2, నవంబర్ 2024, శనివారం

31 వ సామాన్య ఆదివారం

31 వ సామాన్య ఆదివారం 
ద్వితియోపదేశకాండము 6:2-6, హెబ్రీ 7:23-28 మార్కు 12:28-34
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట మరియు ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అనే అంశములను తెలుపుచున్నవి. 
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా వారి యొక్క జీవితంలో అనేక రకములైనటువంటి మేలులు కలుగుతాయి అనేటటువంటి అంశమును కూడా ప్రవక్త తెలిపారు. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించిన యెడల ఇశ్రాయేలు ప్రజలు కలకాలము బ్రతుకుతారు అదే విధముగా ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో క్షేమములు కలుగును మరియు పాలు తేనెలు ప్రవహించే నేల మీద వారు బహు గొప్పగా వృద్ధి చెందుతారు అదే విధముగా ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా దేవుడు వారిని వేయి తరముల వరకు ఆశీర్వదిస్తారు(నిర్గమ 20:6). ఈ యొక్క ఆజ్ఞలు ప్రేమకు సంబంధించినవి. ప్రభువైన యావేను పూర్ణహృదయముతోనూ, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను అని ప్రభువు కోరుకున్నారు. ప్రజల యొక్క మనసులు ఇక వేరే దైవముల మీద ఉండకుండా కేవలము యావే దేవుని మాత్రమే ఆరాధించి ప్రేమించాలి కాబట్టి ప్రభువు ఈ యొక్క ఆజ్ఞను ఇచ్చారు. ప్రేమ ఉండిన యెడల ప్రతి ఒక్కరి జీవితంలో ఏది అయినా పాటించవచ్చు ఎందుకనగా ప్రేమ ఉంటే ఆజ్ఞలను తు:చ తప్పకుండా నెరవేరుస్తారు. మన యొక్క అనుదిన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో యావే దేవుడిని మాత్రమే కాకుండా మిగతా దైవములను కూడా విశ్వసిస్తారు దీనిని ప్రభువు ఖండిస్తూ ఆయన ఒక్కరే నిజమైన దేవుడు అని తెలుపుచూ ఇక వేరే అన్యదైవములను విశ్వసించవద్దని మోషే ప్రవక్త ద్వారా తెలిపారు. యావే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పది ఆజ్ఞలను రెండుగా విభజించినట్లయితే మొదటి మూడు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి మిగతా ఏడు ఆజ్ఞలు తోటి మానవులకు సంబంధించినవి ఈ రెండిటిని కలిపి పది ఆజ్ఞలు అని పిలుస్తారు ఇందులో దైవము మానవులు ఇద్దరు ఉన్నారు కాబట్టి దైవ - మానవ ప్రేమలు విడదీయునటువంటివి. ఈ రెండు ఎప్పుడూ కలసి ప్రయాణం చేయాలి. రైలు పట్టాలు ఏ విధంగానైతే కలిసి పోతుంటాయి అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు అంశాలు పాటిస్తూ జీవించాలి. ఏ ఒక్కటి తక్కువైనా అది నిజమైన సంపూర్ణ క్రైస్తవ జీవితం కాదు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు యొక్క యాజకత్వమును గురించి బోధిస్తూ ఉన్నది. ఆయన ప్రజల పక్షమున మనవి చేయుట కొరకై శాశ్వత జీవియై ఉన్నారు. ఆయన దైవ ప్రేమ మానవ ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టే మన కొరకు తన యొక్క ప్రాణములను సమర్పించారు. ఆయన యొక్క యాజకత్వము గొప్పది. ఎందుకనగా ఎటువంటి పాపము చేయని నిష్కళంక గొర్రెపిల్ల మన కొరకు తన రక్తమును చిందించి తనను తానే దేవునికి మన పాపముల నిమిత్తము సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములో ఒక మంచి ధర్మశాస్త్ర బోధకుడు ఏసు ప్రభువుని, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని అడుగుచున్నారు అందుకుగాను ప్రభువు మొదటిగా దేవుడిని ప్రేమించమని తెలిపి, ఆ ప్రేమను ఇతరులలో వ్యక్తపరచమని కోరారు. ఈ ధర్మశాస్త్ర బోధనకునికి ప్రధాన ఆజ్ఞ తెలుసుకోవాలనిపించింది ఎందుకనగా యూదులు యావే దేవుడిచ్చిన పది ఆజ్ఞలను 613 ఆజ్ఞలుగా మార్చారు అందుకుగాను ప్రజలు ఆచరించడానికి కష్టంగా ఉన్నటువంటి ఇన్ని ఆజ్ఞలలో ఏది ప్రధానమైనదో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు అందుకే యేసు ప్రభువును అడిగారు. ఏసుప్రభు దైవ ప్రేమ మానవ ప్రేమ రెండు వేరు పరపలేనటువంటివి అని తెలిపారు. ఒకే నాణేనికి రెండు ప్రక్కలు ఉన్నట్లే ఒకే ఆజ్ఞకు దైవ ప్రేమ, సోదర ప్రేమ అను రెండు అంశాలున్నాయి. దైవ ప్రేమ లేనిది సోదర ప్రేమ లేదు అలాగే సోదర ప్రేమ లేనిదే దైవ ప్రేమ లేదు. దైవ ప్రేమ నుండి సోదర ప్రేమ ఉద్భవిస్తుంది. మన అందరికీ దేవుడు తండ్రి కాబట్టి మనము ఆయన యొక్క బిడ్డలం కావున మన జీవితంలో దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగి జీవించాలి. దేవుని యెడల ప్రేమ కలిగి జీవించటం అందరికీ సాధ్యమైనది ఎందుకనగా ఆయన మీద ఉన్న ప్రేమ వలన దేవాలయానికి వస్తాం, పరిచర్యలు చేస్తాం, దేవాలయ నిమిత్తమై ఎంతైనా ఉదారంగా అందజేస్తాం కానీ మన ప్రేమను మన పొరుగు వారితో పంచుకోలేం. పొరుగు వారిని ప్రేమించుట కొంతమందికి చాలా చాలా కష్టం. దేవుడిని ప్రేమించే వ్యక్తి తన తోటి వారిని ప్రేమించకపోతే అట్టి వ్యక్తి అసత్య వాది అని యోహాను గారి తెలిపారు. (1 యోహాను 4:20-21) కాబట్టి మనం మన యొక్క శత్రువులను ప్రేమించాలి, మిత్రులను ప్రేమించాలి, మన యొక్క నాశనమును కోరు వారిని ప్రేమించాలి. ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన యెడల మనందరి యొక్క జీవితములో ఎంతో సంతోషంగా ఉంటాయి అలాగే ఈ భూలోకమే పరలోకంగా మారుతుంది. మనము ఏ పని చేసినా దానిని ప్రేమతోనే చేయాలి కాబట్టి ప్రేమ అనేది మన యొక్క క్రైస్తవ జీవితానికి పునాది లాగా ఉండాలి తద్వారా మనందరం మంచి క్రైస్తవ విశ్వాస జీవితమును జీవించగలుగుతాం. 
 Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...