12, ఆగస్టు 2024, సోమవారం

యెహెఙ్కేలు 2:8-3:4 మత్తయి 18:1-5,10,12-14

యెహెఙ్కేలు 2:8-3:4 మత్తయి 18:1-5,10,12-14

ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, "పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు?" అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, "మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందింననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని  నిజముగా నేను మీతో వక్కాణించు చున్నాను. కాబట్టి తనను తాను తగ్గించు కొని ఈ బాలుని వలె వినమ్రుడుగ రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు.  ఇట్టి చిన్న వానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు." ఈ చిన్నవారిలో ఎవ్వరిని   త్రుణికరింపకుడు. ఏలన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి  సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."   ఒకడు  తనకున్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబది  తొమ్మదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పొడా? అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన తొమ్మది తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసి  బాలురలో ఏ ఒక్కడైన నాశనమగుట పరలోక మందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు." 

క్రిస్తునాధుని యందు ప్రియా మిత్రులారా దేవుడు ఈనాడు యెహెఙ్కేలు ప్రవక్తకు తన మాటలను వినిపించుచున్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు అంటున్నాడు నీవు యిస్రాయేలు వలె తిరుగుబాటు చేయవలదు. అలాగే నీవు ఈ గ్రంథపు చుట్టను భుజించి యిస్రాయేలియుల వద్దకు వెళ్లి వారితో మాటలాడుము" అని చెబుతున్నాడు. ఎప్పుడైతే యెహెఙ్కేలు ప్రవక్త నోరు తెరిచాడో అప్పుడు దేవుడు అతనితో  నేను నీకు ఇచ్చు ఈ గ్రంధపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని అంటున్నాడు. అదేవిధంగా యెహెఙ్కేలు దానిని భుజింపగా అది తేనెవలె మధురముగా ఉన్నది. 

మిత్రులారా! దేవుడు ఎప్పుడు తన వాక్కును, తాన్ మాటలను వాగ్ధానాలను మనకు వినిపిస్తూనే ఉంటాడు. మరి మనము వినగలుగుతున్నామా?  దేవుని వాక్కును ఆలకిస్తున్నామా? ఈనాడు యెహెఙ్కేలు దేవుని వాక్కును భుజింపగా అది ఆయన నోటికి తేనె వలే మధురంగా ఉన్నది, నీవు నేను దేవుని వాక్కును, దైవ గ్రంథాన్ని ధ్యానించగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని మనము రోజు వింటూ, చదువుతూ, ధ్యానిస్తూ, పాటిస్తూ ఉంటె నీవును నేను మనందరం కూడా ఆ వాక్యపు రుచిని చూడగలం. వాక్యంతో మన హృదయాలను నింపుకోవాలి. మనందరం వాక్యంతో నింపబడితే మనము కూడా ప్రజలకు దేవుని వాక్యమును బోధించగలం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం హృదయంలో నింపుకోవడానికి ప్రయత్నించుదాం. 

ఈనాటి సువిశేషంలో శిష్యులు యేసు ప్రభువును " పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవ్వడు?"  అని అడుగుతున్నారు. క్రీస్తు ప్రభువు తనను తాను తగ్గించుకొని చిన్న బాలుని వలె మారినవాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. ప్రతి ఒక్కరు గొప్ప వారు కావాలని, గొప్పగా జీవించాలని అందరి కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. గొప్ప స్థాయిలో గొప్పవారిగానే ఉండాలని ప్రయత్నిస్తారు. అదే విధంగా ఆ ఆశ  శిష్యులలో కూడా ఇప్పుడు కలిగింది. వారు పరలోకములో గొప్ప వారిగా ఉండాలని కోరుకుంటున్నారు. మనము ఈ లోకంలో కాదు పరలోకరాజ్యంలో గొప్పగా ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పగా పరిగణించబడతాడు. పరలోకరాజ్యంలో  గొప్పవాడు ఎవడో  దేవుడు తన శిష్యులకు తెలియపరిచారు. మనం ఈ తగ్గింపు జీవితం జీవిస్తున్నామా? లోకంలో మనము చూసినట్లయితే, గర్వం స్వార్ధం ఎక్కువైపోతున్నాయి. ఎవరు తనను తాను తగ్గించుకోలేక పోతున్నారు. గొప్పలు చెప్పుకోవడం, ఇతరులను చిన్న చూపుచూడటం ఎక్కువైపోతోంది. ఏ బంధమైన నిలబడాలంటే, కలకాలం సంతోషంగా ఉండాలంటే ఉండవలసిన ఓకె ఒక గుణం తగ్గింపు గుణం. ఎవ్వరు తగ్గించుకోగలుగుతారు అంటే తనను తాను అర్ధం చేసుకుంటారో వారే!   కొన్ని సార్లుమన  తగ్గింపు జీవితం మనలో ఉన్న  గర్వాన్ని తగ్గిస్తుంది.  మన తగ్గింపు మనస్తత్వం మనలను గొప్పవారిగా చేస్తుంది.త్రోవ తప్పిన గొర్రె ఉపమానములో దేవుడు చెప్పిన గొప్ప సందేశం ఏమిటంటే మనలో చాలా మంది గర్వంతో, స్వార్ధంతో, అజ్ఞానముతో దేవునికి దూరమై పోతున్నాము. మరి ఇది దేవుని చిత్తముకాదు. దేవుడు ఒక గొప్ప కాపరిగా తనను తాను తగ్గించుకొని త్రోవ తప్పిన మనకొరకు వెదుకుతూ వచ్చి మనలను రక్షించాడు. కాబట్టి ప్రియ మిత్రులారా మనం మంచి మార్గంలో దేవుణ్ణి అనుసరిస్తున్నామా లేదా త్రోవ తప్పిన గొర్రెవలె  ఉన్నామా!  ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతినిత్యం తగ్గింపు మనస్సుతో దేవుని త్రోవలో క్రీస్తు వలె తగ్గింపు మనస్సుతో దేవుని వెంబడించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్థన:ప్రభువైన దేవా నీ వాక్కుతో మమ్ము పోషించు నీవు మానవుడు రొట్టెవలనే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అన్నావు కదా ప్రభూ. నీ వాక్కును భుజించి, ధ్యానించి, సత్య త్రోవలో నీ సత్యపు వెలుగులో నడచి నిన్ను చేరి, నన్ను నేను తగ్గించుకొని జీవించే భాగ్యాన్ని మాకు దయ చేయండి. ఆమెన్  

ఫా. సురేష్  కొలకలూరి OCD


11, ఆగస్టు 2024, ఆదివారం

యెహెఙ్కేలు 1:2-5, 24-25 మత్తయి 17:22-27

 యెహెఙ్కేలు 1:2-5, 24-25 మత్తయి 17:22-27

పిమ్మట వారు గలిలీయలో తిరుగుచుండగ యేసు "మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడ బోవుచున్నాడు. వారు ఆయనను చంపుదురు. కాని, మూడవ దినమున లేపబడును" అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్ను వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, "మీ గురువు పన్ను చెల్లింపడా? అని ప్రశ్నింపగ, "చెల్లించును" అని పేతురు ప్రత్యుత్తర మిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు "సీమోను! నీ కేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా? ఇతరుల నుండియా?" అని ప్రశ్నించెను. పేతురు అందుకు "ఇతరుల నుండియే" అని ప్రత్యుత్తర మిచ్చెను. "అయితే పుత్రులు దీనికి బద్దులుకారు గదా! వారు మనలను అన్యధా భావింప కుండుటకై నీవు సముద్రమునకు వెళ్లి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరచినపుడు అందొక నాణెమును చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము" అని యేసు సీమోనును ఆదేశించెను. 

ప్రియ విశ్వాసులారా! ఈనాడు మొదటి పఠనంలో యావే దేవుడు బూసి కుమారుడైన యహేఙ్కేలు అనే యాజకునికి ప్రభుని వాణి ప్రత్యక్షమయ్యెను. ప్రభుని హస్తము అతని మీదికి వచ్చెను. ప్రియ మిత్రులారా యహేఙ్కేలుకు దేవుడు తన సింహాసనం గూర్చి గొప్ప దర్శనము ఇస్తున్నాడు. అదేవిధంగా యెహెఙ్కేలు దేవుని దూతలను, ప్రభుని యొక్క సింహాసనము, సింహాసనము పై కూర్చొని ఉన్నా దేవుణ్ణి చూసి, ప్రభుని యొక్క తేజస్సు అతని చుట్టూ ఉన్న కాంతి మిరుమిట్లు గొలుపుతుండగా, నేలపై బోరగిలబడగానే ప్రభుని స్వరమును ఆయన విన్నాడు. ప్రియ మిత్రులారా దేవుడు ప్రతి నిత్యం తనను ప్రేమించి, సేవించి తనను తెలుసుకోవాలి అని ఎదురు చూసేవారికి తన దర్శనాన్ని ఇస్తుంటాడు. మరి మన జీవితంలో ఎంత మంది దేవుని దర్శనం పొందుకుంటున్నాం. ఎంత మంది దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడైతే మనము ఆయన స్వరాన్ని వింటామో అప్పుడు దర్శనాన్ని ఇస్తాడు. అంతేకాదు ప్రతి దివ్య బలి  పూజలో దేవుడు తన దివ్య దర్శనాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు, దీనిని మనము గ్రహించగలుగుతున్నామా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులకు తన మరణ పునరుత్తనాల గురించి చెప్పడం విని శిష్యులు మిక్కిలి  దుఃఖించుచున్నారు. స్నేహితులారా క్రీస్తు ప్రభుని మరణ పునరుత్తనాల ద్వారా మనము రక్షణము పొందియున్నాము. మన కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు మన క్రీస్తు ప్రభువు. ఆనాడు చాలా మంది పెద్దలు ప్రధానర్చకులు, పరిసయ్యులు క్రీస్తు ప్రభువుని దేవుని కుమారునిగా గుర్తించలేక  చీకటిలో, పాపములో జీవిస్తుండేవారు. అందుకనే క్రీస్తుని  పట్టుకొని, హింసించి అతి క్రూరంగా చంపిన, దేవుడు మాత్రం వారిని క్షమించాడు. రెండవది ఏమిటంటే వారు క్రీస్తు ప్రభువుని దగ్గరకు వచ్చి అడగకుండా ఆయన శిష్యులతో అంటున్నారు. మీ గురువు దేవాలయపు పన్ను చెల్లింపడా ? అని, అంటే వారు యేసు ప్రభువుని దేవుని కుమారుడు అని గుర్తించలేక పోయారు.  కాని క్రీస్తు ప్రభువు ఎంతో బాధ్యతతో పేతురుతో ఇట్లు అంటున్నాడు. నీవు సముద్రమునకు వెళ్లి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరవగానే నీకొక నాణెము కనిపిస్తుంది. దానిని మన ఇద్దరికొరకు సుంకముగా చెల్లింపుము. 

ప్రియా విశ్వాసులారా ఈనాడు మనలో ఎంత మంది దేవుని దర్శనాన్ని పొందగలుగుతున్నాం? మనలో ఎంతమంది క్రీస్తు ప్రభుని దేవుని కుమారునిగా గుర్తించగలుగుతున్నాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన : దేవా మా జీవితాలలో మేము కూడా నీ దర్శనాన్ని పొందే భాగ్యాన్ని ఇచ్చే దేవుడవు. ప్రభువా ! నీ మరణ పునరుత్తనాల ద్వారా నీవిచ్చిన రక్షణను మేము ప్రతినిత్యం గుర్తించుకుంటూ మేము నిన్ను ప్రేమించి, సేవించి నీ పరలోక దర్శనం పొందే భాగ్యము  మాకు దయచేయండి. ఆమెన్ . 

ఫా. సురేష్ కొలకలూరి OCD

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

రాజుల మొదటి గ్రంథం 19:4-8, ఎఫెసీ 4:30-52 యోహాను 6:41-51

ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త గురించి   వింటున్నాము. ఏలీయా ప్రవక్త బాలు ప్రవక్తలందరిని చంపినా తరువాత యేసెబేలు రాణి ఏలియాతో నేను నిన్ను చంపిస్తాను అని చెప్పగానే ఆయన దేవుణ్ణి కలుసుకొవడానికీ, తన ప్రయాణము ప్రారంభించి మార్గంలో  దేవునితో  ప్రభూ ఈ బాధ ఇక చాలు! నా ప్రాణమును తీసుకొనుము  అని మోర పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏలియాను ఆదరించి, ఆకలిని తీర్చిన తరువాత , ఆ శక్తితో  తన ప్రయాణం  నలువది రోజులు నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నాడు. 

ప్రియా విశ్వాసులారా దేవుని వాక్కు ప్రజలకు అందించి ఆత్మబలంతో ఎన్నో గొప్ప కార్యాలు చేసి రోషంతో దేవుని కొరకు జీవించి యావే దేవుడే నిజమైన దేవుడని నిరూపించి, ఎంతో మంది బాలు ప్రవక్తలను చంపి కార్మెల్ కొండపై దేవుని ఘనతను చాటించిన ఏలీయా ప్రవక్త, యేసెబేలు రాణి చంపిస్తుందేమో అని భయపడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలను దేవుడిచ్చే శక్తితో చేస్తూ ఉంటాం. కాని ఎలియా వలె మనం కూడా ఏమైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, ప్రభూ  ఇక చాలు నా ప్రాణమును తీసుకొనుము అని అంటూవుంటాం. ప్రియ విశ్వాసులారా మనము దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నిలబడితే దేవుడు ఎల్లా వేళల మన పక్షమున ఖచ్చితముగా ఉంటూ, మనలను ఆదరిస్తూ, మన ఆకలిని తీర్చుతాడు. మనలను నడిపిస్తుంటాడు. మరి ఈ గొప్ప ప్రేమను దేవుని నడిపింపును అర్ధం చేసుకొనగలుగుతున్నామా లేదా ఆలోచించండి. 

రెండవ పఠనములో వింటున్నాం. మనము దేవుని ప్రియమైన బిడ్డలం కనుక దేవుని పోలి జీవించాలి అని వాక్యంలో స్పష్టంగా చెబుతున్నారు దేవుడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. కాబట్టి క్రీస్తు వలె మనం ప్రేమతో నడుచుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అని తెలియజేస్తుంది. వైరము, మోహము, క్రోధము అనే వాటిని వదలి పెట్టాలి అరుపులుగాని,  అవమానముగాని  ఏ విధమైన ద్వేషభావముగాని,  అసలు మనలో మన కుటుంబాలలోగాని మన మనసులలోగాని ఉండకూడదు. కాని ప్రియా మిత్రులారా ఈలోక  జీవితంలో ప్రేమకు బదులుగా గొడవలు, ప్రతి విషయానికి అరుపులు, కేకలు, అల్లరులు అవమానాలు ఎక్కువై పోతున్నాయి. వీటన్నిటికీ కారణం స్వార్ధం, గర్వం, అసూయ, ఓర్వలేని తనం, అందుకే వాక్యం సెలవిస్తుంది. ఏ విధమైన ద్వేషభావమైన మనలో అసలు ఉండకూడదు.   ఈ లోకంలో స్వార్ధం, నటన, మోసం ఎక్కువగానే కనపడుతుంది, ఈ లోకంలో ఎక్కడ చూసిన స్వార్ధ బుద్దితో ఉన్నవారే ఎక్కువ ఉన్నారు. అన్ని నాకే, అంత నాకే, అన్ని నేనే అనే స్వార్ధం అదేవిధంగా నటన అన్నిటిలో,, అన్ని రంగాలలో అన్ని విధులలో ఎంతో మంది నటిస్తూ నటన జీవితం జీవిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువమంది  ప్రజలు ఇతరులను  అవమానిస్తున్నారు, లేదా అవమానింపబడుతున్నారు. 

ప్రియమిత్రులారా ఆలోచించండి మనం ఏవరిని అవమానించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు.  క్రీస్తుని బిడ్డలుగా, యేసు క్రీస్తుని విశ్వాసులుగా మనము ఎలా ఉండాలి అంటే పరస్పరము దయను, మృదుత్వమును మరియు క్షమాగుణమును కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి దయామయుడు. మృదుత్వంకలిగి క్షమించి ప్రేమించే ప్రేమ మయుడు. కాబట్టి మనము పరస్పరం ప్రేమ కలిగి ఉండటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించుదాం. 

సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు అంటున్నారు. "పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అది విని  యూదులు గొణగసాగారు. ఈ యూదులు క్రీస్తు ప్రభువును తృణీకరించారు. క్రీస్తును కేవలం ఒక మానవునిగా మాత్రమే వారు చూస్తున్నారు. కాని దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోతున్నారు. ఆయనపై నిందలు వేస్తూ వ్యతిరేకిస్తున్నారు. ఆయనను గురించి ప్రశ్నించుకుంటూ గొణుగుతున్నారు. ప్రియ విశ్వాసులారా మనలో చాలామంది యూదుల వలె అపనమ్మకంతో క్రీస్తుని నిజ దేవుడు కాదని అనుమానిస్తుంటాము. కొన్ని సార్లు మనము కూడా గొణుగుకుంటూ దేవుణ్ణి పరీక్షిస్తుంటాం. దేవునిపై మనము కూడా నిందలు వేస్తూ వ్యతిరేకిస్తుంటాము.   

ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఎలా ఉన్నాము అందుకే క్రీస్తు ప్రభువు అంటున్నాడు. తనను పంపిన  తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. మిత్రులారా మనము దేని ద్వారా లేక ఎవరి ద్వారా ఆకర్షింప బడుతున్నాము, ఆలోచించండి. అనేక విధాలుగా మనము ఆకర్షింపబడుతున్నాం. మరి మనము దేవుని ద్వారా ఆకర్షింపబడుతున్నామా! దేవుని వాక్యానికి ఆకర్షింపబడుతున్నామా! ఆలోచించండి. అదేవిధంగా క్రీస్తు ప్రభువు నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందును అని అంటున్నాడు. మనము నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అంటే ఆయనను విశ్వసించాలి. ఒక గొప్ప విశ్వాసిగా విశ్వాస జీవితం జీవించాలి. అదే విధంగా క్రీస్తు ప్రభువు అంటున్నాడు ఈలోకము అనగా మనం జీవించుటకు ఆయన ఇచ్చు ఆహారము తన దేహము. అంటే ఎవరైనా క్రీస్తు శరీర రక్తాలను, దివ్యసత్ప్రసాదమును విశ్వాసంతో  స్వీకరిస్తారో, వారు నిరతము జీవిస్తారు. మరి మనము నిజమైం విశ్వాసంతో క్రీస్తుని శరీర రక్తాలను స్వీకరిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: జీవము గల దేవా, మాకు నీ జీవమును నీ శక్తిని ఇచ్చి నడిపింపుము. ఆనాడు ఏలియా ప్రవక్తను పోషించి, బలపరచి, నడిపించినావు. మమ్ము కూడా అదే విధముగా నడిపించుము. మేము మాలోని చేడు గుణములు విడనాడి నిన్ను పోలి నీ బిడ్డలుగా జీవించే అనుగ్రహం మాకు దయచేయుము. అదేవిధంగా మీ విశ్వాసులుగా పరస్పరం దయను,మృదుత్వమును మరియు క్షమించే గుణములను కలిగి జీవిస్తూ, పరలోకం నుండి దిగివచ్చిన జీవముగల ఆహారం  నీవే అని గుర్తించి, విశ్వసించి, నీ శరీర రక్తాలను విశ్వాసంతో స్వీకరించి నిత్య జీవం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

10, ఆగస్టు 2024, శనివారం

19వ సామాన్య ఆదివారం

19వ సామాన్య ఆదివారం 
1 రాజులు 19:4-8, ఎఫేసీ 4:30-5:2, యోహాను 6:41-51

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మరొకసారి దేవుని యొక్క దివ్య భోజనము గురించి బోధిస్తున్నాయి. గత మూడు వారముగా తల్లి శ్రీ సభ  దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నది. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను రొట్టెతోను మరియు నీటితోనూ పోషించిన విధానం చదువుకుంటున్నాము. ఏలియా ప్రవక్త కార్మెల్ కొండపై 450 మంది బాలు ప్రవక్తలతో సవాలు చేసిన తర్వాత నిజమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యం రుజువు చేసి ఆ 450 మంది బాలు ప్రవక్తలను హతమార్చారు దాని తరువాత ఆహాబు రాజు యొక్క భార్య అయిన యెసెబేలు రాణి తన సైనికులను పంపించి ఏలియాను ఏ విధముగానైనా సరే చంపాలని చూసింది. ఏలియా ప్రవక్త తాను ఈ వార్తను గ్రహించి తన యొక్క ప్రాణములను దక్కించుకొనుట నిమిత్తమై దూరముగా పారిపోవుచున్నారు. 
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకున్నట్లయితే ఏలీయా ప్రవక్త 450 మంది ప్రవక్తలను చంపిన సమయంలో భయపడలేదు కానీ ఒక రాణి యొక్క మూర్ఖత్వము గ్రహించి ఆయన పారిపోతున్నారు. కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఎందుకని ఏలియా పారిపోతున్నారు? తన దేవుడి మీద నమ్మకం లేఖనా, లేదా ఇంకేమైనా కారణమా? ఎంతో ధైర్యంగా ఉన్న ఏలియా ఎందుకు ఒక్కసారిగా బలహీనపడుచున్నాడు? 
ఏలియా ప్రవక్త ఒక్కసారిగా తన యొక్క ప్రాణం మీదకు వచ్చినప్పుడు భయపడుచున్నారు. తన యొక్క కష్ట సమయంలో దేవుని యొక్క స్వరమును గుర్తించలేకపోయారు, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఆయన నిరాశలో ఉంటున్నారు అందుకని ప్రాణభయం మీద ఉన్న ఒక ఆశ వలన దూరంగా ప్రయాణమై పోతున్నారు. మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే;
1. ఏలియా ప్రవక్త యొక్క భయం. తన బలహీనత ద్వారా భయపడ్డారు కానీ ప్రభువు అతనికి దర్శనమిచ్చి, ధైర్యం నుంచి ముందుకు నడిపారు. ఏసుప్రభు మరణం తరువాత కూడా శిష్యులు భయపడిన సమయంలో ఏసుప్రభు పునరుత్థానమైన  తరువాత దర్శనం ఇచ్చి బలపరిచారు (యోహాను 20:19)
2. దేవుడు ఏలియాను విశ్రాంతి తీసుకోమని చెప్పుట. ఆయన దేవుని కార్యము ముగించే అలసట చింది ఉన్నారు కాబట్టి దేవుడు ఏలియాను కొద్దిపాటి సమయము విశ్రాంతి తీసుకోమని తెలుపుచున్నారు.  ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా పరిచర్య చేసి అలసిపోయిన సందర్భంలో ఏసుప్రభు వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మని పలికారు (మార్కు 6:31). ప్రభువు మన యొక్క ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని మనము సంతోషముగా ఉండుట నిమిత్తమై మనకు సహాయపడతారు.
3. దేవుడు పరిగెత్తే వారి వెనకాల వెళతారు. ఏలియా ప్రవక్త దూరంగా వెళ్లేటటువంటి సమయంలో దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. తన యొక్క బలహీన సమయాలలో తోడుగా ఉన్నారు. తాను పరిగెత్తే సమయంలో తన వెనకాలే వస్తున్నారు. యోనా ప్రవక్త కూడా దేవునికి దూరంగా వెళ్లే సమయంలో దేవుడు అతని వెంట వస్తున్నారు. (యోనా 1:3, 2:10)
4. ప్రభువు ఇచ్చిన ఆహారము ద్వారా ఏలీయా ప్రవక్త 40 రోజుల పాటు శక్తిని పొందుకొని తన యొక్క గమ్యమును చేరుకున్నారు. ప్రభువు ప్రసాదించే ఆహారము మన అందరి యొక్క బలహీనతను తొలగించి మనకు బలమును ఒసగుతుంది.
5. దేవుడు మనల్ని ఎన్నటికీ మరువరు. మనము ఉన్నటువంటి అపాయములో ప్రభువు మనకు చేరువలోనే ఉంటారు. దేవుని యొక్క కనుల నుండి మనము దూరముగా వెళ్లలేము ఆయన మనలను పరిశీలిస్తూనే ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా తాను ఉన్నటువంటి పరిస్థితిలో అతనిని విడిచి పెట్టకుండా తన చెంతకు వచ్చి తనను ఆదుకుంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పవిత్రాత్మను విచారణమున ఉంచరాదని పౌలు గారు తెలుపుతున్నారు. పవిత్ర ఆత్మ మనలను బలపరచి ఈ లోకంలో ఎన్ని శోధనలను ఎదుర్కొనటానికి సహాయపడతారు. దేవుడు ఒసగిన ఆత్మ ద్వారా మనందరం కూడా దేవునికి చెందిన వారముగా మరియు దేవుడు మన యొక్క యజమానిగా ఉంటారు కాబట్టి మనము మన యొక్క జీవితములో ఒకరి ఎడల ఒకరు దయను చూపించుకునే విధంగా, అందరితో మంచిగా మాట్లాడుతూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుడిని పోలిన వ్యక్తులుగా జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. దేవుని పోలిన వ్యక్తులుగా అనగా దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో ఆచరించి పాటించి జీవించటం.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తానే జీవాహారము అని ప్రజలకు తెలిపిన విధానము చదువుకుంటున్నాం. ఏసుప్రభు తాను జీవాహారము అని పలికిన సందర్భంలో చాలామంది ఆయన ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తారు అని భావించారు కానీ ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారమును గురించి తెలిపారన్న సత్యమును గ్రహించలేకపోయారు. ప్రభువు ఏ విధంగా మనకు జీవాహారము అవుతారు అంటే;
1. ఆయన యొక్క వాక్కును వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, ఆచరించుట ద్వారా మనకు జీవాహారముగా మారతారు. 
2. ప్రభువు యొక్క శరీర రక్తములను స్వీకరించుట ద్వారా ప్రభువు మనకు జీవాహారమవుతారు. ఆయన దివ్య శరీర రక్తములు మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. 
3. ప్రార్థించుట ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి కొరతను తొలగించి మనలను తన యొక్క సాన్నిద్యంతో నింపుతారు. 
4. దేవుని మీద మనసును హృదయమును లగ్నము చేసి ఆయన కొరకు జీవించినట్లయితే ప్రభువు మన యొక్క జీవాహారము అవుతారు. 
ఈ విధముగా ప్రభువును మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఇక మనకి ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకలి ఉండదు ఎందుకనగా దేవుడే మనలను తనతో నింపుతారు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చి మనకు ఆహారమైన క్రీస్తు ప్రభువును స్వీకరించటానికి మనము ప్రతినిత్యం కూడా సిద్ధముగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

