ఆగమన కాలం మొదటి ఆదివారం
యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36
ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంతో ఒక కొత్త దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఈ యొక్క ఆగమన కాలంలో మనము ప్రభువు యొక్క జన్మము కొరకై/రాకడ కొరకై ఎదురుచూస్తూ ఉన్నాం. ఆగమన కాలము ఒక ప్రత్యేకమైన కాలం ఎందుకనగా ఏసుప్రభు యొక్క పుట్టినరోజు కొరకై మనందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క కాలములో మనము మన హృదయములను పవిత్ర పరచుకొని ఆయన కొరకు ఎదురు చూస్తుంటాం.
ఏసుప్రభు అనేక విధాలుగా మన మధ్యలోనికి వస్తారు. దివ్య సత్ప్రసాదం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము చదవడం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా అనేక విధాలుగా ప్రభువు మన మధ్యకు వస్తూ ఉంటారు. ఈ యొక్క ఆగమన కాలంలో దేవుని యొక్క జన్మం మనందరి యొక్క హృదయములలో ప్రత్యేకంగా జరగాలని మనము ఆధ్యాత్మికంగా తయారవుతాం.
ఈనాటి దివ్య గ్రంథ పఠణములు కూడా ప్రభువు రాకడ గురించి, నిరీక్షించుట గురించి, విశ్వాసముతో ఉండుటను గురించి తెలియజేస్తూ ఉన్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త దేవుని యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు. యూదా ప్రజలు దేవుడిని మరచి, తన యొక్క ఆజ్ఞలను మీరారు. దేవుని యొక్క ప్రజలను నడిపించే రాజులు కూడా దేవుని ప్రవక్త అయినా యిర్మియా మాటలను వినలేదు అందుకే శిక్ష అనుభవించారు. దేవుని యొక్క శిక్ష అనుభవించిన తర్వాత దేవుడు వారికి ఒక సంతోష వార్తను తెలియజేస్తున్నారు. కరుణ గలిగిన దేవుడు వారిని రక్షించుటకు దావీదు వంశము నుండి ఒక రాజును ఎన్నుకుంటానన్నారు. ఆ రాజు నీతి కలిగిన రాజు. ఆయన అందరికీ న్యాయం చేకూర్చే రాజు. ఆయన ప్రజలకు చేసిన ప్రతి ప్రమాణములను నిలబెట్టుకునే రాజు.
యావే ప్రభువు ప్రజలకు ఒక ఆదరణ కర్త అయినటువంటి రాజును పంపిస్తూ వారికి కావలసిన స్వేచ్ఛను, స్వతంత్రమును దయ చేస్తారని చెప్పారు.
దేవుడిచ్చిన వాగ్దానములను నెరవేరుస్తారు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు తనని ఆశీర్వదిస్తానని అది నెరవేర్చారు.(ఆది12:1-3)
ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి కాపాడుతానని వాగ్దానం చేశారు దానిని నెరవేర్చారు (నిర్గమ 3:7-8)
దేవుడు రక్షకుడిని పంపిస్తానని ప్రవక్తల ద్వారా తెలియజేశారు దానిని క్రీస్తు జన్మము ద్వారా నెరవేర్చారు కాబట్టి ప్రభువు ఇచ్చిన వాగ్దానములను తప్పక నెరవేరుస్తారని మనము విశ్వసించాలి.
రక్షకుడు వచ్చే కాలం యూదా రక్షణము పొందును అని ప్రవక్త తెలుపుతున్నారు అనగా క్రీస్తు ప్రభువు ద్వారా అందరూ రక్షించబడతారని అర్థం. ఎన్నో సంవత్సరాల నుండి ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తున్నారు అది క్రీస్తు ప్రభువు ద్వారానే నెరవేరుతుందని యిర్మియా ప్రవక్త తెలియజేశారు. దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజు అదే విధముగా ఆయన వంశము నుండి జన్మింపనున్న రాజు కూడా అదే విధముగా తన ప్రజలను పరిపాలించును. ఆ రాజు ఈ లోకంలో జన్మించిన సందర్భంలో దేవుని యొక్క రక్షణ దినము అనేది రానున్నది, ఆ దినము ప్రజల నుండి భయమును తొలగించును, బానిసత్వమును దూరం చెయ్యను ఇదంతా కేవలం నీతి గల రాజు అయినటువంటి క్రీస్తు ద్వారానే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆయన కొరకు ఆశతో ఎదురు చూడాలని కూడా ప్రవక్త తన ప్రజలకు తెలియజేశారు. వాస్తవానికి ఎదురు చూడటంలో ఆనందం ఉంది, ఎదురు చూడటంలో ఆశ ఉంది, నమ్మకం ఉంది, సహనం, ప్రేమ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యిర్మియా ప్రవక్త ప్రజలకు రక్షకుడు వేంచేయు కాలం గురించి ఒక సంతోష వార్తను తెలుపుచున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజల్లో పరస్పరమ ప్రేమ పెంచాలని అదేవిధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఎల్లప్పుడూ కనబరుచుకొని జీవించాలని తెలియజేశారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా స్వచ్ఛమైన మరియు నిస్వార్ధమైన ప్రేమను చూపించాలని పౌలు గారు తెలియజేశారు. తాను ఏ విధంగానైతే వారి మధ్య మెలిగారో అదే విధముగా ఒకరి ఎడల ఒకరు ప్రవర్తించాలని కోరుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడ కొరకై మనలను సంసిద్ధమై ఉండమని తెలియచేస్తున్నారు
ప్రకృతిలో జరుగు మార్పులను గురించి ఏసు ప్రభువే స్వయముగా తెలియచేస్తున్నారు. ఎన్ని విపత్తులు ఎదురైనా మనం దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. ప్రభు అనేక సందర్భాలలో నేను మీకు సర్వదా తోడై యుండును అని తెలియజేశారు కాబట్టి ఆయన మనతో అన్నివేళలా ఉంటారని మనం దృఢముగా విశ్వసించాలి. ఆయన యొక్క రాకడ కోసం మనం ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉండాలి అదియే క్రైస్తవ విశ్వాసం. ఆటంకములకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధ్యత లేకుండా సుఖ సంతోషాలతో శారీరకవాంఛలకు లోనై ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తే దేవుని సంతృప్తి పరచలేము కావున పరిశుద్ధత కలిగి జీవించాలి మన యొక్క జీవితములను మనము ప్రభువు యొక్క రాకడ కొరకై తయారు చేసుకోవాలి. ప్రభువు మన కొరకై, మనలో ఉండుట కొరకై వస్తున్నారు కాబట్టి ఆయన కొరకు మన హృదయమును పవిత్ర పరచుకొని ఆయనను మనలో ఆహ్వానించు కోవాలి.
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి