యెషయా 50: 4-9, యాకోబు 2:14-18, మార్కు 8: 27-35
ఈనాటి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సేవకుల/ శిష్యుల జీవితం గురించి తెలుపుచున్నది. ప్రభువు యొక్క శిష్యులు ఏ విధంగా ఉండాలి అన్నది ప్రధానమైన అంశం. ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త బాథామయ సేవకుని గురించి తెలియజేస్తున్నారు. ఈ యొక్క సేవకుని యొక్క గీతము ముఖ్యంగా మూడు అంశాలు చూస్తున్నాం. మొదటిగా దేవుడు సేవకుని ఎన్నుకొనుట.
రెండవదిగా సేవకుడు తన యొక్క జీవితమును సేవ కొరకు త్యాగం చేయుట.
మూడవదిగా, ఏ విధముగా దేవుడు తనను ఆపదల నుండి కాపాడతారు అంశమును తెలుపుచున్నారు. తండ్రి తన సేవకుని ఎన్నుకొని, బోధించుటకు కావలసినటువంటి అనుగ్రహమును దయ చేస్తున్నారు. ఈ యొక్క సేవకుడు తన యొక్క పరిచర్య జీవితంలో అనేక రకములైనటువంటి నిందలు భరించవలసి ఉంటుంది అయినప్పటికీ వాటిని ధైర్యంతో దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ భరించారు. అన్యాయంగా ఆయనను బాధించినప్పటికీ, నేరము మోపినప్పటికీ ఆయన మాత్రం అన్నిటినీ మౌనంగా భరించారు ఎందుకనగా చివరి రోజును తన తరపున దేవుడు పోరాడుతారు అని నమ్మకం. ఈ సేవకుని గీతం ఏసుప్రభు యొక్క జీవితమునకు అక్షరాల వర్తిస్తుంది. మెస్సయ్య కొరకే ఈ యొక్క గీతము రాయబడి ఉన్నది. ఏసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా శ్రమలను అనుభవించి మరణించబోతున్నారో, ఆయన పరిచర్య ఎలా సాగినదో, ఎలాగ తండ్రి మీద ఆధారపడ్డారో అంతయు కూడా ఈ గీతం ద్వారా అర్థమవుచున్నది.
ఈ మొదటి పఠణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యము ఏమిటంటే.బాదామయ సేవకుడు ఏ విధముగానయితే తాను తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ తన ప్రాణములను త్యాగం చేశారో మరియు దేవుడు తనకు సహాయం చేస్తారని నమ్మకం ఉంచారు. మనం కూడా అదే విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత యాకోబు గారు దేవుని ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో తెలిపారు అదేంటంటే విశ్వాసము దానికి తగినటువంటి క్రియలు రెండు కూడా క్రైస్తవుల యొక్క జీవితంలో ఉండాలి. కేవలము విశ్వాసం మాత్రమే కాదు కలిగి ఉండవలసినది, విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. అబ్రహాము ఏ విధముగానయితే విశ్వాసము కలిగి తన యొక్క విశ్వాసానికి తగినటువంటి క్రియలను ప్రదర్శించి ఉన్నారో అదేవిధంగా ఎవరైతే దేవుడిని అనుసరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారో వారందరూ కూడా విశ్వాసానికి తగినటువంటి క్రియలు కలిగి ఉండాలి అప్పుడే మన క్రైస్తవ జీవితమనేది యదార్థం అవుతున్నది.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు అన్యుల యొక్క ప్రాంతంలో (కైసరియా ఫిలిప్పి) తాను ఎవరు అనే అంశమును గురించి ప్రజలు తెలుసుకున్నారా? లేదా అని ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొనుట నిమిత్తమై ఏసుప్రభు ఈప్రశ్న అడుగుతున్నారు.
ఈ సువిశేష భాగములో ఏసుప్రభు ప్రశ్నను రెండు విధాలుగా అడగటం చూస్తున్నాం.
మొదటి ప్రశ్న ఏసుప్రభు తన శిష్యులు తన గురించి ఏమని అనుకుంటున్నారు అడుగుచున్నారు.
రెండవ ప్రశ్న ఏసుప్రభు ప్రజలు తన గురించి ఏమని భావిస్తున్నారు అని అడిగారు.మొదటి ప్రశ్నకు సమాధానం యేసు ప్రభువును గూర్చి కొందరు బాప్తిస్మ యోహానని, కొందరు ఏలియా అని మరికొందరు ప్రవక్తలలో ఒకరిని భావించారు. ఎందుకంటే ఏసుప్రభు యొక్క పరిచర్య జీవితం ప్రజలలో ఒక నూతన అనుభూతిని కలిగించినది. ఆయన సత్యమును ప్రకటించారు, అన్యాయమును ఎదిరించారు, పేదల తరుపున పోరాడారు, మరణించిన వారిని జీవంతో లేపారు అందుకని ప్రజలు ప్రభువును గురించి ఒక్కొక్క భిన్న అభిప్రాయమును కలిగి ఉన్నారు. అదే ప్రశ్న తన శిష్యులను అడగగా పేతురు గారు మాత్రము నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు అని సాక్ష్యం ఇచ్చారు. ఇది సాక్షాత్తు దేవుడై తనకు ఎరుక పరిచారు. అదేవిధంగా పేతురు గారికి యేసుప్రభుతో ఉన్నటువంటి అనుభవమును బట్టి, ఆయన చూసిన కార్యములుబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయము ప్రభువునకు తెలియజేశారు. ఈరోజు మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటంటే యేసు ప్రభువు గురించి మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నది. ఆయనను మెస్సయ్యగా అంగీకరిస్తున్నామా. మన రక్షకునిగా తెలుసుకుంటున్నామా. ఆయన మన దేవుడు అని, ఆయన చూపించినటువంటి బాటలో మనం నడుస్తూ ఉన్నామా?. ఏసుప్రభువుని వెంబడించేటటువంటి శిష్యులకు ఉండవలసినటువంటి మూడు ప్రధానమైనటువంటి లక్షణములు గురించి ప్రభువు తెలుపుచున్నారు. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని, సిలువను ఎత్తుకొని, అనుసరించవలెను అని ప్రభువు పలికారు. మొట్టమొదటిగా ప్రభువుని అనుసరించేటటువంటి పరిత్యజించుకొనే మనసు కలిగి ఉండాలి అనగా ప్రభువు కొరకు దేనినైనా విడిచి పెట్టే మనసు ఉండాలి. అదేవిధంగా సిలువ ఎత్తుకొని అనుసరించమని తెలిపారు అనగా బాధలను కష్టాలను ప్రేమతో చేకుని అనుసరించాలి. ప్రభువును వెంబడించుట అనగా ఆయన బోధన ప్రకారము జీవించుట ఆయన నడిచిన మార్గంలో నడుచుట. మన యొక్క విశ్వాస జీవితంలో ప్రభువుని ఆధ్యాత్మికంగా తెలుసుకొని ఆయనకు సాక్షులుగా జీవించాలి ఆయన ఒక బాటలో నడవాలి. ప్రభు యొక్క సేవా జీవితంలో ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మన యొక్క విశ్వాసము క్రియలు ఒకే విధంగా ఉంటాయి
Fr. Bala Yesu OCD
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి