడా సమకూర్చును.
Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...