యోహాను 6: 60-69
ఆయన శిష్యులలో అనేకులు ఇవివినినప్పుడు "ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు?" అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు "ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయిన మనుష్యకుమారుడు తాను పూర్వము ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చునది ఆత్మయే. శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాని, మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు" అని పలికెను. ఆ విశ్వసింపనివారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటినుండియు యేసుకు తెలియును. కనుకనే "తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నాయొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని" అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అపుడు యేసు తన పన్నిద్దరు శిష్యులతో "మీరును వెళ్ళిపోయెదరా?" అని అడుగగా, సీమోను పేతురు, "ప్రభూ! మేము ఎవరియొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి" అనెను.
యోహాను సువిశేషంలో ఈభాగం యేసు ప్రభువు జీవ వాక్కు అని వెల్లడిచేస్తుంది. ఆయన మాటలు కొందరికి కఠినముగా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నది. ప్రభువును కఠినమైన మాటలు మనకు జీవము ఇచ్చేవి అని తెలుస్తుంది. యేసు ప్రభువు మాటలు నిత్య జీవము ఇచ్చేవి అని, ఆయన దేవుని నుండి వచ్చిన పవిత్రుడు అని తెలియపరుస్తుంది.
యేసు ప్రభువును శరీరమును భుజించుట ఆయన రక్తమును పానము చేయుట
యేసు ప్రభువు తన శరీరమును భుజించాలి, తన రక్తమును పానము చేయాలి అని చెప్పినప్పుడు అనేక మంది శిష్యులు ఆ మాటలు కఠినముగా ఉన్నవి అని, ఆయనను అనుసరించడం సాధ్యం కాదు అని వదలిపెట్టి వెళ్లిపోతున్నారు. ఈ మాటలను అర్ధం చేసుకునుటకు వారికి ప్రత్యేక దైవ జ్ఞానము కావలి. యేసు ప్రభువుతో సాన్నిహిత్యము కలిగినవారు ఆ మాటలు అర్ధం చేసుకోగలుగుతారు. తన శరీరమును భుజించటం అంటే ప్రభువు జీవంలో పాలు పంచుకోవడం. రక్తంలో ప్రాణం ఉంటుంది అని యూదులు నమ్మేవారు. యేసు ప్రభువు మీరు నా రక్తమును పానము చేయాలన్నప్పుడు దాని అర్ధం ప్రభువు జీవము మనలో ఉంటుంది అని అంటున్నారు. అందుకే ప్రభువు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన వారు నాయందును నేను వాని యందును ఉంటాము అని ప్రభువు చెప్పారు. ప్రభువు శరీరము మరియు రక్తము మనలను తనతో ఉండేలా చేస్తాయి. మనము ఎల్లప్పుడూ జీవించేలా చేస్తాయి.
ఎందుకు కొంతమంది ఈ మాటలు కఠినముగా ఉన్నవి అని ప్రభువును విడిచి పెడుతున్నారు? యేసు ప్రభువు మాటలను వారు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యిస్రాయేలు ప్రజలు రక్తమును భోజన పదార్ధముగాలేక పానీయముగా తీసుకోరు. లేవియఖాండం 17వ అధ్యాయంలో రక్తములో ప్రాణము ఉంటుంది కనుక అది నిషేధించబడింది. ఇక్కడ ప్రభువు నా రక్తమును పానము చేయాలి అని అంటున్నప్పుడు వారు అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువు చెప్పేది ఆధ్యాత్మికమైన విషయం. దివ్యసత్ప్రసాదము గురించి ప్రభువు చెబుతున్నారు. వారు పొందే శ్రమలు గురించి ప్రభువు చెబుతున్నారు.
తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని అని అంటున్నాడు. ప్రభువు దగ్గరకు రావాలంటే ఆ వ్యక్తికి పశ్చాత్తాపం ఉండాలి, మనస్సు మార్చుకోవాలనే కోరిక ఉండాలి. దానికి ప్రేరణ దేవుడే మనలో పుట్టిస్తాడు. అందుకే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవరు నావద్దకు రాలేరు అని చెబుతున్నారు. మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని ప్రభువు చెబుతున్నారు. అనేక గొప్ప కార్యములను ప్రజలు చూసారు, ఆయనతో పాటు వారు తిరిగారు. ఆయన ఇచ్చిన ఆహారం వారు తిన్నారు. అయినప్పటికీ కొంతమంది యేసు ప్రభువు మాటలను విశ్వసించుటలేదు. విశ్వాసం చాల ముఖ్యం. విశ్వాసం వలన మాత్రమే మనం ప్రభువుతో ఉండగలం, ప్రభువు వద్ద ఉండగలం మరియు ఆయన చెప్పే నిత్యజీవమునకు అర్హులం కాగలం.
యేసు ప్రభువు మీరును వెళ్లిపోయెదరా? అని శిష్యులను అడుగుతున్నారు. అందుకు పేతురు మేము ఎవరి యొద్దకు వెళ్ళెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు అని చెబుతున్నాడు. పేతురు తన జీవితంలో యేసు ప్రభువులాంటి వ్యక్తిని చూడలేదు. ఒక యూదయ వ్యక్తిగా తన మత గురువులు, పెద్దలు అతనికి తెలిసిఉండవచ్చు. కాని వారు ఎవరు నిత్య జీవం ఇచ్చేవారు కారు. అందుకే ప్రభువుతో పేతురు మేము ఎవరి వద్దకు వెళ్ళెదము, అని అంటున్నాడు. ఎవరి వద్దకు వెళ్లిన యేసు ప్రభువు ఇచ్చే వాగ్దనం వారు ఇవ్వలేరు. ఇస్తాము అని కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రభువు మాత్రమే జీవం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు జీవమై ఉండెను అని పవిత్ర గ్రంధం చెబుతుంది. ఆ జీవము, ఆ వాక్కు యేసు ప్రభువే అని తెలుసుకున్న పేతురు ఎక్కడకి వెళ్లక ప్రభువుతో మేము విశ్వసించాము అని చెబుతున్నాడు.
ప్రార్ధన: ప్రభువా! మీరు జీవవాక్కు. మీ మాటలు మాకు నిత్యజీవమును ఇస్తాయి. మీ మాటలు మా జీవితమునకు మార్గముగా ఉన్నాయి. మీ మాటలు మాకు కఠినముగా ఉన్నప్పటికీ అవి జీవమును ఇచ్చేవి అని తెలుసుకునేలా దీవించండి. ప్రభువా! మీరే మాకు ఆధారం, మీరే మాకు మార్గం. మేము ఎక్కడికి వెళ్ళగలం. మీ వలే ఎవరు మా భౌతిక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుతూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు నిత్యజీవము ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నారు. అటువంటి మిమ్ములను కాదని మేము ఎక్కడకు వెళ్ళగలం. మీమీద పూర్తి విశ్వాసం ఉంచి , మారు మనసు పొంది మీమీద ఆధారపడి జీవించే అనుగ్రహం దయచేయండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి