3, ఫిబ్రవరి 2024, శనివారం

సామాన్య కాలం 5వ ఆదివారం


యోబు 7:1-4, 6-7
1కొరింతి 9:16-19
మార్కు 1: 29-39
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మానవ జీవితంలో కష్టాలు, బాధలు ఎదురైన సమయంలో జీవితంలో ఆశలు కోల్పోకుండా ధైర్యంతో ముందుకు సాగాలి అదేవిధంగా దేవునియందు నమ్మకముంచాలి అని తెలుపుచున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సర్వసాధారణం కావున మనకే ఎందుకు కష్టాలు వచ్చాయి అనే ఆలోచనలతో జీవించకుండా ఏసుప్రభువు వలె కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. 
చాలా సందర్భాల్లో మనందరం ప్రతిసారి మనము అనుభవించిన కష్ట,బాధ,శ్రమల గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ వాటన్నిటికన్నా ప్రతి కష్టము తరువాత దేవుని ఆశీర్వాదం ఉంటుంది అని గ్రహించాలి.
ఈనాటి మొదటి పఠణము యోబు గ్రంథము నుండి చదవబడినది. యోబు గ్రంథం ఆనాటి కొంతమంది యొక్క ఆలోచనలను సరి చేసే విధంగా వ్రాయబడినది. అప్పటి కొందరి ఆలోచన ఏమిటి అంటే దేవుడు మంచివారిని దీవిస్తారని, పాపులను క్షమిస్తారని అభిప్రాయం. ఆ అభిప్రాయమున ఖండిస్తూ యోబు గ్రంథములో దేవుడు అందరూ ఎడల ఒకే విధముగా మెలుగుతారు అని తెలుపుచున్నారు. వాస్తవానికి మంచివారే ఎక్కువగా కష్టాలు అనుభవిస్తారు అని ప్రభువు యోబు గ్రంథం ద్వారా తెలుపుతున్నారు. 
యోబు నీతిమంతుడుగా జీవిస్తూ, ఆస్తి ఐశ్వర్యములను కలిగి ఉన్న సమయంలో సైతాను దేవునితో సంభాషించినప్పుడు యోబు మిమ్మల్ని (యావే దేవుని) ఆరాధించేది కేవలం మీరిచ్చిన సంపదలవలనే అని ప్రభువుతో తెలిపినప్పుడు ప్రభువుక సంపదలు ఉన్నా లేకపోయినా నా ఎడల యోబు విశ్వాసపాత్రుడుగా ఉంటారు అని తెలిపినప్పుడు సైతాను యోబును పరీక్షించుటకు సిద్ధమైంది దానికి ప్రభువు కూడా సమ్మతించారు. 
ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా పరీక్షించబడాలి అప్పుడే నిజమైన విశ్వాసము అనేది బయటకు వస్తుంది.1 పేతురు 1:7
ఈనాటి మొదటి పఠణం ద్వారా మనము కొన్ని అంశాలు నేర్చుకోవాలి
1. మంచివారికి కష్టాలు వస్తాయి. చాలా సందర్భాలలో మన యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి చెడ్డవారికి కష్టాలు మంచివారికి ఆశీర్వాదాలు దొరుకుతాయని అందరి అభిప్రాయం కానీ మనం సమాజంలో చూసేది ఏమిటంటే మంచివారు కష్టాలను అనుభవిస్తారు, చెడువారి సంతోషంగా ఉంటాయి. మనము పవిత్ర గ్రంథములో చూసుకున్నట్లయితే ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండి జీవించారో వారే ఎక్కువ కష్టాలు అనుభవించారు. పవిత్ర గ్రంధములో అబ్రహాము,
ఏసేపు, ఇర్మియా ప్రవక్త, మరియమ్మ- యేసేపు, పౌలు గారు  అదేవిధంగా అపోస్తులు, ఇంకా అనేకులు కష్టాలు అనుభవించారు వీరందరూ దేవుడికి దగ్గరగా ఉన్నప్పటికీ, మంచి జీవితం జీవించినప్పటికిని కష్టాలు అనుభవించారు. వీటి యొక్క అర్థం ఏమిటి అంటే మంచి వారికి కష్టాలు వస్తునే ఉంటాయి అది ఎందుకంటే వారు ఇంకా వారి విశ్వాస జీవితంలో దేవునికి దగ్గర అయి ఉండాలి అని మరియు వారి విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండుటకై. మనము కష్టాలు అనుభవిస్తున్నామంటే మనల్ని దేవుడు బాగా గుర్తుపెట్టుకుంటున్నారని అర్థం. ఏ వ్యక్తిని కూడా తన యొక్క శక్తిని మించి సైతాను శోధింపడు.
1కొరింతి 10:13
2, యోబు తన కష్టములలో ఆయన స్థిరముగా, ధైర్యంగా ఉన్నారు. తన జీవితంలో అన్నీ ఉన్నవి ఆస్తిపాస్తులు, స్నేహితులు, కుటుంబము, పిల్లలు అందరు కూడా ఉన్నారు కానీ సైతాను శోధన వలన ఆయన అన్నీ కోల్పోయాడు చివరికి తన యొక్క జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేనటువంటి ఒక పరిస్థితి ఎదురయింది ఆయన శరీరమంతా వ్రణములతో నిండి ఉన్నది. ఆయన శారీరకంగా మానసికంగా కృంగిపోయాడు. పనివాడు ఏ విధముగానయితే బ్రతుకుట కోసం కష్టపడి పనిచేస్తుంటాడో తాను కూడా బ్రతుకుట కొరకు శ్రమలు అనుభవిస్తున్నాను అని తెలుపుతున్నారు.  అన్ని కష్టాలనుభవించినప్పటికీ  కూడా తన జీవితాన్ని తాను నాశనం చేసుకోవాలని కోరుకోలేదు ఆయన అన్ని పరిస్థితులను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నాడు. యోబు యొక్క స్థిరత్వం మనందరం కూడా కలిగి ఉండాలి ఆయనకన్నా మనకి ఎక్కువ కష్టాలు ఏమి వచ్చి ఉండవు కాబట్టి అన్నిటినీ ధైర్యముగా ఎదుర్కోవాలి. యోబు నిరాశలో దేవుని యొక్క సమాధానము కొరకు, ఆశీర్వాదం కొరకు ఎదురుచూస్తూ ఆయన్ని నమ్ముకుని ఉన్నాడు.

3. యోబు తన కష్ట జీవితంలో దేవుడి వైపు మరలుతున్నాడు. ఎవరైతే తనని ఉన్నత స్థితికి చేర్చారు ఆయన వైపే మరొకసారి యోబు తిరుగుచున్నాడు. ఆయన ఎన్నడూ దేవుడిని విడిచిపెట్టలేదు. మనము మాత్రం మన కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి కూడా రాము ఆయనకి ప్రార్థన కూడా చేయము.
4. మన సొంత వారే మనల్ని అర్థం చేసుకోకపోవడం. యోబు యొక్క స్నేహితులు తాను ఉన్నటువంటి స్థితిలో తనను ఓదార్చుటకు బదులుగా ఆయన యొక్క తప్పిదమును వేలెత్తి చూపుచున్నారు. ఆయన దేవుని పాపం చేసాడు కాబట్టే ఇంతటి శిక్ష వచ్చినది అని వారందరూ కూడా తలంచారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన స్నేహితులే, సొంతవారే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని అర్థం చేసుకుంటాడు.
యోబు తన విశ్వాస జీవితంలో దేవుడిని నమ్ముకొని ఆయన మీద ఆధారపడ్డారు కాబట్టి  ఆయనను ఇంకా అధికముగా ఆశీర్వదించారు కాబట్టి మానవ జీవితం కష్టాలతో వున్నప్పటికిని మనం దేవుడిని అంటిపెట్టుకొని ఉంటే దేవుడు మనలని చివరికి ఆశీర్వదిస్తూనే ఉంటారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తాను అందరి కొరకై సేవకుడిగా చేయబడ్డారు అని తెలుపుచున్నారు. దేవుడు తనకు అప్పచెప్పినటువంటి సువార్త ప్రకటన గురించి పౌలు తెలుపుచున్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించుట కొరకై ఆయన అందరి కొరకు అందరివాడే సువార్త సేవ చేసి ఉన్నారు. 
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు తన యొక్క ముఖ్యమైనటువంటి పరిచర్య గురించి తెలుపుతున్నారు. ప్రభువు ఈ లోకంలో రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అదేవిధంగా తండ్రి  యొక్క సువార్త ప్రకటించుటకు వచ్చి ఉన్నారని తెలిపారు. ఏసుప్రభు తాను ఈ లోకమునకు వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుటలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో దేవుడు మనకు ఒసిగినటువంటి పనిని నెరవేర్చుటలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండాలి.
ఈనాటి పఠణముల ద్వారా మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన విశ్వాస జీవితం లో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ధైర్యంతో మనం ముందుకు సాగాలి. దేవుడిని అంటిపెట్టుకొని జీవించాలి అదేవిధంగా మన యొక్క పనిని సక్రమంగా నెరవేర్చాలి.
Fr. Bala Yesu OCD

27, జనవరి 2024, శనివారం

4వ సామాన్య ఆదివారం


ద్వితీయో 18:15-20
1కొరింతి 7:32-35
మార్కు1:21-28
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క సేవకుల యొక్క అధికారం వారి యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తున్నాయి. సేవకులు యొక్క అధికారము అంతయు కూడా దేవుని దగ్గర నుండి వచ్చినది. వారిని ఎన్నుకునే సందర్భంలోనే దేవుడు వారికి సంపూర్ణ అధికారం ఇస్తున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఆయన మరణము గురించి తెలియజేసినప్పుడు  వారు మేము ఒక గొప్ప నాయకుడిని కోల్పోతున్నాము అనేటటువంటి భయములో ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలకు ఊరటనిచ్చుటకు  ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసేటటువంటి మాట ఏమిటంటే తనలాంటి ప్రవక్తని ప్రజల మధ్యకు దేవుడు పంపిస్తానని తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా మనందరం కూడా ఎవరు ప్రవక్త అని తెలుచుకోవాలి. 
ప్రవక్త అనగా దేవుని స్వరము, దేవుని మార్గములను బోధించేవాడు, దేవునికి మానవునికి మధ్య వారధిగా నిలబడే వ్యక్తి , పరలోక సత్యమును బోధించే వ్యక్తి, అన్యాయమును ఎదిరించే వ్యక్తి, అందుకనే ఈనాటి మొదటి పఠణంలో ప్రభువు ఇస్రాయేలు ప్రజలకు మోషే ప్రవక్త వంటి వాడిని పంపిస్తామంటున్నారు. మరి మోషే ఎలాంటి ప్రవక్త? ఆయన కూడా ప్రజల నుండి వచ్చినవాడే, ఆయన కూడా బలహీనుడే ,అయినప్పటికీ  దేవునికి అతి సమీపమున జీవించి ఉన్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క పిలుపుని అందుకున్న తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుటకు ఆయన ఒక నాయకుడిగా అదే విధముగా ఒక మార్గం చూపరీగా నిలిచి ఉన్నారు దేవుని యొక్క పరమ రహస్యములను ప్రజలకు బోధిస్తూ జీవించారు. అలాగే ప్రతి ఒక్క ప్రవక్త కూడా మోషే ప్రవక్త వలే మార్గ చూపరిగా ఉంటూ ప్రజలను దేవుని వైపు నడిపించాలి. ఆయన తన జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన రెండు ప్రధానమైన అంశములు ఏమిటి అంటే తాను ఎల్లప్పుడూ దేవుడికి దగ్గర అయి ఉండాలి అదేవిధంగా తాను దేవుడి యొక్క మాటను మాత్రమే బోధించాలి. తన సొంత ప్రణాళికలు కానీ తన సొంత ఆలోచన గానీ తెలియజేయకూడదు కేవలము దేవుడు చెప్పవలసినది మాత్రమే మనము తెలియజేయాలి అది ప్రవక్త యొక్క ముఖ్యమైన బాధ్యత. అలా వారు చేయకపోతే దేవుని యొక్క శిక్ష కూడా వస్తుంది.
మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు కూడా తెలియజేసే అంశము ఏమిటి అంటే వారు ఆ ప్రవక్త యొక్క మాటను వినాలి.
 ఆ ప్రవక్త యొక్క మాట సంపూర్ణంగా దేవుని యొక్క మాట కాబట్టి దానిని తమ యొక్క జీవితములో ఆచరించి జీవించాలి అది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత మరి ఈనాడు ఎంతమంది దేవుని సేవకులు యొక్క మాటను వారి హెచ్చరికలను ఆలకించి విధేయత చూపుతున్నామా?
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు సమర్పణ జీవితం గురించి తెలియజేస్తున్నారు. వివాహ జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వారికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లేనందున దేవునికి తముతాము పూర్తిగా సమర్పించుకోలేరు కానీ ఎవరైతే పౌలు గారి వలే సమస్తమును కూడా దేవునికి త్యాగం చేసి జీవిస్తున్నారో వారందరూ  తమయొక్క జీవితమును తాము దేవునికి సమర్పించుకొని జీవిస్తారు.
ఈనాటి సువిశేష  పఠణంలో ఏసుప్రభు యొక్క అధికారం గురించి తెలియజేయబడుతుంది ఆయన బోధన అధికారంతో కూడుకున్నటువంటిది. ఏసుప్రభువు యొక్క బోధనలో ఎటువంటి సందేహాలు లేవు ఆయన సమస్తము మీద అధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి తన తండ్రి చిత్తమును సంపూర్ణంగా ఎరిగి ఎటువంటి భయము లేకుండా ఒక మధ్యవర్తిగా తన తండ్రి సందేశములను ప్రజలకు తెలియజేశారు. ఏసుప్రభు యొక్క అధికారము తన తండ్రి నుండి వచ్చినది సృష్టికి పూర్వం నుండి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఈ యొక్క అధికారం ను కలిగి ఉన్నారు ఆయన అధికారము మంచి కొరకు మాత్రమే ఆయన అధికారము సేవ కొరకు మాత్రమే ఆయన అధికారం వినయముతో కూడుకున్నది కాబట్టి ఈరోజు మనము కూడా ధ్యానించవలసిన అంశం ఏమిటి అంటే దేవుడు మనకు ఇచ్చిన అధికారం ఒక యజమానుడిగా నాయకుడిగా ఇచ్చిన అధికారమును మనము సద్వినియోగపరచుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

20, జనవరి 2024, శనివారం

మూడవ సామాన్య ఆదివారం

మూడవ సామాన్య ఆదివారం
యోనా 3:1-5
1కొరింతి 7:29-31
మార్కు 1:14-21
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణములు ప్రభు యొక్క రాకడ కొరకై హృదయ పరివర్తనం చెంది జీవించాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. హృదయ పరివర్తనం మరియు పాపమునకు పశ్చాత్తాప పడటం ఒక కొత్త జీవితం నాంది పలుకుతుంది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యోనా ప్రవక్తను నినెవే పట్టణమునకు హృదయ పరివర్తనం బోధించుటకు పంపిన విధానమును చదువుకుంటున్నాం. దేవుని యొక్క పిలుపును మొదటిగా స్వీకరించినప్పుడు యోనా ప్రవక్త నీనెవే వెళ్ళుటకు నిరాకరించారు ఎందుకంటే నినెవే వాసులు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా జీవించి అనేక సందర్భంలో యుద్ధంలో ఆధిపత్యమును సాధించారు. అందుకనే యోనా నినెవే పట్టణవాసులు నాశనమైతే బాగుండు అని భావించి ఆయన తర్షీషునకు ప్రయాణం ప్రారంభించాడు కానీ తన ప్రయాణం గమ్యమునకు చేరలేదు మార్గమధ్యంలోని దేవుడు ఆయనను పంపవలసిన గమ్యమునకు పంపిస్తున్నారు. యోనా ప్రవక్త నినెవే పట్టణము చేరి అక్కడ ప్రభువు యొక్క హృదయ పరివర్తన సందేశమును ప్రకటించగానే రాజు దగ్గర నుండి చిన్నపిల్లల వరకు కూడా దేవుని యొక్క సందేశము శ్రద్ధగా ఆలకించి, స్వీకరించి వారు హృదయ పరివర్తన మనకు చేయవలసిన ప్రతి పనిని కూడా చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటి అంటే వారు అన్యులు అయినప్పటికీ కేవలం ఒకే ఒక దైవ సందేశమును ఆలకించగానే హృదయ పరివర్తనము చెందటానికి సిద్ధపడుతున్నారు మరి మనము దేవుని  యొక్క వాక్యము విన్న సందర్భంలో హృదయ పరివర్తనము చెందటానికి సిద్ధపడుచున్నాము. నినెవే వాసులు మరణము వస్తుంది అని విన్న వెంటనే గోనె దాల్చి, బూడిద పూసుకొని ఉపవాసం చేసి ఉన్నారు. మనం మరణము గురించి కూడా ధ్యానించినట్లయితే ప్రతి ఒక్కరు హృదయ పరివర్తనం చెంది జీవిస్తారు.
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు గారు ఇక సమయము లేదు అని తెలుపుచున్నారు కావున హృదయ పరివర్తనము చెంది చెడు మార్గములను విడిచి పుణ్యమార్గములను అలవర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన వాంఛలతో కానీ ఆశలతో కానీ జీవించకుండా దేవుని కొరకు జీవించమని తెలుపుచున్నాను. దేవుని కొరకు జీవించాలి అంటే ఇప్పుడు మనము నడుస్తున్న చెడు మార్గము కానీ పాపపు మార్గము కానీ విడిచి పెట్టాలి అప్పుడే మనలో కొత్త జీవితం పుడుతుంది.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తన మొదటి సువార్త పరిచర్య  హృదయ పరివర్తనము అనే అంశము ద్వారా ప్రారంభించి ఉన్నారు. కాలము సంపూర్ణమైనది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించండి అని క్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించారు. హృదయ పరివర్తనం అనగా ఒక యు టర్న్ (U- Turn)తీసుకోవటమే ఎందుకంటే మనము మిస్సయినటువంటి మార్గమును మనము మరల అనుసరించటం.
 పాపము చేసిన సందర్భంలో దేవుని యొక్క మార్గమును విడిచి మన సొంత మార్గంలో ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ యూటర్న్ అనేది మరొకసారి దేవుని యొక్క మార్గమును అనుసరించుటయే. హృదయ పరివర్తన ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం లేనియెడల మనందరం మన యొక్క జీవితమును యధావిధిగా కొనసాగిస్తూ ఉంటాం అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది అనగా దేవుని యొక్క కాలము ప్రారంభమైనది కాబట్టి దానికి అనుగుణంగా మనము హృదయ పరివర్తనం చెందాలి.
హృదయ పరివర్తనము మన యొక్క వ్యసనములు నుండి, పాపపు జీవితము నుండి, మూడు నమ్మకముల నుండి ఇంకా చెడు సుగుణముల నుండి హృదయ పరివర్తనం చెందాలి. హృదయ పరివర్తన ప్రతి ఒక్కరు కోరుకునే అంశం కొన్నిసార్లు దేవుడు ప్రజల హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు, కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులు హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు మరి కొన్నిసార్లు భర్త భార్య హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు అలాగే భార్య భర్త హృదయపరివర్తనం చెందాలనుకుంటారు ఈ విధంగా చాలామంది ఒకరి పట్ల ఒకరు  హృదయ పరివర్తనం కోరుకుంటారు కాబట్టి మనం హృదయ పరివర్తనం చెంది జీవించాలి.
Fr. Bala Yesu OCD

6, జనవరి 2024, శనివారం

క్రీస్తు సాక్షాత్కార పండుగ

క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60:1-6,ఎఫేసి 3:2-3, మత్తయి 2:1-12
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నది. సాక్షాత్కారం అనగా క్రీస్తు ప్రభువు తనను తాను ఇతరులకు ఎరుకపరుచుట. తండ్రి దేవుడు తన కుమారుడిని ఈ లోకమునకు అంతట ఎరుకపరిచారు. ఆయన యొక్క పుట్టుక ద్వారా దేవుడు మొదటగా ఏసుప్రభువును తన తల్లిదండ్రులకు తరువాత గొల్లలకు ఎరుకుపరిచారు అటు తరువాత ముగ్గురు జ్ఞానులకు తన కుమారుడిని బయలుపరిచారు. క్రీస్తు సాక్షాత్కారము ద్వారా మానవలోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది. దేవుడికి మానవునికి మధ్య ఉన్న తెర తొలగిపోయి దేవుడు మానవుడు ఒకటిగా కలిసి ఉన్నారు, ముఖాముఖిగా ఒకరినొకరు చూడగలుగుతున్నారు.
ఈ పండుగను మూడు విధాలుగా పిలుస్తారు
1. ముగ్గురు రాజుల పండుగని
2. విశ్వాసుల పండుగని
3. అన్యుల క్రిస్మస్ పండుగని
ఈ ముగ్గురు జ్ఞానులు అన్యులైనప్పటికీ వారు క్రీస్తు రాజును దర్శించడానికి మరియు ఆరాధించటానికి దూర ప్రాంతముల నుండి సుదీర్ఘమైన ప్రయాణం చేసి కష్టమైనా ఇష్టముగా మార్చుకొని వారు దివ్య బాల యేసును సందర్శించారు. ఈ జ్ఞానులు క్రీస్తు ప్రభువు చెంతకు చేరుటకు ఎటువంటి పవిత్ర గ్రంథమును చదవలేదు కేవలం ఒక నక్షత్రమును ఆధారముగా చేసుకొని వారి యొక్క ప్రయాణమును ప్రారంభించి రక్షకుడిని చేరుకున్నారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరనగా? కాస్పర్, మెల్కియోర్, బల్తజార్.
కాస్పర్ అనేటటువంటి జ్ఞాని అరేబియా దేశం నుంచి తన ప్రయాణం ప్రారంభించి దేవునికి సాంబ్రాణి సమర్పించారు. ఈ సాంబ్రాణి యాజకత్వమునకు గుర్తు ఏసుప్రభు నిత్య యాజకుడని గుర్తించి ఆయన అందరికీ రక్షణనిచ్చుటకై తన్ను తానే బలిగా సమర్పించుకుంటారని మరియు మన కొరకై తండ్రిని సంతోష పరుచుటకు ఒక యాజకునిలా ధూపము వేస్తూ మనలను ఆశీర్వదిస్తారు.
మిల్కియోర్ అనే జ్ఞాని ఏసుప్రభుకు బంగారమును సమర్పించారు. ఈ బంగారం యేసు ప్రభు యొక్క రాజరికమునకు గురుతుగా ఉన్నది. ఆయన మన అందరి యొక్క హృదయములను పరిపాలించే రాజు అందుకే ఆయనకు బంగారం కానుకగా సమర్పించారు
బల్తజార్ అనే జ్ఞాని పరిమళ ద్రవ్యమును యేసు ప్రభుకి సమర్పించారు అది ఆయన మరణమును సూచిస్తుంది. ఆయన మరణించిన తరువాత తన యొక్క శరీరమును మంచిగా ఉంచుటకు ఈ యొక్క పరిమళ ద్రవ్యమును సమర్పించారు. ముక్కు రంధ్రంలో పరిమళ ద్రవ్యమును ఉంచినట్లయితే ఆ యొక్క శరీరం చాలా కాలం నిలుస్తుంది.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను జరుపుకునే సందర్భంలో వారి జీవితము నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి
- 1. ఏసుప్రభువును చూడాలన్న కోరిక. వీరి ప్రయాణం చీకటిలో జరిగినప్పటికీ వారు ఏసుప్రభుని చూడాలి అనేటటువంటి గాఢమైన కోరికను కలిగి ఉన్నారు కాబట్టి ఆయనను సందర్శించి ఉన్నారు. మనలో కూడా దేవుడు ఎడల ఒక గాఢమైన కోరిక ఉండాలి అది ఏమిటి అంటే ఆయనను చూడాలి, ప్రార్థించాలి, ఆయన సన్నిధికి రావాలి అని కోరిక మనలను నడిపించాలి.
2. వెదకుట- ఏసుప్రభు కోసం వెతుకుతూ ఉన్నారు చివరికి ఆయనను కనుగొన్నారు కాబట్టి మనలో కూడా వెదికే సుగుణం ఉండాలి.
3. పాత మార్గమును విడిచి కొత్త మార్గమును అనుసరించాలి. ఈ జ్ఞానులు కూడా చేసినది అదే.
4. దేవుడిని ఆరాధించారు. అన్యులైనప్పటికీ వారు ఏసుప్రభుని విశ్వసించి ఆయన రక్షకుడని గ్రహించి వారు ఎంత పెద్ద జ్ఞానులైనప్పటికీ కూడా ఆయన ముందు సాష్టాంగ పడి ప్రభువుని ఆరాధించారు.
5. విధేయత చూపుట. దేవుని యొక్క దూత వారికి ఆదేశించిన విధముగా వారు దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి వారి యొక్క ప్రయాణమును కొనసాగించారు.
6. దేవునికి కానుకలు సమర్పించారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఏసుప్రభువుకు విలువైన కానుకలను సమర్పించారు అలాగే మనము కూడా దేవునికి విలువైన కానుకలు సమర్పించాలి.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను కొనియాడే  సందర్భంలో మనము వీరిలో ఉన్న లక్షణములను కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

30, డిసెంబర్ 2023, శనివారం

తిరు కుటుంబ ఉత్సవము

తిరు కుటుంబ ఉత్సవము
సిరాకు 3:2-6,12-14
కొలోస్సీ 3:12-21
మత్తయి 2:13-15,19-23

ఈనాడు తల్లి శ్రీ సభ తిరు కుటుంబ పండుగ జరుపుకుంటుంది. ఈ పండుగను 15వ బెనెడిక్ట్ పాపుగారు 1921 వ సంవత్సరంలో ప్రారంభించి ఉన్నారు. క్రిస్మస్ పండుగ జరుపుకున్న సందర్భంలో అదే విధముగా ఒక సంవత్సర చివరి ఆదివారమును ముగించుకొని ఇంకొక కొత్త సంవత్సరములోనికి అడుగుపెట్టేముందు మనము తిరు కుటుంబ పండుగను కొనియాడాలని శ్రీ సభ నిర్ణయించుకున్నది ఎందుకనగా తిరుగు కుటుంబమువలె మన కుటుంబం కూడా ఉండాలి కాబట్టి.
తిరు అనగా పవిత్రమైన కుటుంబం అని ఆదర్శవంతమైన కుటుంబం అని అర్థం. యేసు, మరియమ్మ తల్లి మరియు యేసేపు గార్ల కుటుంబమును తిరు కుటుంబ అని పిలుస్తారు. వీరి కుటుంబం ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబములకు ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.
ఈ పండుగను జరుపుకునే సమయంలో మన కుటుంబాలు తిరు కుటుంబము వలె దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నదా అని పరిశీలన చేసుకోవాలి. 
పాత నిబంధన గ్రంథములో మనము కొన్ని కుటుంబాలను చూస్తున్నాం దేవునికి అతిసమీపముగా జీవించిన కుటుంబాలు ఉదాహరణకు నోవా,అబ్రహాము, ఈ సాకు, యాకోబుల కుటుంబములు ఇంకా మిగతా కొన్ని కుటుంబములు కూడా ఉన్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు బిడ్డల యొక్క కర్తవ్యం గురించి తెలియజేస్తున్నారు. బిడ్డలు తమ తల్లిదండ్రులకు ఎల్లవేళలా విధేయులై జీవిస్తూ వారిని ప్రేమిస్తూ మంచిగా చూసుకోవాలి అని తెలుపుచున్నారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరువక వారి యెడల ఒక కుమారుడిగా, కుమార్తెగా  చేయవలసినటువంటివి(బాధ్యతలు నెరవేర్చుట) అన్నియు చేసి వారి యొక్క దీవెనలు పొందాలి అని ప్రభువు, వాక్యం ద్వారా తెలుపుచున్నారు.
ప్రస్తుత కాలంలో చాలామంది సమాజంలో తమ తల్లిదండ్రులను చూసుకోవటం లేదు, వారిని అనాధలుగా విడిచిపెడుతున్నారు. అదేవిధంగా కొంతమందైతే వారిని అనాధ ఆశ్రమంలో ఉంచుతున్నారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులను వాటా వేసుకుని మూడు నెలలు నా దగ్గర మూడు నెలలు అన్న దగ్గర జీవించు తెలుపుతున్నారు కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకనగా మన తల్లిదండ్రులు లేనిదే ఈ లోకంలో మనం లేము వారే మనల్ని ప్రేమించారు మనకి కావలసినది ఇచ్చారు మన యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు కాబట్టి వారి జీవితమును ఎన్నడూ కూడా మరువకుండా వారిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఒక మంచి బిడ్డగా ప్రతి ఒక్కరూ జీవించాలి. ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు మనందరం కూడా వినయము, దయా, కనికరము, ప్రేమ, కలిగి ఒకరి ఎడల ఒకరు సంతోషముతో జీవించాలి అని తెలుపుచున్నారు. ప్రతి కుటుంబంలో సంతోషము, ప్రేమ అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబములు ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాయి.
ఈనాటి సువిశేష భాగములో ఏసేపు గారు మరియ తల్లి, బాల యేసును తీసుకొని ఐగుప్తునకు వెళుచున్నారు అదేవిధంగా హేరోదు రాజు మరణము తర్వాత శిశువును తీసుకొని ఇశ్రాయేలునకు తిరిగి తీసుకుని రావటమును చదువుకుంటున్నాము. తిరు కుటుంబ పండుగను కొనియాడే సందర్భంలో వీరి యొక్క జీవితములు ఏ విధముగా ఉంటున్నాయి అని మనము ధ్యానించుకోవాలి. వీరు ముగ్గురు కూడా దేవునికి (తండ్రికి, పవిత్రాత్మ కు)సహకరించి దేవుని యొక్క చిత్తమును తమ జీవితంలో నెరవేర్చిన మంచి కుటుంబం. ఒక విధముగా చెప్పుకోవాలంటే తీరు కుటుంబము;
1. దేవునిని విదేయించిన కుటుంబము
2. దేవునికి సహాయం చేసిన కుటుంబము.
3. ప్రేమించే కుటుంబము
4. ప్రార్థించే కుటుంబము
5. త్యాగము చేసిన కుటుంబం
6. దేవుడిని కేంద్రంగా కలిగిన కుటుంబం
7. విశ్వాసము ఉన్న కుటుంబం
కావున ఏ విధముగానయితే తిరు కుటుంబము దేవునికి విధేయత చూపుతూ, దేవుని చిత్తమును ప్రేమిస్తూ, దేవుని కొరకు జీవించి ఉన్నారో అదే విధముగా మన కుటుంబాలు కూడా ఉండాలి.
మన కుటుంబాలు ఏ విధముగా ఉండాలో అని మనమే ఒక నిర్ణయం చేయాలి దానికి తగిన విధముగా ఒక మంచి కుటుంబమును నిర్మించుకోవాలి ఎందుకంటే కుటుంబంలోనే బిడ్డలు అన్నీ నేర్చుకుంటారు కావున తల్లిదండ్రులు బిడ్డలకు సుమాత్రుకగా ఉండుటకు ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు, బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి. బిడ్డలు తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తూ, ప్రేమిస్తూ జీవించాలి. భార్యా భర్తలిద్దరూ కలిసి మెలిసి అర్థం చేసుకుంటూ ప్రేమతో జీవించాలి. ఇదే ప్రభువు మనకు ఈనాడు ఈ పండుగ ద్వారా నేర్పించే అంశం కావున మన కుటుంబములను చక్కదిద్దుకొని దేవునికి ఇష్టకరమైన కుటుంబం గా జీవించుటకు ప్రయత్నం చేద్దాం.
Fr. Bala Yesu OCD

23, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం నాలుగవ ఆదివారం

ఆగమన కాలం నాలుగవ ఆదివారం
2 సమూయేలు  7:1-5,8-12,14,16, రోమి 16: 25-27
లూకా 1:26-38

ఈనాటి దివ్య గ్రంథ పఠనములు ఏసుప్రభు యొక్క మొదటి రాకడను(మనిషావతారం) గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు జన్మదినమునకు అతి చేరువలో ఉన్నటువంటి సమయంలో ఈనాటి పరిశుద్ధ గ్రంథ వచనములు ప్రభువు యొక్క రాక కొరకు మన జీవితములను తయారు చేసుకుని సిద్ధగావుండాలి. ఈనాటి మొదటి పఠణంలో దేవుడు దావీదు రాజుకు చేసిన వాగ్దానము గురించి చదువుకుంటున్నాము. దావీదు రాజు దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యములు తలచుకొని అదే విధముగా ఆయనను శత్రువుల బారి నుండి కాపాడినటువంటి గొప్ప దేవునికి నివాసము ఉండుటకు  యెరూషలేములో  ఒక దేవాలయమును   నిర్మించాలని భావించి ఉన్నారు కానీ దేవుడు మాత్రము దావీదు కాకుండా ఆయన వంశస్థుడు తనకు దేవాలయమును నిర్మిస్తారని తెలుపుచున్నారు. ప్రభువు దావీదుకు తన వలె ఇశ్రాయేలు ప్రజలను శాంతియుతంగా పరిపాలించుటకు ఒక రాజును పంపిస్తానని తెలుపుతున్నారు. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారముగ ప్రభువు ప్రజలను శాంతియుతంగా పాలించుటకు సొలోమోను ఎన్నుకున్నారు అయితే సొలోమోను దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి దేవునికి దూరమై జీవించి అయితే ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి దావీదు యొక్క రాజ్యం కలకాలం నిలుచును కాబట్టి ఆయన యొక్క రాజ్యము కలకాలము ఉండుట కొరకై దేవుడు తన యొక్క కుమారుడిని ఈ లోకానికి పంపిస్తున్నారు. దావీదు విషయంలో దేవుడు మొదటగా చొరవ తీసుకుని ఆయన ఉన్నతమైన స్థితికి ఎన్నుకుంటున్నారు దేవుడికి దగ్గరగా జీవించారు కాబట్టే ఆయన యొక్క రాజ్యము వారసత్వం కలకాలం ఉండుటకై ప్రజల కొరకు మెస్సయ్యను దావీదు వంశం నుండి జన్మించేలా చేస్తున్నారు
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు గారు దాచబడిన దేవుని యొక్క పరమ రహస్యం ప్రజలకు తెలియచేయబడినది అని తెలుపుచున్నారు మన యొక్క రక్షణ.
 ఇంకొక విధముగా చెప్పుకోవాలి అంటే దాచబడిన దేవుని యొక్క పరమ రహస్యం అనగా దేవుని యొక్క రూపము అనేక సంవత్సరాలుగా దాచబడినది ఎందుకంటే దేవుడిని ఎన్నడు ఎవరు కనులారా చూడలేదు కానీ మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ముఖము ప్రజలందరికీ కూడా తెలియజేయబడినది. ఇంకొక విధముగా చెప్పుకోవాలి అంటే దేవుని యొక్క పరమ రహస్యము ఎన్నో సంవత్సరాలుగా అన్యుల నుండి దాచబడినది కానీ పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా అది వారికి తెలియజేయబడినది. మనందరి జీవితంలో ఏది అయినా కొత్తది మనకు తెలిసిన యెడల దానిని మనం సంతోషిస్తాము అదేవిధంగా దేవుని యొక్క పరమ రహస్యం మనకు తెలియజేయబడిన సందర్భంలో మనము కూడా సంతోషించాలి. ఈనాటి సువిశేష భాగములో మరియ తల్లికి మంగళవార్తను గాబ్రియేలు దూత తెలియచేయుటను వింటున్నాము మరియ తల్లి దేవుని యొక్క సందేశం మొత్తము కూడా ఆలకించి ఆలకించినటువంటి వాక్యమును విశ్వసించినది. మరియ తల్లి యొక్క విశ్వాస జీవితము చాలా గొప్పది ఎందుకంటే ప్రవక్తల యొక్క ప్రవచనములను సంపూర్ణముగా విశ్వసించినది ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును ఆయన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించును అన్నటువంటి వాక్యము మరియ తల్లి సంపూర్ణంగా విశ్వసించి ఉన్నది కాబట్టి దేవునికి జన్మనివ్వటకు ఆ తల్లి సిద్ధంగాన్నది అదే విధముగా ఆమె తన జీవితమును దేవుని కొరకు సంసిద్ధం చేసుకున్నది దేవుడిని వాక్కు రూపంలో తనలోకి స్వీకరించాలి అని ఆధ్యాత్మికంగా తాను తయారయ్యారు అందుకే మరియ తల్లి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని పలుకుతూ ఉన్నారు. శూన్యము నుండి సృష్టిని చేసినటువంటి దేవుడు, సముద్రం నుండి దారిని చేసిన దేవుడు, ఎడారి గుండా గమ్యమును మార్గం సిద్ధం చేసిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అందుకని మరియతల్లి దేవుని యొక్క వాక్కు జీవము పొందుకుంటుంది అని సంపూర్ణంగా విశ్వసించినది. ఈరోజు మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క జననము మన హృదయములో జరగాలి అని మనందరం ఎదురు చూస్తున్న అయితే ఈ నాలుగు వారాల ఆగమన కాల యొక్క సిద్ధపాటు మన జీవితంలో దేవుని యొక్క రాకకు మార్గమును సిద్ధము చేసిన విధంగా ఉంటూ ఉన్నదా? అన్నది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే క్రిస్మస్ ద్వారా దేవుడు మనకు దగ్గరవుతున్నారు కాబట్టి ఆయన రాక కొరకు మనం మార్గం సిద్ధం చేయాలి.
Fr. Bala Yesu OCD

16, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం
యెషయా 61:1-2, 10-11
1తెస్సలోని 5:16-24
యోహాను 1:6-8,19-28
ఈనాటి ఆదివారమును లతీన్ భాషలో "గౌదేతే "ఆదివారం అని పిలుస్తారు అనగా 'ఆనందించు' ఆదివారము అని అర్థం. దివ్య బాల యేసు యొక్క రాక అతి చేరువులోవున్నది, మన యొక్క రక్షణ కూడా అతి సమీపంలో ఉన్నది కాబట్టి ఆయన యొక్క రాక కొరకై మనందరం కూడా ఆనందంతో సంసిద్ధత కలిగి ఎదురు చూస్తున్నాం. ప్రభువు నందు ఎల్లప్పుడూ సంతోషించాలి మనం.
ఈనాటి దివ్య గ్రంథ పఠనంలు కూడా దేవుని యొక్క రాక కొరకై త్వరపడి చేయవలసిన ఆధ్యాత్మిక పనులు చేసి సిద్ధంగా ఉండాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. మొదటి పఠనంలో దేవుడు యెషయా ప్రవక్తను అభిషేకించిన విధానమును వింటున్నాం.  బాబిలోనియా బానిసత్వంలో జీవిస్తున్నటువంటి యూదులకు దేవుడు సంతోషకరమైన వార్తను అందచేస్తున్నారు అది ఏమిటంటే  "పేదలకు సువార్తను బోధించటానికి, హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును తన యొక్క సేవకుడిని ఎన్నుకుంటున్నాను అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఈ మాటలను ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకోవాలి ఎందుకనగా మాటలు కేవలం యెషయా ప్రవక్తకు సంబంధించినవి మాత్రమే కాదు అవి బాధామయ సేవకుడైన ఏసుప్రభుకు సంబంధించిన వచనములు. మెస్సయ్య తన యొక్క భూలోక జీవితంలో చేసినది ఈ పనియే.
పేదలు అనగా లేనివారు- ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సాన్నిధ్యం లేకుండ జీవిస్తున్నారో వారికి దేవుడిని అందజేయుట. పేదవారు దేవునియందు నిండు నమ్మకం ఉంచి ఆయనపై పూర్తిగా ఆధారపడి జీవించేవారు. దేవుడే వారి యొక్క ఐశ్వర్యం. ప్రవక్త దేవుడి మీద ఆధారపడి జీవించే వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అని తెలిపారు.
హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకు దేవుడు ప్రవక్తను అభిషేకిస్తున్నారు అంటే బానిసత్వములో బాధలు అనుభవిస్తూ, నిరాశలో, నిస్పృహలో అన్ని కోల్పోయాము అని బాధలో ఉన్న వారిని బలపరచడానికి ప్రవక్త అభిషేకమును పొందుచున్నారు.
చెరలో ఉన్నవారికి అదే విధముగా బంధింపబడిన  వారికి విముక్తిని కలుగ చేయుటకు అభిషేకమును దయచేస్తున్నారు. ప్రవక్త యొక్క ప్రధానమైన బాధ్యత ఏమిటంటే ఎవరైతే ఈ లోక సంబంధమైన కోరికలలో, పాపములో చిక్కుకుని పోయి ఉన్నారో వారిని విడుదల చేయుటకు అభిషేకమును పొందుతున్నారు. అలాగే శిక్షించేటటువంటి వారిని ఓదార్చుటకు ప్రవక్త నియమింపబడుతున్నారు. ఈ మొదటి పఠనం ద్వారా మనము గ్రహించవలసిన అంశం ఏమిటంటే దేవుడు ప్రజలకు సంతోషమును దయ చేయుటకు వారి మార్గములను సరి చేయుటకు వారికి తాను ఎప్పుడూ తోడుగా ఉన్నారు అని తెలియచేయుటకు ప్రవక్తలను ఎన్నుకొని వారిని తన యొక్క సాధనములుగా ప్రజల మధ్య ఉంచుతున్నారు.
ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజలను సర్వదా సంతోషించమని, ప్రార్థించమని మరియు దేవునికి కృతజ్ఞత తెలియజేయమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క రాకడ జరుగును కావున ఆ అంశం మీద ఎల్లప్పుడూ సంతోషించమని తెలుపుతూ ఉన్నారు. అలాగే దేవునికి ప్రార్ధన చేస్తూ ప్రభువు పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞులై జీవించమని తెలుపుతున్నారు. పౌలు గారు ఈ లోకంలో అంతయు పరీక్షించి కేవలం మనిషిని మాత్రమే అనుసరించమని తెలుపుచున్నారు ఎందుకనగా మంచిని చేసినట్లయితే మనము ఎప్పుడు కూడా సంతోషంతోనే జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మనుసారంగా మనము జీవించాలని పౌలు గారు తెలుపుతున్నారు.
ఈనాటి సువిశేష  భాగములో బప్తిస్మ యోహాను గారు గురించి చెప్పబడినది బప్తిస్మ యోహాను గారు ఈ లోకంలో క్రీస్తునకు సాక్షమిచ్చుటకు వచ్చి ఉన్నారు. అలాగే క్రీస్తు  కొరకు ప్రజలలో మార్గమును సిద్ధం చేయుటకు వచ్చి ఉన్నారు. ఆయన సువార్త పరిచర్య చేసే సమయంలో అనేకమంది ప్రజలలో యోహాను గారే మెస్సయ్య లేదా ఇంకా వేరే ఒకరి కొరకు ఎదురు చూడాలా అనే సందేహాలు చాలా ఉన్నాయి దానికిగాను యెరుషలేములో ఉన్న యూదులు కొందరు యాజకులను, లేవీయులను యోహాను గారి దగ్గరికి పంపిస్తున్నారు, ఆయన ఎవరు అని తెలుసుకొనుటకు. యోహాను గారు తాను క్రీస్తుని కాదని ఒప్పుకొనుటకు ఎటువంటి నిరాకరణ చేయలేదు. ఆయన ఆ సందర్భంలో నేనే క్రీస్తు అని చెప్పినట్లయితే అనేకమంది ఆయనను నమ్మి ఉండి ఉండవచ్చు కానీ యోహాను గారు, నేను ఆయనను కాదు కేవలము ఆయన కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకై పంపబడిన వాడిని పలికారు మరియు నేను ఆయన పాదరక్షలను విప్పుటకైన యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారు. బప్తిస్మ  యోహాను గారు ఏసుప్రభుకు సాక్ష్యం ఇచ్చుటలో సంతోషంగా ఉన్నారు.ఈయనలో అంత వినయము ఉన్నది కాబట్టే దేవుడు అతని జీవితమును దీవించారు అందుకే ఏసుప్రభు ఈ భూలోకంలో బప్తిస్మ యోహాను గారు గొప్పవారు అని తెలుపుతున్నారు.
ఈనాటి పరిశుద్ధ వాక్యం మనం దేవుడి యందు సంతోషించాలి అనే అంశమును తెలుపుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా మంచిని చేస్తూ, మంచిగా జీవిస్తూ, ప్రభు రాకడ కొరకై మన జీవితంను సిద్ధపరచుకుంటూ ఆయన వస్తాడు అనేటటువంటి ఆశతో, ఆనందంతో, ఎదురుచూసి రక్షకుని మన ఇంటికి ఆహ్వానించుదాం.
Fr. Bala Yesu OCD

13, డిసెంబర్ 2023, బుధవారం

దైవ వాక్కు ధ్యానము : మత్తయి 11:11-15

దైవ వాక్కు ధ్యానము : మత్తయి 11:11-15:  మత్తయి  11:11-15 "మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ...

9, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాల రెండవ ఆదివారం

ఆగమన కాల రెండవ ఆదివారం
యెషయా 40:1-5,9-11
2 పేతురు 3:8-14
మార్కు1:1-8
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు రక్షకుని రాకడకై మన హృదయం అనే ఇంటికి మార్గమును సిద్ధము చేయుట అనే అంశం గురించి బోధిస్తున్నాయి. ప్రభు మన యొక్క జీవితంలోకి రావాలి అంటే మనందరం కూడా ఆయన కొరకు ఒక మార్గమును సిద్ధం చేయాలి. ఆ మార్గము హృదయ పరివర్తనంతో కూడిన మార్గం అయి ఉండాలి అదేవిధంగా పవిత్రత కలిగిన మార్గమై ఉండాలి.
ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త  బాబిలోనియా బానిసత్వంలో ఉన్న యూదులను ఓదారుస్తున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ బాబిలోనియా బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలకు స్వేచ్ఛనిచ్చి వారిని యెరుషలేమునకు పంపిస్తున్నారు. ఇకమీదట ఇశ్రాయేలు ప్రజలకు  దేవుడు ఒక కాపరిగా తోడుండి వారిని నడిపిస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రవక్త దేవుని యొక్క మాటలను ఈ విధంగా తెలుపుచున్నారు "ఇశ్రాయేలు ప్రజల బానిసత్వం ముగిసినదనియు, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్షను అనుభవించారని,వారి శిక్ష ముగిసినదని తెలిపారు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వమునకు వారి యొక్క పాపము జీవితమే కారణం చెప్పుటకు నిరాకరించలేదు ధైర్యంగా వారికి చేసిన తప్పిదమును తెలియజేశారు. ప్రభు వారికి విముక్తిని కలుగజేస్తూ ఆయన యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయమంటున్నారు. ఈ మొదటి పఠణంలో ఒక స్వరం ఈ విధంగా పలుకుచున్నది "ఎడారిలో ప్రభువులకు మార్గం సిద్ధం చేయుడు, మరో భూమిలో మన దేవునికి రాజ పదమును తయారు చేయుడు. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి పర్వతము చదును చేయబడాలి అదేవిధంగా మిట్ట పల్లములు సమతలముగా చేయాలి". ఈ మాటలు వాస్తవానికి ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితమునకు చెందినటువంటివి.
- ఎడారిలో మార్గమును సిద్ధము చేయుట అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఎడారిలాగా మారినది అంతా కోల్పోయారు, జీవము లేని విధంగా మారినది. దేవుడు లేనటువంటి జీవితం ఎడారి జీవితంలో లాంటిది. అందుకే ఇశ్రాయేలు ప్రజల  యొక్క జీవితం నిర్జీవంగా మారినది, శాంతి లేదు, సమాధానం లేదు కేవలము నిరాశ, నిస్పృహ మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ప్రవక్త అంటున్నారు ఎడారి వలె నిర్జీవముగా ఉన్నటువంటి వారి జీవితములో దేవుని రాకకై మార్గాలు సిద్ధం చేయమంటున్నారు. దేవుడు వారి జీవితము గుండా ప్రయాణిస్తాను అని అంటున్నారు.
- మరు భూమిలో దేవునికి రాజ్యమార్గమును సిద్ధము చేయమంటున్నారు అనగా ఫలించలేనటువంటి జీవితంలో విశ్వాసముతో దేవునికి ఒక మార్గాన్ని సిద్ధం చేయమంటున్నారు.
- ప్రతి లోయ పూడ్చబడాలి అనగా ప్రతి ఒక్కరిలో ఏది కొరతగా ఉన్నదో దానితో వారి జీవితము నింపుకోవాలి అది వినయమైన కావచ్చు, సహనమైన కావచ్చు, ప్రేమ అయినా కావచ్చు, క్షమాపణ అయిన కావచ్చు లేదా ఇతర సుగుణములు ఏవైనా కావచ్చు, కాబట్టి మనలో ఉన్న లోయలను ఈ సుగుణములతో నింపుకోవాలి.
- పర్వతములు, కొండలు నేలమట్టం కావలెను అని ప్రవక్త అంటున్నారు ఈ యొక్క మాటలకు ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే పర్వతములైన, కొండలైనా(hight) ఎత్తుగా ఉంటాయి ఇవి మనలో ఉన్నటువంటి గర్వమునకు, అహంకారంకు చూచనగా ఉన్నాయి కొంతమంది గర్వంతో, అహంకారంతో జీవిస్తుంటారు ఆ యొక్క గర్వము అహంకారం నేలమట్టం అవ్వాలని ప్రవక్త తెలుపుచున్నారు.
- మిట్ట పల్లములు సమతలము కావలెను అనగా మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా సరి సమానులే, దేవుని బిడ్డలే అనే ఆలోచనతో కలిసిమెలిసి జీవించాలి.
ప్రజలను పరిపాలించే రాజు వస్తున్నాడు కాబట్టి ఆయన కొరకై మనందరం మన జీవితంలో ఒక మార్గమును సిద్ధపరచినట్లయితే ప్రభువు మన జీవితము గుండా ప్రయాణిస్తూ ఉంటారు. మార్గము ఏర్పరిచినప్పుడు మాత్రమే ప్రయాణము సులువుగా కొనసాగుతుంది అదేవిధంగా మన జీవితమును దేవుని రాక కొరకై సిద్ధం చేసుకున్న సమయంలో మాత్రమే దేవుడు మన గుండా వెళుతుంటారు. కాబట్టి మన కాపరి అయిన దేవునికి మనందరం మన జీవితాలను తయారు చేసుకుందాం.
ఈనాటి రెండవ పఠణంలో పేతురు గారు ఏసుప్రభు యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు ఆయన యొక్క రాకడ దొంగ వలె వచ్చును కాబట్టి సహనంతో ఉండమని తెలుపుతున్నాను. ప్రభు యొక్క దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరములకు అదేవిధంగా వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉండును. ఆయన యొక్క రాక ఆలస్యం ఎందుకంటే అనేకమంది విశ్వాసులను రక్షించుటకు ఆయన ఆలస్యంగా వస్తూ ఉంటారు కావున మనము ఆయన యొక్క దినముకై వేచి చూస్తూ మన యొక్క జీవితాలను మనము తయారు చేసుకోవాలి.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారు ప్రజలకు హృదయ పరివర్తనము చెంది పాప క్షమాపణకై జ్ఞాన స్నానము పొందాలని తెలుపుచున్నారు. బప్తిస్మ యోహాను గారు ప్రజలకు భిన్నమైన జీవితమును జీవించారు. అంతయు త్యాగం చేసి ఎడారిలో తన సమయమును దేవునితో గడిపారు అదే విధముగా ఆయన తన సమయమును ఎక్కువగా ప్రార్థించుటకై వినియోగించారు, రోమముల వస్త్రములను ధరించారు, నడుమునకు తోలు పట్టి కట్టుకొని మిడతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచుండెను. ఆయన ప్రజలను యేసు ప్రభువు యొక్క రాకడ కొరకై సిద్ధం చేస్తున్నారు. యోహాను గారు తన యొక్క సువార్త పనిని ఎడారిలో ప్రారంభించడానికి కారణం ఏమిటంటే పూర్వ వేదంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో నివసించుచున్న కాలాన్ని ప్రత్యేకంగా దైవ వరప్రసాద కాలమని యూదులు భావించేవారు. దేవుడు తన ప్రజలకు అతి సన్నిహితంగా ఉన్నాడు అని తెలిపే కాలం అది. దైవ రాజ్యం మొదటిగా ఎడారిలో స్థాపింపబడుతుందని అచటనే మెస్సయ్య ప్రత్యక్షమవుతారని యూదులు భావించేవారు అందుకే బప్తిస్మ యోహాను తన యొక్క బోధనలను ఎడారిలో ప్రారంభించి అనేక మందిని ఉదయ పరివర్తనం చెంది ఎలాగ చేశారు. హృదయ పరివర్తనము చెందితే గాని మన దేవుడిని మనలోనికి ఆహ్వానించలేము. కాబట్టి దేవుడే స్వయంగా మన యొక్క హృదయములోనికి రాబోతున్నారు కావున మన పాపపు జీవితమును, పాత అలవాటులను, కోరికలను, అభిప్రాయాలు వదిలేసి దేవునితో కొత్త జీవితం ప్రారంభించాలి. యోహాను గారు ప్రభువు రాకడ కొరకై ప్రజల జీవితాలను సిద్ధం చేసిన విధంగా మనం కూడా దేవుని రాకకై మన జీవితాలను సిద్ధం చేయాలి.

Fr. Bala Yesu OCD

2, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం


యెషయా 63:16-17, 64: 1. 3-8
1 కొరింతి 1:3-9
మార్కు 13: 33-37
ఆగమన కాలం మొదటి ఆదివారం తో దైవార్చన కొత్త సంవత్సరము ప్రారంభమగుచున్నది. ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా జరుగునో ఎవరికీ తెలియదు కావున ఆయన యొక్క రాకడ కొరకు మనము సంసిద్ధులై జీవించాలి. ఆయన రావటము అనేది సత్యం ఎందుకంటే భూమ్యాకాశములు గతించిన గాని నా మాటలు గతించిపోవు అని ప్రభువు పలికారు ఆయన పలికిన ప్రతి మాట తప్పక నెరవేరును. పోయిన దైవార్చన సంవత్సరములో((Year A) ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకై తయారైన విధముగా మరొకసారి మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై తయారై ఉండాలి. 
ఈ యొక్క ఆగమన కాలంలో మనం ప్రభువు యొక్క జన్మము కొరకై ఎదురుచూస్తున్నాం. దేవుడు మన మధ్య మరియు మనలో జన్మించాలి అంటే మనందరం కూడా ఆయనకు ఒక నివాస స్థలమును మన మధ్య మరియు మన హృదయములో ఏర్పరచాలి. 
ఈనాటి మొదటి పఠణంలో  యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చేసిన పశ్చాత్తాప ప్రార్థన గురించి తెలుపుచున్నారు. పర్షియా దేశమునకు చెందిన సైరస్ రాజు ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛనిచ్చి యెరుషలేము దేవాలయం పునః నిర్మించుటకు అనుమతి ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైన విధానమును గ్రహించుకొని వారు పశ్చాత్తాపముచెంది మరొకసారి వారి మధ్య దేవుడిని దిగి రమ్మని ప్రార్థన చేస్తున్నాను. యావే దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయనను వారి మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఒక మహా రాజ్యముగా రూపొందగలదని ఆశపడ్డారు, కానీ వారి యొక్క పాపపు జీవితం వలన దేవునికి దూరమైపోయి సర్వమును కోల్పోయారు. అలాంటి క్లిష్ట పరిస్థితులు యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను దయచేసి చేస్తున్నారు ఏమిటంటే, దేవుడిని నమ్ముకున్న ప్రజలకు ఆయన ఎప్పుడు చేరువులోనే ఉంటారు అని. దేవుని యొక్క గొప్ప లక్షణం , మంచితనము ఏమనగా ఆయన కొరకు ఎదురు చూసే వారికి తప్పనిసరిగా దర్శనం ఇస్తారు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు తప్పు చేసినప్పటికీ, అవిధేయత చూపించినప్పటికీ మాత్రము ఎన్నడు వారిని విడిచిపెట్టలేదు వారికి సహాయంగా ఉన్నారు. కేవలము వారి యొక్క హృదయ పరివర్తన కొరకై కొన్ని సందర్భంలో బానిసత్వంను అనుమతించారు అయినా వారికి తోడుగానే ఉన్నారు.
ఈ మొదటి పఠణం  మొదటి భాగములో ప్రజలు దేవుడు తమ్మును విడిచి పెట్టారు అని భావించారు కానీ రెండవ భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన పట్ల ఏ విధముగా ప్రవర్తించారో తెలుపుచున్నారు. తన చెంతకు వచ్చిన వారిని, తనను సేవించే వారిని మరియు తన మీద ఆధారపడి జీవించే వారిని ప్రభువు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు అని తెలుపుచున్నారు. కేవలము ప్రజలే ఆయనను గుర్తించలేకపోయారు అని తెలిపారు. ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదని ప్రభువు పలికారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు మనకు ఒసగిన అనుగ్రహాలు గురించి తెలుపుచున్నారు. ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనందరికీ కృపానుగ్రహాలు వసగబడెను. ఇది కేవలము ఆయన మనకు ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం. మనము పాపాత్ములు అయినప్పటికీ కూడా ఆయనయే తన ప్రేమ వలన మనకు అనుగ్రహాలు ఇస్తున్నారు. ప్రభు యొక్క రాకడ కొరకై విశ్వాసముతో ఎదురుచూసే వారికి ఆయన యొక్క అనుగ్రహాలకు కొరత ఉండదు అని కూడా పౌలు గారు తెలుపుచున్నారు. అన్ని విషయములయందు వారిని ప్రభువు సుస్థిరం చేస్తారు.
ఈనాటి సువిశేష భాగములో యజమానుడు ఎప్పుడు వచ్చునో తెలియదు కాబట్టి ఆయన యొక్క రాకడకై సేవకులను జాగరుకులై ఉండమని ప్రభువు తెలుపుచున్నారు. ఈ సువిశేష భాగములో రెండు అంశములను ప్రధానంగా చూస్తున్న ఒకటి వేచి ఉండటం రెండు జాగరుకులై ఉండటం.
1. వేచి ఉండటం, ఎదురు చూడటం- వేచి ఉండటం, చూడటం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం.
-తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎదురు చూస్తారు.
-చదువుకునే వారు మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు.
- ప్రయాణికులు వాహనముల కొరకు వేచి ఉంటారు.
-సంతానం లేని వారు పిల్లల కొరకు ఎదురు చూస్తారు.
- దేవుడు కూడా మన యొక్క హృదయ పరివర్తన కొరకు ఎదురు చూస్తారు
ఈ విధంగా చాలా సందర్భాలలో అనేక విషయాలలో ఎదురుచూస్తూ ఉంటాం. ఈ సువిశేషంలో యజమానుడు ఎప్పుడు వస్తారు అని సేవకులు ఎదురుచూస్తున్నారు. ఆయన యొక్క రాక ఊహించని సమయంలో జరుగును కావున వారికి ఇచ్చిన పనిని వారు సక్రమంగా చేస్తూ బాధ్యతాయుతముగా మెలగాలి. కాబట్టి దేవుడు మన యొక్క యజమాని కావున మనం ఆయన యొక్క రాకకు ఎదురు చూడాలి. ఈ భూలోకంలో మంచి పనులు చేస్తూ,  మంచి జీవితం జీవిస్తూ దేవుడిచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి.
2. జాగరుకులై ఉండాలి- అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభువు జాగ్రత్త కలిగి ఉండమంటున్నారు.
శిష్యులను సువార్త సేవకై పంపించే సందర్భంలో మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను జాగ్రత్తగా ఉండమంటున్నారు.
అనేకమంది నా పేరిట వచ్చి నేనే అతనిని చెబుతారు కానీ వారి వెంట మీరు వెళ్ళవద్దు జాగరుకులై ఉండమంటున్నారు.
ఈ లోక విపత్తుల ఎడల జాగరూకులై ఉండమంటున్నారు.
ప్రభు అనేక సందర్భంలో జాగరూకత కలిగి జీవించమంటున్నారు ఎందుకంటే మనము పాపములో పడిపోకూడదని, నశించిపోకూడదని, దేవుని యొక్క మార్గమును విడిచి వెళ్ళకూడదని దేవుని యొక్క కోరిక కాబట్టి ఈ ఆగమన కాలంలో క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై ఎదురుచూసే సమయములో ఆయన యొక్క జననం ఆధ్యాత్మికంగా మన హృదయం జరగాలంటే మనము కూడా దేవుడు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి. మనల్ని మనము ఆధ్యాత్మికంగా ఆయనను స్వీకరించుటకు తయారు చేసుకోవాలి. అదేవిధంగా జాగరుకత కలిగి పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి.

Fr. Bala Yesu OCD

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...