14, మే 2025, బుధవారం

యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం

  యోహాను 13: 16-20

దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాటాడుట లేదు. కాని 'నాతో భుజించువారు నాకు విరుద్ధముగా లేచును. అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అటుల జరిగినపుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే  మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవానిని  స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

సువిశేషంలోని ఈ భాగము యేసు ప్రభువునకు మరియు శిష్యులకు ఉన్న బంధమును , తన శిష్యులను స్వీకరించువానికి సంబంధించి బోధిస్తున్నాయి. యేసు ప్రభువుతో ఉండి ఆయనకు వ్యతిరేకంగా యూదా చేయు పనిని తెలియజేస్తూ , తరువాత శిష్యులు దైర్యంగా ఉండుటకు , స్వార్ధం లేకుండ ఉండుటకు ముందుగానే వారిని హెచ్చరిస్తున్నారు. ఎవరు అయితే యేసు ప్రభువును స్వీకరించారో వారు తండ్రిని స్వీకరించారని, యేసు ప్రభువు శిష్యులను స్వీకరించువారు యేసు ప్రభువును స్వీకరిస్తున్నారని ప్రకటిస్తున్నారు. ఇది యేసు ప్రభువు మరియు శిష్యుల అన్యోన్యతను మరియు ప్రభువు తన శిష్యుల ద్వారా ఇతరులకు తెలియపరచబడాలని కోరుకుంటున్నాడు అని తెలియజేస్తుంది. 

శిష్యుల ప్రవర్తన ఎలా ఉండాలి  

యేసు ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు. యేసు ప్రభువును లోకం ఎలా చూసినదో, శిష్యులను కూడా అలానే చూస్తుంది. అప్పుడు ఈ శిష్యులు రాబోయే కష్టాలు, నష్టాలు బాధలు చూసి చెదిరిపోకుండా ఉండాలి. ప్రభువు శ్రమలకు గురైనట్లే వీరుకూడా శ్రమలకు గురవుతారు. యేసు ప్రభువు ఎలా సేవ చేశారో, వీరు కూడా అలానే చేయాలి, ఆయన గురువు, బోధకుడు అయ్యివుండి కూడా వారి కాళ్ళు కడిగారు, వారి మీద పెత్తనం చేయలేదు. వారి అవసరంలో ఆదుకున్నాడు. క్రీస్తు విశ్వాసికి, శిష్యునకు గర్వం లేక అహంకారం ఉండకూడదు. ప్రభువు పట్ల  వినయం, ప్రజల పట్ల సేవభావం మాత్రమే వారికి ఉండాలి. 

ప్రభువు మాటను ఆచరించుట గొప్ప ధన్యత 

యేసు ప్రభువు తన శిష్యులను అన్నివిధాలుగా సిద్దపరిచాడు. ఏవిధంగా వారు ధన్యులు అవుతారో వారికి తెలియజేస్తున్నారు. కేవలం యేసు ప్రభువు వద్ద నుండి వారు చూచిన ఈ ప్రేమ గురించి, ఈ వినయం గురించి తెలుసుకోవడం వలన వారు గొప్ప వారు కారు, ఎప్పుడైతే ఆయన శిష్యులు యేసు ప్రభువు వలే ప్రేమ జీవితం జీవిస్తూ, ఇతరులకు సేవ చేస్తూ, అహం లేకుండ ఉంటారో అప్పుడు వారు గొప్పవారు అవుతారు. కేవలము యేసు ప్రభువు చేసిన లేక చెప్పిన మాటలను తెలుసుకోవడం వలన కాక  వాటిని పాటించడం ద్వారా మనం ధన్యులం అవుతాం. కనుక ఆయన వలె జీవించుట, మనం అలవాటు చేసుకోవాలి. అందుకే పవిత్ర గ్రంధంలో మంచి చెడులు తెలిసినవారు కాదు జ్ఞానులు, మంచి చెడులు తెలిసి మంచి మాత్రమే అనుసరించు వారిని జ్ఞానులు అంటారు. 

ఎప్పుడు శిష్యులు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తారు 

 "నాతో భుజించువారు నాకు విరుద్ధముగా లేచును" యేసు ప్రభువు ఈమాటలను తనను అప్పగించబోతున్న యూదా గురించి చెబుతున్నారు. తనను ఎవరు అప్పగించబోవుతున్నారో ప్రభువుకు ముందుగానే తెలుసు. యేసు ప్రభువు ఈ విషయమును ముందుగానే తన శిష్యులకు ఏమిజరుగబోతున్నదో తెలియజేస్తున్నాడు. తరువాత వారు ప్రభువు ముందుగానే ఈ విషయమును వారికి తెలియజేసి వారిని అన్నిటికి సిద్ధపడేలా జేస్తున్నాడు. యూదా గురించి ప్రభువు ముందుగానే తెలుసు అందుకే మీరు శుద్ధులై ఉన్నారు కాని అందరు కాదు అని చెప్పారు. యూదా యేసు ప్రభువుతోటి కలిసి జీవించాడు, కలిసి తిన్నాడు కాని, తన స్వార్ధానికి తనను నమ్మిన ప్రభువును అమ్ముకుంటున్నాడు. ప్రభువులో ఏ లోపం చూసి యూదా యేసు ప్రభువుకు వ్యతిరేఖంగా మారలేదు, కేవలం స్వార్ధం, అసూయ, స్వలాభం అనేక గుణాలను పెంపొందించుకొన్నాడు. ప్రభువు గురించి తెలిసి కూడా తన స్వార్ధముననే నిలబడ్డాడు. లేఖనము నెరవేరుటకై ఇవన్నీ జరగాలి అని ప్రభువు చెబుతున్నారు. అంటే ప్రభువు మనలను రక్షించుటకు అన్నిటికి సిద్దపడిఉన్నాడు.  ఇవన్నీ జరిగినప్పుడు వారు ప్రభువు వారికి ఇవ్వన్నీ చెప్పారు అని వారు తెలుసుకున్నారు. 

ప్రభువును స్వీకరించుట

యేసు ప్రభువున శిష్యులు గురువు, రాజు, ప్రవక్త,  క్రీస్తుగా స్వీకరించారు. యేసు ప్రభువును ఈవిధంగా స్వీకరించడం ద్వారా యేసు ప్రభువును గౌరవిస్తున్నారు. దేవునితో ఆయనకు ఉన్న సంబంధమును అంగీకరిస్తున్నారు. కేవలం అంగీకరించడమే కాక వారుకూడా ఆ బంధములో ఉండాలనే కోరికను వెల్లడిచేస్తున్నారు. తనను స్వీకరించువారు తన తండ్రిని స్వీకరిస్తున్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు తండ్రి తరపున, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. యేసు ప్రభువు తన శిష్యులను అన్ని విధాలుగా  సిద్ధపరచే సమయం కడరా భోజన సమయం. అందుకే ఇక్కడ వారితో చెబుతున్నాడు. మిమ్ములను స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు అని అంటున్నాడు. యేసు ప్రభువు శిష్యులు ఆయన  ప్రతినిధులుగా వున్నారు. వారి జీవితం, మాటలు, పనుల ద్వారా ప్రభువును వ్యక్తపరచాలి. శిష్యులు ప్రభువుతో సంభందం కలిగివున్నారు. దేవుని వాక్కును బోధించుట, దేవుని అనుభవించిన వారి కర్తవ్యం. అది ధన్యమైన జీవితం. వారిని గౌరవించడం అందరి విధి.  

ప్రార్ధన : ప్రభువా! మీ  శిష్యులను అన్ని విధాలుగా మీవలే గొప్ప జీవితం జీవిస్తూ, ఇతరుల రక్షణ కొరకు పాటుపడాలని కాక్షించారు. వారు మీరు వాక్కును బోధిస్తూ ఉన్నత జీవితం జీవించారు. మీ వలె కొన్నిసార్లు తిరస్కరించబడ్డారు. మా జీవితాలలో కూడా మిమ్ములను ఇతరులకు తెలియపరచాలని కోరుకుంటున్నాము. అందుకు మీలాంటి జీవితం జీవించాలని ఆశపడుతున్నాము. కాని కొన్ని సార్లు మాలో ఉన్న స్వార్ధం మమ్ములను మీకు దూరంగా చేస్తుంది. అటువంటి సమయాలలో మమ్ము క్షమించి, మేము మీ నిజమైన శిష్యులుగా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి.  మేము మీ వాక్కును బోధించేవారిని గౌరవించి, మిమ్ములను స్వీకరించేలా మమ్ములను మార్చండి. ఎప్పుడు మీతో ఉండాలనే మమ్ము దీవించండి. ఆమెన్  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం

  యోహాను 13: 16-20 దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుక...