31, జనవరి 2025, శుక్రవారం

మార్కు 4 : 35 -41

 ఫిబ్రవరి 01

హెబ్రీ 11 : 1 - 2 , 8 - 19

మార్కు 4 : 35 -41

ఆ దినము సాయంసమయమున,  "మనము సరస్సు  దాటి  ఆవలి తీరమునకు  పోవుదము రండు"  అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమునువీడి  యేసును పడవలో తీసుకొనిపోయిరి, మరికొన్ని పడవలు ఆయన వెంటవెళ్లెను. అపుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి, పడవను చిందరవందర చేయుచు, దానిని ముంచి వేయునట్లుండెను. అపుడు యేసు పడవ వెనుకభాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అపుడు ఆయనను నిద్రలేపి "గురువా! తమకు ఏ మాత్రము విచారములేనట్లున్నది. మేము చనిపోవుచున్నాము" అనిరి. అపుడు యేసు లేచి, గాలిని గద్దించి, "శాంతింపుము" అని సముద్రముతో చెప్పగా, గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. "మీరింత భయపడితిరేల?మీకు విశ్వాసము లేదా? " అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ "గాలియు, సముద్రము సయితము ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో!" అని తమలో తామనుకొనిరి. 

ఈనాటి సువిశేషం పఠనంలో ప్రభువు గాలిని తుఫానను గద్దించి శాంతిపజెయడాన్ని మనం చూస్తున్నాం. ప్రభుని యొక్క శిష్యులు తమ యొక్క అవిశ్వాసం వలన భయపడి పడవలో వారితో ఉన్న ప్రభుని నిద్రనుండి మేల్కొలుపుతూ ఉన్నారు. సర్వభౌమాధికారములు కలిగిన ప్రభువు వారి మధ్య ఉన్నప్పటికీ, గాలి తుఫానులు వారిని భయకంపితులను చేశాయి. వారి భయానికి గల కారణం వారి యొక్క అవిశ్వాసం. మనము కూడా మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క చిన్న విషయానికై భయపడుతూ ఉంటాము. ఒక విషయాన్ని మరచి వేరొక ఆలోచనలను ఆలోచిస్తూ ఉంటాము. మన జీవితంలో మనము ఎదుర్కొనే సమస్యలను చూసి భయపడిపోతుంటాము. కాని  ప్రభువు మన యొక్క జీవితం అనే నావలో మనతో ఉంటూ ఉన్నారు. 

మార్కు  చెప్పినట్లుగా, పడవ విరిగిపోతుందని మరియు అందరూ చనిపోతారని శిష్యులు భయపడ్డారు. కానీ యేసు నిద్రపోతున్నాడు.  వారికి  రాబోయే వినాశనాన్ని విస్మరించినట్లు  వారు ఆయనను నిద్రలేపి, “బోధకుడా, మేము మునిగిపోయినా మీకు పట్టింపు లేదా?” అని ప్రశ్నిస్తున్నారు.  (వచనం 38). అయితే, యేసు తుఫానును ఒక మాటతో శాంతింపజేస్తాడు, కానీ ఆయన శిష్యులను ఇలా గద్దించాడు: “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా విశ్వాసం లేదా?” (వచనం 40). జీవిత తుఫానులపై యేసుకు అధికారం ఉంది, వాటిని మనతో పాటు అనుభవిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది, వాటి నుండి మనల్ని రక్షిస్తుంది మరియు మనకంటే ఎక్కువగా తనను నమ్మాలని కోరుకుంటున్నారు. శిష్యుల మాదిరిగానే, అతను మన జీవితాల్లో  ఉన్నాడని మనము  నమ్ముతున్నాము.

బహుశా అందుకే మార్కు ఈ కథను చేర్చాడు. అంతగా స్పష్టంగా తెలియని విషయం  ఏమిటంటే, యేసు నిద్రపోతున్నప్పుడు కూడా అంతే నియంత్రణలో ఉన్నాడు, శిష్యులు కూడా ఆయన చేతుల్లో సురక్షితంగా ఉన్నారు, ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా అంతే సురక్షితంగా ఉన్నారు. చాలా సార్లు, జీవితం తుఫాను నుండి తుఫానుకు నిరంతర ప్రయాణంలా ​​అనిపిస్తుంది. కనీసం నాకు కూడా అలాగే ఉంటుంది, మరియు మీకూ అలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కానీ యేసు భయపడడు, నిరాశ చెందడు అని తెలుసుకోవడంలో నేను ధైర్యంగా ఉండగలనని కూడా నేను నేర్చుకుంటున్నాను. అతను నిద్రపోవచ్చు, లేదా నిద్రపోకపోవచ్చు, కానీ ఏ విధంగానైనా, పాటలో చెప్పినట్లుగా, “ఆయన ప్రపంచమంతా తన చేతుల్లో ఉంది.” అతను మేల్కొని తుఫానును నిశ్శబ్దం చేయకపోయినా, నేను అతనితో సురక్షితంగా ఉన్నాను. మరియు అతను మేల్కొని తుఫానును నిశ్శబ్దం చేస్తే, అతను బహుశా ఇలా అంటాడు: “నీకు ఎందుకు భయం? నీకు ఇంకా విశ్వాసం లేదా?”.

ప్రార్ధన: ప్రభువా! సృష్టిని, వాతావరణాన్ని మీరు నియంత్రించగలరు. అన్నిటిని క్రమపద్ధతిలో ఉండేలా చేసేమీరు, అవి వాటి క్రమమును తప్పినప్పుడు మీరు చెప్పగానే నియంత్రంలోనికి, క్రమపద్దతి లోనికి వస్తున్నాయి. నా జీవితములో కొన్నీ సార్లు క్రమము తప్పినపుడు నన్ను క్షమించి, మీరు ఇష్టమైన వానిగా జీవించేలా చేయండి. ఎటువంటి పరిస్థితులలో కూడా మీరు నా జీవితం ఉన్నారు అని తెలుసుకొని, భయపడకుండ జీవించేల చేయండి. ఆమెన్. 

బ్ర. గుడిపూడి పవన్  

4, జనవరి 2025, శనివారం

The Feast of Epiphany

The Feast of Epiphany 
క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12

ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడుచున్నది. ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగను కూడా పిలుస్తారు. సాక్షాత్కారం అనగ ఎరుకపరచుకొనుట. దేవుడు మొట్టమొదటిగా సారిగా తన్ను తాను అన్యులకు ఎరుకపరచుకొనుట. క్రీస్తు సాక్షాత్కార పండుగ ద్వారా మానవ లోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది. 
 దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి తెరచాటు తొలగిపోయి ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నారు. ఈ యొక్క పండుగను మూడు విధాలుగా పిలుస్తుంటారు; 
1. ముగ్గురు రాజుల పండుగని 
2. విశ్వాసుల పండుగని 
3. అన్యుల క్రిస్మస్ పండుగని పిలుస్తారు
ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశము నుండి బయలుదేరి బెత్లహేమునకు చేరి దివ్య బాల యేసును దర్శించుకున్నారు. అందుకు వారు దూర ప్రాంతం నుండి ప్రయాణం చేశారు. వారు అన్యులైనప్పటికిని ప్రభువుని ఆరాధించుటకు సుదీర్ఘ ప్రయాణం చేసి బెత్లహేము చేరుకున్నారు. ఎవరు ఈ ముగ్గురు జ్ఞానులు పేర్లు ఈ విధంగా ఉన్నాయి 
1. కాస్పర్ (అరేబియా)-సాంబ్రాణిని సమర్పించారు.
2.మెల్కియోర్(ఇరాక్)-బంగారమును సమర్పించారు.
3. బల్తజార్(పర్షియా)- పరిమళ ద్రవ్యమును సమర్పించారు.
ఈ ముగ్గురు రాజులు సమర్పించినటువంటి కానుకలు ఏసుప్రభు యొక్క దైవత్వమునకు సూచనగా ఉన్నవి. 
బంగారము ఏసుప్రభు యొక్క రాజత్వమునకు గురుతుగా ఉన్నది. సాధారణంగా మనము ఎవరినైనా చూడటానికి వెళ్లేటప్పుడు వారికోసం ఏదో వస్తువులను కానీ, ఫలాలు కానీ తీసుకుని వెళుతుంటాం జ్ఞానులు కూడా ప్రభువు యొక్క జీవితమునకు సంబంధించిన  కొన్ని విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చారు 
- మొదటి కానుక బంగారం. ఈ బంగారము ఏసుప్రభు యొక్క పరిశుద్ధతకు సూచనగా కూడా ఉంది. ఏసుప్రభు పరిశుద్ధుడని ఒక జ్ఞాని గ్రహించి ఆయనకు సమర్పించుటకు ఈ యొక్క బంగారము తీసుకుని వచ్చారు. ప్రభువు యొక్క దర్శనం కలగాలంటే మనకు కూడా పరిశుద్ధ మనస్సుతో ఆయన చెంతకు రావాలి.
- సాంబ్రాణి సువాసనకు గుర్తు ఈ యొక్క సాంబ్రాణిని ధూపం వేయుటకు వినియోగిస్తారు. ఏసుప్రభువు నిత్య యాజకుడు. యాజకుడు దేవాలయంలో ధూపం వేసి దేవునికి బలులు ప్రార్థనలు సమర్పిస్తారు కావున క్రీస్తు ప్రభువు సమర్పించే బలిని సూచించుట కొరకై ఈ యొక్క సాంబ్రాణిని సమర్పించారు.
- మూడవ కానుక పరిమళ ద్రవ్యం ఇది ఏసుప్రభువు యొక్క మరణమును సూచిస్తూ ఉంది. పూర్వకాలం యూదులు మరణించినప్పుడు వారి యొక్క దేహమును పరిమళ ద్రవ్యము పోసి భద్రపరిచేవారు ఏసుప్రభువు యొక్క మరణము ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే గ్రహించి ఆయన యొక్క మరణమును సూచించుట కొరకై దైవ ప్రణాళిక ప్రకారము ఈ యొక్క పరిమళ ద్రవ్యమును సమర్పించారు. యొక్క పరిమళ ద్రవ్యమును చాలా విధాలుగా వినియోగిస్తారు; వస్త్రాలకు, శరీరంకు అలాగే మృతదేహాలకు. పరిమళ ద్రవ్యమును ముక్కు రంధ్రంలో ఉంచిన ఆ యొక్క మృతదేహం కొద్ది కాలం వరకు నశించకుండా అలాగే భద్రంగా ఉంటుంది.
ఈయొక్క ముగ్గురు జ్ఞానులలో మనం గ్రహించవలసిన కొన్ని అంశాలు 
1. జ్ఞానులలో గాఢమైన కోరిక ఉంది- లోకాలనేలే రాజును చూడాలనేటటువంటి గాఢమైనటువంటి కోరిక వారిలో ఉంది, ఆయన చూడాలని, తాకాలని, కానుకలు సమర్పించాలనే కోరిక వారిలో ఉంది
2. చీకటి నుండి వెలుగుకు ప్రయాణం. జ్ఞానులు యొక్క ప్రయాణం చీకటిలో సాగింది ఎందుకనగా కేవలం ఒక నక్షత్రమును ఆధారంగా చేసుకుని వారు బాల యేసు ఉన్న చోటును వెదికారు. మన జీవితాలు కూడా చీకటి నుండి వెలుగుకు సాగాలి. చీకటిలో ఉన్నప్పటికీ అవి వెలుగు వైపు వెళ్లాలి. కేవలము విశ్వాసము ద్వారానే నక్షత్రంను విశ్వసించి దేవుని యొక్క నక్షత్రమని తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు.
3. కానుకలు సమర్పించారు. ఏసుప్రభు యొక్క గొప్పతనమును గ్రహించి  ప్రభువునకు విలువైన కానుకలు సమర్పించారు. 
4. పాత మార్గమును విడిచిపెట్టి కొత్త మార్గము అనుసరించారు. 
5. దేవుని యొక్క మాటలకు విధేయత చూపారు 
6. దివ్య బాల యేసు నందు సాష్టాంగ పడి ప్రభువుని ఆరాధించి తమ యొక్క వినయమును వ్యక్తపరిచారు. 
ఈ విధంగా మనందరం కూడా ఈ యొక్క ముగ్గురు జ్ఞానుల నుండి నేర్చుకోవలసినటువంటి అంశాలు ఇంకెన్నో ఉన్నాయి కావున వారిని ఆదర్శంగా తీసుకుని ప్రభువుని దర్శించుకుని ఆయన యొక్క అనుభూతిని పొందుతూ జీవించటానికి ముగ్గురు జ్ఞానులు వలే ప్రతిరోజు ప్రయత్నిస్తూ చీకటి నుండి వెలుగు అయిన దేవుని చెంతకు చేరాలి. 
Fr. Bala Yesu OCD

28, డిసెంబర్ 2024, శనివారం

తిరు కుటుంబ పండుగ ఆదివారం

 తిరు కుటుంబ పండుగ ఆదివారం 

1 సమూయేలు 1:20-22, 24-28, 1 యోహాను 3:1-2, 21-24, లూకా 2:41-52

ఈనాడు తల్లి శ్రీ సభ తిరు కుటుంబ పండుగను కొనియాడుచున్నది. ఏసు మరియమ్మ మరియు ఏసేపు కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబము మరియు పవిత్రమైనటువంటి కుటుంబము అని తెలుపుతూ ఆ యొక్క కుటుంబమును మన అందరి యొక్క కుటుంబములకు ఆదర్శంగా చేసుకొనమని తల్లి శ్రీ సభ ఈనాడు మన నుండి కోరుచున్నది. ఈయొక్క కుటుంబము ఆదర్శము ఎందుకనగా, ముగ్గురు కూడా తండ్రి చిత్తమును ప్రేమిస్తూ దానిని వారి యొక్క జీవితంలో నెరవేర్చారు. పరస్పరము ఒకరిని ఒకరు సహకరించుకుంటూ జీవించారు.

తండ్రికి తమ్ము తాము సమర్పించుకుంటు జీవించారు.

ఏసుక్రీస్తు ప్రభువు దేవుడైనప్పటికీ మానవునిగా ఒక కుటుంబంలో జన్మించారు ఆ కుటుంబంలో బిడ్డలు ఎలా జీవించాలో తెలిపారు. కాబట్టి ఆయన తన తల్లిదండ్రులతో జీవించిన విధానము అందరికీ కూడా ఒక సుమాత్రుకగా ఉండాలి. మరియమ్మ గారు ఏసేపు గారు ఏ విధముగా నైతే పుణ్య దంపతులుగా జీవించారో అదే విధముగా భార్యాభర్తలు జీవించాలి. ఏసేపు మరియమ్మ గారు వారి యొక్క దాంపత్య జీవితంలో అర్థం చేసుకుంటూ, ప్రేమను పంచుకుంటూ జీవింప సాగారు. మరీ ముఖ్యంగా బాల యేసు ప్రభువును ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి వారు పొందినటువంటి అనేక శ్రమలు మనకు ఆదర్శం అవ్వాలి. దేవుని యొక్క కుటుంబంలో కూడా కష్టాలు వచ్చాయి కాబట్టి మన కుటుంబాలలో కష్టాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు మనము పడిపోకుండా ధైర్యముగా నిలబడాలి.

ఈనాటి మొదటి పఠణంలో ఎల్కాన, హన్నా తమ బిడ్డ అయినటువంటి సమూయేలును దేవాలయంలో సమర్పించిన విధానమును చదువుకుంటున్నాము. ఈ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవింప సాగారు ఎందుకనగా వారి యొక్క జీవితంలో హన్నాకు సంతానం లేని సమయంలో భర్త భార్యతో నీవు బాధపడవద్దు పది బిడ్డలకు సమానమైన భర్తను నేనున్నాను కదా అని తన భార్యను ఓదార్చి తనకు అండగా నిలబడ్డాడు. ఈ యొక్క కుటుంబము నిజముగా దేవుని మీద ఆధారపడుతూ జీవించిన కుటుంబం వారి యొక్క బిడ్డను కూడా దేవుని సేవ నిమిత్తము సమర్పించారు. ఈనాటి రెండవ పఠణంలో కూడా మనందరం కూడా దేవుని బిడ్డలం దేవుని యొక్క కుటుంబమునకు చెందిన వారసులమని తెలియజేస్తూ ఉన్నది.

ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఏసేబుగారు బాల యేసును దేవాలయములో సమర్పించిన విధానము అదేవిధంగా ఆయనను యెరుషలేము దేవాలయంలో కోల్పోయిన విధానము మరలా తిరిగి పొందుటన గురించి వింటున్నాం. ఈ యొక్క  సువిశేష భాగములో వీరిద్దరూ కూడా తమ యొక్క విధులను నెరవేర్చారు. బిడ్డ మీద ఉన్న ప్రేమతో మరల తిరిగి బిడ్డను వెదకుచు ఆయన కోసం తపించి ఉన్నారు ఇది కేవలం ఆయన మీద ఉన్న ప్రేమ వలనే. ఈ యొక్క తిరు కుటుంబము నుండి మనము కూడా గమనించవలసినటువంటి కొన్ని అంశములు ఏమిటనగా 

1. దేవుడిని కలిగి ఉన్న కుటుంబం 

2. దేవునికి విధేయించిన కుటుంబం 

3. నిస్వార్ధమైన కుటుంబం 

4. ప్రేమ కలిగిన కుటుంబం 

5. ఒకరినొకరు అర్థం చేసుకున్న కుటుంబం 

6. వినయము కలిగిన కుటుంబం

7. బాధ్యతలు నెరవేర్చిన కుటుంబం. 