యోహాను 12: 24-26

యోహాను 12: 24-26    (10 ఆగస్టు 2024)

 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన:గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించును. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినయెడల వానిని నాతండ్రి గౌరవించును. 

ధ్యానము: ఈరోజు మనము  పునీత లారెన్స్ గారి మహోత్సవమును జరుపుంటున్నాము. ఎవరు పునీత లారెన్స్ గారు అంటే యేసు ప్రభువు వలే జీవించడానికి ఆయన నిజ అనుచరునిగా జీవించిన వ్యక్తి. ఆయన 32 సంవత్సరాల వయసులో మరణించాడు. రోమపుర ఆర్చ్ డికనుగా సేవ చేసాడు. యేసు ప్రభువు మరణించిన రెండువందల సంవత్సరాల తరువాత ఈయన జీవించాడు. ఆనాటి రోజులలో తిరుసభకు స్వతంత్రం లేదు, తిరుసభ మొత్తం  రహస్యంగా దేవుణ్ణి ఆరాధించారు. క్రైస్తవులను అనేక విధాలుగా హింసించారు. ఎంతో గోరంగా హింసించారు అంటే కొంత మందిని మంటలలో కాల్చారు. కొంతమందిని అడవి మృగాలకు  ఆహారంగా ఇచ్చారు. కొంతమందిని నూనెలో కాల్చారు. క్రైస్తవుల మీద హింస వలేరియన్, డైక్లిషియన్లు చక్రవర్తులుగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది.  వలేరియన్ చక్రవర్తి  మేత్రానులను , గురువులను, డికనులను చంపాలి అని శాసనము చేసాడు. 258వ సంవత్సరంలో సిక్స్టాస్ పోపుగారిని బంధించారు. ఆది చూచిన  లారెన్స్ పోపుగారి వెంట వెళుతూ నన్ను వదలి ఎలా వెళతారు తండ్రిగారా అని అడిగితే ఆ పోపుగారు లారెన్స్ తో, కుమారా నేను నిన్ను వదలి పెట్టను, నీకు ఎక్కువ హింసలు రాబోతున్నవి.   నీవు ఇంకా ఎక్కువుగా ప్రభువుకు సాక్షమివ్వడానికి వస్తావు అని చెప్పాడు. కనుక లారెన్స్ గారికి వచ్చేటువంటి హింస ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు.  

లారెన్స్ రోమాపూరి ఆర్చి డికను, రోమా పూరి తిరుసభ   సంపదమొత్తం లారెన్స్ ఆదీనంలో ఉన్నది.  లారెన్స్ ఆ సంపదను పేదలకు పంచుతూ ఉండేవాడు.  అప్పుడు ఆ సంపదను అక్కడి అధికారులు కావాలని అడిగినప్పుడు లారెన్సు వారిని  మూడు రోజులు సమయం అడిగి,  ఆ సమయంలో ఆ సంపదను మొత్తాన్ని పేదలకు పంచి ఇచ్చాడు. తరువాత  రోములో ఉన్న పేదలను మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇదే తిరుసభ సంపద అని వారి ముందు ఉంచాడు.  లారెన్స్ గారికి తనకు ఏమి జరుగుతున్నదో ఖచ్చితముగా తెలుసు. అయినప్పటికి అతనికి ఎదురయ్యే సమస్యలను హింసను పట్టించుకోకుండా, యేసు ప్రభువు నిజమైన అనుచరునిగా ఉండటానికి సిద్ధపడ్డాడు. 

ఆది మొత్తం పరిశీలిస్తున్న అధికారి లారెన్స్ గారిని బంధించాడు. ఆయన్ను ఒక మాంసపు ముక్కను నిప్పుల మీద కాల్చినట్లు ఒక ప్రక్క కాల్చగా, నేను ఈ ప్రక్కన కాలిపోయాను, ఇప్పుడు అవతలి ప్రక్కన కాల్చమని అడిగాడు. వారు అటులనే వేరొక ప్రక్కన కాల్చడం జరిగినది. ఎంతటి బాధనైనా తట్టుకోవటానికి పునీత లారెన్స్ గారు సిద్ధపడ్డాడు. తాను పొందే హింస తక్కువ అన్నట్లు హింసించే వారిని ఇంకా ఎక్కువగా హింసించేలా ప్రేరేపించాడు. వారితో పరిహాసం ఆడాడు. అయన దృష్టిలో  యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం అనేది ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. వారు పెట్టె హింసలు చాలా కఠినమైనవి ఐన ప్రభువు సాక్షిగా నిలబడటానికి ఆనందంగా వాటిని భరించాడు అవి ఆయనకు అల్పమైనవిగా కనపడినవి. ప్రభవు మీద అతని ప్రేమ అంత గొప్పది. యేసు ప్రభువు అనుచరునిగా జీవించాడు. అందుకే పునీత లారెన్స్ గారు హాస్య కళాకారులకు పాలక పునీతునిగా ప్రసిద్ధి. 

ఈనాటి సువిశేషంలో ప్రభువు తన అనుచరుల లక్షణాల గురించి చెబుతున్నాడు. గోధుమగింజ భూమిలో పడి నశించనంతవరకు అది ఫలించదు. అంటే నేను నా బాహ్య పొరను వదిలించుకొని రావాలి అప్పుడు మాత్రమే నేను పూర్తిగా ఫలించడానికి సిద్దము అవుతాను. ఏమిటి ఈ బాహ్యపొర ఎలా దానిని నేను కోల్పోవాలి? ప్రభువే నాకు అది నేర్పుతున్నారు. ఎలా నన్ను నేను రిక్తుని చేసుకోవాలో చెబుతున్నాడు. నెను ఈ లోక జీవితం నాకోసము కాదు, ఈ లోకంలో నేను కేవలం నాకోసమే జీవించినట్లయితే  నా జీవితం  ఫలించదు. ఈ జీవితంలో నన్ను నేను ఇతరుల కోసం ఇవ్వాలి. యేసు ప్రభువు వలె జీవించాలి. ఆయన తన ప్రాణమును, తన సమయాన్ని, తన శక్తిని, తన యుక్తిని, తన జీవితాన్ని మన కోసం హెచ్చించాడు. తన ప్రాణమును కూడా కోల్పోయాడు కాని తండ్రి ఆయనకు తన ప్రాణమును ధారపోయుటకు మరల తీసుకొనుటకు అధికారం ఇచ్చాడు.

ఈ లోకములో తన జీవితమే ముఖ్యం, తన ప్రాణమే ముఖ్యం అనుకునే వారు అందరు స్వార్ధంతో జీవించువారే, వారు దేవుని అనుగ్రహములను కోల్పోతున్నారు. యేసు ప్రభువు చెప్పినట్లు జీవిస్తే ఆయనతో పాటు మనము ఉండవచ్చు. యేసు ప్రభువుతో పాటు ఉంటే తండ్రి దేవుడే మనలను గౌరవిస్తారు. యేసు ప్రభువును అనుసరిస్తూ, నన్ను నేను కోల్పోయిన నాకు లాభమే. ఎందుకంటే పరలోకమున నేను నా ప్రాణమును పొందుతాను. మరల ప్రభువుతో కలసి ఉంటాను, ఈ మహాద్భాగ్యం ఏమిచ్చి నేను పొందగలను. కేవలము ఆ ప్రభువును అనుసరించుటం వలన మాత్రమే. అంతే కాదు అప్పుడు తండ్రి దేవుడు నన్ను గౌరవిస్తారు అని ప్రభువు చెబుతున్నారు. 

ప్రార్ధన : సకల వర ప్రధాత అయిన ప్రభువా! నేను నా జీవితములో ఉహించలేనటువంటి గొప్ప అనుగ్రహాలు నాకు దయచేసి ఉన్నారు.  మీరు వాగ్దానము చేసిన వాటిని పొందుటకు నాకు అర్హత లేదు ప్రభువా కాని , పునీతుల జీవితాలు చూసినప్పుడు నేను కూడా అలా జీవించాలి అనే కోరిక నాలో కూడా పుడుతుంది, వారి వలె మిమ్ములను సంపూర్ణంగా అనుసరించే అనుగ్రహం దయచేయండి. మిమ్ములను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ మీతో ఉండే అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

8, ఆగస్టు 2024, గురువారం

నహుము 1:15,2:2;3:1-3,6-7 మత్తయి 16:24-28

నహుము 1:15,2:2;3:1-3,6-7 మత్తయి 16:24-28  (9 ఆగస్టు 2024)

"నన్ను అనుసరింపగోరువాడు తననుతాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడు కొనచూచు వాడు దానిని పోగొట్టుకొనును. నా  నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించు కొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంతవరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు పలికెను. 

క్రిస్తునాధుని యందు ప్రియ స్నేహితులారా ఈనాడు కార్మెల్ సభకు ఎంతో  పర్వదినం. కార్మెల్ సభ సభ్యులు ఎంతో సంతోషంగా పునీత ఎడిత్ స్టెయిన్ గారి పండుగను జరుపుకుంటారు.

ఆమె జీవితం: పునీత  ఎడిత్ స్టెయిన్ గారు అక్టోబర్ 12 వ తేదీన 1891వ సంవత్సరంలో జన్మించారు. చిన్న వయస్సు నుండి ఎంతో జ్ఞానము కలిగిన వ్యక్తి.  ఆమె హెడ్మాన్డ్ హస్రెల్ అనే గొప్ప తత్వవేత్త శిష్యురాలు. ఆమె కూడా త్తత్వవేత్తగా ప్రసిద్ధి చెందినవారు. 1904వ సంవత్సరంలో తనను తాను  నాస్తికురాలిగా ప్రకటించుకుంది. కాని కాలక్రమేణా ఆమె గొప్ప జ్ఞానము కలిగిన విద్యార్థిగా , మరియు కళాశాల ఆచార్యరాలుగా గొప్ప మేధాసంపద కలిగిన వ్యక్తిగా మారింది. ఆమె 1921లో అవిలాపుర  తెరాసమ్మ గారి జీవిత కథను,  ఆత్మకథ పుస్తకం చూసి రాత్రికి రాత్రే ఆ పుస్తకాన్ని చదివి, ఆమె సత్యాన్ని కనుగొన్నది. ఆమె సత్యం కోసం అన్వేషిస్తుంది.  తెరెసామ్మ గారి ఆత్మకథ ద్వారా క్రీస్తు ప్రభువు సత్యం అని కనుకొన్నది. ఆమె కార్మెల్ సభకు ఎంతో ఆకర్షితురాలైంది. 1982లో యూదా మతం నుండి  కాథోలికురాలిగా మారింది. తదనంతరం ఆమె 1933లో కొలోన్లోని కార్మెల్ మఠంలో చేరింది. కార్మెల్ మఠంలో సిలువ తెరెసా బెనెడిక్తగా పేరును స్వీకరించింది. ఈ పేరుకు అర్ధం తెరెసా సిలువ ద్వారా ఆకర్షించబడింది అని అర్ధం. ఎడిత్ స్టెయిన్ గారు తన గొప్ప రచనల ద్వారా ఎన్నోసత్యాలను ప్రజలకు తెలియజేసినటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభువుని  కోసం, క్రీస్తు ప్రభునిపై తనకు ఉన్న ప్రేమకోసం తన విశ్వాసాన్ని వదలక ఎన్నో కష్టాలను బాధలను ఏంతో సంతోషంతో ఎదుర్కొవడానికి, క్రీస్తు కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి, సత్యం కొరకు సాక్షిగా నిలబడింది,ఈ గొప్ప పునీతురాలు. ఆమె ఆగస్టు 9, 1942 వ సంవత్సరంలో వేదసాక్క్షి మరణం పొందింది.  

ఈనాటి మొదటి పఠనంలో యూదా ప్రజలకు శుభ వర్తమానమును ఈ విధంగా  వినిపిస్తున్నాడు. దుష్టులు మీపై మరల దాడి చేయరు. వారు  ఆడపొడ కానరాకుండా పోవుదురు. అదేవిధంగా మీకు మునుపు ఉన్న వైభవమును తిరిగి నెలకొల్పుదును. మరి మనము శుభ వర్తమానము వినగలుగుతున్నామా, దేవుడు మనలను రక్షిస్తున్నాడు. మనకు  వైభవమును ఇస్తున్నాడు. దానిని మనము నిలుపుకోగలుగుతున్నామా? ఆలోచించండి. మనము దేవునికి దూరంగా వెళ్లిన  , ఆయనను బాధపెట్టిన,  ఆయన మాత్రం మనలను వదలి పెట్టరు. అదేవిధంగా విశ్వాస పాత్రంగా మనము కూడా జీవించాలి. 

ఈనాడు సువిశేషం  "పునీత ఎడిత్ స్టెయిన్ గారి  జీవితంలో అక్షరాల నెరవేరింది. అదేమిటంటే క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు "నన్నుఅనుసరించగోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను." పునీత ఎడిత్ స్టెయిన్ గారు క్రీస్తును తెలుసుకొని తనను తాను పరిత్యజించుకొన్నది. తన జీవితంలో వచ్చే శ్రమలను బాధలను కష్టాలను ఇబ్బందులను మోస్తూ సిలువను  ఎత్తుకొని క్రీస్తు ప్రభువును అనుసరించింది. క్రీస్తు ప్రభువుని అడుగుజాడలలో నడిచి ఆయన సాక్షిగా మారింది. క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా నా నిమిత్తము ఎవరైతే  తమ ప్రాణాలను ధారా పోస్తారో వారు తమ ప్రాణాలను దక్కించుకొందురు అని అన్న మాటను నెరవేర్చింది. ఈలోకం మొత్తం పంపాదించి తమను కోల్పోతే లాభము ఏమిటి అనే సత్యాన్ని తెలుసుకొని తనను తాను  దేవునికిసమర్పించుకుంది. వారి వారి పనులను బట్టి దేవుడు  ప్రతిఫలాన్ని ఇస్తాడని మనము విన్నాం.  ఆమె చేసిన గొప్ప పని ఏమిటంటే తాను సత్యాన్ని  తెలుసుకొని సత్యస్వరూపుడైన  క్రీస్తుని అనుసరించింది. అంతేకాక క్రీస్తుని కొరకు తన ప్రాణమును దారపోసింది. ప్రభువు చెప్పినట్లుగా ఆమె క్రియలను బట్టి ఆమె విశ్వాసాన్నిబట్టి ఆమె తిరుసభలో ఒక గొప్ప పునీతురాలుగా మారింది. మరి మనము నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నామా!మనల్ని మనము పరిత్యజించు కొంటున్నామా? మన సిలువలు అనే బాధలు కష్టాలను ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తున్నామా, ఈ  కాలంలో చాలా మంది క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు. కాని తమను తాము ప్రరిత్యాజించుకోలేక పోతున్నారు. కేవలం నామ మాత్రంగా అనుసరిస్తున్నారు. ఆలోచించండి, మనము ఎలా ఉన్నాం? లోక సంపదలతో  మన ఆత్మను కోల్పోతున్నాము. కాబట్టి ప్రియాబిడ్డలారా పునీత ఎడిత్ స్టెయిన్ గారి వలె జీవిస్తూ ఆమె వలె గొప్ప కార్యాలు చేస్తూ క్రీస్తు ప్రభుని నిజమైన అనుచరులుగా జీవించుదాం. 

ప్రార్ధన : ఓ ప్రభువా మీరు మాకు ఎన్నోసార్లు నీతి మార్గంలో నడవమని పిలుపు ఇస్తున్నారు. కొన్ని  సార్లు మమ్ము మేము పరిత్యజించుకోలేక పోతున్నాం. మా సిలువను మోయలేక పోతున్నాం. మా సిలువలు అనే బాధలతో  నిన్ను అనుసరించలేక పోతున్నాం. కాని తండ్రి! భయంతో , దురాలోచనలతో లోక సంపదలతో పడి మా ఆత్మలు కోల్పోతున్నాము. ప్రభువా మంచి క్రియలద్వారా విశ్వాసంతో మిమ్ము అనుసరించి మీ రాజ్యంలో చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

7, ఆగస్టు 2024, బుధవారం

యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23

యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23 (8 ఆగస్టు  2024)

తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. "ప్రజలు మనుష్యకుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?" అని తన  శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. "మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు?" అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిచ్చెను. "యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడును." ఇట్లు చెప్పి, తాను  క్రీస్తునని ఎవ్వరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటినుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలవలన , ప్రధానార్చకులవలన , ధర్మ శాస్త్ర బోధకులవలన పెక్కుబాధలను అనుభవించి, మరణించి మూడవదినమున పునరుత్తానుడగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, "ప్రభూ ! దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక !" అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో "ఓ సైతాను! నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధిచినవే, కాని  దేవునికి సంబంధిచినవికావు" అనెను

క్రిస్తునాధుని ప్రియ మిత్రులారా, ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన ప్రజలతో  ఒక నూతన నిబంధము చేసుకొనడానికి సిద్ధంగా ఉన్నాడని అదే విధంగా ఆ నిబంధన  తాను మన పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు  చేసుకొనిన నిబంధన వంటిది కాదు అని తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే 'నేను మీ దేవుడనైన ప్రభువును-మీరు నా ప్రజలు' నేను మీ కాపరిని మీరు నా మంద అని ప్రభువు మన పితరులతో నిబంధన చేసుకున్నాడు. మరి ఎందుకు దేవుడు మరల ఒక నూతన నిబంధనము మనతో చేసుకోవాలి అనుకుంటున్నాడు అంటే, మన పితరులు, పూర్వికులు  ప్రభువును ఆయన చేసిన గొప్ప అద్భుతకార్యాలను  తమ కన్నులార చూచి అనుభవించి కూడా ప్రభుని యొక్క నిబంధనను మీరారు. అన్యదైవములను కొలిచి తమ జీవితాలలో అనేక తప్పులు చేసుకుంటూ దేవుణ్ణి విడనాడి పాపము చేస్తూ పాప మార్గములలో ప్రయాణించారు. దేవుని యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రమును విడనాడారు. తమ నాశనమును తామే కొనితెచ్చుకున్నారు. 

మరి నూతన నిబంధన ఏమిటి అంటే మనము కూడా మన పూర్వికులలాగా, మన పితరుల వలె దేవుణ్ణి దైవ శాస్త్రాన్ని ఆయన చేసిన నిబంధనను మర్చిపోయి జీవిస్తున్నామా?  దేవుడు చెప్పినట్లుగా దైవ ప్రజలలాగా మంచి పనులు చేయలేకపోతున్నాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వలేక పోతున్నాం. అందుకే దేవుడు మనందరితో నూతన నిబంధన చేస్తున్నాడు. అది ఏమిటంటే "నేను నా ధర్మ శాస్త్రాన్ని వారి అంతరంగమున ఉంచుదును. వారి హృదయాలపై లిఖింతును. అల్పులు అధికులెల్లరు నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును దానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను అని దేవుడు అంటున్నాడు. మరి మనము దేవుని ధర్మ శాస్త్రాన్ని మన హృదయాలలో పదిల పరుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ, దైవ ప్రజలుగా జీవించాలి. జీవించడానికి ప్రయత్నించాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా అడుగుతున్నారు. నేను ఎవరినని మీరు భావించుచున్నారు? అప్పుడు పేతురు యేసు ప్రభువుతో " నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిస్తున్నాడు. ఈ విషయమును పేతురుకు  బయలు పరిచినది, పరలోకమందున్న తండ్రి దేవుడు. ప్రియ మిత్రులారా అదే ప్రశ్న దేవుడు ఈనాడు మనలను అడుగుతున్నాడు. మన సమాధానము ఏమిటి ? యేసు క్రీస్తుని గురించి నీ అనుభవం ఏమిటి? మనం క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నాము ? చాలా మంది పునీతులు క్రీస్తును, ఆయన కార్యములను చూసి కొంతమంది నా తండ్రి అని, కొందరు నా రక్షకుడు అని , కొందరు నా కాపరి అని  ఎన్నో భావాలు చెబుతుంటారు. క్రీస్తుని యెడల నీ భావం ఏమిటి? నీ అనుభవం ఏమిటి? నీ ఉద్దేశ్యం ఏమిటి? నేను నేను నిజంగా క్రీస్తుని అనుభవిస్తున్నానా ? లేదా? ఆత్మా పరిశీలన చేసుకుందాం. దేవున్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : ప్రభువైన దేవా! మేము మిమ్ము మా ప్రభుడవని గుర్తించుకొని మీ  ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ-మీతో మేము చేసుకొనిన నిబంధమును ఎల్లవేళలా గుర్తించుకొని మీ  ప్రజలలాగా జీవించడానికి, మిమ్ము  తెలుసుకోవడానికి అదేవిధంగా మీ  ధర్మ శాస్త్రాన్ని మా హృదయాలలో పదిల పరుచుకోవడానికి మాకు మీ కృప వరములను దయచేయండి. తద్వారా మేము మిమ్ము తెలుసుకొని, ప్రేమించి సేవించుదుము. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

6, ఆగస్టు 2024, మంగళవారం

యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18

 యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18  (7ఆగస్టు 2024)

యేసు అటనుండి  తూరు , సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్లెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, "ప్రభూ! దావీదుకుమారా! నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపచుచున్నది" అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్కమాటైనను మాట్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి "ఈమె మన  వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు"  అనిరి. "నేను యిస్రాయేలు వంశమున చెదిరిపోయిన గొఱ్ఱెలకొరకు మాత్రమే పంపబడితిని" అని ఆయన సమాధానము ఇచ్చెను. అపుడు ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి "ప్రభూ! నాకు సాయపడుము"అని ప్రార్ధించెను. "బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు" అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభూ! కాని తమ యజమానుని భోజనపుబల్ల నుని క్రింద పడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను. యేసు ఇది విని "అమ్మా!నీ విశ్వాసము మెచ్చదగినది. ఈ కోరిక నెరవేరునుగాక!" అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. 

ప్రియమైన దైవ ప్రజలారా ఈనాటి పఠనాలలో ప్రభువైన దేవుడు నేను మీ అందరికి దేవుడును, నేను మిమ్ము కరుణింతును. నేను మీకు దర్శనమిచ్చితిని. నేను మిమ్ము శాశ్వతమైన, నిత్యప్రేమతో  ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. మిత్రులారా దేవుడు చెప్పే ఈ మాటలకు మనము ఏమి చేయాలి అంటే మనము మన దేవుడైన ప్రభుని చెంతకు రావాలి. ప్రభువు చెంతకు వచ్చి ఏమి చెయ్యాలి? అంటే దేవుని గొప్ప కార్యములను  ఆయన చేసిన మేలులను గుర్తించి మనలను రక్షించినందుకు ధన్యవాదములు చెల్లించి, స్తుతిగానము చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియవిశ్వాసులారా నీవు నేను మన దేవుణ్ణి మన దేవునిగా అంగీకరిస్తున్నామా? లేదా లోకంలోని వ్యక్తులను , పదవులను డబ్బును సంపదను లేదా మన కోరికలను అనుసరించి దేవుని మర్చి పోతున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము  ప్రార్ధిస్తామో ప్రభువు కరుణామయుడు కనుక మనలను ఖచ్చితముగా కరుణిస్తాడు. మనము పవిత్ర గ్రంధంలో చూస్తే, మమ్ము కరుణించు అడిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కరుణించాడు. ఆయన కరుణకు హద్దులు లేవు. ఓక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లుగా దేవుడు మనలను తన శాశ్వతమైన నిత్యా ప్రేమతో ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మరి మనము దేవుని శాశ్వత ప్రేమను అర్ధం చేసుకుంటున్నామా! దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామా? లేదా ఈ లోక సంపదలను ఈ లోక వస్తువులను, ఈ లోక పదవులను ఈ లోక ఆకర్షణలు ప్రేమిస్తున్నామా ఆలోచించండి. 

ఈనాడు సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును  ఒక తల్లి తన బిడ్డను రక్షించండి అని వచ్చినప్పుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించారు. తల్లి తన బిడ్డకై పడిన వేదనను కష్టాన్ని విశ్వాసాన్ని చూసి అద్భుత కార్యం చేసున్నాడు. కననీయ స్త్రీలో ఉన్నా విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి. ఆమె వలే మనము దేవుణ్ణి పిలవాలి. ఆమె దావీదు కుమారా యేసయ్య నన్ను కరుణింపుము అని ప్రార్ధించింది. మరి  మనము ఆ తల్లి వలె మన మన తల్లి దండ్రుల కోసం, బిడ్డల కోసం మన కుటుంబం కోసం మన  సంఘం కోసం ప్రార్ధన చేస్తున్నామా లేదా? కొన్ని సార్లు దేవుడు కుడా  మన వేడుకోలు పట్టించుకోవడం లేదు అని చాలా మంది ప్రార్ధన చేయడం, దేవాలయానికి వెళ్లడం మానివేస్తారు, ఈనాటి సువిశేషం ద్వారా మానమ్  గ్రహించవలసినది ఏమిటంటే మనం విశ్వాసం కోల్పోకుండా నమ్మకంతో, దేవా మమ్ము కరుణించును అని మనం    ప్రార్ధన చేస్తే  దేవుడు  ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యలు మన జీవితంలో తప్పకుండ చేస్తాడు. మరి మనము ఏమి చేయాలంటే  దేవుడ్ని చెంతకు రావాలి, ప్రార్ధించాలి. అలాగే ఆయన చేసిన మేలులకు స్తుతిగానం చెయ్యాలి. 

ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీ ప్రేమ శాశ్వతమైనది. నీ కరుణ ఎల్లలు లేనిది. మేము నీ శాశ్వతమైన ప్రేమను తెలుసుకూన్ నీ ప్రేమను అనుభవించి నీ కరుణను పొంది నీ ప్రేమలో జీఇవస్తు నీ దయను పొందుతు, నిన్ను స్తుతిస్తూ ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ . 

ఫా . సురేష్ కొలకలూరి OCD

3, ఆగస్టు 2024, శనివారం

18 వ ఆదివారం

 18 వ ఆదివారం 

నిర్గమ ఖాండం 16:2-4,12-15 ఎఫెసి 4:17,20-24  యోహాను 6: 24-35

అక్కడ యేసుగాని , శిష్యులు గాని లేకుండుటచూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫ ర్నామునకు పోయిరి.  ప్రజలు సరస్సు  ఆవలివైపున యేసును కనుగొని  "బోధకుడా!  మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని  మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత  భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన  తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు  ముద్రను వేసియున్నాడు"  అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. అంతట "నిన్ను   విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?" అని వారు మరల ప్రశ్నించిరి. "వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను. అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను" అని వారు ఆయనతో చెప్పిరి. "పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషేకాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"  అని యేసు వారితో అనెను. "అయ్యా ! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి. అందుకు యేసు "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు  ఎన్నడును దప్పికగొనడు" 

ఈనాడు దేవుడు మనకు ఇచ్చే సందేశం. 

మొదటి పఠనం : దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షిస్తున్నాడు. 

రెండవ పఠనంలో మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొని క్రీస్తునందు నూతన  జీవితాన్ని ప్రారంభించండి. 

సువిశేష పఠనం: దేవుడు తనను వెదుకుతూ వచ్చిన ప్రజలకు అశాశ్వతమైన  భోజనముకై శ్రమింపుడు అంటు నేనే జీవము గల ఆహారాన్ని అని  తెలియజేశాడు. 

ప్రియా విశ్వాసులారా మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు మోషే మరియు అహరోనులు మీద నేరము మోపుతున్నారు. ఎందుకు అంటే వారు మోషేతో మేము ఐగుప్తులో చచ్చిన బాగుండేది. అక్కడ మేము మాంసమును , రొట్టెను కడుపారా భుజించితిమి. ఇప్పుడు మేమందరం ఈ ఎడారిలో ఆకలితో మలమల మాడి చంపబడడానికి మీరిద్దరు మమ్ము ఇక్కడకు తీసుకొని వచ్చారా అని దూషించారు. యిస్రాయేలు ప్రజలు, శరీరానికి దాని అవసరాలకు లొంగిపోయి, వారు పొందిన స్వతంత్రాన్ని, బానిసత్వము నుండి  రక్షణను, విడుదలను మర్చిపోయిదైవసేవకులను  దూషించారు. కాని  దేవుడైన యావే నిర్గమ  16:4లో వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై వారిని  ఈ విధంగా పరీక్షింతును అని అంటున్నాడు. ప్రభువు ప్రేమతో వారికి ఆకాశము నుండి మన్నాను మరియు వారు కడుపునిండా భుజించడానికి పూరేడు పిట్టలను దయచేసి, యావేనైన నేను మీ దేవుడనని తెలియజేశాడు. 

దేవునికి అంత తెలుసు. మనకు ఏమికావలెనో,ఎప్పుడు కావలెనో ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి  దేవుడు మనలను  పరీక్షిస్తున్నాడని మనకు అనిపిస్తే మనము దేవుని ధర్మములను అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు. అంత దేవుడే ఇస్తాడు. కాబట్టి పరీక్షింపబడినప్పుడు గొణుకుతూ, సణుగుతూ , ఎదురు తిరుగుతూ నేరం మోపుతూ కాకుండా దేవుని చిత్తానుసారం,  ఆజ్ఞానుసారం నడుచుకుందాం. 

సువిశేషంలో ప్రజలు క్రీస్తు ప్రభువును వెదుకుతూ వచ్చినప్పుడు, ప్రజలు ఎందుకు వచ్చారో వారి మనస్సులోని ఆలోచనలను తెలుసుకోని, మీరు రొట్టెను తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు.  కాని నా సూచక క్రియలను చూసి కాదు అని ప్రజలకు చెప్పియున్నాడు. దీని ద్వారా మనము ఏమి తెలుసుకోవాలంటే, దేవునికి  మనము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, మన మనస్సులోని ఆలోచనలు, ఆశలు ఏంటో తెలుసు. దేవుడు   మన ఉద్దేశాలు  ఎలాంటివి, మంచివా?  కాదా? అని ఖచ్చితంగా చెప్పగలడు. 

ఈనాడు ఎంతో  మంది ప్రజలు తమ స్వలాభాల కోసం, స్వష్టతల కోసం  దేవుని  వెదుకుచు వస్తున్నారు, కాని  నిజంగా దేవుణ్ణి నమ్మి రావడంలేదు. దేవునికి తెలుసు .  దేవుని దగ్గర నుండి అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నారు. దేవా! నాకు నీవు కావాలి అని   ఎంత మంది అడుగుతున్నారు? వరాలు కావాలి, దీవెనలు కావాలి అని దేవుని దగ్గరకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు.  కాని ఆ వారలను దీవెనలను ఇచ్చే వార ప్రధాతను నాకు నీవు కావాలి అని ఎంత మంది అడుగుతున్నాం. 

క్రీస్తు ప్రభువు అంటున్నాడు, అశాశ్వతమైం దానికై శ్రమింపవలదు. మిత్రులారారా !  ఈనాటి సమాజంలో ఎంతో మంది అశాశ్వతమైన ఈలోక  వస్తువులు, ఈలోక,  వ్యామోహం ఈలోక  సంపదల కోసం శ్రమిస్తున్నారు. ఈ లోకం శాశ్వతంకాదు. మనము ఎల్లకాలం ఈలోకంలో ఉండము. ఈ అశాశ్వ తమైన వాటి కొరకు మనం పడే శ్రమ వృధా! కాని  క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత  భోజనముకై శ్రమింపుడు అని అంటున్నాడు. మనము ఏ రకమైన  పనులు చేయాలి ఈ నిత్య జీవమును పొందాలంటే యోహాను 6: 35 వచనములో చెబుతున్నాడు. "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎప్పటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. దీని అర్ధం ఏమిటంటే మనము దేవుని యొద్దకు రావాలి, దేవుని విశ్వసించాలి. అపుడు మనకు జీవం లభిస్తుంది. 

రెండవ పఠనంలో: మనము వింటున్నాం మన పాత స్వభావమును విడిచి, మీ మనస్తత్వమును నుత్నికరించుకొనుడు. అన్యుల వలె  ఆలోచనలు గలవారిగా మీరు ప్రవర్తించకండి. మీరు సత్యమైన నీతిని మరియు పరిశుద్దతను కలిగి క్రొత్త స్వభావమును ధరింపుము. దేవుని పోలికలా  జీవించండి అని పౌలుగారు తెలుయజేస్తున్నారు. మొదటి పఠనములో యిస్రాయేలు ప్రజలు తమ పాత స్వభావమును మార్చుకోవాలి. వారు దేవుని విధులను పాటించాలని సువిశేషంలో జనులు శాశ్వతమైన వాటికొరకు శ్రమించాలని చెబుతూ మనము నీతితో పరిశుద్ధతతో క్రొత్త స్వభావమును ధరించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 

ప్రార్ధన: పరిశుద్దుడైన తండ్రి మా జీవితాలు  పరీక్షలకు గురైనప్పుడు మాకు ఓర్పును, శనమును దయచేయండి. మీ గొప్ప కార్యాలు మాయందు జరిగింపుము/ మేము మీ యొద్దకు వచ్చుటకు, మిమ్ము విశ్వసించుటకు జీవం పొందుటకు కావలసిన నీతిని పరిశుద్దతను మాకు దయచేయండి, మా పాట పాపపు  స్వభావమును మార్చుకొని నీ పోలిక  క్రొత్త స్వభావమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

18వ సామాన్య ఆదివారం

18వ సామాన్య ఆదివారం 
నిర్గమ 16:2-4,12-15, ఎఫేసీ 4:17,20-24, యోహాను 6:24-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల కొరకై ఏర్పరచినటువంటి పరలోక విందు గురించి తెలుపుచున్నవి.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నాను, పూరేడు పిట్టలను ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత భూమికి ప్రయాణమైనప్పుడు ఎడారిలో ఆకలిగొనిన సందర్భంలో వారు మోషే ప్రవక్తకు విరుద్ధముగా దేవునికి విరుద్ధముగా నడుచుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలి బాధకు తట్టుకోలేక ఐగుప్తులో వారు భుజించిన మాంసాహార భోజనాన్ని మరియు రొట్టెలను తలచుకొని అచటనే ఉండి దేవుని చేతిలో చనిపోయిన బాగుండేది అని గొణగసాగిరి. అందుకుగాను దేవుడు వారికి స్వయముగా పరలోక దూతలు భుజించే భోజనము ఒసగి ఉన్నారు. ఈ యొక్క మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. ఎడారిలో మన్నా అనేది ఒక విశ్వాస పరీక్ష ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కావలసినది మొత్తం కూడా ఒక్కసారి సమర్పించవచ్చు కానీ అలాగా చేయలేదు. ఏనాటికి మన్నా ఆనాటికే ప్రభువు ఇచ్చారు అనగా వారు దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి యందు విశ్వాసము కలిగి జీవించాలి అనే ఉద్దేశ్యం కొరకు. అదేవిధంగా ఎవరికి ఎంత కావాలో అంతే దేవుడు ఉండేలాగా చేస్తున్నారు
2. దేవుని యొక్క ఉదార స్వభావము. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధముగా మాట్లాడినప్పటికీ ప్రభువు వారి యొక్క మాటలను పట్టించుకోకుండా ఇంకా సమయం వేచి ఉండకుండా వెంటనే సహాయము చేస్తూ వారి యొక్క ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. ఎదుటివారు చేసిన తప్పిదమును గుర్తించకుండా వారి యొక్క ఆకలిని తీర్చుట చాలా గొప్పది.
3. ఫిర్యాదు చేయటం. ఇది సర్వసాధారణంగా చాలామంది యొక్క జీవితంలో చూస్తూ ఉంటా. ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, మార్తమ్మ మరియమ్మ మీద ఫిర్యాదు చేస్తున్నారు అలాగే యోహాను శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఉపవాసము ఉండటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు ఈ విధంగా చాలామంది దేవునికి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు కానీ అది మంచిదా లేక చెడా అని కొంతమంది మాత్రమే గ్రహిస్తారు. మన జీవితంలో ఏదైనా కొరతగా అనిపిస్తే వెంటనే మనము దేవునికి ఫిర్యాదు చేయటానికి ముందుంటాం కానీ ఆయనను అర్థం చేసుకునటానికి ప్రయత్నం చేయము.
4. ఇశ్రాయేలీయుల యొక్క అప నమ్మకం. దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా కాపాడిన విషయం మరచితిరి, ఫరో సైన్యమును నాశనము చేసిన విధానం మరిచితిరి అలాగే దేవుడు వారిని ఆదుకుంటారు అనే విషయంలో కూడా మరచి జీవించారు అందుకే ప్రభువు వారి విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి ఆకాశము నుండి అద్భుత రీతిగా ఈ యొక్క పరలోక భోజనమును ప్రసాదిస్తున్నారు.
5. దేవుడు మనలను పోషిస్తాడు అనే నమ్మకం లేక ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు గొణుగుతూ అపనమ్మకంతో జీవిస్తుంటాం. ఈ యొక్క శారీరక సంబంధమైన ఆకలి దప్పులను గురించే ఆలోచిస్తుంటాము గాని దేవుని వైపు మన యొక్క దృష్టి మరల్చి ఆయనపై నమ్మకంతో మన కష్టాలను ఆయన చేతులలో ఉంచడానికి వెనుకంజ వేస్తాం. మన యొక్క భౌతిక భోజనమునకు ఆరాటపడతాం కానీ ఆధ్యాత్మిక భోజనం గురించి చింతించం మన గమ్యాన్ని మరచిపోయి భౌతిక చింతలకే ప్రాధాన్యతనిస్తాం.
  ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు పాత స్వభావమును విడిచి కొత్త స్వభావమును కలిగి జీవించమని తెలుపుచున్నారు. మన యొక్క పాత స్వభావమును విడిచి పెట్టకపోతే మనలో నూతనత్వము ఉండదు.  గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది అట్లే ఉండును కానీ నశించిన దానియందు ఒక కొత్త జీవము ఉద్భవించును అలాగే మనలో పాపము ఉన్నంత కాలము మనము క్రీస్తునకు జన్మించలేం మన యొక్క పాపమునకు మరణించిన సందర్భంలో క్రీస్తు ప్రభువు మనకు జన్మించిన వారముగా ఉంటాము. దివ్య సత్ప్రసాద స్వీకరణ ద్వారా క్రీస్తు ప్రభువు మనలోనికి వేంచేసి మన యొక్క జీవితములను నూతన పరచున్నారు. పునీత పౌలు గారు తన యొక్క పాత స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు ప్రభువును వెంబడించారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ఏసుప్రభు 'నేనే జీవాహారము' అని పలుకుచున్నారు. ఏసుప్రభు 5000 మందికి ఆహారమును వసగిన తర్వాత ఆయన కఫర్నామునకు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ప్రభువును వెంబడించారు ఆ సందర్భంలో అడిగినా ప్రశ్న" ప్రభువా, మీరు ఎప్పుడూ ఇక్కడికి వచ్చితిరి? " ఈ ప్రశ్న వారు ఏసుప్రభు యొక్క బోధనలు వినటానికి అడగలేదు కేవలము వారు పోషింపబడ్డారు కాబట్టి ఏసుప్రభు దగ్గరికి వస్తే మరల వారి యొక్క శారీరక ఆకలి తీరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రభువుని ప్రశ్న అడిగారు దానికి గాను ప్రభువు శాశ్వతమైన భోజనము కొరకు శ్రమింపుడు పలికారు. 
ప్రజలు తమ యొక్క పొట్టలను నింపిన రొట్టెలను గురించి  ఆలోచిస్తున్నారు కానీ ఆ పొట్టల నింపినటువంటి దేవుడిని మాత్రము తలంచలేదు. రొట్టెలను రొట్టెలగానే స్వీకరించారు కానీ అవి దేవుని యొక్క వరము అని విశ్వసించలేకపోయారు.
ఏసుప్రభు తానే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము అని తెలుపుచూ ఈ యొక్క ఆహారమును భుజించిన అతడు ఎన్నటికీ ఆకలిగొనడు అని ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుడు మన కొరకై ప్రసాదించిన దివ్య సత్ప్రసాదం మనము ఎప్పుడు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఈ యొక్క మన్నాను భుజించి వాగ్దాత భూమికి చేరుకున్నారు. మనము కూడా ఏసుప్రభు మన కొరకై వసగిన తన యొక్క దివ్య శరీర రక్తములను భుజించి మన జీవితములను మార్చుకొని పరలోక రాజ్యములో ప్రవేశించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యసప్రసాదము పట్ల ప్రేమను గౌరవమును అలవర్చుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...