12, మే 2025, సోమవారం

క్రీస్తు -నిత్యజీవ ప్రధాత మన కాపరి

 యోహాను 10:22-30 

యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టు  గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి. అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు  క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును  వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము  ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని  నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను. 

ఎందుకు యిస్రాయేలు కాపరులు విఫలం అయ్యారు? 

"యెరూషలేములో దేవాలయయెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను." దేవాలయ  ప్రతిష్టోత్సవము యిస్రాయేలు పండుగలలో చాలా ముఖ్యమైన పండుగ. అది వారు యేరుషలేము దేవాలయాన్ని మక్కబియుల కాలంలో  పునః ప్రతిష్ట చేసిన సమయాన్ని గుర్తు చేస్తూ పండుగ జరుపుకునే సమయం. ఈ సమయాలలో వారు యెహెజ్కేలు గ్రంధంలో యిస్రాయేలు ప్రజలకు దేవుడు తానే కాపరిగా ఉంటాను అనే మాటలను ధ్యానించేవారు, వారి కాపరులు ఎలా కాపరులగా విఫలం చెందారో ధ్యానించేవారు. ఈ సంధర్భంలో జరుగుతున్న సువిశేషం భాగం ఇది. ఎవరు నిజమైన కాపరి. ఎలా కాపరులు విఫలం చెందారు? అంటే  యిస్రాయేలు కాపరులు స్వార్ధంతోటి జీవించి వారి బాధ్యతను విస్మరించారు. 

 సంపూర్ణమైన విశ్వాసం 

"యూదులు ఆయన చుట్టు  గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి." ఇక్కడ కొంతమంది యేసు ప్రభువు దగ్గరకు వచ్చి నీవు క్రీస్తువా? అని అడుగుతున్నారు. ఎందుకు వారు ఆయనను అడుగుతున్నారు అంటే ఆయన వారికి అప్పటికె  కాపరి గురించి,  యిస్రాయేలు కాపరి గురించి చెప్పాడు. యేసు ప్రభువే  వారికి కాపరిగా కావాలని వుంది. ఆయన చేసిన పనులను బట్టి ఆయన వారి కాపరి అయితే వారికి దేవుని నుండి వచ్చే మేలుల గురించి వారికి ఒక అవగాహన ఉంది, కనుక వారు యేసు ప్రభువును నీవు క్రీస్తువా? అని అడుగుతున్నారు. కాని యేసు ప్రభువు అనేక సార్లు తన పనులు తాను క్రీస్తు అని చెబుతున్నాయి అని వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారు మరల ఆయనను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. యేసు ప్రభువు వారిని సంధిగ్ధావస్థలో ఉంచలేదు. పూర్తిగా యేసు ప్రభువుకు చెందిన వారిగా ఉండుటకు వారు నిశ్చయించుకోలేదు అందుకే వారు అలా మాటలాడుతున్నారు.  ప్రభువును విశ్వసించిన వారికి ఆయన మీద ఎటువంటి అపనమ్మకం లేదు. ఆయన పనులను మొత్తాన్ని వారు నమ్ముతారు. 

ప్రభువు అతీతమైన శక్తి గలవాడు 

"అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు  క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. " యేసు ప్రభువు మరల వారికి ఆయన ఎవరు అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. నేను మీకు ముందే చెప్పితిని అని అంటున్నారు. కాని వారు ఆయన మాటలను నమ్మని విషయాన్ని ఆయన వారికి చెబుతున్నారు. యేసు ప్రభువు ఇక్కడ తాను చేసే పనులు తన గురించి  సాక్ష్యం ఇస్తున్నవి అని చెబుతున్నారు. ఇది ఇక్కడ మాత్రమే కాదు యేసు ప్రభువు చేసిన ప్రతి పని కూడా ఆయన ఎవరు ? అని ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పని కూడా మానవ మాత్రుడు ఎవరు చేయలేనటువంటి పని. ఆయన ప్రతి కార్యం కూడా రక్షణ ఇచ్చే కార్యం. దాని ద్వారం ఆయన దేవుడు అని తెలుస్తుంది. ఇవి అన్ని చూసి కూడా ఆయనను మరలా అదే ప్రశ్న వారు అడుగుతున్నారు. వారు ఆయనను నమ్ముటకు సిద్ధంగా లేరు. వారు ఆయనను ఎందుకు నమ్ముట లేదు అంటే వారు ఆయనకు చెందిన వారు కాదు. 

"మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును  వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును." ఆయనకు చెందిన వారు అయితే ఆయన మాటలను విశ్వసించేవారు. ఆయనను వెంబడించేవారు. కాని ఆయనకు చెందిన వారిగా ఉండుటకు వారికి ఇష్టం లేదు. ఆయన అనుచరులుగా ఉండేవారికి, ఆయనను అనుసరించే వారికి ఆయన ఎవరు అని తెలుసు, ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి మాత్రమే సాధ్యం, మానవ మాత్రుడు ఎవరు కూడా ఆయన చేసే పనులని చేయలేరు. ఎందుకు కొంతమంది ఆయనను నమ్ముట లేదు? దీనికి కారణం ఏమిటి అంటే ఆయనను నమ్మని వారు వారి జీవితాలను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు, ఆయనకు పూర్తిగా చెందిన వారిగా ఉండుటకు ఇష్ట పడలేదు. ఎందుకంటే ఆయనకు చెందిన వారిగా ఉండాలి అంటే ఆయన మాటలకు అనుకులమూగ జీవించాలి. ఆయన చెప్పినట్లుగా జీవించుటకు వీరు సిద్ధముగా లేరు కనుక ఆయనను వారు నమ్మక మరలా ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాని యేసు ప్రభువుకు చెందిన వారు ఆయనను ఎప్పుడు వెంబడిస్తూనే వుంటారు. 

నిత్యజీవ ప్రదాత ప్రభువు 

"నేను వానికి నిత్యజీవము  ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు."  యేసు ప్రభువు తనను అనుసరించే వారికి నిత్యజీవము ఇస్తాను అని వాగ్ధానం చేస్తున్నాడు. కనుక వారు ఎల్లకాలము జీవిస్తారు. వారు నాశము చెందక జీవిస్తారు. ఎందుకు వారు నాశము చెందరు, అంటే ఆయనే జీవం, ఈ జీవంతో ఉన్న వారు ఎవరు కూడా నాశము చెందరు. ఈ జీవం మనలను ఎల్లపుడూ జీవించాడానికి మనతో పాటు ఉంటుంది. ఇది అందరికీ కాక ఆయనకు చెందిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది యేసు ప్రభువు మనకు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. మనం కూడా ఈ జీవం కలిగి ఉండటానికి సిద్దపడుతున్నామా! లేక ఈ లోక విషయాలలోనే సంతృప్తి పడుటకు ఇష్టపడుతున్నామా? ఈ ప్రశ్నలను ప్రతి నిత్యం మనం అడగవవలసిన అవసరము ఉన్నది. 

"వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని  నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను. ఇక్కడ మనం యేసు ప్రభువుని శిష్యులు లేక ఆయన అనుచరులను, ఆయనకు చెందిన వారిని ఎవరు ఆయన నుండి అపహరించలేరు అని అంటున్నారు దానికి కారణం ఏమిటి అంటే ఆయనను వారు అంతగా అనుభవించారు, ఆయనను వారు అంతగా అనుభవ పూర్వకముగా తెలుసుకున్నారు కనుక ఆయన నుండి ఎవరు వారిని వేరు చేయడానికి ప్రయత్నించిన అది కుదరదు, దైవ అనుభవం అంత గొప్పది. పునీత పౌలు మరియు అనేక మంది పునీతులు ఇలా జీవించిన వారే. వారికి క్రీస్తు తప్ప మిగిలినది మొత్తం వ్యర్ధమే.  అంతేకాదు యేసు ప్రభువు నుండి తీసుకొనుట అంటే తండ్రి నుండి తీసుకొనుట రెండు కూడా సాధ్యం కాదు. ఇక్కడ యేసు ప్రభువు తండ్రితో తనకు ఉన్న ఐక్యతను, వారు ఇద్దరు ఏకమై ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు.

ప్రార్ధన : ప్రభువా మీరు మా నిజమైన కాపరి అని మేము తెలుసుకుంటున్నాము. కొన్ని సార్లు మా స్వార్ధ బుద్ధితో ఎక్కడ మా జీవితములో మిమ్ములను అనుసరించినట్లయితే మమ్ములను మేము మార్చుకోవాలి ఏమో, అనే ఆలోచనలతో మీ కాపుదలలో ఉండకుండా మీరు ఎవరో తెలియదు అనే విధంగా మేము జీవిస్తున్నాము అటువంటి సమయాలలో మమ్ములను క్షమించండి. మేము మిమ్ములను మా కాపరిగా అంగీకరించి జీవించే విధంగా మమ్ములను దీవించండి. మేము మీ పనుల, ద్వారా, మీ మాటల ద్వారా మీరే రక్షకుడు అని తెలుసుకుంటున్నాము. మమ్ములను మీ అనుచరులుగా, మీ మందలోనివారినిగా చేయండి. మేము మీ నుండి ఎవరిచేత అపహరింపకుండా ఉండేలా కాపాడండి. దాని ద్వారా మేము ఎప్పటికీ నాశము చెందక మీరు చెప్పిన నిత్యం జీవం పొందేలా మరియు  మేము ఎప్పుడు మీ స్వరమును విని పాటించే విధంగా మమ్ము దీవించండి. ఆమెన్. 

Fr. Amruth 

11, మే 2025, ఆదివారం

రక్షకుడైన యేసు ప్రభువు- మంచి కాపరి

 యోహాను 10: 27-30

నా గొఱ్ఱెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికిని నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతినుండి అపహరింపలేడు. వానిని నా కిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును, నా తండ్రియు ఏకమైయున్నాము" అని చెప్పెను.

నా గొర్రెలు నా స్వరము వినును: 

యేసు ప్రభువు  శిష్యులు తన స్వరం  వినును అంటున్నారు. వినటం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన చెప్పినట్లు చేయడం. వినటం వలన విశ్వాసం వస్తుంది. అబ్రాహాము దేవుని మాటలను విన్నాడు. దేవుడు చెప్పినట్లు చేసాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సమూవేలు ప్రభువును మాటలను విన్నాడు వాటిని పాటించాడు గొప్ప యాజకునిగా, న్యాయాధిపతిగా ఎదిగాడు. మోషే దేవుని మాటను విన్నాడు గొప్ప నాయకునిగా ఎదిగాడు. యేసు ప్రభువు శిష్యులు తమ గురువు స్వరమును వినిన ఆయన మాటలను పాటించిన వారు కూడా గొప్ప వారు అవ్వుతారు. 

నేను వానిని ఎరుగుదును. 

నా గొర్రెలను నేను ఎరుగుదును: ఈ మాటలు ప్రభువుకు ప్రతి శిష్యుడు, అనుచరుడు వ్యక్తిగతంగా తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రభువుకు తన అనుచరుల సంతోషాలు, కష్టాలు నష్టాలు, బాధలు  అన్ని తెలుసు. వారు ఎంతటి  బలవంతులు, బలహీనులు అనే విషయంకూడా ప్రభువుకు తెలుసు. గొఱ్ఱెలు తమ కాపరిని అనుసరిస్తాయి. తమ కాపరి స్వరము వాటికి తెలుస్తుంది. తమ కాపరి ఎటువంటి అపాయకారి పరిస్థితులలో కూడా తమను విడువడు అని వాటికి అనుభవపూర్వకంగా తెలుసు. వాటిని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. కాపరికి గొర్రెలకు ఉన్న సంబంధములో గొర్రెలను కాపాడుటకు, వన్య మృగములనుండి రక్షించుటకు కాపరి తన ప్రాణమును కూడా పణంగా పెడుతాడు. ఇది ప్రభువుకు తన అనుచరులకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం. ప్రభువు తన అనుచరులను ఎప్పుడు వదలి పెట్టలేదు. ఎప్పుడు వారితోనే ఉన్నాడు. అందుకే ప్రభువు నన్ను ప్రేమించువాడు నామాట పాటించును వాని వద్దకు నేను తండ్రి వచ్చి వానితో నివసింతుము అని చెప్పాడు. 