ఈ యొక్క 2024వ సంవత్సర చివరి ఆదివారమున తిరు కుటుంబ పండుగ మన యొక్క కుటుంబాలు కూడా ఈ యొక్క తిరు కుటుంబమును పోలిన విధంగా ఉండాలి అని ఆలోచిస్తూ, మన కుటుంబములను సరిచేసుకుని జీవించటానికి ప్రయత్నం చేయాలి ఎందుకనగా కుటుంబమే బిడ్డలకు మొదటి పాఠశాల వారు అక్కడ నుండి అన్నీ కూడా నేర్చుకుంటారు కాబట్టి కుటుంబం మంచిదైతే సంఘం మంచిదవుతుంది, సంఘం మంచిదైతే ఊరే మంచిదవుతుంది, ఊరు మంచిదైతే రాష్ట్రం మంచిదవుతుంది ఈ విధంగా ఈ ప్రపంచమే మంచిగా అవుతుంది కాబట్టి మన కుటుంబములను సరిచేసుకుని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. 

Fr. Bala Yesu OCD

24, డిసెంబర్ 2024, మంగళవారం

క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25

"క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25
ఈనాడు యావత్ ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు జయంతి యొక్క పుట్టినరోజు పండుగను కొన్నియాడుచున్నది. ఈ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా మిగతా వారందరూ కూడా జరుపుకుంటారు ఏదో ఒక విధముగా వారి ఇంటిలో క్రిస్మస్ నక్షత్రమో, చెట్టునో ఉంచుకుంటూ వారి ఈ పండుగను జరుపుకుంటారు. 
1. క్రిస్మస్ పండుగ అందరికీ ఆనందంనిచ్ఛే ఒక పండుగ ఎందుకనగా 
-ఎన్నో వందల సంవత్సరముల నుండి ఎదురుచూస్తున్నటువంటి మెస్సయ్య జన్మించబోతున్నారు, - ప్రవక్తల యొక్క ప్రవచనములు నెరవేరబోతున్నాయి.
- దేవుని యొక్క రాకడ భూమి మీద మన జన్మంలా జరుగుచున్నది. దేవుడు ఈ భూమి మీదకు మనలాగా వచ్చి మన అందరిని కూడా పరలోకము చేర్చాలి అన్నదే ప్రభువు యొక్క కోరిక. ఇంగ్లీషులో ఒక గొప్ప మాట ఈ విధంగా రాయబడినది Jesus became so that we might become what He is. దేవుడు మానవుడు అయినది, మానవుని తనలాగా మార్చుట కొరకే. క్రీస్తు యొక్క జననము ద్వారా మనము మొట్టమొదటిసారిగా చరిత్రలో దేవుణ్ణి కనులారా చూడగలుగుతున్నాము, చెవులారా వినగలుగుతున్నాము. చేతితో తాకగలుగుతున్నాము. ఆయన యొక్క ఉనికిని మనము మన యొక్క జీవితంలో అనుభవించగలుగుతున్నాం. ఇది కేవలం దేవుడు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమ వలన మాత్రమే చేసినటువంటి గొప్పదైనటువంటి పని. 
ఎందుకు దేవుడు మానవుడు అయ్యారు అని మనం ఇంకా ధ్యానించినట్లయితే ప్రభువు పతనమైనటువంటి మానవలోకమును రక్షించుట కొరకు, తప్పిపోయిన గొర్రెలను వెదకుట కొరకు, మనందరికీ పరలోక మార్గము చూపుట కొరకు ఆయన మనలాగా మారి మన మధ్యన నివసించారు. ఒక చిన్న సంఘటన మనకు ఇంకా క్లుప్తంగా ఈ అంశం గురించి వివరిస్తుంది. ఒక మంచు కురిసే(మంచు గడ్డ కట్టే స్థలం) ప్రాంతంలో ఒక రోజున కొన్ని పక్షులు ఒక భక్తుడు యొక్క ఇంటి దగ్గర చెట్టు మీద వాలి ఉన్నాయి అయితే బయట చాలా చలిగా, మంచు గడ్డలు కట్టడం వల్ల అక్కడున్నటువంటి పక్షులన్నీ కూడా ఎటు వెళ్లాలో తెలియక దీనస్థితిలో ఉన్నాయి వాటి పరిస్థితిని చూసినటువంటి ఆ భక్తుడు ఎలాగైనా సరే వాటిని రక్షించాలనుకున్నాడు కానీ అది ఎలా అని ఆయనకు తోచలేదు అప్పుడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక షెడ్డులో కొంచెం మేత పెట్టి వాటిని లోపలికి పిలవటానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడున్న పక్షులు ఆయన మాట విని లోపలికి రాలేకపోయాయి ఎందుకంటే ఆయన స్వరాన్ని అవి గుర్తించలేకపోయాయి అప్పుడు ఆయన తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు నేను కూడా ఒక పక్షినైతే ఈ పక్షులన్నీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లి బ్రతికించి ఉండే  వాడినని భావించాడు. ఈ యొక్క విషయము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఎవరైతే ఇతరుల యొక్క స్వభావంలోకి వెళుతుంటారో, ఇతరులు లాగా మారతారు అప్పుడు వారికి అనేక విషయాలు తెలియచేసి వారిని రక్షించవచ్చు. దేవుడు కూడా చేసినటువంటి గొప్ప పని ఇదే మనలాగా వచ్చి మనందరినీ పరలోకం చేర్చాలనుకున్నారు, మనకు అనేక విషయాలు మన స్వభావంలో అర్థమయ్యే విధంగా తెలిపి మనలను మార్చాలనుకున్నారు. ఇది ఒక సంతోషకరమైనటువంటిది మానవాళి ఆనందమునుంచే వార్త.
.2. క్రిస్మస్ పండుగ మార్చే పండుగ అనగా భూలోకాన్ని పరలోకముగా మార్చినటువంటి గొప్ప పండుగ. దేవుడు ఉన్న స్థలము పరలోకం అదే దేవుడు భూలోకమునకు వచ్చి పరలోకంగా మార్చారు. మనకు  పరలోక అనుభూతిని కలుగ చేశారు. ఏసుప్రభు తన యొక్క రాకతో ఎందరినో మార్చారు మరి ఆయన రాకడ మనల్ని మార్చగలుగుతుందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏసుప్రభు తన మాటల ద్వారా క్రియల ద్వారా సాన్నిధ్యం ద్వారా అనేక మందిని మార్చారు.
3.  క్రిస్మస్ అనగా దేవుడు మానవులకు దగ్గరైన వేళ. దేవుడు మానవులకు ప్రేమను పంచుటకు దగ్గరగ వచ్చారు మరి మనము దేవుని కొరకు రాగలుగుతున్నామా? ప్రభువే తన చిత్తము ప్రకారముగా మన కొరకు తన యొక్క మహిమాన్వితమైనటువంటి స్థలమును విడిచి మన కొరకు వచ్చారు. మనము దేవుని కొరకు దేవాలయానికి వస్తున్నామా?
రక్షకుని యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న అందరూ కూడా కలిసి ఆనందంగా ఈ పండుగ కొనియాడుతూ, ప్రేమను పంచుతూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దేవుడిని ఆరాధిస్తూ ఈ యొక్క పుట్టినరోజు పండుగను కొనియాడాలి.

Fr. Bala Yesu OCD

21, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం 
మీకా 5:1-4 హెబ్రీ 10: 5-10 లూకా1:39-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ఏసుప్రభు యొక్క ఆగమనం కోసం ఎదురు చూసే వారందరిలో ఆయన యొక్క జన్మం జరుగుతుంది అనే అంశము గురించి తెలియజేయు చున్నవి. దేవుని ప్రణాళికకు సహకరిస్తూ ఆ ప్రణాళికను వ్యక్తిగత జీవితంలో అమలు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరిలో దేవుడు జన్మిస్తారు.  ప్రభువు యొక్క జన్మదినం త్వరగా రాబోవుచున్నది కాబట్టి ఆయన రాక కొరకు ఆధ్యాత్మికంగా తయారవ్వాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు మీకా ప్రవక్త ద్వారా చేసినటువంటి వాగ్దానములను తప్పనిసరిగా నెరవేరుస్తారు అనే విషయమును తెలుపుచున్నారు. బెత్లెహేము నుండి రక్షకుడు ఉదయిస్తాడు అని ప్రవక్త తెలియజేశారు. దీనిలో ఒక అర్థము ఉన్నది. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు బెత్లహేముని ఎన్నుకున్నారు రక్షకుని జన్మస్థలంగా? మొదటిగా బెత్లహేము అనగా హౌస్ ఆఫ్  ద బ్రెడ్ అని అదేవిధంగా దేవుని యొక్క నిలయము అని అర్థం కావున అక్కడినుండి రక్షకుడు జన్మిస్తారు. బెత్లహేము లేవీయులకు కేంద్ర స్థానంగా ఉన్నది. బెత్లహేము దావీదు రాజు యొక్క జన్మస్థలం. ఇశ్రాయేలును పరిపాలించే పాలకుడు మరియు దేవుడు పంపబోయే వ్యక్తి క్రీస్తు ప్రభువే ఎందుకంటే దేవుడు మరియమ్మకు ప్రత్యక్షమైన సమయంలో తనతో పలికిన మాటలు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అన్నారు.( లూకా 1:33). దేవుడు చిన్నదైనటువంటి బెత్లహేమును ఎన్నుకొని ఆ ప్రదేశమునకు రక్షకుని జన్మస్థలమును అర్థము  ఇస్తున్నారు. ఎఫ్రాతా అనేది ఒక చిన్న గ్రామం దానికి పెద్ద గుర్తింపులేదు అయితే దేవుడు మాత్రము ఆ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక గొప్ప ప్రాంతమును ఎన్నుకొనక కేవలం గుర్తింపు లేని అతి సామాన్యమైన ప్రాంతమున ఎన్నుకొని దానికి ఒక గొప్పదైన అర్థం ఇస్తున్నారు. మన జీవితంలో ప్రముఖమైన స్థలంలో జీవించడానికి ప్రయత్నిస్తాం కానీ దేవుడు మాత్రం ఒక చిన్నదైనటువంటి గుర్తింపు లేని స్థలము ఎన్నుకొని అక్కడ జన్మిస్తున్నారు.
దేవుడు అల్పులైనటువంటి చేపలు పట్టే శిష్యులను ఎన్నుకొని వారిని గొప్పవారిగా తీర్చిదిద్దారు సామాన్యురాలు అయినటువంటి మరియమ్మ గారిని ఎన్నుకొని దేవుని తల్లిగా చేశారు కాబట్టి ప్రభువు అల్పమైనటువంటి ప్రాంతంలో జన్మించి ఆ ప్రాంతములకే కొత్తదైన అర్థం ఇస్తున్నారు ఈ క్రిస్మస్ కాలమున అల్పుల మైనటువంటి మనలో జన్మించి మన యొక్క జీవితమునకు కూడా కొత్త అర్థమును దయ చేస్తారు. 
ఈనాటి రెండవ పఠణంలో ఏసు క్రీస్తు ప్రభువు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అని తెలియజేశారు. 
ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఎలిజబెతమ్మను సందర్శించుట గురించి వింటున్నాం దేవదూత వద్ద నుండి శుభ వచనము విన్న మరియ మాత వెంటనే తన చుట్టమైన ఎలిజబెతమ్మను కలుసుకొనుటకు వెళ్ళుచున్నారు. దాదాపుగా నాలుగు రోజుల ప్రయాణం చేసి విసుగు చెందకుండా నజరేతు నుండి యూదయా పట్టణంలో ఉన్న  అయిన్ కరీము అనే ప్రాంతమునకు మరియ తల్లి 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి  ఎలిజబెత్తమ్మను కలుసుకున్నారు. ఈ యొక్క సువిశేష పట్టణములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. అడగక మునుపే సహాయము చేయుట. మరియ తల్లిని ఎలిజబెత్తమ్మ సహాయము చేయమని పిలవలేదు కానీ మరియమ్మ గారే ఎలిజబెత్ పరిస్థితిని అర్థం చేసుకొని వారికి సహాయం చేయుటకు వెళ్లారు. కానా పల్లెలో కూడా మరియ తల్లియే చొరవ తీసుకొని వారు అడగకమునుపే సహాయం చేశారు. మన క్రైస్తవ జీవితంలో కూడా చాలా సందర్భంలో మనం ఇతరులు మనల్ని అడగాలనుకుంటాం అప్పుడే సహాయం చేస్తాం కానీ మరియ తల్లి యొక్క గొప్పతనం ఏమిటంటే అడగకపోయినా సహాయం చేసే గుణం అని మనం నేర్చుకోవాలి. 
2. ఆనందమును పంచుకొనుట. మరియమ్మ గారు దేవునికి తల్లిగా పిలవబడిన సమయంలో తన యొక్క ఆనందమును తన చుట్టమైన ఎలిజబెత్తమ్మతో పంచుకొనుటకు ఆనందముతో పరిగెడుచున్నారు. దైవ అనుభూతిని కలిగిన మరియమ్మ గారు ఇంకొక వ్యక్తిని సందర్శిస్తూ తన దైవ అనుభూతిని మరియు ఆనందమును ఇతరులకు ఇస్తున్నారు. మనం కూడా క్రైస్తవ జీవితంలో ఇతరులకు ఆనందం నివ్వటానికి ప్రయత్నించాలి. 
3. మరియమ్మ గారి యొక్క వినయం. మరియమ్మ గారు కూడా గర్భము ధరించి ఉన్నారు తాను కూడా ఇతరుల యొక్క సహాయం కావలసిన వారే కానీ తాను తన యొక్క సహాయం చూసుకోకుండా ఇతరులకు సహాయం చేయాలని తనను తాను తగ్గించుకొని ఎలిజబెత్ దగ్గరకు వెళుతుంది. వాస్తవానికి మరియమ్మ గారు దేవునికి తల్లిగా ఉండబోతున్నారు ఎలిజబెతమ్మ ప్రవక్తకు తల్లిగా ఉండబోతున్నారు ఈ సందర్భంలో మరియమ్మ గారి దేవుని తల్లి అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకొని సేవాభావంతో ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్లి సేవ చేస్తున్నారు.
4. ఎలిజబెతమ్మ తన వయసులో చిన్నదైనా మరియమ్మ గారికి నమస్కరించి నా దేవుని యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను అని మరియమ్మ గారిని గౌరవించి నమస్కరించినది మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకన్నా చిన్న వయసులో ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనమును మంచితనము చూసినప్పుడు వారిని కూడా గౌరవించాలి. జీవం పోసిన దేవునికి జీవమునిచ్చుటకు నిన్ను తల్లిగా దేవుడు ఎన్నుకున్నారని ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారిని గౌరవించారు.
ఈనాటి ఈ యొక్క దివ్యగంధ పఠణముల ద్వారా మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికను అంగీకరిస్తూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తూ జీవించాలి. మన యొక్క జీవితంలో ప్రభువు కొరకు తయారు చేసుకోవాలి. మరియ తల్లి మరియు ఎలిజబెతమ్మవలే ఇతరులకు సహాయం చేస్తూ, ప్రేమను పంచుతూ జీవించాలి. 
Fr. Bala Yesu OCD

14, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల మూడవ ఆదివారం

ఆగమన కాల మూడవ ఆదివారం 
జెఫాన్య 3:14-18, ఫిలిప్పీ 4: 4-7 లూకా 3:10-18
ఈనాటి ఆదివారమును తల్లి శ్రీ సభ "ఆనందించు"(Gaudete Sunday)ఆదివారంగా పిలుస్తున్నది ఎందుకనగా ప్రభువు యొక్క జన్మము ఆసన్నమవుతున్నది కాబట్టి మనము సంతోషించాలి. ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు మనకు బోధించుచున్నటువంటి అంశము కూడా ఆనందించుట గురించియే. ఎందుకు మనము ఆనందించాలి అనే అంశమును ధ్యానించినట్లయితే మనకు అనేక విషయములు జ్ఞాపకం వస్తాయి;
- మనలను రక్షించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనతో ఉండే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
-  మనల్ని ప్రేమించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనల్ని క్షమించే దేవుడు వస్తున్నాడు కాబట్టి సంతోషించాలి
- మనలను పరలోకం చేర్చే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి ఈ విధంగా దేవుని యొక్క అనేక అంశములను గురించి మనము ఆనందించాలి.
ఏ విధముగానయితే మనము ప్రార్ధించినప్పుడు దేవుడు మనకు దయచేసినప్పుడు మనం ఆనందిస్తామో, అదేవిధంగా చిన్నపిల్లలు తమకు నచ్చిన దానిని వారు పొందుతున్నప్పుడు ఆనందిస్తారు మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మనలను తండ్రి వైపుకు నడిపించే ప్రభువు రాబోతున్నందుకు మనం కూడా సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో జెఫన్యా ప్రవక్త ఇశ్రాయేలును, యెరుషలేమును సంతోషించమని తెలుపుచున్నారు. ప్రభువు వారి మీద ఉన్నటువంటి నిందలను తొలగించినందుకుగాను అదే విధముగా వారిని శత్రువుల యొక్క భారి నుండి కాపాడినందుకు సంతోషించమని తెలుపుతున్నారు. దేవుడు వారి యొక్క మధ్య ఉన్నందుకు, దేవుడు వారిని క్రింద పడనివ్వకుండా చూసుకుంటున్నందుకు అదే విధముగా వారికి నూతన జీవితమున వసుగుతున్నందుకుగాను ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను, యెరుషలేము వాసులను సంతోషించమని తెలుపుచున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు బానిసత్వమునకు పంపబడిన సమయంలో వారి నుండి స్వేచ్ఛ, ఆనందం తీసివేయబడినది ఇప్పుడు మరొకసారి దేవుడు వారిని విముక్తులను చేస్తూ వారికి ఇవ్వవలసినటువంటి ఆనందమును దయచేస్తున్నారు అందుకే ప్రవక్త ఆనందించండి అని తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు ప్రభువు నందు ఆనందించండి మహా ఆనందపడండి అని పలుకుతున్నారు. ప్రభువు యొక్క రాకడ కొరకై విచారింపక హృదయపూర్వకంగా ప్రార్థించమని పౌలు గారు తెలిపారు. పౌలు గారు ఫిలిప్ప ప్రజలకు దేవుని వాక్యము ప్రకటించు సందర్భంలో పరిసయ్యుల వలన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఫిలిప్పు ప్రజలను కూడా వారి జీవితంలో ఎదురయ్యే శ్రమలకు చింతింపక దేవునియందు నమ్మకంతో  వారిని హృదయపూర్వకంగా ప్రార్ధించమంటున్నారు వారి శ్రమలు కొద్ది కాలమే అంటున్నారు. ప్రభువు వస్తారు కావున ఆనందించమని అదే విధంగా మహా ఆనందంతో ఉండమని తెలుపుచున్నారు.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారి మాటలు విన్న ప్రజలు వెంటనే హృదయ పరివర్తనమునకు చెందిన క్రియలను చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు.ఎవరైతే రెండు అంగీలను కలిగి ఉన్నారో వారు లేని వారికి ఒకటి ఇమ్మని తెలుపుతున్నారు అదేవిధంగా భోజన పదార్థములు కలిగిన వారు లేనివారికి ఇవ్వమని తెలుపుతున్నారు. ఈ మాటలు యొక్క సారాంశం ఏమిటంటే దేవుడు ఇచ్చిన దానిని ఉదారంగా ఇతరులతో పంచుకుని జీవించమని యోహాను గారు తెలుపుతున్నారు. అదేవిధంగా సుంకరులను అధిక సుంకమ వసూలు చేయవద్దంటున్నారు, అలాగే రక్షక భటులు వచ్చి అడిగినప్పుడు ఎవరికి కూడా హాని చేయకుండా న్యాయముగా వారిపట్ల ప్రవర్తించమని బప్తిస్మ  యోహాను గారు తెలిపారు. వాస్తవానికి ఈ మూడు అంశాలు కూడా సంతోషించదగినటువంటి అంశములే ఎందుకంటే వారు హృదయ పరివర్తనము చెంది ఇతరులకు సంతోషించే విధంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే యోహాను గారు వారిని హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలి రమ్మంటున్నారో వెంటనే వారిలో ఉన్న పాపమును గ్రహించి  మెస్సయ్యాను స్వీకరించుట కొరకై తగినటువంటి క్రియలు చేయుటకు సిద్ధముగా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీకి, మీలో పాపము చేయని వ్యక్తి ఈమె మీద మొదటి రాయిని వేయమన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ వారిలో ఉన్న పాపమును గ్రహించి వెంటనే తిరిగి వెళ్ళారు. ఈ యొక్క సువిషేశ భాగములో వున్న వ్యక్తులు కూడా వారి పాపపు జీవితమును సరి చేసుకొనుటకు సిద్ధపడుతున్నారు దాని వలన ఈ సమాజము కూడా సంతోషిస్తూ ఉన్నది. ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే నేను ఇతరులకు సంతోషిస్తున్నానా?. నా వలన నలుగురు సంతోషపడుతున్నారా?. నా రక్షకుని రాకడ కొరకు ఎదురుచూస్తున్నానా? నేను సంతోషంగా జీవిస్తున్నా? అని పరిశీలన చేసుకొని జీవించాలి.
మనం ఆనందంగా ఉండుట కొరకై ప్రభువు వస్తున్నారు కాబట్టి ప్రతినిత్యం కూడా ఆనందంగా జీవించడానికి పాపము లేకుండా పుణ్య క్రియలు చేస్తూ జీవిద్దాం. 
Fr. Bala Yesu OCD

7, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం 
బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆగమన కాలంలో రెండవ మరియు మూడవ ఆదివారములో బప్తిస్మ యోహాను సందేశమును వింటుంటాం. దేవుని యొక్క రాకడ కొరకై మనందరం కూడా మన జీవితంలో మార్గమును సిద్ధము చేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణమునకు ఒక మార్గము అనేది తప్పనిసరిగా అవసరం ఎందుకంటే మార్గము లేనిదే ప్రయాణము సక్రమంగా జరగదు, గమ్యమును చేరలేము. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత్మ భూమికి నడిచే సమయములో దేవుడే స్వయముగా వారికి మార్గ సూపరిగా ఉండి వారిని నడిపించారు. మార్గము లేని జీవితము గమ్యము చేరటము కష్టం.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు స్వయంగా తన ప్రజల కొరకు బాబిలోనియా నుండి యెరుషలేమునకు మార్గమును సిద్ధం చేస్తారని తెలుపుతున్నారు కనుక బారుకు ప్రవక్త దుఃఖించే ఇశ్రాయేలు ప్రజలను సంతోషించమని తెలుపుచున్నారు. బారుకు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను దేవుని చెంతకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వారి యొక్క బానిసత్వం ముగిసిన తర్వాత తిరిగి దేవుని చెంతకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా మన యొక్క పాపపు జీవితమును వదిలి, దేవుని చెంతకు తిరిగి రావాలి అదే ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువు ఇశ్రాయేలు ప్రజల కొరకై తానే స్వయంగా మార్గమును సిద్ధం చేస్తున్నారు లోయలు పుడ్చుతున్నారు. ప్రభువు తన ప్రజలకు ఒక మంచి మార్గమును ఏర్పరిచి వారిని సంతోషంగా ఉండులాగా చేస్తారని బారుకు ప్రవక్త తెలియజేశారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులను దేవుని యొక్క రాకడ కొరకై సంసిద్ధత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రార్థించుకొనమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో యోహాను గారు ప్రభువు యొక్క రాకడ కొరకై మార్గమును సిద్ధం చేయుడని  వెలిగెత్తి యోర్థను నది తీరమున ప్రకటించుచుండెను. బప్తిస్మ యోహాను ఈ లోకమునకు వచ్చినదే యేసు ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకు దాని ద్వారా ఏసుప్రభు ఇంకా త్వరగా తండ్రి పరిచర్యను ఈ లోకంలో చేయవచ్చు కాబట్టి.
మన జీవితంలో దేవుని యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయని యెడల దేవుడు మన ఇంటి గుండా ప్రవేశించరు, మనలోకి ప్రవేశించరు. మన యొక్క జీవితంకు మార్గమును హృదయ పరివర్తన ద్వారా, చెడును విడిచి పెట్టుట ద్వారా ఏర్పరచవచ్చు అప్పుడు దేవుడు మనలోకి ప్రవేశిస్తారు. మార్గమును సిద్ధం చేయుట చాలా కష్టం ఎందుకంటే అడ్డుగా ఉన్నటువంటి ప్రతిది కూడా తొలగించాలి అప్పుడే మార్గము ఏర్పరచగలరు కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు ఏదైతే అడ్డుగా ఉంటుందో మనము దానిని తీసివేయాలి. ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయమని ఎడారిలో ఒక స్వరము వినబడెను అని యెషయా ప్రవక్త తెలియజేశారు. ఎడారి అనునది దేవుడిని కలుసుకునే ఒక స్థలం, మన జీవితాలు మార్చు స్థలం. మనము ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటారు అని తెలిపే ఒక ప్రదేశం. హాగారు ఎడారిలో ఉండగా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నారు. ఏలియా నిర్జన ప్రదేశంలో ఉండగా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎడారి వలె నిరుత్సాహమైనటువంటి సమయములు ఎదురైనప్పుడు మనము దైవ అనుభూతిని పొందగలము. దేవుడు మనకు తోడుగా ఉంటారు.
ప్రతి లోయ పూడ్చబడును అని తెలుపుతున్నారు అనగా మనలో మనలో ఉన్నటువంటి అసమానతలను దేవుడు తన యొక్క వాక్యము ద్వారా దివ్య సంస్కారాలు ద్వారా నింపుతూ సరిసమానం చేస్తారు. అదేవిధంగా పర్వతాలు కొండలు సమము చేయబడాలి అనగా మనలో ఉన్నటువంటి గర్వము, అహము అనేటటువంటి చెడు గుణములను సమానము చేయాలి అనగా వినయము కలిగి జీవించాలి. వక్రమార్గములు సరిచేయాలి అనగా మన యొక్క జీవనశైలిని మార్చుకోవాలి. ప్రభువుకి మన హృదయములో మార్గము సిద్ధము చేయాలంటే మన గర్వమును తగ్గించుకోవాలి, పాపపు జీవితాన్ని విస్మరించాలి. పరిత్యజించుకునే లక్షణము కలిగి ఉండాలి. ఈ యొక్క ఆగమన కాల రెండవ ఆదివారంలో మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటంటే దేవుని కొరకు మనము మన జీవితంలో ఎలాంటి మార్గమును సిద్ధం చేస్తున్నాం?. ఆయన కొరకు అడ్డుగా ఉన్నటువంటి పాపమును తొలగించుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా.? హృదయ పరివర్తనం చెందుతున్నామా లేదా? పాపక్షమాపణను కలిగి ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

30, నవంబర్ 2024, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం 
యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36
ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంతో ఒక కొత్త దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఈ యొక్క ఆగమన కాలంలో మనము ప్రభువు యొక్క జన్మము కొరకై/రాకడ కొరకై ఎదురుచూస్తూ ఉన్నాం. ఆగమన కాలము ఒక ప్రత్యేకమైన కాలం ఎందుకనగా ఏసుప్రభు యొక్క పుట్టినరోజు కొరకై మనందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క కాలములో మనము మన హృదయములను పవిత్ర పరచుకొని ఆయన కొరకు ఎదురు చూస్తుంటాం. 
ఏసుప్రభు అనేక విధాలుగా మన మధ్యలోనికి వస్తారు. దివ్య సత్ప్రసాదం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము చదవడం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా అనేక విధాలుగా ప్రభువు మన మధ్యకు వస్తూ ఉంటారు. ఈ యొక్క ఆగమన కాలంలో దేవుని యొక్క జన్మం మనందరి యొక్క హృదయములలో ప్రత్యేకంగా జరగాలని మనము ఆధ్యాత్మికంగా తయారవుతాం. 
ఈనాటి దివ్య గ్రంథ పఠణములు కూడా ప్రభువు రాకడ గురించి, నిరీక్షించుట గురించి, విశ్వాసముతో ఉండుటను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త దేవుని యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు. యూదా ప్రజలు దేవుడిని మరచి, తన యొక్క ఆజ్ఞలను మీరారు. దేవుని యొక్క ప్రజలను నడిపించే రాజులు కూడా దేవుని ప్రవక్త అయినా యిర్మియా మాటలను వినలేదు అందుకే శిక్ష అనుభవించారు. దేవుని యొక్క శిక్ష అనుభవించిన తర్వాత దేవుడు వారికి ఒక సంతోష వార్తను తెలియజేస్తున్నారు. కరుణ గలిగిన దేవుడు వారిని రక్షించుటకు దావీదు వంశము నుండి ఒక రాజును ఎన్నుకుంటానన్నారు. ఆ రాజు నీతి కలిగిన రాజు. ఆయన అందరికీ న్యాయం చేకూర్చే రాజు. ఆయన ప్రజలకు చేసిన ప్రతి ప్రమాణములను నిలబెట్టుకునే రాజు. 
యావే ప్రభువు ప్రజలకు ఒక ఆదరణ కర్త అయినటువంటి రాజును పంపిస్తూ వారికి కావలసిన స్వేచ్ఛను, స్వతంత్రమును దయ చేస్తారని చెప్పారు.
 దేవుడిచ్చిన వాగ్దానములను నెరవేరుస్తారు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు తనని ఆశీర్వదిస్తానని అది నెరవేర్చారు.(ఆది12:1-3)
ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి కాపాడుతానని వాగ్దానం చేశారు దానిని నెరవేర్చారు (నిర్గమ 3:7-8)
దేవుడు రక్షకుడిని పంపిస్తానని ప్రవక్తల ద్వారా తెలియజేశారు దానిని క్రీస్తు జన్మము ద్వారా నెరవేర్చారు కాబట్టి ప్రభువు ఇచ్చిన వాగ్దానములను తప్పక నెరవేరుస్తారని మనము విశ్వసించాలి.
రక్షకుడు వచ్చే కాలం యూదా రక్షణము పొందును అని ప్రవక్త తెలుపుతున్నారు అనగా క్రీస్తు ప్రభువు ద్వారా అందరూ రక్షించబడతారని అర్థం. ఎన్నో సంవత్సరాల నుండి ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తున్నారు అది క్రీస్తు ప్రభువు ద్వారానే నెరవేరుతుందని యిర్మియా ప్రవక్త తెలియజేశారు. దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజు అదే విధముగా ఆయన వంశము నుండి జన్మింపనున్న రాజు కూడా అదే విధముగా తన ప్రజలను పరిపాలించును. ఆ రాజు ఈ లోకంలో జన్మించిన సందర్భంలో దేవుని యొక్క రక్షణ దినము అనేది రానున్నది, ఆ దినము ప్రజల నుండి భయమును తొలగించును, బానిసత్వమును దూరం చెయ్యను ఇదంతా కేవలం నీతి గల రాజు అయినటువంటి క్రీస్తు ద్వారానే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆయన కొరకు ఆశతో ఎదురు చూడాలని కూడా ప్రవక్త తన ప్రజలకు తెలియజేశారు. వాస్తవానికి ఎదురు చూడటంలో ఆనందం ఉంది, ఎదురు చూడటంలో ఆశ ఉంది, నమ్మకం ఉంది, సహనం, ప్రేమ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యిర్మియా ప్రవక్త ప్రజలకు రక్షకుడు వేంచేయు కాలం గురించి ఒక సంతోష వార్తను తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజల్లో పరస్పరమ ప్రేమ పెంచాలని అదేవిధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఎల్లప్పుడూ కనబరుచుకొని జీవించాలని తెలియజేశారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా స్వచ్ఛమైన మరియు నిస్వార్ధమైన ప్రేమను చూపించాలని పౌలు గారు తెలియజేశారు. తాను ఏ విధంగానైతే వారి మధ్య మెలిగారో అదే విధముగా ఒకరి ఎడల ఒకరు ప్రవర్తించాలని కోరుకున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడ కొరకై మనలను సంసిద్ధమై ఉండమని తెలియచేస్తున్నారు
ప్రకృతిలో జరుగు మార్పులను గురించి ఏసు ప్రభువే స్వయముగా తెలియచేస్తున్నారు. ఎన్ని విపత్తులు ఎదురైనా మనం దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. ప్రభు అనేక సందర్భాలలో నేను మీకు సర్వదా తోడై యుండును అని తెలియజేశారు కాబట్టి ఆయన మనతో అన్నివేళలా ఉంటారని మనం దృఢముగా విశ్వసించాలి. ఆయన యొక్క రాకడ కోసం మనం ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉండాలి అదియే క్రైస్తవ విశ్వాసం. ఆటంకములకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధ్యత లేకుండా సుఖ సంతోషాలతో శారీరకవాంఛలకు లోనై ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తే దేవుని సంతృప్తి పరచలేము కావున పరిశుద్ధత కలిగి జీవించాలి మన యొక్క జీవితములను మనము ప్రభువు యొక్క రాకడ కొరకై తయారు చేసుకోవాలి. ప్రభువు మన కొరకై, మనలో ఉండుట కొరకై వస్తున్నారు కాబట్టి ఆయన కొరకు మన హృదయమును పవిత్ర పరచుకొని ఆయనను మనలో ఆహ్వానించు కోవాలి.
Fr. Bala Yesu OCD

23, నవంబర్ 2024, శనివారం

34వ సామాన్య ఆదివారం

34వ సామాన్య ఆదివారం
విశ్వవిబుడైన క్రీస్తు రాజు యొక్క మహోత్సవము.
దానియేలు 7:13-14,దర్శన 1:5-8, యోహాను 18:33-34
1 కొరింతి 15:20-26, 28
మత్తయి 25:31-46

ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవమును కొనియాడుతున్నది, 1925 వ సంవత్సరంలో 11వ భక్తినాధ పాపు గారు  ఈ పండుగను ప్రారంభించియున్నారు. 20వ శతాబ్దంలో యూరప్ దేశములో అధికారుల యొక్క పాలన కఠినంగా ఉండటంవల్ల, అప్పటి అధికారులు ప్రజలకు ప్రాముఖ్యతను వారి యొక్క అధికారంకు ప్రాముఖ్యతనిచ్చి జీవించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, జాతుల మధ్య వివక్షతను తీసుకుని వచ్చి ఉన్నారు. కొంతమంది దేవుడంటే విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో జీవించే వారు, అదేవిధంగా కొంతమంది యూదులను బంధించి చెరసాలలో వేసి చంపారు. ఈ విధంగా అధికారులు తమ యొక్క స్వార్థం కొరకై అధికారమును వినియోగించుకునే సందర్భంలో 11వ భక్తనాధ పాపు గారు ఆనాటి  అధికారులకు, ప్రజలందరికీ క్రీస్తు ప్రభువు యొక్క అధికారం  ఏ విధంగా ఉన్నది తెలియజేశారు. ఈ విశ్వమంతటికి క్రీస్తు ప్రభువే రాజు అని ప్రకటించి, మన హృదయ పీఠాలపై క్రీస్తు రాజుని ప్రతిష్టించుకోమని అదే విధముగా మన జీవితాలను ఆయన ఆధీనమునకు అప్పగించుమని పాపుగారు ప్రోత్సహించారు. 
పరిశుద్ధ గ్రంథం మరీ ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం క్రీస్తు ప్రభువును రాజుగా చూపిస్తుంది,ఆయన రాజ్యపాలన గురించి ప్రవక్తలు ముందుగానే తెలియచేశారు.
యెషయా 9:6-7, యిర్మీయా 23:5, దానియేలు 7:13-14. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మరియ తల్లితో 'తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యుగయుగములు యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యముకు అంతమే ఉండదు అని తెలియజేశారు'. పిలాతు కూడా ఏసుప్రభువుతో సంభాషించేటప్పుడు "నీవు యూదుల రాజువా"? అని అడుగారు. నీవే అంటున్నావు కదా అని ఏసుప్రభు తెలిపారు. ఆయన రాజు అని పవిత్ర గ్రంథములో చెప్పబడినది కాబట్టి మనందరం కూడా ఆయన  మన యొక్క రాజు అని గ్రహించి  ఆయన చెప్పిన విధముగా జీవింపసాగాలి.
ఈ లోకంలో ఎంతో మంది రాజుల గురించి మనము చదువు కొని ఉండవచ్చు, విని ఉండవచ్చు. ఏసుప్రభు యొక్క రాజరికం ఈ లోక రాజుల యొక్క పాలనకు భిన్నంగా ఉంటుంది. సిలువయే ఆయన సింహాసనం, ముళ్ళ కిరీటమే ఆయన రాజు కిరీటం, చేతిలోని దండమే తన యొక్క అధికారమునకు గుర్తు. పేద సాధలే తన యొక్క ప్రజలు. పరలోకమే తన రాజ్యం.
 ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పాలన చేసి ఉన్నారో మనందరం గ్రహించాలి, ఆయన మరణము తర్వాత కూడా ఒక తీర్పరి అయిన రాజుగా మనలను పరిపాలన చేస్తారు.
క్రీస్తు ప్రభువు ఎలాంటి రాజు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సేవ భావం కలిగిన రాజు- ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది సేవ చేయుటకే కానీ సేవింపబడుటకు కాదు. ఈ లోకంలో ఉన్న రాజులు ప్రతినిత్యం కూడా ఎదుటి వారి యొక్క సేవలను అందుకునే వారే, వారి యొక్క సుఖభోగాలు పేరు ప్రతిష్టల కొరకు పాలన చేసేవారు కానీ క్రీస్తు ప్రభువు ప్రతినిత్యం ఇతరులకు సేవ చేస్తూ వారి శ్రేయస్సు కొరకు జీవించారు.
2. ఆయన క్షమించే రాజు- ఏసుప్రభు శిలువ మీద వ్రేలాడే సమయములో తండ్రికి ప్రార్థన చేసినది ఏమనగా 'తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు ఎరుగరు కావున వీరిని క్షమించు' అని ప్రార్థన చేశారు. తన ప్రజలు తనకు విరుద్ధముగా చేసినటువంటి పాపములను క్షమించమని క్రీస్తు రాజు తన తండ్రిని ప్రార్థించారు. ఆయన మనందరి పాపములను క్షమించే రాజు.
3. ప్రేమించే రాజు- నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని తెలుపుచు, వారి కొరకు తన ప్రాణమును త్యాగం చేసినటువంటి గొప్ప రాజు క్రీస్తు ప్రభువు. ఆయన ప్రేమ ఎటువంటి భేదము లేనటువంటి ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. అంతటి గొప్పదైన ప్రేమతో తన ప్రజలను పరిపాలించారు ఆయన మనందరిని  నిరతము ప్రేమించే రాజు.
4. నడిపించే రాజు- ఒక గొర్రెల కాపరి తన మందకు ముందుగా ఉండి గొర్రెలను ఏ విధముగా నైతే పచ్చిక బయలు వైపు నడిపిస్తారో అదే విధముగా క్రీస్తు రాజు  తన ప్రజలను పరలోకము వైపు నడిపిస్తారు, మంచి వైపు నడిపిస్తారు. మనము ఆయన స్వరమును విని నడుచుకోవాలి.
5. శాంతిని నెలకొల్పే రాజు-ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది ఎందుకంటే మన అందరి జీవితాలలో శాంతి- సమాధానములు నెలకొల్పుట కొరకై. పాపము చేసిన మానవుడు దేవునికి దూరమైనప్పుడు శాంతి సమాధానము లేకుండా జీవించే సమయంలో మన అందరి కొరకై తన్ను తాను బలిగా సమర్పించుకుని మనలను తండ్రితో సఖ్యపరచి ఉన్నారు దాని ద్వారా ప్రతి ఒక్కరికి శాంతిని దయచేసారు.
6. వినయము కలిగిన రాజు-ఏసుప్రభు తనను తాను రిక్తుని చేసుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించి సేవకు రూపం దాల్చి, శిష్యుల యొక్క పాదాలు కడిగి ఎంతో వినయముతో జీవించారు. అయిన పవిత్రుడైనప్పటికీ పాపాత్ములమైన మన మధ్య జీవించారు. ఇది ఆయన యొక్క వినయమునకు గొప్ప నిదర్శనం.
7. మనందరినీ తన బాగా మార్చే రాజు. క్రీస్తు ప్రభువు మనందరం కూడా తనలాగా మారాలని కోరుతున్నాను అందుకని ఈ భూలోకమునకు వచ్చి మనకు అనేక రకములైన విషయములు తెలియజేశారు. దేవుని యొక్క ప్రతిరూపమున జన్మించిన మనందరం ఆయనను పోలినటువంటి వ్యక్తులుగా జీవించినవి అని ప్రభువు కోరుకున్నావు. ఏ అధికారి కూడా తనున్న స్థానంలో వేరే వారు ఉండటానికి ఇష్టపడరు కానీ క్రీస్తు రాజు మనందరం కూడా తన రాజ్యంలో ఉండాలి అలాగే తనలా ఉండాలని కోరుకున్నారు. 12 మంది శిష్యులను పిలిచి వారు తనలాగా మారాలని కోరుతున్నటువంటి ప్రభువు మన క్రీస్తు రాజు.
ఈనాడు క్రీస్తు రాజు యొక్క పండుగను జరుపుకునే సందర్భంలో ఆయన ఏ విధముగా జీవించి ఉన్నారో మనందరం కూడా ఆయన రాజ్యమునకు చెందిన వారు అయినట్లయితే ఆయన ఇచ్చే సూచనలు, ఆజ్ఞలు పాటించి జీవించాలి. అప్పుడు మాత్రమే మనందరం పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాం. క్రీస్తు ప్రభువుని నీ హృదయ రాజుగా అంగీకరిస్తున్నావా? దాని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావా అని వ్యక్తిగతంగా ఆలోచించి మనందరం కూడా ఆయన వలె జీవించాలి. క్రీస్తు రాజును మన యొక్క హృదయములను పరిపాలించే విధముగా మనము ఆహ్వానించాలి. ఆయన మన హృదయములను పరిపాలించిన యెడల మనందరం సన్మార్గంలో నడవగలం.
Fr. Bala Yesu OCD

16, నవంబర్ 2024, శనివారం

33 వ సామాన్య ఆదివారం

33 వ సామాన్య ఆదివారం 
దానియేలు 12:1-3, హెబ్రీ10:11-14,18 మార్కు 13:24-32
ఈనాటి పరిశుద్ధ గ్రంథములు దేవుని యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నాయి. ఆయన యొక్క రాకడ కొరకై మనందరం కూడా సంసిద్ధులై జీవించాలి. అదేవిధంగా దేవుడు తనను విశ్వసించే వారితో ఎల్లప్పుడూ ఉంటారని కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభువు మన యొక్క కష్ట కాలములో, అంత్య దినములలో మనతోనే ఉంటారు ఎందుకనగా ఆయన ఇమ్మానుయేలు ప్రభువు, మనతో ఉండే దేవుడు. 
ఈనాటి మొదటి పఠణంలో దానియేలు ప్రవక్తకు కలిగిన నాలుగవ దర్శనము గురించి వింటున్నాము. మానవులు మరణించి సమాధి చేయబడిన తర్వాత మట్టిలో నిద్రించే చాలా మంది సజీవులవుతారని చెబుతున్నారు. 
ఆనాడు విశ్వాస పాత్రులుగా జీవిస్తున్న యూదులను నాల్గవ అంతెయోకు(Antioch. IV)  రాజు అన్యాయంగా వారిని యూదులను శిక్షకు గురిచేసి చంపారు. ఈ యొక్క రాజు ఆయన యూదా ప్రజల మీద అనేక రకములైన ఆంక్షలు విధించి వారు గ్రీకు మతస్తుల ఆచారాలను, పద్ధతులను అనుసరించాలని ఒత్తిడి చేశారు. యూదా ప్రజల సున్నతిని తిరస్కరించాడు, దేవాలయాలను ధ్వంసం చేశాడు దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులను నాశనం చేశారు అది మాత్రమే కాకుండా వారికి విలువైన పవిత్ర గ్రంథం "తోరా" యొక్క ముఖ్య భాగాలను కాల్చివేశాడు. ఇలాంటి ఒక కష్టతరమైన పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రవక్త దేవుని యొక్క అభయంను /రక్షణ వినిపించారు. దేవుని యెడల విశ్వాసము కలిగిన యూదులు కూడా మరణించిన తర్వాత శరీరంతో పునరుత్థానం చెందుతారని తెలిపారు. దేవుని యందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి జీవించాలని కూడా ప్రవక్త వారిని ప్రోత్సహించారు. దానియేలు ప్రవక్త ప్రజలు అనుభవించే బాధలను చూసి వారికి ఊరటనిస్తున్నారు. దేవుడు ఎప్పుడూ తన ప్రజలకు చేరువలోనే ఉంటారని తెలియజేశారు. దానియేలు గ్రంధం 11: 21-39 వచనములు చదివినట్లయితే ఇక్కడ సిరియా రాజు అయినా నాలుగవ అంతియోక్ యొక్క దురాలోచనలు, ఆయన అహం, స్వార్థం ఆయన చేసే హింసలు అర్థమవుతాయి. ఎన్ని విపత్తులు ఎదురైనా సరే ప్రజలలో ఒక విధమైన ఆశను నమ్మకాన్ని ప్రవక్త కలుగ చేశారు. వారి జీవిత అంత్య దినములు సంభవించినప్పుడు దేవుని కోసం ఎలాగ జీవిస్తున్నాం అన్నది ముఖ్యం. క్రైస్తవ విశ్వాసము మరియు యూదుల యొక్క విశ్వాసము ఏమిటనగా అంతిమ దినమున అందరు కూడా సజీవులుగా లేపబడతారని. యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలకు దేవుని వాక్యము ప్రవచించగానే అవి శరీరమును పొందుకొని జీవము కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు 37:13. చనిపోయిన వారు దేవుని కృప వలన సజీవులవుతారని ఈ యొక్క వాక్యము తెలుపుతుంది. మక్కబీయులు గ్రంథంలో ఏడుగురు సోదరులు ప్రాణత్యాగము చేశారని వింటున్నాం ఎందుకంటే వారికి పునరుత్థానమునందు విశ్వాసము ఉన్నది అందుకని వారు తమ ప్రాణాలను దేవుని కొరకు త్యాగం చేశారు.(2 మక్కబీయులు 7:9) ఈ యొక్క మొదటి పఠణం ద్వారా మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి మనము జీవించాలి. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన యందు విశ్వాసము కోల్పోకుండా జీవించాలి.
ఈనాటి రెండవ పఠణం యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ఈ యొక్క భాగములో ప్రత్యేక విధముగా ఏసుప్రభువు సమర్పించిన బలికి మిగతా యాజకులు సమర్పించిన బలికి ఉన్నటువంటి వ్యత్యాసమును తెలియజేస్తున్నారు. పూర్వ నిబంధన ప్రధాన యాజకులు ఒకే రకమైన బలులు అర్పించినప్పటికీ ప్రజల పాపాలు తొలగించలేకపోయారు కానీ క్రీస్తు ప్రభువు తన యొక్క బలిద్వారా అందరి పాపాలను ఒక్కసారిగా మన్నించారు. ఆయన సమర్పించిన బలిలో రక్షణ సామర్థ్యం ఉంది. ప్రభువు సమర్పించిన బలి విశ్వాసులను దేవుని ఎదుట నీతిమంతులుగా చేస్తుంది శుద్ధికరిస్తుంది అదేవిధంగా అందరూ రక్షణ పొందుటకు సహాయపడుతుంది.  పాత నిబంధన గ్రంథంలో వారు సమర్పించిన బలులన్నీ కేవలము క్రీస్తు ప్రభువు యొక్క బలితో పరిపూర్ణమయ్యాయి. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు శకం 69 వ సంవత్సరంలో రోమీయులు క్రైస్తవులను మరియు క్రైస్తవ మతం స్వీకరించిన యూదులను అనేక రకాల హింసలకు గురి చేశారు అలాంటి సమయంలో తన యొక్క ప్రజల విశ్వాసాన్ని బలపరుచుటకు దేవుడు మరలా వస్తాడని నమ్మకమును కలిగిస్తూ మార్కు సువార్తికుడు ఈ యొక్క మాటలను రాస్తున్నారు. తనకు కలిగినటువంటి దర్శనం వలన మనుష్య కుమారుని రాకడ ద్వారా ప్రపంచంలో కొన్ని ప్రకృతి మార్పులు జరుగుతాయని మార్కు గారు తెలియజేశారు. వాస్తవానికి నిజమైన విశ్వాసులకు అవన్నీ భయపెట్టే సంకేతాలు కావు ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం గా జీవించిన వారికి ఎల్లప్పుడూ మేలు కలుగును ప్రభు వారందరినీ రక్షించును. ఏసుప్రభు అత్తి చెట్లనుండి ఒక గుణపాఠం ను నేర్పిస్తున్నారు. ఈ యొక్క అత్తి చెట్ల ఆకులు వసంత రుతువు చివరిలోనే చిగురిస్తాయి అవి అలా కనిపించినప్పుడు ఒక కొత్త కాలం సంభవించునదని మనకు తెలుస్తుంది ఆ కాలంకు తగిన విధంగా మనం కూడా తయారవ్వాలి. ఆకులు రాలిపోయాయి అంటే చెట్టు చనిపోయినది అని కాదు అర్థం, కొత్త ఆకులు వస్తాయని అర్థం. అదే విధముగా దేవుని యొక్క రెండవ రాకడ జరిగినప్పుడు కూడా క్రొత్తకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మనం దానికి తగిన విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న పాపము, స్వార్థము, అహం అన్నింటిని చంపేయాలి అప్పుడే దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించగలం.
 దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎప్పుడూ సంసిద్ధముగా ఉండాలి. ఆయన యొక్క రాకడ ఎప్పుడు ఎలాగా వచ్చునో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతినిత్యం కూడా మనము మనల్ని తయారు చేసుకుంటూ జీవించాలి. చివరిగా ఈ యొక్క పఠణముల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు.
1. నిరీక్షణ కలిగి ఉండుట 
2. విశ్వాసము కలిగి జీవించుట 
3. దేవుని యొక్క రాకడకు సంసిద్ధత కలిగి జీవించుట 
4. ప్రభువుకు సాక్షులై ఉండుట. 
5. దేవునికి అనుగుణంగా జీవించుట.

Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...