10, మే 2025, శనివారం
పాస్కా కాలపు నాలుగవ ఆదివారము
జీవవాక్కు
యోహాను 6: 60-69
ఆయన శిష్యులలో అనేకులు ఇవివినినప్పుడు "ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు?" అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు "ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయిన మనుష్యకుమారుడు తాను పూర్వము ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చునది ఆత్మయే. శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాని, మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు" అని పలికెను. ఆ విశ్వసింపనివారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటినుండియు యేసుకు తెలియును. కనుకనే "తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నాయొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని" అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అపుడు యేసు తన పన్నిద్దరు శిష్యులతో "మీరును వెళ్ళిపోయెదరా?" అని అడుగగా, సీమోను పేతురు, "ప్రభూ! మేము ఎవరియొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి" అనెను.
యోహాను సువిశేషంలో ఈభాగం యేసు ప్రభువు జీవ వాక్కు అని వెల్లడిచేస్తుంది. ఆయన మాటలు కొందరికి కఠినముగా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నది. ప్రభువును కఠినమైన మాటలు మనకు జీవము ఇచ్చేవి అని తెలుస్తుంది. యేసు ప్రభువు మాటలు నిత్య జీవము ఇచ్చేవి అని, ఆయన దేవుని నుండి వచ్చిన పవిత్రుడు అని తెలియపరుస్తుంది.
యేసు ప్రభువును శరీరమును భుజించుట ఆయన రక్తమును పానము చేయుట
యేసు ప్రభువు తన శరీరమును భుజించాలి, తన రక్తమును పానము చేయాలి అని చెప్పినప్పుడు అనేక మంది శిష్యులు ఆ మాటలు కఠినముగా ఉన్నవి అని, ఆయనను అనుసరించడం సాధ్యం కాదు అని వదలిపెట్టి వెళ్లిపోతున్నారు. ఈ మాటలను అర్ధం చేసుకునుటకు వారికి ప్రత్యేక దైవ జ్ఞానము కావలి. యేసు ప్రభువుతో సాన్నిహిత్యము కలిగినవారు ఆ మాటలు అర్ధం చేసుకోగలుగుతారు. తన శరీరమును భుజించటం అంటే ప్రభువు జీవంలో పాలు పంచుకోవడం. రక్తంలో ప్రాణం ఉంటుంది అని యూదులు నమ్మేవారు. యేసు ప్రభువు మీరు నా రక్తమును పానము చేయాలన్నప్పుడు దాని అర్ధం ప్రభువు జీవము మనలో ఉంటుంది అని అంటున్నారు. అందుకే ప్రభువు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన వారు నాయందును నేను వాని యందును ఉంటాము అని ప్రభువు చెప్పారు. ప్రభువు శరీరము మరియు రక్తము మనలను తనతో ఉండేలా చేస్తాయి. మనము ఎల్లప్పుడూ జీవించేలా చేస్తాయి.
ఎందుకు కొంతమంది ఈ మాటలు కఠినముగా ఉన్నవి అని ప్రభువును విడిచి పెడుతున్నారు? యేసు ప్రభువు మాటలను వారు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యిస్రాయేలు ప్రజలు రక్తమును భోజన పదార్ధముగాలేక పానీయముగా తీసుకోరు. లేవియఖాండం 17వ అధ్యాయంలో రక్తములో ప్రాణము ఉంటుంది కనుక అది నిషేధించబడింది. ఇక్కడ ప్రభువు నా రక్తమును పానము చేయాలి అని అంటున్నప్పుడు వారు అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువు చెప్పేది ఆధ్యాత్మికమైన విషయం. దివ్యసత్ప్రసాదము గురించి ప్రభువు చెబుతున్నారు. వారు పొందే శ్రమలు గురించి ప్రభువు చెబుతున్నారు.
తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని అని అంటున్నాడు. ప్రభువు దగ్గరకు రావాలంటే ఆ వ్యక్తికి పశ్చాత్తాపం ఉండాలి, మనస్సు మార్చుకోవాలనే కోరిక ఉండాలి. దానికి ప్రేరణ దేవుడే మనలో పుట్టిస్తాడు. అందుకే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవరు నావద్దకు రాలేరు అని చెబుతున్నారు. మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని ప్రభువు చెబుతున్నారు. అనేక గొప్ప కార్యములను ప్రజలు చూసారు, ఆయనతో పాటు వారు తిరిగారు. ఆయన ఇచ్చిన ఆహారం వారు తిన్నారు. అయినప్పటికీ కొంతమంది యేసు ప్రభువు మాటలను విశ్వసించుటలేదు. విశ్వాసం చాల ముఖ్యం. విశ్వాసం వలన మాత్రమే మనం ప్రభువుతో ఉండగలం, ప్రభువు వద్ద ఉండగలం మరియు ఆయన చెప్పే నిత్యజీవమునకు అర్హులం కాగలం.
యేసు ప్రభువు మీరును వెళ్లిపోయెదరా? అని శిష్యులను అడుగుతున్నారు. అందుకు పేతురు మేము ఎవరి యొద్దకు వెళ్ళెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు అని చెబుతున్నాడు. పేతురు తన జీవితంలో యేసు ప్రభువులాంటి వ్యక్తిని చూడలేదు. ఒక యూదయ వ్యక్తిగా తన మత గురువులు, పెద్దలు అతనికి తెలిసిఉండవచ్చు. కాని వారు ఎవరు నిత్య జీవం ఇచ్చేవారు కారు. అందుకే ప్రభువుతో పేతురు మేము ఎవరి వద్దకు వెళ్ళెదము, అని అంటున్నాడు. ఎవరి వద్దకు వెళ్లిన యేసు ప్రభువు ఇచ్చే వాగ్దనం వారు ఇవ్వలేరు. ఇస్తాము అని కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రభువు మాత్రమే జీవం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు జీవమై ఉండెను అని పవిత్ర గ్రంధం చెబుతుంది. ఆ జీవము, ఆ వాక్కు యేసు ప్రభువే అని తెలుసుకున్న పేతురు ఎక్కడకి వెళ్లక ప్రభువుతో మేము విశ్వసించాము అని చెబుతున్నాడు.
ప్రార్ధన: ప్రభువా! మీరు జీవవాక్కు. మీ మాటలు మాకు నిత్యజీవమును ఇస్తాయి. మీ మాటలు మా జీవితమునకు మార్గముగా ఉన్నాయి. మీ మాటలు మాకు కఠినముగా ఉన్నప్పటికీ అవి జీవమును ఇచ్చేవి అని తెలుసుకునేలా దీవించండి. ప్రభువా! మీరే మాకు ఆధారం, మీరే మాకు మార్గం. మేము ఎక్కడికి వెళ్ళగలం. మీ వలే ఎవరు మా భౌతిక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుతూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు నిత్యజీవము ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నారు. అటువంటి మిమ్ములను కాదని మేము ఎక్కడకు వెళ్ళగలం. మీమీద పూర్తి విశ్వాసం ఉంచి , మారు మనసు పొంది మీమీద ఆధారపడి జీవించే అనుగ్రహం దయచేయండి. ఆమెన్
4, మే 2025, ఆదివారం
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29
మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్లలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటకు చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబెరియానుండి కొన్ని పడవలువచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను వేరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు, దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది" అని చెప్పెను.
ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును అన్వేషించడం మరియు ఎటువంటి పరిస్థితులలో మనం యేసు ప్రభువును అన్వేషిస్తున్నాము , ఎప్పుడు ఆయనను అన్వేశించాలి , శాశ్వతమైనది ఏమిటి అని తెలుసుకొని దాని కోసమై అన్వేషించాలి అని సువిశేషం వివరిస్తుంది.
దేవుని కోసం వెదకుట
ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును వెదకుచు అనేక మంది వస్తున్నారు. వారు ఎందుకు యేసు ప్రభువును అన్వేషిస్తున్నారు ఆంటే అంతకు ముందు రోజు ప్రభువు వారి ఆకలిని తీర్చారు. కేవలం ఐదు రొట్టెలతో 5000 మందికి ఆహారమును ఇచ్చాడు. ఇతనిని అనుసరిస్తే మాకు కావలసిన ఆహరం దొరుకుతుంది అని వారు ఆయన కోసం వెతుకుచున్నారు. అంతకు ముందు వారిలో కొంతమంది వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులను చేసాడు. ఇతనిని అనుసరిస్తే మాకు ఎటువంటి అనారోగ్యం ఉండదు అని ఆయన కోసం వెదకుచుండవచ్చు. యేసు ప్రభువు చెప్పే మాటలు ఎలా సాధ్యం అని తెలుసుకొనుటకు, ఆయనను అడుగుటకు వారిలో ఉన్న కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు ప్రభువును వెదుకుచుండవచ్చు. ప్రభువు దేవాలయములో ఉన్న వ్యాపారులను పంపిచివేస్తున్నారు కనుక అనేక మంది దేవుని ఆలయంలోవెళ్ళుటకు ఆవకాశం ఇచ్చాడు కనుక ఇంకా వారి అవసరాలను చెప్పుకొనుటకు ప్రభువును వెదకుచు ఉండవచ్చు. ఇతను రాజు అయితే మాకు అన్ని సమకూరుతాయి అని ప్రభువును వెదకుచు ఉండవచ్చు. అందుకే ప్రభువు వారితో అంటున్నారు "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు" అని అంటే మనం ప్రభువును వెదకవలసినది, అద్భుతాలు చూడాలనో, ఆహారం కోసమో కాదు. ఆయన అంతకంటే చాలా గొప్పవి ఇచ్చేటువంటి ప్రభువు. ప్రభువు తానె జీవ జలము అనే చెబుతున్నాడు. నేను ఇచ్చే జలమును త్రాగితే మరల దప్పిక కలుగదు అని చెబుతున్నాడు. నేను జీవాహారము అని చెబుతున్నాడు. నన్ను భుజించువాడు ఎన్నటిని మరణింపడు అని చెబుతున్నాడు. ప్రభువు మనకు శాశ్వతమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, వాటిని ఎలా పొందాలో అన్వేషించమంటున్నాడు, వాని కోసము పనిచేయమంటున్నాడు. దేవున్ని వెదకడం అంటే నిత్య జీవమును వెదకటం. అందుకే ప్రభువు చెబుతున్నాడు నేనే జీవమును అని.
శాశ్వతమైనది- అశాశ్వతమైనది
ఇక్కడ యేసు ప్రభువు తనకోసం వచ్చిన వారితో "అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు." అని చెబుతున్నాడు. యేసు ప్రభువు తన అనుచరులకు ఈలోక విషయములు అశాశ్వతమైనవి అని, శారీరక విషయాలు, అవసరాలు, సంపదలు అశాశ్వతమైనవి అని చెబుతున్నాడు. అందుకే ఈలోక సంపదలు కాక పరలోక సంపదలు కూడపెట్టుకోమని చెబుతారు. "ఈలోక సంపదలు కూడపెట్టుకొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తినివేయును." "నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు." ఈనాటి సువిశేషంలో మాత్రం ప్రభువు మనలను శాశ్వత భోజనముకై శ్రమించమని చెబుతున్నారు. నిజానికి చాలా మంది పేరు ప్రఖ్యాతలు కోసం శ్రమిస్తుంటారు. అవికూడా శాశ్వతం కాదు. అప్పుడు ఏమిటి శాశ్వతమైనవి ఏమిటి అంటే పరలోక రాజ్యము, నిత్య జీవము ఇవి మనకు శాశ్వతమైనవి.
శాశ్వతమైనవి అయితే అవి మనకు ఎవరు ఇస్తారు
యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారితో ఆయన "మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును." అని చెబుతున్నాడు. ప్రభువు మాత్రమే దానిని ప్రసాదించగలరు. ఎందుకంటే ఆయనకు మాత్రమే అది ప్రసాదించే అధికారం ఉన్నది. శాశ్వతమైనవి దైవికమైనవని వారికి అర్ధం అయ్యింది. కనుక వారు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయాలని అడుగుతున్నారు. అందుకు యేసు ప్రభువు దేవుడు పంపిన వానిని విశ్వసించండి అదే దేవుడు మీ నుండి కోరుకుంటున్నారు అని చెబుతున్నాడు. నిత్య జీవం కావాలంటే లేక శాశ్వతమైన ఆహారం కావాలంటే చేయవలసినది యేసు ప్రభువును విశ్వసించడం. యేసు ప్రభువును విశ్వసించడం అంటే ఆయన చెప్పినట్లు మారుమనస్సు పొంది, ఆయన ఆజ్ఞలను పాటించడం. అప్పుడు మనం ఆ నిత్య జీవానికి అర్హులము అవుతాము.
ప్రార్ధన: ప్రభువా! మా జీవితాలలో అనేక విషయాలలో మీ సహకారం కోసం మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. అనేక సార్లు మేము మిమ్ములను మా భౌతిక అవసరములనే కోరుకుంటున్నాము. మేము ఏమి కోరుకోవాలో నేర్పించండి. మీరు చెప్పినట్లుగా శాశ్వతమైన వాటిని వెదకుచు, వాని కొరకు పాటుపడేలా మమ్ము మార్చండి. నిత్య జీవితం మీద ఆశ కలిగి, మిమ్ములను విశ్వసించి, మీ ఆజ్ఞలకు అనుకూలంగా జీవించేలా మమ్ము మార్చండి. ఆమెన్
30, ఏప్రిల్ 2025, బుధవారం
దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?
దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?
యోహాను 3: 16-21
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును" అని సమాధానమిచ్చెను.
ఈ వాక్యాలు దేవుడు ఎంతగా ఈ లోకమును ప్రేమించినది, అదేవిధంగా మానవుడు నాశనము చెందకుండా తన కుమారుణ్ణి పంపిన విషయం, ఆ కుమారుణ్ణి విస్వసించుట ద్వారా వారు నిత్యజీవము పొందుతారని, ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చారని దుష్క్రియలు చేసేవారు, ఆ వెలుగు దగ్గరకు వచ్చుటకు ఇష్టపడక అవి బయట పడతాయి చీకటిలోనే ఉన్నాడు. సత్యవర్తనుడు వెలుగును సమీపిస్తున్నాడు. జీవితాన్ని మార్చుకుంటున్నాడు అని తెలియజేస్తున్నాయి.
దైవ ప్రేమ
దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని రక్షించడానికి తన కుమారుడిని ఈలోకానికి పంపాడు. కుమారుడు తన తండ్రి సంకల్పమైన లోక రక్షణము నెరవేర్చడానికి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుని కుమారుడు తన తండ్రి చిత్తాన్ని పూర్తి చేసి అంత సమాప్తం అయినది అని చెప్పాడు. ఆయనను కలుసుకున్న, వినిన , చూసిన ప్రతివాడు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను సిమియోను ప్రవక్త వలే చూసారు. ఆయనను విశ్వసించిన వారు రక్షణ పొందుతున్నారు.
దేవుడు లోకాన్ని ఖండించడానికి తన కుమారున్ని పంపలేదు
దేవుడ సృష్టి ఆరంభం నుండి మానవున్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నడు విడనాడలేదు. దేవుడు ఎప్పుడు పాపి మరణించాలని, లేక నాశనం కావాలని కోరుకొనలేదు. ఆయన మానవుణ్ణి సన్మార్గంలో పెట్టదలచి క్రమ పద్దతిలో పెట్టగ దేవుడు శిక్షించినట్లుగా అనుకున్నాడు. దేవున్ని ఒక కఠిన యజమానిగా చూసాడు కాని దేవుని ప్రేమను, తండ్రి వాత్స్యాల్యాన్ని అర్ధం చేసుకోలేదు. అనేక సార్లు దేవుడు తన రాయబారులను పంపాడు. కాని మానవుడు దేవుడు పంపిన వారిని లెక్క చేయలేదు. తరువాత తన కుమారుణ్ణి పంపుతున్నారు. ఈ లోకాన్ని నాశనం చేయక తన కుమారుని జీవితం ద్వారా, మనకు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు, తన మరణం ద్వారా మనకు పాపములను క్షమిస్తున్నారు. తన మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం పొందే అనుగ్రహం ఇస్తున్నాడు.
విశ్వాసం యొక్క ప్రాముఖ్యత
రక్షణ యేసు ప్రభువును విశ్వసించడం వలన వస్తుంది. యోహాను ఈ విషయాన్ని తన సువిశేషంలో చాలా సార్లు లిఖించడం జరిగింది. ప్రతి అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ, సువిశేష ఆరంభంలో, మధ్యలో మరియు చివరిలో యేసు ప్రభువును విశ్వసించడం వలన నిత్య జీవం వస్తుంది అని ప్రకటిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ప్రభువు కొన్ని సందర్భాలలో ఇది నీవు విశ్వసిస్తున్నావా? అని అడుగుతున్నారు. వారు స్వస్తత పొందిన తరువాత మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచింది అని అంటున్నారు. ప్రభువుని యందు మనకు విశ్వాసము ఉండటం వలన నిత్యజీవమే కాక ఈ లోకములో అనేక విషయాల్లో విజయాన్ని పొందుతాము.
వెలుగు- చీకటి
యేసు ప్రభువు నేనే లోకమునకు వెలుగును అని ప్రకటించాడు. యోహాను సువిశేషంలో మొదటి అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వెలుగాయను అని వింటాము. ప్రభువు దగ్గరకు నీకొదేము చీకటి వేళలో వస్తున్నాడు. అతను చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. కాని చీకట్లో ఉన్నవారు వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడటలేదు. వెలుగు దగ్గరకు వస్తే వారి ఎటువంటి వారు అనేది, లేక వారి జీవితం అందరికి తెలిసిపోతుంది అని భయపడేవారు. కాని ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు చేసిన తప్పులు ఏమి అందరికి తెలుస్తాయి అని భయపడనవసరం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చే సమయంలో ఆ వెలుగులో మనలో వున్న చేడు, మలినం లేక తొలగిపోతుంది. ప్రభువు నీకొదేము వచ్చినపుడు తాను చీకటిలో వచ్చిన, ప్రభువు దగ్గర ఉండటం వలన తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాని ఎవరు అయితే చెడు పనులు చేస్తున్నారో, ప్రభువు దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదో వారు చెడునే ప్రేమిస్తున్నారు. వారు మారటానికి ఇష్టపడటం లేదు. వారి పనులు ఎవరికీ తెలియకూడదు అని వారు వెలుగును సమీపించడం లేదు. ప్రభువు దగ్గరకు రాకపోతే, మనలో ఉన్న ఆ చెడు ఎప్పటికి వెళ్లిపోదు. దాని ద్వారా ప్రభువు మనకు ఇచ్చే ఆ రక్షణ పొందలేము. సత్య వర్తనము కలిగి జీవించడము అనేది చాలా ముఖ్యము. అప్పుడు మనం చేసే పనులు దేవునికి ఇష్టమవుతాయి.
ప్రార్ధన: ప్రభువా ! మీరు లోకమును ఎంతగానో ప్రేమించి మీ ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకమునకు దానిని రక్షించుటకు పంపారు. ఆయనను విశ్వసించిన వారంతా నిత్యజీవం పొందుటకు మీరు అటుల చేశారు. ప్రభువా మిమ్ములను మీ కుమారుణ్ణి మేము విశ్వసిస్తున్నాము. కొన్ని సార్లు వెలుగైన మీ కుమారుని దగ్గరకు రావడానికి మేము భయబడ్డాము. ఆ వెలుగులో నా పాపము ఎక్కడ బయటపడుతుందో అని సందేహించాము. కాని ప్రభువా! ఆ వెలుగు మా లోని పాపమును దహించివేసి మమ్ములను పరిశుద్దులనుగా చేస్తుంది అని మరిచిపోయాము. అటువంటి సందర్భంలో మమ్ములను క్షమించండి. మేము మీ దగ్గరకు వచ్చి ఎల్లప్పుడు వద్ద ఉంటూ, మిమ్ము విశ్వసించి మీరు ఏర్పాటు చేసిన రక్షణ పొందేలా మమ్ము దీవించండి .ఆమెన్
28, ఏప్రిల్ 2025, సోమవారం
నూతనంగా జన్మించుట
యోహాను 3: 7-15
నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పిన్నందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. "ఇది ఎటుల సాధ్యమగును?" అని నికోదేము అడిగెను. అందులకు యేసు: "నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను.
నూతన జీవితం - క్రీస్తు ఎత్తబడటం
ఈ సువిశేష భాగంలో నూతన జీవితం ఎలా మొదలవుతుంది, దానికి ఏమి చేయాలి అని మరియు ఏవిధంగా క్రీస్తు మోషే కంచు సర్పమును ఎత్తినట్లు ఎత్తబడతాడు అనే విషయాలను మనము చూస్తాము. యేసు ప్రభువు నికోదేముకు ఎలా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి అని చెబుతున్నాడు. అటులనే ఈ నూతన జీవితం పొందేవాడు నిత్యజీవానికి అర్హుడు అవుతాడు, ప్రభువు అందుకుగాను వారి కొరకై సిలువ మీదకు ఎత్తబడతాడు, ప్రభువుని సిలువ మరణం మానవునికి ఈ నిత్య జీవమును ఇచ్చుటకే అనే విషయం స్పష్టము అవుతుంది.
ఎందుకు మరల జన్మించాలి ?
యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్యం యొక్క గొప్ప తనాన్ని అందరికి ప్రకటించారు. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి దేనినైన కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ రాజ్యం కావాలనికోరుకుంటాడు. దేవుని రాజ్యం అంటే అంతటి గొప్పది కనుక యేసు ప్రభువు చెప్పిన అనేక ఉపమానాలలో దాని విలువ తెలిసిన వ్యక్తులు, ఏమి కోల్పోయిన దానిని పొందుటకు ప్రయత్నిస్తారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రధానమైన అర్హత నూతన జన్మను పొందాలి అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ఈ నూతన జన్మ ముఖ్యమైనది. మానవుడు తన సొంత బలం ద్వారా ఈ నూతన జన్మను పొందలేడు, జీవించలేడు. దేవుని తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా హృదయ పరివర్తనతోనే మొదలవుతుంది, అందుకే ప్రభువు తన పరిచర్యలు మొదట హృదయ పరివర్తన పొందాలి అని చెబుతున్నారు.
ఆత్మతో జన్మించువారు
ఆత్మతో జన్మించువారిని ప్రభువు గాలితో పోల్చుతున్నారు. గాలి ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడకు వెళుతుందో మనకు తెలియదు, అటులనే ఆత్మతో జన్మించువారు, లేక నూతన జన్మ పొందిన వారు, మారు మనసు పొందినవారు ఎలా ఉంటారో మనము చూస్తాము. వారి జీవితాల్లో ఉన్న మార్పు, వారి పరివర్తన మనకు కనపడుతునే ఉంటుంది, అంటే మనం ఆత్మను చూడము కానీ వారి జీవితంలో వచ్చే మార్పును బట్టి వారు నూతన జీవితం జీవిస్తున్నారు అని తెలుసుకొనవచ్చు. మగ్దలా మరియ, పౌలు వారి జీవితాలలో వచ్చిన మార్పును, జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పును మనం చూసినప్పుడు వారు, హృదయ పరివర్తన చెందారు అని , నూతన జీవితం వారు జీవిస్తున్నారు అని మనము తెలుసుకుంటాము. ఆత్మ ద్వారా జన్మించిన వారి జీవితాలలో కూడా ఈ మార్పును మనం చూడవచ్చు. ఆత్మ ఫలాలు వారి జీవితాల్లో సుష్పష్టంగా కనిపిస్తాయి. వారు పాపమునకు బానిసలుగా కాక స్వతంత్రంగా జీవిస్తారు.
యేసు ప్రభువు ఎదుట నికోదేము సందేహంను వేలిబుచ్చుట
యేసు ప్రభువు ఆత్మ వలన జన్మించుటకు గురించి చెప్పిన తరువాత నీకొదేము ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నాడు. ప్రభువు అతనికి అది క్రొత్త విషయము ఏమి కాదు అని తెలియజేస్తూనే, నీవు బోధకుడివి కదా! ఈ విషయం తెలియదా అని అడుగుచున్నాడు. పాత నిబంధనలలో కూడా మనం మారు మనస్సు గురించి వింటాము. మరి ఎందుకు వీరు అవి ఏమి తెలియక ఉన్నారు అంటే వారు ఎప్పుడు ఈ లోక విషయాలు, మరియు స్వార్ధ పూరిత ఆలోచనలతో ఉన్నారు. కానుక అనేక దైవ విషయాలు, దైవ జ్ఞానం గురించి అజ్ఞానములో ఉన్నారు. దైవ జ్ఞానము కోసం మనము ఎంతగానో శ్రమించాలి. ఆయనను వేదకాలి అటువంటి వారికి ప్రభువు ఆ జ్ఞానమును ఇస్తారు.
పరలోక విషయాల గురించి యేసు ప్రభువు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి వచ్చినవారు. ఆయనే చెప్పేవి మాత్రమే ప్రామాణికం, అటువంటి వాటి గురించి జ్ఞానము కావాలి అంటే ప్రభువుని మాటలను వినాలి. ప్రభువును విశ్వసించాలి, ప్రభువు చెప్పినట్లు చేయాలి. కాని అనేక సార్లు ప్రభువుని మాటలను మనం పెడచెవిన పెట్టి పరలోక జ్ఞానమును పోగొట్టుకుంటున్నాము. నికోదేముతో ప్రభువు అంటున్నారు మేము చూచిన విషయాలను చెప్పిన మీరు నమ్ముటలేదు అని. అంటే మనం కొన్ని సార్లు ఎంతో కరుడుగట్టిన హృదయాలు కలిగిన వారిగా ఉంటున్నాము. ప్రభువు మాత్రమే పరలోకము నుండి వచ్చినవాడు మరియు తిరిగి పరలోకమునకు వెళ్లినవాడు. ఆయనకు పోయిన చోటుకు వెళ్ళుటకు ఆయనను మాత్రమే అనుసరించాలి.
యేసు ప్రభువు ఎత్తుబడుట
పాత నిబంధనలో దేవునికి మాటకు ఎదురుతిరిగిన వారు పాము కాటుకు గురయ్యి మరణిస్తుంటే, మోషే దేవునికి మొరపెట్టగా, వారిని రక్షించుటకు మోషేతో దేవుడు ఒక కంచు సర్పము తయారు చేసి దానిని చూచిన వారు రక్షించబడ్డారు. అటులనే పాపం చేసిన మానవుని రక్షించడానికి ప్రభువు సిలువ మీద మరణించారు. ఇది ప్రభువును విశ్వసించువారు అందరు నిత్య జీవం పొందుటకు ఆయన సిలువ మీద మరణించారు. మనందరికీ ఆయన నిత్య జీవాన్ని సాధ్యం చేశారు.
ప్రార్ధన: ప్రభువా! మీరు నికోదేముతో మరల జన్మించుట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభువా మీ మాటలు విని అనేక మంది పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుటకు దేనిని కోల్పోవడానికి అయినా సిద్ధపడ్డారు. నేను కూడా నా జీవితాన్ని మార్చుకొని, నూతన హృదయం కలిగి జీవించి, మిమ్ములను అనుసరించి మీరు నా కోసం మరణించి, నాకు సాధ్యం చేసిన ఆ నిత్యజీవాన్ని పొందే అనుగ్రహం చేయండి. ఆమెన్
27, ఏప్రిల్ 2025, ఆదివారం
నీటివలన ఆత్మ వలన నూతన జీవం
యోహాను 3:1-8
వెలుగు దగ్గరకు వచ్చుట
ప్రభువు గొప్పతనాన్ని ఒప్పుకొనుట
నీటివలన ఆత్మవలన పుట్టుట
ఆత్మను గుర్తించగలుగుట
26, ఏప్రిల్ 2025, శనివారం
యేసు ప్రభువు దర్శనములు
మార్కు 16: 9-15
ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్తానుడైన యేసు, తాను ఏడూ దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్లి ఆయనతో ఉండినవారును, దుఃఖసాగరంలో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.
ఈ వచనాలు యేసు ప్రభువు పునరుత్థానము నిద్ధారణము మరియు శిష్యులకు ఓదార్పును తెలియజేస్తూ, వారు చేయవలనసిన కర్తవ్యము గురించి తెలియజేస్తున్నాయి. ఈ దర్శనములు వారిలో ఉన్న అపనమ్మకమును తీసివేయుటకు ఆయన సువార్తను బోధించుటకు వారిని మరల ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు.
మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను
యేసు ప్రభువు మొదటగా ఒక స్త్రీకి దర్శనము ఇస్తున్నాడు. యూదయ సమాజంలో, మరియు యేసు ప్రభువు కాలములో ఒక స్త్రీకి సమాజంలో అంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. మరియు ఈ మరియమ్మ నుండి ప్రభువు దయ్యములను వదలకొట్టాడు. ప్రభువు మనకు దర్శనము ఇవ్వడడానికి మన గత జీవితం ఏమిటి? మనకు సమాజం ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? అనేవి ఏమి ప్రభువు పరిశీలించరు. మనకు ప్రభువు మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిఉంటే చాలు. ఆయన మనము మరచిపోలేని మేలులను మనకు చేస్తారు. అంతేకాక మనలను ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక మందికి ఆదర్శవంతులుగా తయారుచేస్తారు. ఈ మరియమ్మ అనేక బంధనాలనుండి విముక్తి పొందింది. ప్రభువు మాటలకు అణువుగా మనం ఉంటే మన జీవితం కూడా ఎటువంటి లోక శక్తులకు బానిసలు కాకుండా ఎల్లప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతాం.
ప్రభువు దర్శనం గురించి నమ్మక పోవుట
దుఃఖంలో ఉన్న శిష్యులకు ప్రభువు ఓదార్పు ఇవ్వడానికి ఎంతగానో వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నప్పటికీ శిష్యులు నమ్మలేదు. వారికి నమ్మకము కలుగక పోవడానికి కారణం పకృతి విరుద్ధంగా ఉన్న మరణం నుండి లేవడం అనేది నమ్మదగినదిగ లేకపోవడం. అంతేకాక ప్రభువే ఇటువంటివి చేశారు. ఆయనే మరణించిన తరువాత ఎవరు అలా చేయగలరు? అనేక ప్రశ్నలు వారిలో ఉన్నవి. వీరిలో ఉన్న ఈ భయాలు మరియు యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు ఆసరాగా తీసుకొని ఎవరైన పుకార్లు పుట్టిస్తున్నారు అనే అనుమానాలు ఇవాన్నీ శిష్యులలో ఉండవచ్చు అందుకే వారు అన్నింటిని నమ్మలేని పరిస్థితుల్లో లేరు.
ఇద్దరు శిష్యులకు దర్శనం
యేసు ప్రభువు గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులకు దర్శనం ఇస్తున్నారు. లూకా సువిశేషంలో ఎమ్మావు వెళుతున్న ఇద్దరు శిష్యులు అని మనం చదువుతాం. ప్రభువు వారితో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రభువును గుర్తించలేకపోయారు. తరువాత రొట్టెను విరిచి ఇస్తున్నప్పుడు వారు ప్రభువును గుర్తించారు. అనేక సార్లు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ప్రభువును గుర్తించలేపోతున్నాము కారణము కేవలం ప్రభువుకు సంబంధించిన విషయాలలో మనం ప్రేక్షకులుగా మాత్రమే ఉంటున్నాము. ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువు వారికి దర్శనము ఇచ్చిన విషయం గురించి ఇతర శిష్యులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు. శిష్యులు ఏక్కువ నమ్మనది వారికి స్వయంగా ప్రభువు ఇచ్చిన దర్శనమును. వారు స్వయనుభవంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రభువు మాత్రము మనకు ఇతరుల సాక్ష్యంను కూడా నమ్మమని చెబుతున్నారు.
ప్రభువుని సందేశం
యేసు ప్రభువు పదకొండు మంది శిష్యులకు దర్శనము ఇచ్చి వారి అవిశ్వాసమును ఖండించారు. యేసు ప్రభువు వారి హృదయ కాఠిన్యము, అవిశ్వాసమును గద్దించారు. హృదయ కాఠిన్యము చాల మందిలో పెరుగుతున్నది. హృదయ కాఠిన్యము పెరిగినప్పుడు మనము దేనికి స్పందించము. ఇతరుల అవసరములలో ఉన్న , కష్టాలలో ఉన్నా నాకు ఎందుకులే? అనే ధోరణిలో ఉంటాము. క్రీస్తు అనుచరులలో ఉండకూడనిది ఈ హృదయ కాఠిన్యము. అందుకే దేవుడు యిస్రాయేలుకు వారి రాతి గుండెను తీసి మాంసంతో కూడిన హృదయము వారికి ఇస్తాను అని చెప్పినది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు ప్రభువు వలె ఇతరుల జీవితాలు చూసినప్పుడు వారి సమస్యలు , లేక సౌఖ్యాల అనుకూలంగా స్పందించ కలగాలి. ప్రభువు వారితో సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. శిష్యులకు ఉన్న ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడం. ఎందుకు ఇది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రభువు ఇచ్చే రక్షణ అందరికి, కేవలం ఒక జాతి, ప్రాంతం, వర్గమునకు మాత్రమే చెందినది కాదు. ఆ విషయం ఈ శిష్యుల ప్రపంచమంతట తిరిగి అందరికి తెలియజేస్తూ, వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇతరుల అనుభవాలు మాత్రమే కాక వారు కూడా స్వయంగా ప్రభువును పునరుత్థానం అయిన తరువాత చూసారు, విన్నారు మరియు ఆయన నుండి వారి కర్తవ్యము ఏమిటో తెలుసుకున్నారు. వీరు మాత్రమే కాక ప్రభువును తెలుసుకున్న వారు అందరు ఈ కర్తవ్యము కలిగివున్నారు. వారు అందరు ఆయనను ప్రకటించవలసి బాధ్యత ఉంది.
ప్రార్థన : ప్రభువా! మీరు ఈ లోకమున ఉండగా అనేకమందిని పాపము నుండి సాతాను బంధనముల నుండి విముక్తిని కలిగించారు. అదేవిధంగా వారిని స్వతంత్రులనుచేశారు. మీరు చూపించిన కరుణకు స్పందిస్తూ, మంచి జీవితం జీవించిన వారిని మీరు అనాధారం చేయలేదు. మగ్ధలా మరియమ్మకు దర్శనము ఇవ్వడం, శిష్యులకు దర్శనం ఇవ్వడం, ఇవాన్నీ మీరు మమ్ములను విడిచిపెట్టడం లేదు అని తెలుపుతున్న, మిమ్ములను నమ్మడంలో, విశ్వసించడంలో అనేకసార్లు విఫలం చెందుతున్నాం. దానికి మాకు ఉన్న అనేక భయాలు కారణం అయ్యివుండవచ్చు. ప్రభువా! మీరు మాతో ఎప్పుడు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకొని, మీరు ప్రసాధించిన రక్షణ అందరికి అని, మీ సువార్తను ప్రకటించే భాద్యత, మాకు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు, మీ సువార్తను ఇతరులకు ప్రకటించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ఆమెన్.
12, ఏప్రిల్ 2025, శనివారం
మ్రానికొమ్మల ఆదివారము
5, ఏప్రిల్ 2025, శనివారం
ఐదవ తపస్సుకాలపు ఆదివారము
29, మార్చి 2025, శనివారం
తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం
రక్షకుడైన యేసు ప్రభువు- మంచి కాపరి
యోహాను 10: 27-30 నా గొఱ్ఱెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అ...