ఆగమన కాల మూడవ ఆదివారం
జెఫాన్య 3:14-18, ఫిలిప్పీ 4: 4-7 లూకా 3:10-18
ఈనాటి ఆదివారమును తల్లి శ్రీ సభ "ఆనందించు"(Gaudete Sunday)ఆదివారంగా పిలుస్తున్నది ఎందుకనగా ప్రభువు యొక్క జన్మము ఆసన్నమవుతున్నది కాబట్టి మనము సంతోషించాలి. ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు మనకు బోధించుచున్నటువంటి అంశము కూడా ఆనందించుట గురించియే. ఎందుకు మనము ఆనందించాలి అనే అంశమును ధ్యానించినట్లయితే మనకు అనేక విషయములు జ్ఞాపకం వస్తాయి;
- మనలను రక్షించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనతో ఉండే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనల్ని ప్రేమించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనల్ని క్షమించే దేవుడు వస్తున్నాడు కాబట్టి సంతోషించాలి
- మనలను పరలోకం చేర్చే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి ఈ విధంగా దేవుని యొక్క అనేక అంశములను గురించి మనము ఆనందించాలి.
ఏ విధముగానయితే మనము ప్రార్ధించినప్పుడు దేవుడు మనకు దయచేసినప్పుడు మనం ఆనందిస్తామో, అదేవిధంగా చిన్నపిల్లలు తమకు నచ్చిన దానిని వారు పొందుతున్నప్పుడు ఆనందిస్తారు మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మనలను తండ్రి వైపుకు నడిపించే ప్రభువు రాబోతున్నందుకు మనం కూడా సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో జెఫన్యా ప్రవక్త ఇశ్రాయేలును, యెరుషలేమును సంతోషించమని తెలుపుచున్నారు. ప్రభువు వారి మీద ఉన్నటువంటి నిందలను తొలగించినందుకుగాను అదే విధముగా వారిని శత్రువుల యొక్క భారి నుండి కాపాడినందుకు సంతోషించమని తెలుపుతున్నారు. దేవుడు వారి యొక్క మధ్య ఉన్నందుకు, దేవుడు వారిని క్రింద పడనివ్వకుండా చూసుకుంటున్నందుకు అదే విధముగా వారికి నూతన జీవితమున వసుగుతున్నందుకుగాను ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను, యెరుషలేము వాసులను సంతోషించమని తెలుపుచున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు బానిసత్వమునకు పంపబడిన సమయంలో వారి నుండి స్వేచ్ఛ, ఆనందం తీసివేయబడినది ఇప్పుడు మరొకసారి దేవుడు వారిని విముక్తులను చేస్తూ వారికి ఇవ్వవలసినటువంటి ఆనందమును దయచేస్తున్నారు అందుకే ప్రవక్త ఆనందించండి అని తెలుపుచున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు ప్రభువు నందు ఆనందించండి మహా ఆనందపడండి అని పలుకుతున్నారు. ప్రభువు యొక్క రాకడ కొరకై విచారింపక హృదయపూర్వకంగా ప్రార్థించమని పౌలు గారు తెలిపారు. పౌలు గారు ఫిలిప్ప ప్రజలకు దేవుని వాక్యము ప్రకటించు సందర్భంలో పరిసయ్యుల వలన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఫిలిప్పు ప్రజలను కూడా వారి జీవితంలో ఎదురయ్యే శ్రమలకు చింతింపక దేవునియందు నమ్మకంతో వారిని హృదయపూర్వకంగా ప్రార్ధించమంటున్నారు వారి శ్రమలు కొద్ది కాలమే అంటున్నారు. ప్రభువు వస్తారు కావున ఆనందించమని అదే విధంగా మహా ఆనందంతో ఉండమని తెలుపుచున్నారు.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారి మాటలు విన్న ప్రజలు వెంటనే హృదయ పరివర్తనమునకు చెందిన క్రియలను చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు.ఎవరైతే రెండు అంగీలను కలిగి ఉన్నారో వారు లేని వారికి ఒకటి ఇమ్మని తెలుపుతున్నారు అదేవిధంగా భోజన పదార్థములు కలిగిన వారు లేనివారికి ఇవ్వమని తెలుపుతున్నారు. ఈ మాటలు యొక్క సారాంశం ఏమిటంటే దేవుడు ఇచ్చిన దానిని ఉదారంగా ఇతరులతో పంచుకుని జీవించమని యోహాను గారు తెలుపుతున్నారు. అదేవిధంగా సుంకరులను అధిక సుంకమ వసూలు చేయవద్దంటున్నారు, అలాగే రక్షక భటులు వచ్చి అడిగినప్పుడు ఎవరికి కూడా హాని చేయకుండా న్యాయముగా వారిపట్ల ప్రవర్తించమని బప్తిస్మ యోహాను గారు తెలిపారు. వాస్తవానికి ఈ మూడు అంశాలు కూడా సంతోషించదగినటువంటి అంశములే ఎందుకంటే వారు హృదయ పరివర్తనము చెంది ఇతరులకు సంతోషించే విధంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే యోహాను గారు వారిని హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలి రమ్మంటున్నారో వెంటనే వారిలో ఉన్న పాపమును గ్రహించి మెస్సయ్యాను స్వీకరించుట కొరకై తగినటువంటి క్రియలు చేయుటకు సిద్ధముగా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీకి, మీలో పాపము చేయని వ్యక్తి ఈమె మీద మొదటి రాయిని వేయమన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ వారిలో ఉన్న పాపమును గ్రహించి వెంటనే తిరిగి వెళ్ళారు. ఈ యొక్క సువిషేశ భాగములో వున్న వ్యక్తులు కూడా వారి పాపపు జీవితమును సరి చేసుకొనుటకు సిద్ధపడుతున్నారు దాని వలన ఈ సమాజము కూడా సంతోషిస్తూ ఉన్నది. ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే నేను ఇతరులకు సంతోషిస్తున్నానా?. నా వలన నలుగురు సంతోషపడుతున్నారా?. నా రక్షకుని రాకడ కొరకు ఎదురుచూస్తున్నానా? నేను సంతోషంగా జీవిస్తున్నా? అని పరిశీలన చేసుకొని జీవించాలి.
మనం ఆనందంగా ఉండుట కొరకై ప్రభువు వస్తున్నారు కాబట్టి ప్రతినిత్యం కూడా ఆనందంగా జీవించడానికి పాపము లేకుండా పుణ్య క్రియలు చేస్తూ జీవిద్దాం.
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి