14, మే 2025, బుధవారం

యేసులా జీవించుట -దేవుని స్నేహితుడవుట

యోహాను 15: 9-17 

నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. "నా ఆనందము మీయందు ఉండవలయుననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితులకొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించినవానిని పాటించినచో మీరు నా స్నేహితులైయుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను. ఏలయన, నేను నా తండ్రివలన వినినదంతయు మీకు విశదపరచితిని.మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్లి ఫలించుటకును, మీఫలము నిలిచియుండుటకును, మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమకలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. 

యోహాను సువిశేషంలోని ఈ భాగం యేసు ప్రభువు మరియు తండ్రి మధ్య  ప్రేమ, అయన మనలను ఎలా ప్రేమించారో అటువంటి ప్రేమ ఒకరిమీద ఒకరు కలిగి ఉండటం గురించి బోధిస్తుంది. ఆయన వలె ఎలా మనము కూడా ప్రేమించగలం అంటే కేవలం ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారానే, అపుడే   ఆయన ప్రేమలో నెలకొని ఉండటం  జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. 

యేసు ప్రభువు మరియు  తండ్రి మధ్య ప్రేమ  

నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. యేసు ప్రభువు నిత్యము తండ్రి ప్రేమను అనుభవిస్తూనేఉన్నాడు. అది ఎలా అంటే వారి ఇద్దరి యేసు ప్రభువు ఈలోకంలో జన్మించినప్పుడు దేవుని దూతలు తమ ఆనందమును వ్యక్తం చేశారు. యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకునేటప్పుడు ఇతను నా ప్రియమైన కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుని స్వరము వినిపించింది. యేసు ప్రభువు అలవాటు చొప్పున ఉదయమునే దేవాలయమునకు వెళ్లడం లేదా ఒంటరిగా ప్రార్ధనకు వెళ్లడం మనకు ఆయన తండ్రితో ఎంత సాన్నిహిత్యాన్ని కోరుకున్నాడు,  అనేది మనకు తెలుస్తుంది. యేసు ప్రభువు అద్భుతం చేసిన తరువాత తండ్రికు కృతజ్ఞత తెలియజేస్తుంటాడు. తండ్రి చిత్తమును తన ఆహారముగా మార్చుకొని, తండ్రి చిత్తమును నెరవేర్చడమే తన ధ్యేయం చేసుకున్నాడు. యేసు ప్రభువు శ్రమలు అనుభవించాలని తెలిసికూడా, వాటి ద్వారా తన తండ్రి కోరుకున్న మానవ రక్షణ జరుగుతుంది అని  వాటిని అనుభవించడానికి నిశ్చయించుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు తాను తండ్రి ఎప్పుడు ఏకమై ఉన్నాము అని చెప్పుచున్నాడు.

దేవుని ఆజ్ఞలు పాటించుట- నిత్యానందకారకం 

మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. యేసు ప్రభువు ఎలా తన తండ్రి ప్రేమలో ఉన్నాడో మనకు వివరంగా చెబుతున్నారు. ఇది కేవలం తండ్రి ఆజ్ఞలను పాటించడం వలన యేసు ప్రభువు తండ్రి ప్రేమలోనే నెలకొనియున్నాడు. యేసు ప్రభువు, నేను ఎందుకు తండ్రి సంకల్పం నెరవేర్చడానికి పూనుకోవాలి అని అనుకోలేదు. తండ్రి చిత్తమును నెరవేర్చడమే తన కర్తవ్యం అని దానిని నెరవేర్చడానికి ఏమి చేయడానికైన సిద్ధపడ్డాడు. మరణించడానికి సిద్ధపడ్డాడు. దానిద్వారా ఆయన తండ్రికి ఎప్పుడు దూరంగా లేడు. ఎల్లప్పుడు తండ్రితో కలిసియున్నాడు. తద్వారా నిత్యానందము పొందుతున్నాడు.  యేసు ప్రభువుని మాటలను మాటలను విని, ఆయన వలె, పాటించినట్లయితే  మనము కూడా నిత్యము ఆనందంగా ఉండవచ్చు. నేను నా ప్రభువుని చిత్తమును నెరవేర్చాను అనే ఆనందం ఎల్లపుడు మనతో ఉంటుంది. 

 యేసు ఆజ్ఞల అనుసరణ - ఆయన స్నేహితునిగా మార్పు

 యేసు ప్రభువు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ చాల ఉన్నతమైనది. నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని చెబుతున్నారు. అంతేకాదు తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడు లేడు అని చెబుతున్నాడు. మనలను తన స్నేహితులను చేస్తున్నాడు. యేసు ప్రభువు మన కోసం తన ప్రాణమును అర్పించాడు. మనము ప్రభువునకు ప్రియమైన వారమని తెలియజేస్తున్నాడు.  మనము కూడా ప్రభువు చెప్పినట్లు ఆయన ఆజ్ఞలనుపాటిస్తే మనము ఆయన స్నేహితులము అవుతాము అని చెబుతున్నాడు. పాత నిబంధనలో అబ్రాహామును కూడా దేవుని స్నేహితుడు అని ఆంటారు.  దేవుని ఆజ్ఞలు పాటించుట వలన ఆయన స్నేహితులం  అవుతాము.యేసు ప్రభువు మనం ఆయన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. 

ప్రార్ధన: ప్రభువా! మీరు తండ్రితో ఎప్పుడు సాన్నిహిత్యం కలిగివున్నారు. తండ్రి కూడా మిమ్ముల్ని ఎంతగానో ప్రేమించాడు. మీరు చేసిన అన్ని పనులు తండ్రి అనుమతి ఉంది. మీరు తండ్రి ప్రేమయందు ఉన్నట్లు, మేము మీ ఆజ్ఞలను అనుసరిస్తూ మీ ప్రేమను ఇతరులకు చూపిస్తూ మీ స్నేహితులుగా జీవించేలా చేయండి. ఆమెన్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

యేసులా జీవించుట -దేవుని స్నేహితుడవుట

యోహాను 15: 9-17  నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ...