4, మే 2025, ఆదివారం

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29 

మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్లలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటకు చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబెరియానుండి కొన్ని పడవలువచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను వేరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు, దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును అన్వేషించడం మరియు ఎటువంటి పరిస్థితులలో మనం యేసు ప్రభువును అన్వేషిస్తున్నాము , ఎప్పుడు ఆయనను అన్వేశించాలి , శాశ్వతమైనది ఏమిటి అని తెలుసుకొని దాని కోసమై అన్వేషించాలి అని సువిశేషం వివరిస్తుంది. 

దేవుని కోసం వెదకుట 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును వెదకుచు అనేక మంది వస్తున్నారు. వారు ఎందుకు యేసు ప్రభువును అన్వేషిస్తున్నారు ఆంటే అంతకు ముందు రోజు ప్రభువు వారి ఆకలిని తీర్చారు. కేవలం ఐదు రొట్టెలతో 5000 మందికి ఆహారమును ఇచ్చాడు. ఇతనిని అనుసరిస్తే మాకు కావలసిన ఆహరం దొరుకుతుంది అని వారు ఆయన కోసం వెతుకుచున్నారు. అంతకు ముందు వారిలో కొంతమంది వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులను చేసాడు. ఇతనిని అనుసరిస్తే మాకు ఎటువంటి అనారోగ్యం ఉండదు అని ఆయన కోసం వెదకుచుండవచ్చు. యేసు ప్రభువు చెప్పే మాటలు ఎలా సాధ్యం అని తెలుసుకొనుటకు, ఆయనను అడుగుటకు వారిలో ఉన్న కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు ప్రభువును వెదుకుచుండవచ్చు.  ప్రభువు దేవాలయములో ఉన్న వ్యాపారులను పంపిచివేస్తున్నారు  కనుక అనేక మంది దేవుని ఆలయంలోవెళ్ళుటకు ఆవకాశం ఇచ్చాడు కనుక ఇంకా వారి అవసరాలను చెప్పుకొనుటకు ప్రభువును వెదకుచు ఉండవచ్చు. ఇతను రాజు అయితే మాకు అన్ని సమకూరుతాయి అని ప్రభువును వెదకుచు ఉండవచ్చు.  అందుకే ప్రభువు వారితో అంటున్నారు  "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు" అని అంటే మనం ప్రభువును వెదకవలసినది, అద్భుతాలు చూడాలనో, ఆహారం కోసమో కాదు. ఆయన అంతకంటే చాలా గొప్పవి ఇచ్చేటువంటి ప్రభువు. ప్రభువు తానె జీవ జలము అనే చెబుతున్నాడు. నేను ఇచ్చే జలమును త్రాగితే మరల దప్పిక కలుగదు అని చెబుతున్నాడు. నేను జీవాహారము అని చెబుతున్నాడు. నన్ను భుజించువాడు ఎన్నటిని మరణింపడు అని చెబుతున్నాడు. ప్రభువు మనకు శాశ్వతమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, వాటిని ఎలా పొందాలో అన్వేషించమంటున్నాడు, వాని కోసము పనిచేయమంటున్నాడు. దేవున్ని వెదకడం అంటే నిత్య జీవమును వెదకటం. అందుకే ప్రభువు చెబుతున్నాడు నేనే జీవమును అని. 

శాశ్వతమైనది- అశాశ్వతమైనది

ఇక్కడ యేసు ప్రభువు తనకోసం వచ్చిన వారితో "అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు." అని చెబుతున్నాడు.  యేసు ప్రభువు తన అనుచరులకు ఈలోక విషయములు అశాశ్వతమైనవి అని, శారీరక విషయాలు, అవసరాలు, సంపదలు  అశాశ్వతమైనవి అని చెబుతున్నాడు. అందుకే ఈలోక సంపదలు కాక పరలోక సంపదలు కూడపెట్టుకోమని చెబుతారు. "ఈలోక సంపదలు కూడపెట్టుకొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తినివేయును." "నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు." ఈనాటి సువిశేషంలో మాత్రం ప్రభువు మనలను శాశ్వత భోజనముకై శ్రమించమని చెబుతున్నారు. నిజానికి చాలా మంది పేరు ప్రఖ్యాతలు కోసం శ్రమిస్తుంటారు. అవికూడా శాశ్వతం కాదు. అప్పుడు ఏమిటి శాశ్వతమైనవి ఏమిటి అంటే  పరలోక రాజ్యము, నిత్య జీవము ఇవి మనకు శాశ్వతమైనవి. 

శాశ్వతమైనవి అయితే అవి మనకు ఎవరు ఇస్తారు 

యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారితో ఆయన "మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును." అని చెబుతున్నాడు. ప్రభువు మాత్రమే దానిని ప్రసాదించగలరు. ఎందుకంటే ఆయనకు మాత్రమే అది ప్రసాదించే అధికారం ఉన్నది. శాశ్వతమైనవి దైవికమైనవని వారికి అర్ధం అయ్యింది. కనుక వారు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయాలని అడుగుతున్నారు. అందుకు యేసు ప్రభువు దేవుడు పంపిన వానిని విశ్వసించండి అదే దేవుడు మీ నుండి కోరుకుంటున్నారు అని చెబుతున్నాడు. నిత్య జీవం కావాలంటే లేక శాశ్వతమైన ఆహారం కావాలంటే చేయవలసినది యేసు ప్రభువును విశ్వసించడం. యేసు ప్రభువును విశ్వసించడం అంటే ఆయన చెప్పినట్లు మారుమనస్సు పొంది,  ఆయన ఆజ్ఞలను పాటించడం. అప్పుడు మనం ఆ నిత్య జీవానికి అర్హులము అవుతాము. 

ప్రార్ధన: ప్రభువా!  మా జీవితాలలో అనేక విషయాలలో మీ సహకారం కోసం మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. అనేక సార్లు మేము మిమ్ములను మా భౌతిక అవసరములనే కోరుకుంటున్నాము. మేము ఏమి కోరుకోవాలో నేర్పించండి. మీరు చెప్పినట్లుగా శాశ్వతమైన వాటిని వెదకుచు, వాని కొరకు పాటుపడేలా మమ్ము మార్చండి. నిత్య జీవితం మీద ఆశ కలిగి, మిమ్ములను విశ్వసించి, మీ ఆజ్ఞలకు అనుకూలంగా జీవించేలా మమ్ము మార్చండి. ఆమెన్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...