7, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం 
బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆగమన కాలంలో రెండవ మరియు మూడవ ఆదివారములో బప్తిస్మ యోహాను సందేశమును వింటుంటాం. దేవుని యొక్క రాకడ కొరకై మనందరం కూడా మన జీవితంలో మార్గమును సిద్ధము చేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణమునకు ఒక మార్గము అనేది తప్పనిసరిగా అవసరం ఎందుకంటే మార్గము లేనిదే ప్రయాణము సక్రమంగా జరగదు, గమ్యమును చేరలేము. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత్మ భూమికి నడిచే సమయములో దేవుడే స్వయముగా వారికి మార్గ సూపరిగా ఉండి వారిని నడిపించారు. మార్గము లేని జీవితము గమ్యము చేరటము కష్టం.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు స్వయంగా తన ప్రజల కొరకు బాబిలోనియా నుండి యెరుషలేమునకు మార్గమును సిద్ధం చేస్తారని తెలుపుతున్నారు కనుక బారుకు ప్రవక్త దుఃఖించే ఇశ్రాయేలు ప్రజలను సంతోషించమని తెలుపుచున్నారు. బారుకు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను దేవుని చెంతకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వారి యొక్క బానిసత్వం ముగిసిన తర్వాత తిరిగి దేవుని చెంతకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా మన యొక్క పాపపు జీవితమును వదిలి, దేవుని చెంతకు తిరిగి రావాలి అదే ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువు ఇశ్రాయేలు ప్రజల కొరకై తానే స్వయంగా మార్గమును సిద్ధం చేస్తున్నారు లోయలు పుడ్చుతున్నారు. ప్రభువు తన ప్రజలకు ఒక మంచి మార్గమును ఏర్పరిచి వారిని సంతోషంగా ఉండులాగా చేస్తారని బారుకు ప్రవక్త తెలియజేశారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులను దేవుని యొక్క రాకడ కొరకై సంసిద్ధత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రార్థించుకొనమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో యోహాను గారు ప్రభువు యొక్క రాకడ కొరకై మార్గమును సిద్ధం చేయుడని  వెలిగెత్తి యోర్థను నది తీరమున ప్రకటించుచుండెను. బప్తిస్మ యోహాను ఈ లోకమునకు వచ్చినదే యేసు ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకు దాని ద్వారా ఏసుప్రభు ఇంకా త్వరగా తండ్రి పరిచర్యను ఈ లోకంలో చేయవచ్చు కాబట్టి.
మన జీవితంలో దేవుని యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయని యెడల దేవుడు మన ఇంటి గుండా ప్రవేశించరు, మనలోకి ప్రవేశించరు. మన యొక్క జీవితంకు మార్గమును హృదయ పరివర్తన ద్వారా, చెడును విడిచి పెట్టుట ద్వారా ఏర్పరచవచ్చు అప్పుడు దేవుడు మనలోకి ప్రవేశిస్తారు. మార్గమును సిద్ధం చేయుట చాలా కష్టం ఎందుకంటే అడ్డుగా ఉన్నటువంటి ప్రతిది కూడా తొలగించాలి అప్పుడే మార్గము ఏర్పరచగలరు కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు ఏదైతే అడ్డుగా ఉంటుందో మనము దానిని తీసివేయాలి. ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయమని ఎడారిలో ఒక స్వరము వినబడెను అని యెషయా ప్రవక్త తెలియజేశారు. ఎడారి అనునది దేవుడిని కలుసుకునే ఒక స్థలం, మన జీవితాలు మార్చు స్థలం. మనము ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటారు అని తెలిపే ఒక ప్రదేశం. హాగారు ఎడారిలో ఉండగా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నారు. ఏలియా నిర్జన ప్రదేశంలో ఉండగా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎడారి వలె నిరుత్సాహమైనటువంటి సమయములు ఎదురైనప్పుడు మనము దైవ అనుభూతిని పొందగలము. దేవుడు మనకు తోడుగా ఉంటారు.
ప్రతి లోయ పూడ్చబడును అని తెలుపుతున్నారు అనగా మనలో మనలో ఉన్నటువంటి అసమానతలను దేవుడు తన యొక్క వాక్యము ద్వారా దివ్య సంస్కారాలు ద్వారా నింపుతూ సరిసమానం చేస్తారు. అదేవిధంగా పర్వతాలు కొండలు సమము చేయబడాలి అనగా మనలో ఉన్నటువంటి గర్వము, అహము అనేటటువంటి చెడు గుణములను సమానము చేయాలి అనగా వినయము కలిగి జీవించాలి. వక్రమార్గములు సరిచేయాలి అనగా మన యొక్క జీవనశైలిని మార్చుకోవాలి. ప్రభువుకి మన హృదయములో మార్గము సిద్ధము చేయాలంటే మన గర్వమును తగ్గించుకోవాలి, పాపపు జీవితాన్ని విస్మరించాలి. పరిత్యజించుకునే లక్షణము కలిగి ఉండాలి. ఈ యొక్క ఆగమన కాల రెండవ ఆదివారంలో మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటంటే దేవుని కొరకు మనము మన జీవితంలో ఎలాంటి మార్గమును సిద్ధం చేస్తున్నాం?. ఆయన కొరకు అడ్డుగా ఉన్నటువంటి పాపమును తొలగించుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా.? హృదయ పరివర్తనం చెందుతున్నామా లేదా? పాపక్షమాపణను కలిగి ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

The Feast of Epiphany

The Feast of Epiphany  క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...