8, నవంబర్ 2024, శుక్రవారం

లూకా 16: 1-8

 లూకా 16: 1-8

యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "ఒక ధనవంతునివద్ద  గృహనిర్వాహకుడు  ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృథా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, 'నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగా ఉండ వీలుపడదు' అని చెప్పెను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: 'ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తిలేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహనిర్వాహకత్వమునుండి తొలగింపబడినపుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను' అని యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో 'నీవు నా యాజమానునికి ఎంత ఋణపడి ఉన్నావు? అని అడిగెను. వాడు 'నూరు మణుగుల నూనె' అని చెప్పెను. అపుడు అతడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము' అని చెప్పను. అంతట అతడు రెండవ వానితో 'నీవు ఎంత ఋణపడి వుంటివి?' అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు' అని  బదులుపలికెను. అపుడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, ఎనుబది అని వ్రాసికొనుము'  అనెను. ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజలకంటే యుక్తిపరులు. 

యేసు ప్రభువు ఒక అవినీతి పరుడైన ఒక  గృహ నిర్వాహకుడి గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఒక గృహ నిర్వాహకుడు తన భవిష్యత్తు కొరకు ఎలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడో,  తన ఉద్యోగం పోయినట్లయితే తను  ఎలా జీవించాలో ఎంతో ముందు చూపు కలిగి ఉన్నాడో ప్రతి ఒక్కరు ఆత్మకు సంబంధించి ఈ  లోకానికి చెందిన వారు ఈ లోకమునకు చెందిన జీవితం గురించియే ఇంత ముందు చూపు కలిగి ఉంటె వెలుగు పుత్రులు పరలోక జీవితం  పొందాలనుకునేవారు ఇంక ఎంత ముందు చూపు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు ప్రభువు.  ఒక సంపన్న యజమాని తన సంపదను నిర్వహిస్తున్నా గృహ నిర్వాహకుడు తన సంపదను వృథా  చేస్తున్నాడు అని తెలుసుకొని తనని పని నుండి తీసివేయ నిశ్చయించుకున్నాడు. గృహనిర్వాహకుడిని  యజమాని తీసివేయదలుచుకున్నది, తనలో నిజాయితీ లేదు అని మరియు తన సంపదను వృథా చేస్తున్నాడని,  నిజాయితీ లేకపోవడం, వృథా చేయడం, ఆ పనికి అతడు సరికాదు అని తెలుపుతున్నవి. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి పని కూడా ఈ కోవలోనికే వస్తుంది. ప్రతి వ్యక్తికీ  దేవుడు ఇచ్చిన బాధ్యత నిజాయితీగా ఉండటం మరియు  దేవుడు  ఇచ్చిన ఏ సంపదను కాని ప్రతిభను కాని వృథా చేయకుండా మన ఉన్నతికి మరియు  ఇతరుల ఉన్నతికి వాడాలి. 

 యజమాని గృహ నిర్వాహకున్ని తొలగించే ముందు అతని పనికి సంబంధించిన లెక్కలను  కోరుతున్నాడు. ప్రభువు ప్రతి వ్యక్తిని కూడా లెక్కను అడుగుతాడు. ఇక్కడ గృహనిర్వాహకుడు  త్వరలో ఉద్యోగం నుండి తీసివేయబడుతుందని  గ్రహించి, తన భవిష్యత్తు కోసం ఒక తెలివైన ప్రణాళికను రూపొందించుకున్నాడు. అది ఏమిటంటే తన యజమానునికి ఋణపడి ఉన్న వారిని పిలిచి వారి ఋణములను తగ్గించాడు దానిద్వారా ఈ ఋణస్థుల నుండి లభ్ది పొందవచ్చని అనుకుంటున్నాడు. గృహ నిర్వాహకునకు  తన గురించి తనకు  మంచి అవగాహన ఉంది, తాను ఎవరిని యాచించలేడని, మరియు శ్రమించుటకు శక్తిలేనివాడనని తెలుసుకున్నాడు. అప్పుడు తన భవిష్యత్తు కోసం  ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు. మన జీవితం గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. నా భవిష్యత్ ఏమిటి, నా ధ్యేయం ఏమిటి?  క్రీస్తు అనుచరునిగా నేను పరలోకం పొందటం నా ధ్యేయం.  

ఈ ఉపమానములో  ఆసక్తిని రేకెత్తించేది ఏమిటంటే, యేసు ప్రభువు ఆ గృహ నిర్వాహకునికి   మెచ్చుకొంటున్నాడు.  యేసు ప్రభువు గృహ నిర్వాహకుని నిజాయితి లేకపోవడాన్ని మెచ్చుకోవడం లేదు. తాను  ఉద్యోగం కోల్పోతే ఎలా బ్రతకాలో ముందుగానే ఆలోచించి యుక్తిగా ప్రవర్తించడాన్ని మెచ్చుకుంటున్నాడు.  ఈ లోకపు వ్యక్తులు  వెలుగుకు చెందిన వ్యక్తుల కంటే  వారి భవిష్యత్తు గురించి భరోసా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  యేసు ప్రభువు తన అనుచరులను కూడా వారి జీవితాలు పరిశీలించుకోవాలని  ఈ లోకానికి చెందిన విషయాలయందే ఇన్ని జాగ్రత్తలు తీసుకొనే వీరికంటే, పరలోక విషయాలను కోరుకునే వారు ఎక్కువగా తమను తాము పరిశీలించుకుంటూ, సంస్కరించుకుంటూ, పరలోకానికి అర్హులుగా మరాలని కోరుకుంటున్నాడు. 

ఈ ఉపమానం మనకు ఇవ్వబడిన సమయాన్ని, ప్రతిభను మరియు ఇతర అనుగ్రహములను  దేవుని చిత్తమునకు  అనుగుణంగా ఉపయోగించామో లేదో  పరిశీలించమని అడుగుతుంది. పూర్తిగా ప్రభువు చిత్తమునకు అనుకూలంగా వాడకపోయినట్లయితే ఒకసారి ఈలోక వ్యక్తులను చూసి, అల్పమైన వాటికోసమే ఎంతగానో ప్రణాళికలు వేసుకునే వారిని చూసి , నిత్య జీవం ఇచ్చే ప్రభువును పొందడం కోసం తగిన ప్రణాళిక వేసుకోమని చెప్తుంది. క్రీస్తు అనుచరులుగా ఆయనను పొందుటకు  ప్రణాళికబద్దంగా జీవిస్తూ,  జాగరూకత కలిగి నిజాయితితో కూడిన జీవితం జీవిస్తూనే, ఆధ్యాత్మిక సంపదను సంపాదించుటకు పాటుపడుదాం. 

ప్రార్ధన: ప్రభువా! మిమ్ములను తెలుసుకొని, మీరు మాకు ఇచ్చే గొప్ప అనుగ్రహాలు పొందుకుంటూ   వాటిని సరియైన విధంగా వాడుకోలేకుండా ఉన్నాము. మీరు ఇచ్చిన సమయాన్ని, ప్రతిభను  దుర్వినియోగం చేస్తున్నాము. అటువంటి సందర్భాలలో మమ్ము క్షమించండి. మీ అనుగ్రహాల విలువ తెలుసుకొని వాటిని మీ చిత్తము కొరకు వాడే వారినిగా మమ్ము దీవించండి.  అనేకసార్లు అవివేకంతో ధ్యేయం లేకుండా జీవిస్తున్నాము. అటులకాకుండ మిమ్ములను పొందాలని, మీ పరలోకంలో స్థానము పొందేందుకు ప్రణాళికతో జీవించేలా దీవించమని వేడుకొంటున్నాము. ఆమెన్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...