యోహాను 10: 27-30
నా గొఱ్ఱెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికిని నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతినుండి అపహరింపలేడు. వానిని నా కిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును, నా తండ్రియు ఏకమైయున్నాము" అని చెప్పెను.
నా గొర్రెలు నా స్వరము వినును:
యేసు ప్రభువు శిష్యులు తన స్వరం వినును అంటున్నారు. వినటం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన చెప్పినట్లు చేయడం. వినటం వలన విశ్వాసం వస్తుంది. అబ్రాహాము దేవుని మాటలను విన్నాడు. దేవుడు చెప్పినట్లు చేసాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సమూవేలు ప్రభువును మాటలను విన్నాడు వాటిని పాటించాడు గొప్ప యాజకునిగా, న్యాయాధిపతిగా ఎదిగాడు. మోషే దేవుని మాటను విన్నాడు గొప్ప నాయకునిగా ఎదిగాడు. యేసు ప్రభువు శిష్యులు తమ గురువు స్వరమును వినిన ఆయన మాటలను పాటించిన వారు కూడా గొప్ప వారు అవ్వుతారు.
నేను వానిని ఎరుగుదును.
నా గొర్రెలను నేను ఎరుగుదును: ఈ మాటలు ప్రభువుకు ప్రతి శిష్యుడు, అనుచరుడు వ్యక్తిగతంగా తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రభువుకు తన అనుచరుల సంతోషాలు, కష్టాలు నష్టాలు, బాధలు అన్ని తెలుసు. వారు ఎంతటి బలవంతులు, బలహీనులు అనే విషయంకూడా ప్రభువుకు తెలుసు. గొఱ్ఱెలు తమ కాపరిని అనుసరిస్తాయి. తమ కాపరి స్వరము వాటికి తెలుస్తుంది. తమ కాపరి ఎటువంటి అపాయకారి పరిస్థితులలో కూడా తమను విడువడు అని వాటికి అనుభవపూర్వకంగా తెలుసు. వాటిని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. కాపరికి గొర్రెలకు ఉన్న సంబంధములో గొర్రెలను కాపాడుటకు, వన్య మృగములనుండి రక్షించుటకు కాపరి తన ప్రాణమును కూడా పణంగా పెడుతాడు. ఇది ప్రభువుకు తన అనుచరులకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం. ప్రభువు తన అనుచరులను ఎప్పుడు వదలి పెట్టలేదు. ఎప్పుడు వారితోనే ఉన్నాడు. అందుకే ప్రభువు నన్ను ప్రేమించువాడు నామాట పాటించును వాని వద్దకు నేను తండ్రి వచ్చి వానితో నివసింతుము అని చెప్పాడు.
నా గొఱ్ఱెలు నన్ను వెంబడించును
యేసు ప్రభువు తన గొర్రెలు తనను వెంబడించును అని ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఈ గొఱ్ఱెలు సాధారణమైనటువంటివి కావు. ఎందుకంటే వాటికి తమ కాపరి ఎవరో తెలుసు. ఎవరిని వెంబడించాలో తెలుసు. ప్రక్కతోవను పట్టని గొర్రెలు ఇవి. ఎందుకు ఈ గొఱ్ఱెలు ప్రత్యేకంగా ఉంటాయి అంటే అవి తమ కాపరిని ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాయి. తనకు దగ్గరగా ఉన్నాయి. తమ కాపరితో ఉన్న ఆ సాన్నిహిత్యం వారిని ఎప్పుడు ఆ కాపరిని కోరుకునే విధంగా చేస్తాయి. ఇది యేసు ప్రభువుకు తన శిష్యులకు ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియజేస్తున్నది. ఒకసారి ప్రభువుని స్వరమును విని, ఆయనను వెంబడించిన వారి జీవితం సాధారణ వ్యక్తుల జీవితం వలే ఉండదు. వారు ప్రభువుని నిజమైన అనుచరులు కనుక ఆయన అనుచరులుగా, ఆయన జీవితం తెలిసిన వారిగా, ఈ అనుచరుల జీవితం కూడా ప్రభువుని జీవితం వలే ఉంటుంది. పరిపూర్ణంగా ప్రభువును వెంబడించేవారి జీవితం ద్వారా ప్రభువు ఇతరులకు సాక్షాత్కరము అవుతారు.
వారిని ఎవడును ఎప్పుడును అపహరింపడు
ప్రభువు అనుచరులను ఎవరు అపహరించలేరు. ఎందుకంటే తండ్రి ప్రభువునకు తన అనుచరులను ఇచ్చాడు. తండ్రి అందరికంటే గొప్పవాడు. ఎవరు తండ్రి నుండి వారిని అపహరింపలేరు. ప్రభువుతో వున్న వారిని సాతాను ఎంత ప్రయత్నించిన ఏమి చేయలేదు. వారు ప్రభువు మాటలను, ఆజ్ఞలను ఎప్పుడు అనుసరిస్తారు. ఎప్పుడు కూడా వారు ప్రభువు మాటను జవదాటరు కనుక వారికి అటువంటి అపాయము రాదు. ప్రభువు వారిని ఎప్పుడు పచ్చికబయళ్లలో మేపుతారు. నేను తండ్రి ఒకటై ఉన్నాము అని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు శిష్యులతో తన తండ్రితో తనకు ఉన్న సంబంధం గురించి చెబుతున్నారు. అటులనే తన శిష్యులు కూడా ఐక్యంగా ఉండాలని ప్రభువుకోరుతున్నారు.
ప్రార్ధన: ప్రభువా! మీరు ఈలోకంలో ఉండగా అనేక విధాలుగా మీ శిష్యులను కాపాడుతూ, మీ మాటలను ఆలకించి జీవించుట వలన వారికి వచ్చే అనుగ్రహాల గురించి చెబుతూనే ఉన్నారు. ప్రభువా! ఎల్లప్పుడు మీ స్వరమును ఆలకించి, మీరు నడిచినట్లు మీ మార్గమును అనుసరించి మా జీవితాన్ని మీ వలె మార్చుకునేల చేయండి. ప్రభువా! మీతో ఎల్లప్పుడు సాన్నిహిత్యంగా ఉండి, మీరు ఇచ్చే నిత్య జీవం పొందేలా చేయండి. ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి