30, ఏప్రిల్ 2025, బుధవారం

దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?

 దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు? 

యోహాను 3: 16-21 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు  ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై  అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక  కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును" అని సమాధానమిచ్చెను. 

ఈ వాక్యాలు దేవుడు ఎంతగా ఈ లోకమును ప్రేమించినది, అదేవిధంగా మానవుడు నాశనము చెందకుండా తన కుమారుణ్ణి పంపిన విషయం, ఆ కుమారుణ్ణి విస్వసించుట ద్వారా వారు నిత్యజీవము పొందుతారని, ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చారని దుష్క్రియలు చేసేవారు, ఆ వెలుగు దగ్గరకు వచ్చుటకు ఇష్టపడక అవి బయట పడతాయి చీకటిలోనే ఉన్నాడు. సత్యవర్తనుడు వెలుగును సమీపిస్తున్నాడు. జీవితాన్ని మార్చుకుంటున్నాడు అని తెలియజేస్తున్నాయి.  

దైవ ప్రేమ 

దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని  రక్షించడానికి తన కుమారుడిని ఈలోకానికి పంపాడు. కుమారుడు తన తండ్రి సంకల్పమైన లోక రక్షణము నెరవేర్చడానికి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు.  దేవుని కుమారుడు తన తండ్రి చిత్తాన్ని పూర్తి చేసి అంత సమాప్తం అయినది అని చెప్పాడు. ఆయనను కలుసుకున్న, వినిన , చూసిన ప్రతివాడు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను సిమియోను  ప్రవక్త వలే చూసారు. ఆయనను విశ్వసించిన వారు రక్షణ పొందుతున్నారు. 

దేవుడు లోకాన్ని ఖండించడానికి  తన కుమారున్ని పంపలేదు 

దేవుడ సృష్టి ఆరంభం నుండి మానవున్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నడు విడనాడలేదు. దేవుడు ఎప్పుడు పాపి మరణించాలని, లేక నాశనం కావాలని కోరుకొనలేదు. ఆయన మానవుణ్ణి సన్మార్గంలో పెట్టదలచి క్రమ పద్దతిలో పెట్టగ దేవుడు శిక్షించినట్లుగా అనుకున్నాడు. దేవున్ని ఒక కఠిన యజమానిగా చూసాడు కాని దేవుని ప్రేమను,  తండ్రి వాత్స్యాల్యాన్ని అర్ధం చేసుకోలేదు.  అనేక సార్లు దేవుడు తన రాయబారులను పంపాడు. కాని మానవుడు దేవుడు పంపిన వారిని లెక్క చేయలేదు. తరువాత తన కుమారుణ్ణి పంపుతున్నారు. ఈ లోకాన్ని నాశనం చేయక తన కుమారుని జీవితం ద్వారా, మనకు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు, తన మరణం ద్వారా మనకు పాపములను క్షమిస్తున్నారు. తన మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం పొందే అనుగ్రహం ఇస్తున్నాడు. 

విశ్వాసం యొక్క ప్రాముఖ్యత 

రక్షణ యేసు ప్రభువును విశ్వసించడం వలన వస్తుంది. యోహాను ఈ విషయాన్ని తన సువిశేషంలో చాలా సార్లు లిఖించడం జరిగింది. ప్రతి అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ, సువిశేష  ఆరంభంలో, మధ్యలో మరియు చివరిలో యేసు ప్రభువును విశ్వసించడం వలన నిత్య జీవం వస్తుంది అని ప్రకటిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ప్రభువు కొన్ని సందర్భాలలో ఇది నీవు విశ్వసిస్తున్నావా? అని అడుగుతున్నారు. వారు స్వస్తత పొందిన తరువాత మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచింది అని అంటున్నారు.  ప్రభువుని యందు మనకు విశ్వాసము ఉండటం వలన నిత్యజీవమే కాక ఈ లోకములో అనేక విషయాల్లో విజయాన్ని పొందుతాము.  

వెలుగు- చీకటి  

యేసు ప్రభువు నేనే లోకమునకు వెలుగును అని ప్రకటించాడు. యోహాను సువిశేషంలో మొదటి అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వెలుగాయను అని వింటాము. ప్రభువు దగ్గరకు నీకొదేము చీకటి వేళలో వస్తున్నాడు. అతను చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు.  కాని చీకట్లో ఉన్నవారు వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడటలేదు. వెలుగు దగ్గరకు వస్తే వారి ఎటువంటి వారు అనేది, లేక వారి జీవితం అందరికి తెలిసిపోతుంది అని భయపడేవారు. కాని ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు చేసిన తప్పులు ఏమి అందరికి తెలుస్తాయి అని భయపడనవసరం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చే  సమయంలో ఆ వెలుగులో మనలో వున్న చేడు, మలినం లేక తొలగిపోతుంది. ప్రభువు నీకొదేము వచ్చినపుడు తాను చీకటిలో వచ్చిన, ప్రభువు దగ్గర ఉండటం వలన తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాని ఎవరు అయితే చెడు పనులు చేస్తున్నారో, ప్రభువు దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదో వారు చెడునే ప్రేమిస్తున్నారు. వారు మారటానికి ఇష్టపడటం లేదు. వారి పనులు ఎవరికీ తెలియకూడదు అని  వారు వెలుగును సమీపించడం లేదు. ప్రభువు దగ్గరకు రాకపోతే, మనలో ఉన్న ఆ చెడు ఎప్పటికి వెళ్లిపోదు. దాని ద్వారా ప్రభువు మనకు ఇచ్చే ఆ రక్షణ పొందలేము. సత్య వర్తనము కలిగి జీవించడము అనేది చాలా ముఖ్యము. అప్పుడు మనం చేసే పనులు దేవునికి ఇష్టమవుతాయి. 

ప్రార్ధన: ప్రభువా ! మీరు లోకమును ఎంతగానో ప్రేమించి మీ ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకమునకు దానిని రక్షించుటకు పంపారు. ఆయనను విశ్వసించిన వారంతా నిత్యజీవం పొందుటకు మీరు అటుల చేశారు. ప్రభువా మిమ్ములను మీ కుమారుణ్ణి మేము విశ్వసిస్తున్నాము. కొన్ని సార్లు వెలుగైన మీ కుమారుని దగ్గరకు రావడానికి మేము భయబడ్డాము. ఆ వెలుగులో నా పాపము ఎక్కడ బయటపడుతుందో అని సందేహించాము. కాని ప్రభువా! ఆ వెలుగు మా లోని పాపమును దహించివేసి మమ్ములను పరిశుద్దులనుగా చేస్తుంది అని మరిచిపోయాము. అటువంటి సందర్భంలో మమ్ములను క్షమించండి. మేము మీ  దగ్గరకు వచ్చి ఎల్లప్పుడు వద్ద ఉంటూ, మిమ్ము విశ్వసించి మీరు ఏర్పాటు చేసిన రక్షణ పొందేలా మమ్ము దీవించండి .ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...