నా గొఱ్ఱెలు  నన్ను వెంబడించును

యేసు ప్రభువు తన గొర్రెలు తనను వెంబడించును అని ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఈ గొఱ్ఱెలు సాధారణమైనటువంటివి కావు. ఎందుకంటే వాటికి తమ కాపరి ఎవరో తెలుసు. ఎవరిని వెంబడించాలో తెలుసు. ప్రక్కతోవను పట్టని గొర్రెలు ఇవి. ఎందుకు ఈ గొఱ్ఱెలు ప్రత్యేకంగా ఉంటాయి అంటే అవి తమ కాపరిని ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాయి. తనకు దగ్గరగా ఉన్నాయి. తమ కాపరితో ఉన్న ఆ సాన్నిహిత్యం వారిని ఎప్పుడు ఆ కాపరిని కోరుకునే విధంగా చేస్తాయి. ఇది యేసు ప్రభువుకు తన శిష్యులకు ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియజేస్తున్నది. ఒకసారి ప్రభువుని స్వరమును విని, ఆయనను వెంబడించిన వారి జీవితం సాధారణ వ్యక్తుల జీవితం వలే ఉండదు. వారు ప్రభువుని నిజమైన అనుచరులు కనుక ఆయన అనుచరులుగా, ఆయన జీవితం తెలిసిన వారిగా, ఈ అనుచరుల జీవితం కూడా ప్రభువుని జీవితం వలే ఉంటుంది. పరిపూర్ణంగా ప్రభువును వెంబడించేవారి జీవితం ద్వారా ప్రభువు ఇతరులకు సాక్షాత్కరము అవుతారు. 

నేను వాటికి నిత్యజీవము ప్రసాదింతును

ఎప్పుడైతే యేసుప్రభువు అనుచరులు ఆయన వలె జీవిస్తారో , ఆయనను తెలుసుకొని, ఆయన స్వరమును విని, ఆ మాటలకు కట్టుబడి జీవిస్తారో వారు ప్రభువు వలె మారిపోతుంటారు. అపుడు వారు ఎల్లప్పుడు ప్రభుతోనే ఉండుటకు అర్హతను సాధిస్తారు. ప్రభువు జీవము. ప్రభువుతో కలిసి ఎల్లప్పుడు ఉండటం అంటే మరణము లేకుండా ఉండటం. అటువంటి వారికి నిత్యజీవం ప్రభువు ఇస్తారు. ప్రభువు మాత్రమే అది ఇవ్వగలరు. ప్రభువు తన అనుచరులకు, శిష్యులకు ఆ అనుగ్రహమును ప్రసాదిస్తారు. 

వారిని ఎవడును ఎప్పుడును అపహరింపడు

ప్రభువు అనుచరులను ఎవరు అపహరించలేరు. ఎందుకంటే తండ్రి ప్రభువునకు తన అనుచరులను ఇచ్చాడు. తండ్రి అందరికంటే గొప్పవాడు. ఎవరు తండ్రి నుండి వారిని అపహరింపలేరు.  ప్రభువుతో వున్న వారిని సాతాను ఎంత ప్రయత్నించిన ఏమి చేయలేదు. వారు ప్రభువు మాటలను, ఆజ్ఞలను ఎప్పుడు అనుసరిస్తారు. ఎప్పుడు కూడా వారు ప్రభువు మాటను జవదాటరు కనుక వారికి అటువంటి అపాయము రాదు. ప్రభువు వారిని  ఎప్పుడు పచ్చికబయళ్లలో మేపుతారు.  నేను తండ్రి ఒకటై ఉన్నాము అని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు శిష్యులతో తన తండ్రితో తనకు ఉన్న సంబంధం గురించి చెబుతున్నారు. అటులనే తన శిష్యులు కూడా ఐక్యంగా ఉండాలని ప్రభువుకోరుతున్నారు.   

ప్రార్ధన: ప్రభువా! మీరు ఈలోకంలో ఉండగా అనేక విధాలుగా మీ శిష్యులను కాపాడుతూ, మీ మాటలను ఆలకించి జీవించుట వలన వారికి వచ్చే అనుగ్రహాల గురించి చెబుతూనే ఉన్నారు. ప్రభువా! ఎల్లప్పుడు మీ స్వరమును ఆలకించి,  మీరు నడిచినట్లు మీ మార్గమును అనుసరించి మా జీవితాన్ని మీ వలె మార్చుకునేల చేయండి. ప్రభువా! మీతో ఎల్లప్పుడు  సాన్నిహిత్యంగా  ఉండి,  మీరు ఇచ్చే నిత్య జీవం పొందేలా చేయండి. ఆమెన్. 

Fr. Amruth 

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...